వ్యవసాయ మంత్రిత్వ శాఖ
వాతావరణ సమాచార నెట్‌వర్క్ డేటా వ్యవస్థ ప్రారంభం
प्रविष्टि तिथि:
24 JUL 2026 6:01PM by PIB Hyderabad
‘వెదర్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ అండ్ డేటా సిస్టమ్’ (విండ్స్) కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఒక కార్యక్రమం. పంటల బీమా, వ్యవసాయ సలహాలు, వివిధ రంగాల్లో విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన దీర్ఘకాలిక, స్థానిక స్థాయి వాతావరణ సమాచారాన్ని సేకరించేందుకు దేశవ్యాప్తంగా ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు (ఏడబ్ల్యూఎస్), ఆటోమేటిక్ రెయిన్ గేజ్‌లు (ఏఆర్జీ) నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం దీని లక్ష్యం. ఈ వ్యవస్థ ద్వారా గ్రామం లేదా ప్రాంత స్థాయిలో వర్షపాతం, ఉష్ణోగ్రత, ఇతర వాతావరణ పరిస్థితులపై కచ్చితమైన సమాచారం లభిస్తుంది. దీని ఆధారంగా రైతులకు మెరుగైన వ్యవసాయ సలహాలు అందించడం, పంటల నష్టాలను అంచనా వేయడం, విపత్తులపై ముందస్తు చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుంది. విండ్స్ కార్యక్రమాన్ని 7 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు (అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఒడిశా, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్) అమలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 16,843 ప్రాంతాల్లో వాతావరణ సమాచార కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం లభించింది. వీటిలో 1,188 ప్రాంతాల్లో సివిల్ పనులు పూర్తయ్యాయి. అలాగే 892 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు, ఆటోమేటిక్ రెయిన్ గేజ్‌లు ఏర్పాటు చేశారు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) అమలులో మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా, పంట నష్టం, నష్ట అంచనాలను మరింత పారదర్శకంగా, కచ్చితంగా నిర్ధారించేందుకు ఖరీఫ్ 2023 నుంచి సాంకేతిక ఆధారిత దిగుబడి అంచనా వ్యవస్థ (ఎస్-టెక్) అమలు చేస్తున్నారు. ఎస్-టెక్ ద్వారా క్రమంగా రిమోట్ సెన్సింగ్ ఆధారిత పంట దిగుబడి అంచనా విధానానికి మారాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా పంట దిగుబడిని మరింత న్యాయబద్ధంగా, కచ్చితంగా అంచనా వేయడం సాధ్యమవుతుంది. ఈ కార్యక్రమాన్ని ఖరీఫ్ 2023 నుంచి వరి, గోధుమ పంటలకు, ఖరీఫ్ 2024 నుంచి సోయాబీన్ పంటకు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా, ఎస్-టెక్ ద్వారా అంచనా వేసిన దిగుబడికి మొత్తం దిగుబడి అంచనాలో తప్పనిసరిగా 30 శాతం ప్రాధాన్యత (వెయిటేజ్) కేటాయించారు.
2025–26 ఆర్థిక సంవత్సరంలో ఎస్-టెక్ కార్యక్రమాన్ని 12 రాష్ట్రాల్లోని 344 జిల్లాల్లో అమలు చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంకేతికత ఆధారంగా అంచనా వేసిన దిగుబడికి 100 శాతం వెయిటేజ్ కేటాయించింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం వెయిటేజ్ ఇవ్వగా, ఒడిశా, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్-టెక్ ఆధారిత దిగుబడి అంచనాకు 40 శాతం వెయిటేజ్ కేటాయించాయి.
ఎస్-టెక్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సంబంధిత భాగస్వాములతో కలిసి క్రమబద్ధమైన సమీక్షా విధానాన్ని ఏర్పాటు చేసింది.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద క్లెయిమ్‌లను సకాలంలో పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం క్రింద చర్యలు చేపట్టింది:
-
రైతుల బీమా సబ్సిడీ చెల్లింపులు, సమాచార లభ్యత, ఆన్‌లైన్‌లో రైతుల నమోదు, బీమా పొందిన ప్రతి రైతు వివరాలను అప్‌లోడ్ చేయడం/పొందడం, క్లెయిమ్ మొత్తాన్ని నేరుగా రైతు బ్యాంకు ఖాతాకు ఎలక్ట్రానిక్ విధానంలో బదిలీ చేయడం వంటి సేవల కోసం ఒకే వేదికగా పనిచేసేలా జాతీయ పంటల బీమా పోర్టల్ (ఎన్సీఐపీ)ని ప్రభుత్వం అభివృద్ధి చేసింది.
-
క్లెయిమ్‌ల చెల్లింపు ప్రక్రియను కఠినంగా పర్యవేక్షించేందుకు, ఖరీఫ్ 2022 నుంచి క్లెయిమ్‌ల చెల్లింపుల కోసం ప్రత్యేకమైన ‘డిజిక్లెయిమ్ మాడ్యూల్’ ను అమల్లోకి తీసుకొచ్చారు. ఈ విధానంలో జాతీయ పంటల బీమా పోర్టల్ ను పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (పీఎఫ్ఎంఎస్), బీమా కంపెనీల అకౌంటింగ్ వ్యవస్థలతో అనుసంధానం చేశారు. దీని ద్వారా అన్ని క్లెయిమ్‌లను సకాలంలో, పారదర్శకంగా ప్రాసెస్ చేసి చెల్లింపులు చేయడం సాధ్యమవుతుంది.
-
ఖరీఫ్ 2024 నుంచి బీమా కంపెనీ సకాలంలో చెల్లింపులు చేయని పక్షంలో, జాతీయ పంటల బీమా పోర్టల్ ద్వారా 12 శాతం జరిమానా స్వయంచాలకంగా లెక్కించి విధించే విధానాన్ని అమలు చేస్తున్నారు.
-
రైతులకు కేంద్ర ప్రభుత్వ వాటాకు సంబంధించిన ప్రీమియం సబ్సిడీ ఆధారంగా రావాల్సిన క్లెయిమ్‌లు సకాలంలో, తగిన నిష్పత్తిలో అందేలా కేంద్ర ప్రభుత్వ ప్రీమియం సబ్సిడీ వాటాను రాష్ట్ర ప్రభుత్వ వాటా నుంచి వేరు చేసే విధానాన్ని అమలు చేశారు.
-
ఖరీఫ్ 2025 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రీమియం సబ్సిడీ వాటా విడుదలలో ఆలస్యం జరిగితే, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వంపై కూడా 12 శాతం జరిమానా విధించే విధానాన్ని అమలు చేస్తున్నారు.
-
పథకం నిబంధనల ప్రకారంరాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రీమియం వాటాను ముందుగానే జమ చేసేందుకు ఎస్క్రో ఖాతాను ప్రారంభించడం ఖరీఫ్ 2025 సీజన్ నుంచి తప్పనిసరి చేశారు. దీని ద్వారా ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
-
పథకం అమలులో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, దిగుబడి సమాచారం/పంట కోత ప్రయోగాల వివరాలను సీసీఈ - అగ్రీ యాప్ ద్వారా సేకరించి, వాటిని జాతీయ పంటల బీమా పోర్టల్ లో అప్‌లోడ్ చేసే విధానం అమలు చేస్తున్నారు. బీమా కంపెనీలకు పంట కోత ప్రయోగాల నిర్వహణను ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం కల్పించడం, రాష్ట్రాల భూ రికార్డులను ఎన్సీఐపీతో అనుసంధానం చేయడం, ఎస్ - టెక్ ద్వారా రిమోట్ సెన్సింగ్ ఆధారిత దిగుబడి అంచనా విధానాన్ని వినియోగించడం వంటి చర్యలు చేపట్టారు. ఈ సాంకేతిక ఆధారిత చర్యలన్నీ రైతుల క్లెయిమ్‌లను సకాలంలో పరిష్కరించేందుకు, చెల్లింపులను వేగవంతం చేసేందుకు దోహదపడుతున్నాయి.
-
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద స్థానిక విపత్తులు, కోత అనంతర నష్టాల కారణంగా వ్యక్తిగత రైతుల పొలాలు, భూ విస్తీర్ణాల వారీగా పంట నష్టాలను అంచనా వేసే ప్రక్రియను మరింత సమర్థవంతంగాసులభతరం చేసేందుకు ‘క్రాప్ లాస్ అసెస్‌మెంట్ యాప్’ (క్లాప్)ను డిజిటల్ మొబైల్ అప్లికేషన్‌గా అభివృద్ధి చేశారు.ఈ పథకం కింద అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో క్లాప్ వినియోగాన్ని తప్పనిసరి చేశారు.
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్‌నాథ్ ఠాకూర్ ఈ రోజు రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలిపారు.
***
(रिलीज़ आईडी: 2289303)
आगंतुक पटल : 15