ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
సహకార ప్రణాళికలు, ఆవిష్కరణ సవాళ్లు, సామర్థ్య పెంపు ద్వారా ఏఐ ఆధారిత పాలన, ప్రజారోగ్య- ప్రజా సేవలను అందిస్తున్న 'ఇండియా ఏఐ మిషన్'
62 మంత్రిత్వ శాఖల్లో 762 రకాల ఏఐ ఉపయోగించే సందర్భాలను (యూజ్ కేసులను) గుర్తించిన ఇండియా ఏఐ మిషన్.. 58 ఏఐ ఎక్సలెన్స్ సెంటర్లు, 543 డేటా- ఏఐ ల్యాబ్‌లకు ఆమోదం
प्रविष्टि तिथि:
29 JUL 2026 3:55PM by PIB Hyderabad
సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచన ఆధారంగా భారతదేశ ఏఐ విధానం తయారైంది. ఏఐ వల్ల కలిగే ప్రమాదాలు, సవాళ్లను ఎదుర్కొంటూనే యువతకు ఆర్థిక అవకాశాలను, ఉపాధిని కల్పించడం దీని ముఖ్య లక్ష్యం.
ఏడాదికి 300 బిలియన్ డాలర్ల రాబడి, 60 లక్షల మంది ఉద్యోగులతో అత్యంత క్రియాశీలకంగా ఉన్న దేశీయ ఐటీ రంగాన్ని ప్రాతిపదికగా తీసుకుని భారతదేశ ఏఐ వ్యూహం తయారైంది. ఇండియా ఏఐ మిషన్ కింద పేర్కొన్న ఏడు ప్రధాన విభాగాల ద్వారా భారత ఏఐ లక్ష్యాలకు మద్దతునిస్తుంది:
-
ఇండియా ఏఐ కంప్యూట్ విభాగం: వేగంగా విస్తరిస్తున్న భారత ఏఐ అంకురాలు, పరిశోధక వర్గాల అవసరాలను తీర్చడానికి అత్యంత సామర్థ్యం కలిగిన, సులభంగా విస్తరించదగిన ఏఐ కంప్యూటింగ్ వ్యవస్థను నెలకొల్పడం.
-
ఫౌండేషన్ మోడల్స్: మన దేశ సార్వభౌమ ఏఐ సామర్థ్యాలను పెంపొందించడానికి, భారత్‌కు మాత్రమే ప్రత్యేకమైన వినియోగ నమూనాల అవసరాలను తీర్చడానికి స్వదేశీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎంలు), మల్టీమోడల్ మోడల్స్, రంగాల వారీ స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్‌ను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించడం.
-
ఇండియా ఏఐ అప్లికేషన్ డెవలప్‌మెంట్ కార్యక్రమం - ఐఏడీఐ: కీలక రంగాలకు పెద్దపీట వేస్తూ భారీ సామాజిక-ఆర్థిక మార్పును తీసుకురాగల సామర్థ్యం ఉన్న ప్రభావవంతమైన ఏఐ పరిష్కారాల అభివృద్ధి, విస్తరణ, వినియోగానికి మద్దతు ఇవ్వడం.
-
ఇండియా ఏఐ ఫ్యూచర్‌స్కిల్స్: ఏఐ విద్యను అందరికీ సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ప్రత్యేక డేటా, ఏఐ ల్యాబ్‌లను ఏర్పాటు చేయడం.. విద్యార్థులకు ఫెలోషిప్‌లు అందించడం, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపకల్పన చేయడం ద్వారా నైపుణ్యం కలిగిన ఏఐ మానవ వనరుల వ్యవస్థను నిర్మించడం.
-
ఏఐ కోష్- ఇండియా ఏఐ డేటాసెట్స్ వేదిక: స్వేచ్ఛా ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల నుంచి లభించే సమాచార వనరులను ఒకే చోటకు చేర్చి నాణ్యమైన డేటాసెట్‌లు, మోడల్‌లు, టూల్స్‌ను సులభంగా పొందగలిగేలా ఒకే ఒక సమగ్ర వేదికను రూపొందించడం.
-
సురక్షితమైన, విశ్వసనీయ ఏఐ: భారతదేశపు విలక్షణమైన సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యానికి అనుగుణంగా తయారుచేసిన స్వదేశీ పాలనా చట్రాలు, ఎవాల్యుయేషన్ సాధనాల ద్వారా బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధికి బాటలు వేయడం.
-
ఇండియా ఏఐ స్టార్టప్ ఫైనాన్సింగ్: ప్రాజెక్ట్ ప్రారంభంలోని రూపకల్పన స్థాయి నుంచి వాణిజ్యీకరణ వరకు నిధుల కొరతను నివారిస్తూ మొదటి నుంచి వృద్ధి దశ వరకు అవసరమైన మూలధనం, పూర్తి స్థాయి సహాయాన్ని అందించడం.
అప్లికేషన్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్ (ఐఏడీఐ) కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులను ఒకే చోటకు చేర్చి ప్రజారోగ్య, ప్రజా సేవల విషయంలో ఏఐ వినియోగంపై 2024 ఏప్రిల్ 5న 'ఇండియా ఏఐ' ఒక వర్క్‌షాప్‌ను నిర్వహించింది. ఈ వర్క్‌షాప్ మంత్రిత్వ శాఖలు, విభాగాలు తమ డేటా సామర్థ్యాలను అంచనా వేయడంలో ఏఐ ఉపయోగించే సందర్భాలను (యూజ్ కేసులు) గుర్తించడంలో సహాయపడింది. పరిపాలన, ప్రజా సేవలను అందించే విషయంలో ఏఐ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడంలో సంప్రదింపులు, భాగస్వామ్య దృక్పథాన్ని ఇది పెంపొందించింది.
ఆవిష్కరణ సవాళ్లు, నిధులు అందించే కార్యక్రమాలు, హ్యాకథాన్‌ల ద్వారా ఐఏడీఐ ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, పాలన, వాతావరణం, సైబర్ భద్రత, ఆర్థిక నియంత్రణతో సహా అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగాల్లో అనేక ఏఐ పరిష్కారాల నమూనాలను రూపొందించింది. ఆలోచనల దశ నుంచి ప్రయోగాత్మక వినియోగం, విస్తరణ వరకు వీటిని తీసుకెళ్లే మార్గాలను సుగమం చేసింది. దీని కింద ఇండియా ఏఐ మిషన్ ఈ రంగాల వ్యాప్తంగా 11 జాతీయ స్థాయి హ్యాకథాన్‌లు, ఆవిష్కరణ ఛాలెంజ్‌లను ప్రారంభించింది.
-
ఇండియా ఏఐ ఆవిష్కరణ ఛాలెంజ్.. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, పాలన, అభ్యాస వైకల్యాలు, వాతావరణ మార్పుల రంగాలలో ఏఐ పరిష్కారాలపై దృష్టి సారించింది. కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, ప్రభుత్వ రంగ సంస్థలతో ప్రయోగాత్మక వినియోగం కోసం మొదటి దశలో 30 పరిష్కారాలను ఎంపిక చేశారు. ఆ తర్వాత జాతీయ స్థాయి విస్తరణ కోసం ఐదు బృందాలను (ప్రతి రంగానికి ఒకటి) ఎంపిక చేశారు. ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో ప్రయోగాత్మక ప్రాజెక్టులు వివిధ స్థాయిలలో పురోగమిస్తున్నాయి.
-
ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) భాగస్వామ్యంతో నిర్వహించిన 'ఇండియా ఏఐ ఐ4సీ సైబర్ గార్డ్ ఏఐ హ్యాకథాన్'.. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో (ఎన్‌సీఆర్‌పీ) వస్తున్న సైబర్ నేర ఫిర్యాదులను వర్గీకరించడానికి, కొత్తగా ఉత్పన్నమవుతున్న నేరాల సరళిని గుర్తించడానికి ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేసింది. ఇలా జాబితా చేసిన పరిష్కారాన్ని ఐ4సీ వ్యవస్థలతో అనుసంధానించారు.
-
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) భాగస్వామ్యంతో నిర్వహించిన 'ఇండియా ఏఐ – జీఎస్ఐ మినరల్ టార్గెటింగ్ విత్ ఏఐ హ్యాకథాన్'... భూగర్భశాస్త్రం, భూభౌతికశాస్త్రం, భూరసాయనశాస్త్రం, రిమోట్ సెన్సింగ్ వంటి భూ శాస్త్రీయ డేటాసెట్‌లను ఉపయోగించి అధునాతన ఖనిజ నిక్షేపాలను అంచనా వేసేందుకు ఏఐ, ఎంఎల్‌ను ఉపయోగించడంపై దృష్టి పెట్టింది.
-
జాతీయ క్యాన్సర్ గ్రిడ్ భాగస్వామ్యంతో చేపట్టిన 'క్యాన్సర్ ఏఐ, సాంకేతిక ఛాలెంజ్' (క్యాచ్).. క్యాన్సర్ పరీక్ష, వ్యాధి నిర్ధారణ, చికిత్సా విషయంలో సహాయం, ఆరోగ్య సంరక్షణ నిర్వహణను బలోపేతం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఎంపిక చేసిన ఉత్తమ బృందాల పరిష్కారాలను అమలు చేయడానికి ముందు వాటికి సంబంధించిన నైతిక పరిశీలన జరుగుతోంది.
-
'ఇండియా ఏఐ ఫేస్ అథెంటికేషన్ ఛాలెంజ్'.. ఏఐ ఆధారంగా నకిలీలను తొలగించడం, 'వన్-టు-మెనీ' ఫోటో పరిశీలన ద్వారా ప్రభుత్వ పరీక్షల పారదర్శకత, ప్రామాణికతను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. యూపీఎస్‌సీలో (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) వినియోగించేందుకు రెండు బృందాలను ఎంపిక చేశారు. ఇప్పటికే దీని అమలు ప్రారంభమైంది.
-
'ఇండియా- ఏఐ ఇంటెలిజెంట్ డాక్యుమెంట్ ప్రాసెసింగ్ (ఐడీపీ) ఛాలెంజ్'.. క్లిష్టమైన బహుభాషా పత్రాల నుంచి సమాచారాన్ని ఆటోమేటిక్‌గా వేరు చేయడం, వర్గీకరించడం, ప్రామాణీకరించడం, క్రమబద్ధీకరించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఎంపిక చేసిన రెండు బృందాలను యూపీఎస్‌సీలో నియమించారు. ప్రస్తుతం వీటి అమలు కొనసాగుతోంది.
-
ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖల మద్దతుతో ప్రారంభమైన 'ఇండియా ఏఐ ఆవిష్కరణ ఛాలెంజ్ 2026'.. ఆయుష్ ఆరోగ్య సంరక్షణ, ఎంఎస్ఎంఈల (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల) కోసం ఏఐ పరిష్కారాలను ప్రోత్సహిస్తుంది. విభిన్న సమస్యల పరిష్కారాల కోసం ఇప్పటికే దరఖాస్తులు వచ్చాయి. మొదటి దశ ఎవాల్యుయేషన్లు పురోగతిలో ఉన్నాయి. దీని తర్వాత నమూనా (ప్రాటోటైప్) అభివృద్ధి, ప్రయోగాత్మక వినియోగం చేపట్టనున్నారు.
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్‌టీజీఎస్) భాగస్వామ్యంతో నిర్వహించిన 'పరిపాలనలో భారీ మార్పుల కోసం ఇండియా ఏఐ ఛాలెంజ్'.. కీలక శాఖల్లో ఏఐ ఉపయోగించే సందర్భాలపై (యూజ్ కేసులు) దృష్టి సారించింది. దీనికి సంబంధించిన దరఖాస్తులు అందాయి. ప్రస్తుతం మొదటి దశ ఎవాల్యూయేషన్లు జరుగుతున్నాయి. తదుపరి దశలో నమూనాల అభివృద్ధి, ప్రయోగాత్మక అమలు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.
-
ఇండియా ఏఐ ఫైనాన్షియల్ కాంప్లయన్స్ రిపోర్టింగ్ ఛాలెంజ్.. నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్‌ఆర్ఏ) భాగస్వామ్యంతో ఏఐ ఆధారిత నిబంధనల అమలు పర్యవేక్షణ, ప్రమాద ముప్పు అంచనాను ప్రోత్సహిస్తుంది.
-
సీడీఎస్‌సీఓ– ఇండియా ఏఐ హెల్త్ ఇన్నోవేషన్ యాక్సిలరేషన్ హ్యాకథాన్: సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌తో (సీడీఎస్‌సీఓ) కలిసి నిర్వహించిన ఈ హ్యాకథాన్... పత్రాల సారాంశాల తయారీ, వివరాల గోప్యత, తనిఖీ నివేదికలతో సహా నిబంధనల అమలు ప్రక్రియలను ఏఐ ద్వారా ఆటోమేట్ చేయడంపై దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి నమూనాల అభివృద్ధి, విస్తరణలు ప్రణాళికాబద్ధంగా ఉన్నాయి.
-
పీఎంజేఏపై ఆటో అడ్‌జ్యూడికేషన్ హ్యాకథాన్: నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్‌హెచ్ఏ) భాగస్వామ్యంతో పీఎంజేఏవై క్లెయిమ్‌ల పరిశీలన కోసం ఏఐ ఆధారిత పరిష్కారాల చట్రాలను అభివృద్ధి చేయడానికి మద్దతునిచ్చింది. దీని ఫలితంగా అనేక నమూనాలు, ప్రయోగాత్మక వినియోగాలు సాధ్యమయ్యాయి.
