బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు ఎక్స్ఛేంజ్ నిబంధనలు
प्रविष्टि तिथि:
29 JUL 2026 5:19PM by PIB Hyderabad
గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టం- 1957లోని సెక్షన్ 18B కింద కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ 04.06.2026న నోటిఫై చేసిన ‘బొగ్గు ఎక్స్చేంజ్ నిబంధనలు- 2026’.. బొగ్గు లేదా లిగ్నైట్, వాటి ప్రాసెస్ చేసిన రూపాల వర్తకాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా ప్రోత్సహించడానికి ఒక సమగ్రమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేస్తాయి.
బొగ్గు ఎక్స్ఛేంజ్ నిబంధనలు- 2026 లోని ముఖ్యాంశాలు:
-
బొగ్గు ఎక్స్ఛేంజ్(ల)ను నమోదు చేయడానికి, నియంత్రించడానికి బొగ్గు నియంత్రణ సంస్థ (సీసీఓ) ప్రాధికార సంస్థగా వ్యవహరిస్తుంది. ‘బొగ్గు ఎక్స్ఛేంజ్ నిబంధనలు- 2026’లో ముఖ్యంగా నిర్దేశించిన అర్హతా ప్రమాణాలు, రిజిస్ట్రేషన్ విధానం, రుసుములు- ఛార్జీలు, నికర విలువ, యాజమాన్య నిర్మాణం, పాలనా వ్యవస్థకు అనుగుణంగా సీసీఓ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి నిర్వహణ విధానాలను నిర్దేశించొచ్చు.. అవసరమైన మార్గదర్శకాలను జారీ చేయొచ్చు.
-
బొగ్గు, దాని ప్రాసెస్ చేసిన రూపాల కొనుగోలుదారులు, అమ్మకందారులు ఒకే వేదికపై లావాదేవీలు, వ్యాపారం, ఒప్పందాలు చేసుకోవడానికి వీలు కల్పించే ఒక ఆన్‌లైన్ వ్యవస్థగా ‘బొగ్గు ఎక్స్ఛేంజ్’ని నిర్వచించారు.
-
ఎక్స్ఛేంజ్ రిజిస్ట్రేషన్లను ఎవాల్యుయేషన్ చేయడం, మంజూరు చేయడం, పునరుద్ధరించడం, రద్దు చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ సమయంలో నిష్క్రమణ పథకాలను ఆమోదించే బాధ్యత ప్రాధికార సంస్థపై ఉంటుంది.
-
బిడ్డింగ్, ధరల నిర్ణయాత్మక విధానాలు, లావాదేవీల షెడ్యూలింగ్, డెలివరీకి సంబంధించిన కాంట్రాక్ట్ నిబంధనలు, సరఫరా చేసే బొగ్గు నాణ్యత, బిడ్ రకాలు, లావాదేవీల రుసుము గరిష్ఠ పరిమితులు, బైలాలు, నిర్వహణ విధానాలను ఆమోదించడం ద్వారా ఈ ప్రాధికార సంస్థ పరిపాలనా నియంత్రణను కలిగి ఉంటుంది.
-
మార్కెట్‌ను మోసం చేయటం, కార్టెలైజేషన్, ఇన్‌సైడర్ ట్రేడింగ్, ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేయడాన్ని గుర్తించడానికి, అరికట్టడానికి మార్కెట్ పర్యవేక్షణను ఈ ప్రాధికార సంస్థ నిర్వహిస్తుంది. ఈ నిబంధనల్లోని ఏవైనా అంశాలను ఉల్లంఘించినా లేదా పాటించకపోయినా జోక్యం చేసుకునే, తాత్కాలిక ఆదేశాలు జారీ చేసే, తనిఖీ చేసే అధికారం ఈ ప్రాధికార సంస్థకు ఉంటుంది.
-
బొగ్గు సరఫరా కాంట్రాక్టులను రూపొందించడం, అటువంటి కాంట్రాక్టుల లావాదేవీలను సులభతరం చేయడం.. న్యాయమైన, పారదర్శకమైన, నిష్పాక్షికమైన, సమర్థవంతమైన, బలమైన ధరల నిర్ణయాత్మక విధానాన్ని, వ్యాప్తి చేయటాన్ని నిర్ధారించడం.. కాంట్రాక్ట్ నిబంధనలకు అనుగుణంగా బొగ్గును సమర్థవంతంగా, సకాలంలో సరఫరా అయ్యేలా చూసుకోవటం వంటి లక్ష్యాలతో ‘బొగ్గు ఎక్స్ఛేంజ్’ స్థాపన, నిర్వహణ జరుగుతోంది. బొగ్గు ఎక్స్ఛేంజ్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ వ్యవస్థను నడుపుతుంది. తన కార్యకలాపాల కోసం నెట్‌వర్క్ కమ్యూనికేషన్‌ను ఉపయోగిస్తుంది.
