అంతరిక్ష విభాగం
azadi ka amrit mahotsav

పార్లమెంట్ ప్రశ్న: మానవ సహిత వ్యోమనౌక ప్రయోగం, స్వదేశీ అంతరిక్ష సాంకేతికత

प्रविष्टि तिथि: 30 JUL 2026 5:15PM by PIB Hyderabad

2035 నాటికి ఐదు మోడ్యూళ్లతో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ అంతరిక్ష కేంద్రమే భారతీయ అంతరిక్ష స్టేషన్ (బీఏఎస్). సవరించిన గగన్‌యాన్ కార్యక్రమ పరిధిలో భాగంగా బీఏఎస్ మొదటి మోడ్యూల్ (బీఏఎస్-01) అభివృద్ధి, 2028లో ప్రయోగానికి 2024 అక్టోబర్‌లో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బీఏఎస్-01కి సంబంధించి బేస్‌లైన్ డిజైన్ సమీక్ష, సిస్టమ్ ఇంజనీరింగ్ పూర్తయ్యాయి. 31 రకాల బేస్‌లైన్ డిజైన్ పత్రాలు విడుదలయ్యాయి. నిపుణుల కమిటీ సమీక్ష కూడా పూర్తయింది. అనుబంధ వ్యవస్థల (సబ్-సిస్టమ్‌ల) రూపకల్పన ప్రారంభమైంది.

గగన్‌యాన్ కార్యక్రమంలో భాగంగా మానవుల కోసం ఉద్దేశించిన ప్రయోగ వాహక నౌక (హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్- హెచ్ఎల్‌వీఎం3), ఆర్బిటల్ మోడ్యూల్, వ్యోమగాములు తప్పించుకునే వ్యవస్థ (క్రూ ఎస్కేప్ సిస్టమ్), భూతల మౌలిక వసతులు ఏర్పాటు, ఫ్లైట్ ఆపరేషన్లు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్ వ్యవస్థల ఏర్పాటు, వ్యోమగాముల రికవరీ కార్యకలాపాలలో కొత్త పురోగతి నమోదైంది. ఈ దిశగా ముందస్తు ప్రయోగాలు అయిన టీవీ-డీ1, ఐఏడీటీ- 01, 02లు విజయవంతంగా పూర్తయ్యాయి. మొదటి మానవరహిత వ్యోమనౌక ప్రయోగం 'జీ1' కి సంబంధించిన పనులు తుది దశలో ఉన్నాయి.

ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంటర్‌ఫేస్‌లతో సహా డాకింగ్ వ్యవస్థ రూపకల్పన పూర్తయింది. ఇంధనాన్ని మళ్లీ నింపే (రీఫ్యూయలింగ్) ప్రక్రియకు సంబంధించిన కాన్సెప్ట్ డెమో మోడల్ ప్రదర్శన విజయవంతమైంది.

మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి అవసరమైన ఇతర కీలక సాంకేతికతలలో వ్యోమగాముల దుస్తులు (ఫ్లైట్ సూట్), కిటికీ లేదా పరిశీలన ద్వారం (వ్యూ పోర్ట్),  వ్యోమగాముల సీటు (క్రూ సీట్) ఉన్నాయి. ప్రస్తుత గగన్‌యాన్ ప్రయోగాల కోసం వీటిని విదేశీ సంస్థల నుంచి కొనుగోలు చేశారు. 

మానవ అంతరిక్ష రంగానికి సంబంధించి వ్యోమగాముల దుస్తులు, పరిశీలన ద్వారం, వ్యోమగాముల సీటు‌, డాకింగ్ సాంకేతికతతో సహా ప్రధాన కీలక సాంకేతికతలను గుర్తించారు. ఈ కీలక సాంకేతికతలను స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం వీటి నమూనా (ప్రోటో‌టైప్) హార్డ్‌వేర్ రూపకల్పన, అభివృద్ధి పనులు వేగంగా పురోగమిస్తున్నాయి.

ఇవన్నీ భారతీయ అంతరిక్ష స్టేషన్ (బీఏఎస్) మిగిలిన నాలుగు మోడ్యూళ్లను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించడానికి, అభివృద్ధి చేయడానికి అవసరమైన సాంకేతిక పునాదిని వేస్తాయి. ఇది కీలకమైన మానవ అంతరిక్ష ప్రయోగ సాంకేతికతలలో స్వయంసమృద్ధిని పెంపొందిస్తుంది. తద్వారా మానవ సహిత వ్యోమ నౌక ప్రయోగాలకు అవసరమైన నూతన ఆవిష్కరణలను, అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తుంది.

కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ, భూవిజ్ఞాన శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర హోదా).. ప్రధాని కార్యాలయం, సిబ్బంది-ప్రజా ఫిర్యాదులు-పింఛన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ ఈ సమాచారాన్ని నేడు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో తెలియజేశారు.

 

***


(रिलीज़ आईडी: 2292143) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी