శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
‘సుస్థిరత కోసం ఏఐ.. వర్ధమాన దేశాల మధ్య సహకారం’పై ఐఐటీ-హైదరాబాద్‌లో ‘బ్రిక్స్ సైన్స్ అకాడమీస్ ఫోరమ్ మీటింగ్-2026’ విజయవంతం
प्रविष्टि तिथि:
24 JUL 2026 7:32PM by PIB Hyderabad
ఈ నెల 22-23 తేదీల్లో ఐఐటీ-హైదరాబాద్ ప్రాంగణంలో నిర్వహించిన ‘బ్రిక్స్ సైన్స్ అకాడమీస్ ఫోరమ్ మీటింగ్-2026’ విజయవంతంగా ముగిసింది. ఇందులో తొలిరోజున సుస్థిర ప్రగతి దిశగా కృత్రిమ మేధ వినియోగం-వర్ధమాన దేశాల మధ్య సహకార బలోపేతం ఇతివృత్తంపై ప్రతినిధులు చర్చించారు. కృత్రిమ మేధ (ఏఐ) పురోగమనంలో ‘సమష్టి, సహకార, సందర్భోచిత’ విధానాల (3సీ)పై 13 బ్రిక్స్ సభ్యత్వ, భాగస్వామ్య దేశాలు ఒకే వేదికపైకి వచ్చాయి. ఈ మేరకు 8 సభ్యదేశాలు- బ్రెజిల్, ఇండియా, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, రష్యా, దక్షిణాఫ్రికా సహా 5 భాగస్వామ్య దేశాలు- నైజీరియా, వియత్నాం, బెలారస్, కజకిస్తాన్, మలేషియా దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.
భారత జాతీయ సైన్స్ అకాడమీ (ఐఎన్‌ఎస్‌ఏ) ఆతిథ్యమిచ్చిన నేపథ్యంలో ఆ సంస్థ అధ్యక్షుడు ప్రొఫెసర్ శేఖర్ సి.మాండే అధ్యక్షోపన్యాసం చేశారు. అంతర్జాతీయ, వర్ధమాన దేశాల ప్రధాన సవాళ్ల పరిష్కారంలో ‘ఏఐ’ పరిణామాత్మక పాత్రను ఈ సందర్భంగా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఏఐ వ్యవస్థలు నైతికంగా, సార్వజనీనంగా, పారదర్శకంగా, అన్ని సామాజిక-ఆర్థిక వర్గాలకు అందుబాటులో ఉండేలా చూడటం ప్రధానమని స్పష్టం చేశారు. బహుపాక్షిక శాస్త్రీయ భాగస్వామ్యాన్ని బలోపేతం అవసరాన్ని ‘ఐఎన్‌ఎస్‌ఏ’ ఉపాధ్యక్షుడు (అంతర్జాతీయ వ్యవహారాలు) డాక్టర్ దేవాశీష్ మిత్రా విశదీకరించారు. అనంతరం ఐఐటీ-హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి తన సంస్థాగత ప్రసంగంలో తాము చేపట్టిన వివిధ ఏఐ సంబంధిత కార్యక్రమాల గురించి వివరించారు.
కృత్రిమ మేధపై సహకారంలో కీలకాంశాలు
ఈ వేదికపై చర్చల సందర్భంగా ఏఐ ఆధారిత కార్యక్రమాల కోసం కింద పేర్కొన్న ఐదు ప్రాధాన్య రంగాలను ఎంపిక చేశారు:
· అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ - తయారీ రంగం: అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ సత్వర ఆవిష్కరణ, అత్యాధునిక తయారీ రంగ సామర్థ్య వికాసం, సరఫరా వ్యవస్థల మెరుగుదల.
· ఆరోగ్య సంరక్షణ: వైద్య రంగ నిర్ణయాల మెరుగుదల, జనాభా స్థాయిలో నిర్ధారణ పరీక్షల నిర్వహణ, ఆరోగ్య పరిశోధనలకు ప్రోత్సాహం.
· వాతావరణ మార్పు - పర్యావరణ సుస్థిరత: దీర్ఘకాలిక అంచనాల మెరుగుదల, భౌతిక నమూనాలతో ఏఐ అనుసంధానం, నష్ట నివారణ సామర్థ్య కల్పన.
· వ్యవసాయం - ఆహార భద్రత: ఏఐ ఆధారిత సలహాల జారీ, విత్తన పరిశోధన వేగవంతం, సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాల సద్వినియోగం.
· విపత్తుల అంచనా - నిర్వహణ:: అత్యవసర పరిస్థితులలో అంచనా సామర్థ్యం, భూకంప విశ్లేషణ, వనరుల మెరుగుదల బలోపేతం.
అకాడమీల ఫోరం పరిచయ గోష్ఠిలో ఐఐటీ-ఢిల్లీ ప్రొఫెసర్ అంబుజ్ సాగర్ నేతృత్వాన ఇతివృత్త నేపథ్యాన్ని పరిచయం చేయడం ద్వారా సమగ్ర చర్చలకు వేదికను సిద్ధం చేశారు. ఇందులో పాల్గొన్న అకాడమీల ప్రతినిధులు కింది విధఃగా తమతమ జాతీయ దృక్పథాలను విశదీకరించారు:
· బ్రెజిల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్- ఆరోగ్య సంరక్షణ, వాతావరణ మార్పు ఉపశమన పునరుత్థాన సామర్థ్యం, ఆహార భద్రత కోసం సమ్మిళిత ‘ఏఐ’కి ప్రాధాన్యం.
· చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్- సుస్థిర ప్రగతి లక్ష్యాలకు (ఎస్‌డీజీ) అనుగుణంగా సమాచార భాగస్వామ్యం-ధ్రువీకరణ-నిదర్శనాధారిత విధాన రూపకల్పనపై ప్రముఖంగా ప్రస్తావన.
· ఈజిప్టు అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ- సామర్థ్య వికాసం, బ్రిక్స్ ఏఐ నెట్‌వర్క్ రూపకల్పను పిలుపు.
· ఇథియోపియా అకాడమీ ఆఫ్ సైన్సెస్- ప్రతినిధులు- సైబర్ భద్రత, ఏఐ విద్య సహా భాషా వైవిధ్య పరిరక్షణకు ప్రాధాన్యం.
· ఇండోనేషియా అకాడమీ ఆఫ్ సైన్సెస్- వివరణాత్మకత, నైతిక ముప్పులు, మానవ వివేచన మెరుగుదలలో ఏఐ ఆవశ్యకత స్పష్టీకరణ.
· రష్యా అకాడమీ ఆఫ్ సైన్సెస్- బలమైన నైతిక విలువలు, పారదర్శకత, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ వంటి సంస్థాగత యంత్రాంగ సహిత విశ్వసనీయ ఏఐ వ్యవస్థలకు మద్దతు.
· దక్షిణాఫ్రికా అకాడమీ ఆఫ్ సైన్సెస్- డిజిటల్ అంతరం తగ్గింపు, వాతావరణం సహా ఆరోగ్యం, ఆహార భద్రతలకు ప్రాధాన్యంపై దృష్టి.
· నైజీరియా అకాడమీ ఆఫ్ సైన్సెస్- నైతిక ఏఐ, సమాచార ఆధారిత ప్రణాళికకు ప్రాధాన్యం.
· వియత్నాం అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ- ఉపాధి, స్థానిక సమాచారం, పర్యావరణ ప్రభావాలపై ఆందోళనల ప్రస్తావన.
· బెలారస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్- దూరవైద్యం, సమాచార భద్రతలపై ప్రముఖంగా ప్రస్తావన.
· కజకిస్తాన్ రిపబ్లిక్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్- సాంకేతికతల అందుబాటు, ‘ఎస్‌డీజీ’ల అనుసంధానం, యువ శాస్త్రవేత్తలకు మద్దతుకు ప్రాధాన్యం.
అనంతరం ఐఎన్‌ఎస్‌ఏ ఉపాధ్యక్షుడు (ఫెలోషిప్ వ్యవహారాలు) ప్రొఫెసర్ యు.బి.దేశాయ్, చర్చల సారాంశాన్ని వివరించారు. సభ్య దేశాల మధ్య మెరుగైన సహకారం, సామర్థ్య వికాసం, విజ్ఞాన ఆదానప్రదానం ఆవశ్యకతను స్పష్టం చేశారు. “ఆరోగ్య సంరక్షణలో ఏఐ ఎందుకు? (ఎప్పుడు వినియోగించకూడదు)” ఇతివృత్తంపై ఐఎన్‌ఎస్‌ఏ ఉపాధ్యక్షుడు (సైన్స్ పాలసీ) ప్రొఫెసర్ అనురాగ్ అగర్వాల్ ప్రధానోపన్యాసం చేశారు. ఈ విధంగా తొలి రోజు అధికారిక కార్యక్రమాలు చర్చలు ముగించిన ప్రతినిధులు నెట్‌వర్కింగ్ విందులో పాల్గొన్న అనంతరం కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలిచ్చారు.
ఇక రెండో రోజు కార్యక్రమం ఐఎన్‌ఎస్‌ఏ ఉపాధ్యక్షుడు (సైన్స్ అండ్ సొసైటీ) ప్రొఫెసర్ ఇంద్రనీల్ మన్నా ప్రధానోపన్యాసంతో ప్రారంభమైంది. సమాచార సమీకరణ, నమూనాల రూపకల్పన, భౌతికశాస్త్ర ఆధారిత మోడలింగ్, భవిష్యత్ ఆశావహ పదార్థ గుర్తింపు సహా పదార్థావిష్కరణలో ఏఐ పాత్రను ఆయన విశదీకరించారు. అనంతరం ‘సీఎస్‌ఐఆర్-సీఐఎల్’ డైరెక్టర్ డాక్టర్ ఆశిష్ లెలే “ఏఐ-గ్రీన్ హైడ్రోజన్ సద్వినియోగం: సామర్థ్యం పెంపు, డీకార్బనైజేషన్‌కు ప్రోత్సాహం” అంశంపై కీలకోపన్యాసం ఇచ్చారు. భారత ఇంధన మార్పిడి విధానాలను, జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రాధాన్యాన్ని, పర్యావరణ హిత లాజిస్టిక్స్, డీకార్బనైజ్డ్ డేటా సెంటర్ల ఆవశ్యకతను ఆయన వివరించారు.
రెండోరోజు ముగింపు కార్యక్రమంలో భాగంగా ఐఎన్‌ఎస్‌ఏ అధ్యక్షుడు ప్రొఫెసర్ శేఖర్ సి.మాండే అధ్యక్షతన సంయుక్త ప్రకటనపై సార్వత్రిక చర్చ కీలక ఘట్టంగా నిలిచింది. ఇందులో పాల్గొన్న బ్రిక్స్ సభ్య, భాగస్వామ్య దేశాల సైన్స్ అకాడమీల ప్రతినిధులందరూ ఏకాభిప్రాయంతో ప్రకటనను ఖరారు చేయడంపై విస్తృతంగా చర్చించారు. అకాడమీల ఉమ్మడి దృక్పథం-సిఫారసులను ప్రతిబింబించే ఈ సంయుక్త ప్రకటనకు మరో వారంలో ఆమోదం తర్వాత మంత్రుల స్థాయి ‘బ్రిక్స్ సైన్స్-టెక్నాలజీ-ఇన్నొవేషన్’ (ఎస్‌టీఐ) సమావేశం-2026 నాటికి దీన్ని అందజేసే అవకాశాలున్నాయి.
చివరగా సంయుక్త కార్యదర్శి (ఎంఈఆర్ అండ్ జీ20), బ్రిక్స్ ‘సూస్ షెర్పా’ శ్రీ శంభులింగప్ప హక్కీ ప్రసంగిస్తూ- సుస్థిర ప్రగతి లక్ష్యాలు, నిదర్శానాధారిత ప్రభుత్వ విధానాలకు సైన్స్ ఒక అనివార్య పునాది అని స్పష్టం చేశారు. సంయుక్త ప్రకటనపై ఏకాభిప్రాయానికి వచ్చినందుకు అకాడమీలన్నిటినీ ఆయన అభినందించారు. మానవాళి కేంద్రక ప్రగతిపై భారత్ దార్శనికతకు అనుగుణంగా, సముచిత సమయంలో ఈ చర్చలు సాగాయని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమానికి ఐఎన్‌ఎస్‌ఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ బ్రజేష్ పాండే వందన సమర్పణతో ముగింపు పలికారు. ఇది విజయవంతం కావడంలో సహకరించిన అన్ని అకాడమీలు, ప్రతినిధులు, వక్తలు సహా ఐఐటీ-హైదరాబాద్, ‘ఎంఈఏ, ఐఎన్‌ఎస్‌ఏ’లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
***
(रिलीज़ आईडी: 2289304)
आगंतुक पटल : 22