-
బొగ్గు ఎక్స్ఛేంజ్ ఒక స్వతంత్ర కమిటీ ద్వారా నిర్వహించబడే 'సెటిల్మెంట్ గ్యారంటీ ఫండ్'ను (ఎస్‌జీఎఫ్) నిర్వహిస్తుంది. ఈ నిధిలోని కనీసం 50 శాతం మొత్తాన్ని షెడ్యూల్డ్ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్లు, ట్రెజరీ బిల్లులు లేదా ప్రభుత్వ సెక్యూరిటీలు వంటి సురక్షితమైన, ద్రవ్య లభ్యత కలిగిన మార్గాల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
-
లావాదేవీలను రోజువారీగా పర్యవేక్షించడానికి, పర్యవేక్షణ నిర్వహించడానికి బొగ్గు ఎక్స్ఛేంజ్‌లు ఒక మార్కెట్ నిఘా కమిటీ, నిఘా విభాగాన్ని కలిగి ఉంటాయి. ఇవి బిడ్‌ల కోసం స్వయంచాలక ఆడిట్ రికార్డును నిర్వహించడం, ఐటీ వ్యవస్థల సెక్యూరిటీ ఆడిట్ చేపట్టడం, అత్యవసర సమయాల్లో వ్యాపారం నిరంతరాయంగా కొనసాగేలా డిజాస్టర్ రికవరీ సైట్, ప్రత్యామ్నాయ ట్రేడింగ్ సదుపాయాన్ని నిర్వహించే బాధ్యతలను నిర్వర్తిస్తాయి.
-
బొగ్గు ఎక్స్ఛేంజ్ ఒక ఫిర్యాదుల నివారణ వేదికను కూడా కలిగి ఉంటుంది. ఏదైనా నిర్దిష్ట ఫిర్యాదు పరిష్కారానికి సంబంధించి బొగ్గు ఎక్స్ఛేంజ్ నుంచి సమాచారాన్ని కోరే అధికారం ప్రాధికార సంస్థకు ఉంటుంది.
15.07.2026న ప్రారంభించిన ప్రత్యేక ఆన్‌లైన్ దరఖాస్తు వేదిక ద్వారా బొగ్గు ఎక్స్ఛేంజ్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు అందిన తేదీ నుంచి నిబంధనలకు లోబడి పనిచేసే ‘బొగ్గు ఎక్స్ఛేంజ్’ కార్యాచరణలోకి రావడానికి అంచనా వేసిన సమయం 12 నెలలు.
సొంత అవసరాల కోసం బొగ్గును ఉపయోగించే గనుల యజమానులు (క్యాప్టీవ్ మైనర్స్), వాణిజ్య గనుల ఉత్పత్తిదారులు.. అనియంత్రిత రంగానికి చెందిన చిన్న, మధ్యతరహా వినియోగదారులతో సహా ఏ సంస్థ అయినా బొగ్గు ఎక్స్ఛేంజ్(ల) ద్వారా లావాదేవీలు, వ్యాపారం, డెలివరీ ఆధారిత కాంట్రాక్టులు చేసుకోవచ్చు. బొగ్గు ఎక్స్ఛేంజ్‌లో వ్యాపారం లేదా లావాదేవీలు జరిగే బొగ్గు ధరల నిర్ణయాన్ని.. న్యాయమైన, నిష్పాక్షికమైన, పోటీతత్వంతో కూడిన, సమర్థవంతమైన ధరలను నిర్ధారించే విధానం ద్వారా ఎక్స్ఛేంజ్ చేపడుతుంది. బిడ్డింగ్, ధరల నిర్ణయాత్మక విధానాలు ప్రాధికార సంస్థ ద్వారా ఆమోదించిన ప్రక్రియకు అనుగుణంగా నిర్వహిస్తారు. అమలు చేసిన కాంట్రాక్ట్ ధర సర్దుబాటు (ప్రీ అడ్జస్ట్‌మెంట్) విధానం .. బొగ్గు నమూనా పరిశీలనా సంస్థ (కోల్ శాంప్లింగ్ ఏజెన్సీ) జారీ చేసిన నాణ్యత ప్రామాణీకరణ పత్రం ఆధారంగా విక్రయించిన బొగ్గు నాణ్యతకు తగినట్లుగా అంతిమ ధర సర్దుబాటు చేస్తారు. 'బొగ్గు ఎక్స్ఛేంజ్ నిబంధనలు- 2026'లో ప్రతిపాదించిన మార్కెట్ పర్యవేక్షణ, నిఘా వ్యవస్థలు మార్కెట్ మోసాలను లేదా దుర్వినియోగాన్ని అరికట్టి బొగ్గు ఎక్స్ఛేంజ్ వ్యవస్థలో పారదర్శకతను తీసుకువస్తాయి. ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలు, అనియంత్రిత రంగంలోని చిన్న, మధ్యతరహా వినియోగదారులు కూడా తమ మార్కెట్ భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికి ఈ వేదికను ఉపయోగించుకోవచ్చు.
ఈ సమాచారాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే నేడు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఇచ్చారు.
***
(रिलीज़ आईडी: 2291529)
आगंतुक पटल : 13