మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆక్వా పార్కుల అభివృద్ధి

प्रविष्टि तिथि: 30 JUL 2026 3:06PM by PIB Hyderabad

(ఎ) కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ పరిధిలోని మత్స్య శాఖ... ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) కింద సమీకృత అక్వాపార్కుల నిర్మాణాన్ని చేపడుతోంది. మత్స్య, ఆక్వాకల్చర్ విలువ వ్యవస్థ వ్యాప్తంగా స్థానిక అవసరాలకు తగిన సమగ్ర పరిష్కారాలను అందించడం, వివిధ మత్స్య కార్యకలాపాలకు వీటిని కేంద్రాలుగా తీర్చిదిద్దడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. దీనిలో భాగంగా పీఎంఎంఎస్‌వై కింద దేశవ్యాప్తంగా మొత్తం రూ. 713.80 కోట్ల అంచనా వ్యయంతో 12 సమీకృత అక్వాపార్కుల ఏర్పాటుకు మత్స్య శాఖ ఆమోదం తెలిపింది. అందులో సీఫుడ్ ప్రాసెసింగ్ పార్కు, రొయ్యలు, సముద్ర చేపలు, పీతలు, సముద్రపు నాచు, అలంకార చేపల పెంపకం వంటి అనేక విభాగాలతో కూడిన సమీకృత ఆక్వా పార్కు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనకు రూ. 88.08 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదం లభించింది.

 

(బి) పీఎంఎంఎస్‌వైలోని కేంద్ర ప్రాయోజిత పథకం (సీఎస్ఎస్) పరిధిలోని వ్యక్తిగత లబ్ధిదారునిపై ఆధారపడని ప్రాజెక్టుల విభాగం కింద ఈ సమీకృత అక్వా పార్కులను నిర్మిస్తారు. ఈ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేసే ఇటువంటి కార్యకలాపాల ప్రాజెక్టు వ్యయాన్ని, నిర్దేశిత నిధుల పంపిణీ విధానం అనుసరించి కేంద్రం, రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం పంచుకుంటాయి. ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ ప్రాంత రాష్ట్రాలకు సంబంధించి 90 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం, 10 శాతం నిధులను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. ఆంధ్రప్రదేశ్ సహా ఇతర సాధారణ రాష్ట్రాలలో ప్రాజెక్టు వ్యయంలో 60 శాతం కేంద్ర వాటాగా, 40 శాతం రాష్ట్ర వాటాగా ఉంటుంది. చట్టసభలు ఉన్నవి, లేనివి అనే తేడా లేకుండా అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో 100 శాతం నిధులను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది.

 

(సి) కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖలోని మత్స్య శాఖ పీఎంఎంఎస్‌వైతో పాటు ఇతర పథకాల ద్వారా మత్స్య, ఆక్వాకల్చర్ రంగంలో ప్రాసెసింగ్ సామర్థ్యం, బ్రాండింగ్, ఎగుమతుల ఆధారిత తయారీని పెంచడానికి పలు కీలక చర్యలు చేపట్టింది.  (i) ప్రాంతాల వారీగా విలువాధారిత, ప్రాసెసింగ్‌ కార్యకలాపాలను ప్రోత్సహించడానికి 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 34 ఉత్పత్తి, ప్రాసెసింగ్ క్లస్టర్లను ప్రకటించారు. (ii) ల్యాండింగ్, నిర్వహణ, ప్రాథమిక ప్రాసెసింగ్ మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు 11 కొత్త ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి, ప్రస్తుతం ఉన్న 11 హార్బర్ల ఆధునీకరణకు ఆమోదం తెలిపారు.  (iii) చేపల నిర్వహణలో పరిశుభ్రతను మెరుగుపరచడం, పంట కోత అనంతరం జరిగే నష్టాలను తగ్గించడానికి 23 ఆధునిక ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు ఆమోదం లభించింది. (iv) పర్యావరణానికి హాని కలగని సుస్థిర సముద్ర చేపల వేటకు మద్దతు ఇవ్వడం, ప్రాసెసింగ్‌కు అవసరమైన ముడిసరుకు లభ్యతను పెంచడం కోసం 284 లోతైన సముద్ర వేట నౌకలను మంజూరు చేశారు. (v) విభిన్న రకాల ఉత్పత్తులు, బ్రాండింగ్, ఎగుమతి ఆధారిత సముద్రపు ఆహార తయారీని ప్రోత్సహించేందుకు 121 విలువ ఆధారిత నూతన వ్యాపార యూనిట్లకు ఊతమిచ్చారు.(vi)  ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్, ఎగుమతి సదుపాయాలతో కూడిన పూర్తి స్థాయి ఆక్వాకల్చర్ మౌలిక వసతుల కేంద్రాలుగా 12 సమీకృత అక్వాపార్కులను ఏర్పాటు చేశారు. వీటికి తోడు, మత్స్య, ఆక్వాకల్చర్ మౌలిక వసతుల అభివృద్ధి నిధి (ఎఫ్ఐడీఎఫ్) కింద ఎగుమతుల ప్రోత్సాహక మౌలిక వసతుల కల్పనకు ప్రైవేటు కంపెనీలు, పారిశ్రామికవేత్తలకు సంబంధించి 18 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వీటిలో ప్రధానంగా ఆధునిక చేపల ప్రాసెసింగ్ కేంద్రాలు, కోల్డ్-చైన్ సదుపాయాలు, విలువ జోడింపు యూనిట్ల విస్తరణ ఉన్నాయి.

 

(డి) మత్స్య రంగంలో నైపుణ్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) కింద మత్స్యకారులు, చేపల పెంపకందారులు, సంబంధిత పారిశ్రామిక కార్మికుల సామర్థ్యాలను పెంచేందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా శిక్షణా, నైపుణ్యాభివృద్ధి, సామర్థ్య పెంపు కార్యక్రమాలను అమలు చేయడానికి జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థను (ఎన్ఎఫ్‌డీబీ) నోడల్ ఏజెన్సీగా నియమించారు. పీఎంఎంఎస్‌వై కింద ఎన్ఎఫ్‌డీసీ ఇప్పటివరకు 4,041 శిక్షణా కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపింది. ఈ కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 1,75,261 మంది మత్స్యకారులు ప్రయోజనం పొందారు.

 

ఈ సమాచారాన్ని రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమల శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ అందించారు.

 

***


(रिलीज़ आईडी: 2292139) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी