రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

రెండో స్వదేశీ డైవింగ్ సపోర్ట్ నౌక అయిన ‘నిపుణ్’ను నౌకాదళానికి అప్పగించిన హిందుస్థాన్ షిప్‌యార్డ్

प्रविष्टि तिथि: 30 JUL 2026 8:38PM by PIB Hyderabad

స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన రెండో డైవింగ్ సపోర్ట్ వెసెల్ (డీఎస్‌వీ) ‘నిపుణ్’ను హిందూస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) 2026 జులై 30న విశాఖపట్నంలో భారత నౌకాదళానికి అందించింది. ఈ నౌకను 'ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ (ఐఆర్ఎస్)' వర్గీకరణ నియమాలకు అనుగుణంగా రూపకల్పన చేసి నిర్మించారు.

సంస్కృత భాషలో ‘నిపుణ్’ అంటే ‘ఒక నిర్దిష్ట రంగంలో నైపుణ్యం, సామర్థ్యం, పూర్తి అవగాహన ఉన్నది’ అని అర్థం. ఆ పేరుకు తగ్గట్టుగానే ఈ నౌక అత్యంత ప్రత్యేకమైనది. సముద్రంలో లోతైన డైవింగ్ ఆపరేషన్లు, రక్షణ చర్యలను చేపట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఈ నౌకలో అత్యంత ఆధునికమైన 'డైవ్ పరికరాలు’ ఉన్నాయి. ఇది లోతైన సముద్రంలో 'సాచురేషన్ డైవింగ్' చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. డైవింగ్ ఆపరేషన్లను నిర్వహించడానికి నౌక పక్క భాగంలో ఒక ప్రత్యేక 'డైవింగ్ స్టేజ్'ని కూడా ఏర్పాటు చేశారు. దీనిలోని 'రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్' (ఆర్ఓవీలు) డైవర్లను పర్యవేక్షించడం, నావికా వ్యర్థాలు లేదా మునిగిన వస్తువుల వెలికితీత పనులను సులభతరం చేయడం ద్వారా నౌక కార్యాచరణ సామర్థ్యాలను మరింత పెంచుతాయి. జలాంతర్గామిలో అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు సిబ్బందిని సురక్షితంగా తరలించడానికి 'డీప్ సబ్‌మర్జెన్స్ రెస్క్యూ వెసెల్'కి (డీఎస్ఆర్‌వీ) ఇది ఒక 'ప్రధాన నౌక (మదర్ షిప్)' కూడా వ్యవహరిస్తుంది.

దాదాపు 75 శాతం స్వదేశీ పరికరాలతో నిర్మితమైన 'నిపుణ్'ను నౌకాదళానికి అప్పగించటం.. భారత ప్రభుత్వ 'ఆత్మనిర్భర్ భారత్' దార్శనికతకు అనుగుణంగా స్వదేశీ నౌకా నిర్మాణంలో భారత నౌకాదళం సాధించిన మరొక ముఖ్యమైన మైలురాయి. లోతైన సముద్రపు డైవింగ్ ఆపరేషన్ల వంటి విశిష్ట రంగంలో భారత నౌకాదళ సామర్థ్యాలను మరింత పటిష్ఠం చేయడంలో ఈ నౌక చేరిక ఒక ప్రధాన ముందడుగుగా ఉంటుంది. 

 

***


(रिलीज़ आईडी: 2292150) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi