వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారత బొమ్మల ఎగుమతులలో 89.1 శాతం భారీ వృద్ధి
దేశీయ తయారీ రంగంలోనూ బలమైన వృద్ధికి ఇదొక ప్రతీక
‘టాయ్ బిజ్ ఇంటర్నేషనల్-2026’లో 400 భారతీయ బ్రాండ్ల ప్రదర్శనతో దేశీయ అమ్మకాలు సహా ఎగుమతి అవకాశాలకు చేయూత
ప్రభుత్వ చర్యలతో భారత బొమ్మల పరిశ్రమలో నాణ్యత.. భద్రత.. పోటీతత్వం మెరుగుదల
प्रविष्टि तिथि:
28 JUL 2026 4:14PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ‘టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ సంస్థ ఈ నెల 4 నుంచి 7 వరకూ ‘17వ టాయ్ బిజ్ ఇంటర్నేషనల్ బి2బి ఎగ్జిబిషన్’ను నిర్వహించింది. భారత బొమ్మల పరిశ్రమకు ప్రోత్సాహం, వ్యాపార నెట్‌వర్కింగ్ సౌలభ్య కల్పన, దేశీయ విక్రయాలు, ఎగుమతులలో వృద్ధికి అవకాశాల సృష్టి ఈ ఎగ్జిబిషన్ ప్రధాన లక్ష్యాలు. ఈ నేపథ్యంలో 400 భారత బొమ్మల బ్రాండ్లు, 40 దేశాల నుంచి 100 మంది అంతర్జాతీయ కొనుగోలుదారులు, సుమారు 30,000 మంది వ్యాపార సందర్శకులు ఈ ప్రదర్శనలో పాలుపంచుకున్నారు. టోకు-చిల్లర వ్యాపారులు, పంపిణీదారులు, సంస్థాగత కొనుగోలుదారులు సహా ఇ-కామర్స్ వేదికలతో తయారీదారులను అనుసంధానించే వేదికగా ఈ ప్రదర్శన ఉపయోగపడింది. అయితే, బొమ్మల పరిశ్రమకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక విధానమంటూ ఇప్పటిదాకా ఏదీ లేదు.
భారత్‌లోకి 2018-19లో 371.7 మిలియన్ డాలర్ల విలువైన బొమ్మలు దిగుమతి అయ్యాయి. వీటిలో అధిక శాతం ప్రమాదకరమైనవే కాకుండా నాసిరకం, నకిలీ, చౌకబారు బొమ్మలున్నాయి. ఇక 2019లో ‘మిస్టరీ షాపింగ్’ కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా దేశీయ బొమ్మలలో 33 శాతం మాత్రమే భారత నాణ్యత ప్రమాణాల సంస్థ (బీఐఎస్) నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని వెల్లడైంది.
ఈ నేపథ్యంలో దేశీయ బొమ్మల నాణ్యత-భద్రత ప్రమాణాల మెరుగుదల సహా భారత బొమ్మల పరిశ్రమ సర్వతోముఖాభివృద్ధి దిశగా కేంద్రం ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల వివరాలు కిందివిధంగా ఉన్నాయి:
- కేంద్రంలోని 14 మంత్రిత్వ శాఖలు-విభాగాల సమన్వయంతో, 21 కార్యాచరణ అంశాల సహిత సమగ్ర జాతీయ బొమ్మల కార్యాచరణ ప్రణాళిక (ఎన్‌ఏపీటీ)ను రూపొందించింది. భారతీయ విలువలు, సంస్కృతి-చరిత్ర ఆధారంగా బొమ్మల రూపకల్పన-తయారీని ఈ ప్రణాళిక ప్రోత్సహించింది. అలాగే అభ్యసన వనరులుగా బొమ్మల వినియోగానికి చేయూతనిచ్చింది. బొమ్మల రూపకల్పన-తయారీ కోసం హ్యాకథాన్, ప్రదర్శనలు, భారీ పోటీల నిర్వహణతోపాటు నాణ్యత పర్యవేక్షణను బలోపేతం చేసింది. నాసిరకం, హానికర బొమ్మల దిగుమతిని అరికడుతూ స్వదేశీ బొమ్మల సముదాయాలను ప్రోత్సహించింది. అలాగే, దేశీయ తయారీ పెంపుపైనా దృష్టి సారించింది.
- బొమ్మలపై (హెచ్ఎస్ కోడ్-9503) ప్రాథమిక కస్టమ్స్ సుంకం (బిసీడీ)ని 2020 ఫిబ్రవరిలో 20 నుంచి 60 శాతానికి, 2023లో 70 శాతానికి పెంచింది. అలాగే, 2025-26 కేంద్ర బడ్జెట్‌లో ఎలక్ట్రానిక్ బొమ్మల విడి భాగాలపై (హెచ్ఎస్ 95030091 కిం) ‘బీసీడీ’ని 20 శాతంగా సవరించింది.
- బొమ్మలకు సంబంధించి 25.02.2020న ‘నాణ్యత నియంత్రణ ఉత్తర్వు’ (క్యూసీఓ) జారీ కాగా, ఇది 01.01.2021 నుంచి అమలులోకి వచ్చింది.
- భద్రమైన బొమ్మల దిశగా భారతీయ ప్రమాణానుగుణ బొమ్మలపై ‘బీఐఎస్’ గుర్తు వినియోగాన్ని అనుమతిస్తూ దేశీయ బొమ్మల తయారీదారులకు 1800కు పైగా, విదేశీ తయారీదారులకు 50కి పైగా లైసెన్సులు జారీచేసింది.
- ఆటపాటలు, కార్యాచరణాధారిత అభ్యసనంపై విద్యా మంత్రిత్వశాఖ రూపొందించిన జాతీయ విద్యా విధానం-2020 దృష్టి సారించింది. తదనుగుణంగా బాలల అభ్యసన ప్రక్రియను ఆనందదాయకం, సుబోధకంగా రూపొందించే లక్ష్యంతో, ‘ఎన్‌సీఈఆర్‌టీ’ ‘బొమ్మల ఆధారిత బోధన పద్ధతి’పై కరదీపికను ప్రచురించింది. బాలల్లో వివిధ సామర్థ్యాలను ప్రోత్సహించే దిశగా వివిధ దశలలో వాడే బొమ్మలను.. ముఖ్యంగా దేశీయ బొమ్మలు-ఆటలను ఇది సూచిస్తుంది.
- దేశీయ బొమ్మల పరిశ్రమకు మద్దతుగా సముదాయాధారిత విధానం రూపొందింది. సంప్రదాయ పరిశ్రమల పునరుజ్జీవన నిధుల పథకం (ఎస్‌ఎఫ్‌యూఆర్‌టీఐ) కింద సూక్ష్మ-చిన్న-మధ్య తరహా ‘ఎంఎస్‌ఎంఈ’ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 18 బొమ్మల సముదాయాలకు ఆమోదముద్ర వేసింది. మరోవైపు 40 బొమ్మల సముదాయాలకు డిజైనింగ్-టూలింగ్‌లో వస్త్ర పరిశ్రమల మంత్రిత్వశాఖ చేయూతనిస్తోంది.
- ‘స్టార్టప్ ఇండియా’ కార్యక్రమం 700కు పైగా అంకుర సంస్థలకు డీపీఐఐటీ గుర్తింపునిచ్చింది.
- బొమ్మల ఎగుమతుని ప్రోత్సహించడం కోసం అందుకు ఉద్దేశించిన ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల మినహాయింపు పథకం కింద 2,200కు పైగా ఎగుమతిదారు సంస్థలకు మద్దతునిస్తోంది.
- భారత్-యూఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం, భారత్-ఆస్ట్రేలియా ఆర్థిక సహకార-వాణిజ్య ఒప్పందం, భారత్-ఐరోపా యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య సంఘాల మధ్య వాణిజ్య-ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం, భారత్-ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం, భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, భారత్-యూకే సమగ్ర ఆర్థిక-వాణిజ్య ఒప్పందం తదితరాల కింద సుంకరహిత మార్కెట్ ప్రవేశానికి అవకాశం కలిగింది.
- స్వదేశీ బొమ్మల రంగంతోపాటు ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా ‘టాయ్‌కథాన్’ సహా వివిధ రకాల బొమ్మల ప్రదర్శనలు, ప్రచార కార్యక్రమాలను చేపట్టారు.
ఈ విధంగా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను చేపట్టడంతో భారత బొమ్మల పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందింది. ఈ మేరకు నాణ్యత ప్రమాణాల స్థాయికి అనుగుణమైన బొమ్మల తయారీ 2019లో 33 శాతం కాగా, 2025 నాటికి అది 95 శాతానికి పెరిగింది. ఈ సర్వే ప్రకారం భారత మార్కెట్లో లభించే బొమ్మల నాణ్యతలో గణనీయ వృద్ధి నమోదైంది.
మరోవైపు అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, నెదర్లాండ్స్, జర్మనీ వంటి దేశాలకు ఎగుమతుల ద్వారా భారత బొమ్మల పరిశ్రమ నికర ఎగుమతిదారుగా ఆవిర్భవించింది. దీంతో బొమ్మల దిగుమతి 37.5 శాతం దాకా తగ్గి, ఎగుమతులు 89.1 మేర వృద్ధి సాధించాయి.
|
వాణిజ్యం
|
2018-19
|
2025-26
|
వృద్ధి
|
|
ప్రపంచ దేశాల నుంచి భారత్ దిగుమతులు (మిలియన్ డాలర్లలో)
|
371.7
|
232.3
|
-37.5%
|
|
ప్రపంచ దేశాలకు భారత్ నుంచి ఎగుమతులు (మిలియన్ డాలర్లలో)
|
203.5
|
384.7
|
89.1%
|
మూలం: ట్రేడ్‌స్టాట్ వెబ్‌సైట్, హెచ్‌ఎస్ 9503, 9504, 9505 సంబంధిత సమాచారం
కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద ఈ రోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.
***
(रिलीज़ आईडी: 2290840)
आगंतुक पटल : 4