ఈ కార్యక్రమాలన్నీ కలిసి పరిపాలన, ప్రజా సేవలను అందించే విషయంలో ఏఐ కార్యాచరణ ప్రణాళికల రూపకల్పన, అమలు ప్రక్రియలలో వర్క్‌షాప్‌లు, సంప్రదింపులు, భాగస్వామ్య సవాళ్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను చురుగ్గా సంప్రదిస్తూ భాగస్వాములను చేస్తున్న తీరును తెలిజేస్తున్నాయి.
ఏఐ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు: సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, పరిశ్రమ భాగస్వాముల సహకారంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 ఏఐ ఎక్సలెన్స్ సెంటర్ల (ఏఐ-సీఓఈ) ఏర్పాటు పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఆమోదించిన నిబంధనల ప్రకారం తమిళనాడు రాష్ట్రానికి రెండు ఏఐ ఎక్సలెన్స్ సెంటర్లను (ఏఐ-సీఓఈ) కేటాయించారు.
ఇండియా ఏఐ డేటా, ఏఐ ల్యాబ్‌లు (ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు): ఇండియా ఏఐ ఫ్యూచర్‌స్కిల్స్ విభాగం కింద ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని ఐటీఐలు, పాలిటెక్నిక్‌లలో ఏఐ, డేటా అనోటేషన్, డేటా క్యూరేషన్, అప్లైడ్ డేటా సైన్స్‌లలో శిక్షణ ఇవ్వడం కోసం 543 డేటా, ఏఐ ల్యాబ్‌ల ఏర్పాటు చేసేందుకు ఆమోదం లభించింది. ఈ ప్రతిపాదనలో భాగంగా తమిళనాడుకు 18 డేటా, ఏఐ ల్యాబ్‌లను కేటాయించారు.
ఇండియా ఏఐ ఫెలోషిప్‌లు: ఇండియా ఏఐ ఫ్యూచర్‌స్కిల్స్ విభాగం కింద ఏఐ విద్య, పరిశోధనల కోసం డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులకు ఫెలోషిప్‌లు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా 178 సంస్థలకు చెందిన విద్యార్థులకు మొత్తం 686 ఫెలోషిప్‌లను మంజూరు చేశారు. వీటిలో 96 డిగ్రీ, 34 పీజీ, 32 పీహెచ్‌డీ ఫెలోషిప్‌లతో కలిపి తమిళనాడుకు చెందిన విద్యార్థులకు అత్యధికంగా 162 ఫెలోషిప్‌లు లభించాయి.
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు: భారత్ 2026 ఫిబ్రవరి 16 నుంచి 21 వరకు ఢిల్లీలో 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు- 2026'ను నిర్వహించింది. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో గౌరవ ప్రధాని మాట్లాడుతూ... ప్రభుత్వ శాఖల వ్యాప్తంగా ఏఐ వినియోగాన్ని వేగవంతం చేసేందుకు 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో'తో చురుగ్గా భాగస్వామ్యమై తమ తమ రంగాలకు సంబంధించిన ఏఐ అనువర్తనాలను గుర్తించాలని కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలను కోరారు.
ఈ సూచనలతో పాటు సదస్సులో జరిగిన చర్చల ఆధారంగా పరిపాలన, సేవలను అందించటం, పనితీరు సామర్థ్యం, రంగాల వారీ సవాళ్లను పరిష్కరించడంలో ఏఐని ఉపయోగించుకునే అవకాశాలను గుర్తించేందుకు క్యాబినెట్ కార్యాలయం.. వివిధ మంత్రిత్వ శాఖలు, శాఖలతో సమన్వయం చేసింది. దీని ఫలితంగా 62 మంత్రిత్వ శాఖలు, విభాగాల నుంచి 762 సమస్యలను (ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్) గుర్తించారు. ఏఐ ఆధారిత పరిష్కారాలను సులభతరం చేయడం కోసం వీటిని తదనంతరం 'ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ’కు (మైటీ) పంపించారు.
పౌర సేవలతో సహా ప్రభుత్వ వ్యవస్థలలో ఏఐ వినియోగం.. పారదర్శకత, జవాబుదారీతనం, సమాచార గోప్యత, ఆల్గారిథమిక్ నిష్పాక్షికత, స్వతంత్ర తనిఖీ ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా చూడటానికి ప్రభుత్వం కింది చర్యలను చేపట్టింది:
-
డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం- 2023 (డీపీడీపీ చట్టం).. ప్రయోజనాల పరిమితి, డేటా తగ్గింపు, సమాచార సహిత అంగీకారం, యాక్సెస్- సవరణ, డేటా నిబంధనల తొలగింపు హక్కులతో సహా వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయడానికి ఒక సమగ్రమైన చట్రాన్ని అందిస్తుంది. దీని ప్రకారం ‘ప్రధాన డేటా సంరక్షకులు’.. ఒక డేటా ఆడిటర్‌ను నియమించి క్రమానుగతంగా 'డేటా సంరక్షణ ప్రభావ అసెస్‌మెంట్స్ నిర్వహించడాన్ని ఇది తప్పనిసరి చేస్తుంది.
-
ఇండియా ఏఐ మిషన్‌లో ‘సురక్షితమైన, విశ్వసనీయ ఏఐ’ విభాగం కింద.. ఏఐ పక్షపాత నిర్మూలన, అల్గారిథమ్ ఆడిటింగ్, వివరించదగిన ఏఐ, గోప్యతను పరిరక్షించే ఏఐ, డీప్‌ఫేక్ గుర్తింపు వంటి అంశాలపై 13 బాధ్యతాయుతమైన ఏఐ ప్రాజెక్టులను ఎంపిక చేశారు. మోడల్ నిష్పాక్షికతను అంచనా వేసే సాధనాలు, భాగస్వామ్య ఆల్గారిథమిక్ ఆడిటింగ్ కోసం ఓపెన్ సోర్స్ చట్రంతో సహా స్వదేశీ సాధనాలు, నిబంధనలను అభివృద్ధి చేయడానికి విద్యాసంస్థలు, అంకురాలు, పరిశ్రమలు, పౌర సమాజ సంస్థలు వీటిని అమలు చేస్తున్నాయి.
-
దేశంలో కృత్రిమ మేధ సురక్షితమైన, బాధ్యతాయుతమైన, సమగ్రమైన అభివృద్ధి, వినియోగం కోసం ఒక సమగ్ర జాతీయ చట్రాన్ని అందిస్తూ 2025 నవంబర్ 5న 'ఇండియా ఏఐ గవర్నెన్స్ మార్గదర్శకాలు' విడుదల అయ్యాయి. వీటికి అనుగుణంగా ఈ సంస్థాగత వ్యవస్థలు ప్రారంభమయ్యాయి: ఏఐ గవర్నెన్స్ అండ్ ఎకనామిక్ గ్రూప్ (ఏఐజీఈజీ).. భారతదేశ జాతీయ ఏఐ పరిపాలనా వ్యూహాన్ని రూపొందించడానికి వివిధ మంత్రిత్వ శాఖలతో ఏర్పడిన ఒక ఉన్నత స్థాయి సంస్థ. టెక్నాలజీ అండ్ పాలసీ ఎక్స్‌పర్ట్ కమిటీ (టీపీఈసీ).. సాంకేతిక, విధానపరమైన సిఫార్సులను అందించే నిపుణుల కమిటీ. ఏఐఎస్ఐ (ఏఐ సేఫ్టీ ఇన్‌స్టిట్యూట్).. భద్రతా పరిశోధనలు చేపట్టడం, ప్రమాణాలను రూపొందించడం, ఏఐ వ్యవస్థలను పరీక్షించడం, ఉత్పన్నమయ్యే నూతన ముప్పులను ఎవాల్యూయేషన్ చేయడం కోసం ఏర్పాటు చేసిన సంస్థ.
-
ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్' (సెర్ట్-ఇన్).. 2023 మేలో అడ్వర్సేరియల్ ఏఐ బెదిరింపుల నివారణకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సలహాలు జారీ చేసింది. 2024 సెప్టెంబర్‌లో ఎస్ఐఎస్ఏతో కలిసి 'సర్టిఫైడ్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (సీఎస్‌పీఏఐ) కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2025 మార్చిలో 'జెనరేటివ్ ఏఐ'ని బాధ్యతాయుతంగా ఉపయోగించడానికి పాటించాల్సిన ఉత్తమ విధానాలపై సలహాలను జారీ చేసింది.
-
భారతదేశ ఏఐ పరిపాలన విషయంలో సాంకేతిక, సంస్థాగత మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వడానికి, ఏఐ భద్రతపై స్వదేశీ పరిశోధన- అభివృద్ధికి ఒక కేంద్రంగా 'ఇండియా ఏఐ సేఫ్టీ ఇనిస్టిట్యూట్'ను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ సమాచారాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద 29.07.2026న లోక్‌సభలో సమర్పించారు.
***
(रिलीज़ आईडी: 2291505)
आगंतुक पटल : 11