అంతరిక్ష విభాగం
618 మిలియన్ డాలర్లు దాటిన పెట్టుబడులు.. ఊపందుకున్న ప్రైవేటు అంతరిక్ష రంగం
పార్లమెంటుకు వెల్లడించిన డాక్టర్ జితేంద్ర సింగ్
జాతీయ భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసిన ప్రభుత్వం
ప్రైవేటు సంస్థలకు 105 అనుమతులు జారీ, అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం పెంపునకు ప్రత్యేక భద్రతా మార్గదర్శకాలను రూపొందిస్తున్న ఇన్ స్పేస్ సంస్థ
అంతరిక్ష సంస్కరణలతో వేగంగా విస్తరిస్తున్న భారత ప్రైవేటు అంతరిక్ష వ్యవస్థ: పార్లమెంటులో డాక్టర్ జితేంద్ర సింగ్
ప్రైవేటు పెట్టుబడులు, అంకురాల వృద్ధి, జాతీయ భద్రతే లక్ష్యంగా భారత అంతరిక్ష రంగంలో తదుపరి దశ సంస్కరణలు: డాక్టర్ జితేంద్ర సింగ్
प्रविष्टि तिथि:
23 JUL 2026 4:35PM by PIB Hyderabad
భారత అంతరిక్ష రంగంలో కీలక సంస్కరణల అనంతరం గొప్ప పురోగతి నమోదైందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాస్త్రాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రాజ్యసభలో పేర్కొన్నారు. ప్రైవేటు సంస్థలకు 105 అధికారిక అనుమతులు జారీ అవ్వడంతోపాటు ప్రైవేటు రంగంలోకి 187 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూనే, దేశ వ్యూహాత్మక ప్రయోజనాలు, జాతీయ భద్రత రక్షణకు బలమైన నియంత్రణ వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేస్తోందని ఆయన అన్నారు.
రాజ్యసభలో అడిగిన నక్షత్ర గుర్తు లేని ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పలు కీలక గణాంకాలను వెల్లడించారు. 2026 జూలై 14 నాటికి ప్రభుత్వేతర సంస్థలకు 105 అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. 2026 సంవత్సరంలోనే ప్రైవేటు రంగంలోకి 187 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు వివరించారు. గత కొన్నేళ్లలో ప్రైవేటు నిధుల సమీకరణ దాదాపు ఆరు రెట్లు పెరిగిందని చెప్పారు. 2021-22లో 100.5 మిలియన్ డాలర్లుగా ఉన్న ఈ మొత్తం 2023-24లో 348.5 మిలియన్ డాలర్లకు, 2026 మార్చి 31 నాటికి 618.5 మిలియన్ డాలర్లకు చేరుకుందని తెలిపారు. ఇది దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అంతరిక్ష రంగ వ్యవస్థపై దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.
వేగవంతమైన వాణిజ్య వృద్ధితో పాటు పటిష్టమైన జాతీయ భద్రతా రక్షణ చర్యలను చేపట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ రాజ్యసభకు తెలియజేశారు. ప్రైవేటు అంతరిక్ష కార్యకలాపాల కోసం వచ్చే ప్రతి దరఖాస్తును అనుమతించే ముందు.. ఇన్ స్పేస్ నిబంధనలు, మార్గదర్శకాలు, విధానాల (ఎన్జీపీ) ప్రకారం వ్యూహాత్మక, భద్రతా, జాతీయ ప్రయోజనాలను సమగ్రంగా మూల్యాంకనం చేస్తున్నట్లు చెప్పారు. ప్రైవేటు రంగ భాగస్వామ్యం విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి భాగస్వాములతో సంప్రదించి అంతరిక్ష కార్యకలాపాలు, సురక్షిత నిర్వహణ కోసం ప్రత్యేక భద్రతా మార్గదర్శకాలను ఇన్ స్పేస్ రూపొందిస్తోందని వెల్లడించారు.
భారత ప్రైవేటు అంతరిక్ష రంగ పురోగతిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సమగ్ర విధానపరమైన, నియంత్రణ, ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా భారత అంతరిక్ష విధానం 2023 అమలు, సరళీకృత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)విధానం, ఇన్ స్పేస్ ద్వారా సులభతరం చేసిన అనుమతుల ప్రక్రియ, ఇస్రో సదుపాయాలను రాయితీతో వినియోగించుకునే వెసులుబాటు, రూ.1,000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్, రూ. 500 కోట్ల టెక్నాలజీ అడాప్షన్ ఫండ్, ఇన్ స్పేస్ సీడ్ ఫండ్ పథకం, అంకుర సంస్థలకు వ్యవస్థాపకత, ఇంక్యుబేషన్ మద్దతు, ఇస్రో నుంచి ప్రైవేటు సంస్థలకు సాంకేతికత బదిలీ, తక్కువ ఖర్చుతో కూడిన పరిశోధన, పరీక్షా మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించే పరిశ్రమల అవగాహన సదస్సులు వంటి కార్యక్రమాలు ఉన్నాయి.
అంతరిక్ష కార్యకలాపాలు నిర్వహించడానికి ఇప్పటివరకు 17 అంతరిక్ష అంకుర సంస్థలకు ఇన్ స్పేస్ అనుమతులు ఇచ్చిందని శ్రీ జితేంద్ర సింగ్ రాజ్యసభకు తెలిపారు. ఇది భారత అంతరిక్ష లక్ష్యాలకు ఎంతగానో తోడ్పడుతున్న ఒక చైతన్యవంతమైన స్టార్టప్ వ్యవస్థ ఆవిర్భావాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.
2020లో తీసుకొచ్చిన అంతరిక్ష రంగ సంస్కరణలపై ఇన్ స్పేస్ చేపట్టిన ప్రభావ అంచనా నివేదిక వివరాలను మంత్రి రాజ్యసభలో పంచుకున్నారు. ఈ సంస్కరణలు ఆరేళ్ల కాలంలోనే భారత ప్రైవేటు అంతరిక్ష రంగ స్వరూపాన్ని పూర్తిగా మార్చివేశాయని చెప్పారు. 2014లో కేవలం ఒక్కటే ఉన్న క్రియాశీల అంతరిక్ష అంకుర సంస్థల సంఖ్య నేడు 400 దాటిందని, ప్రైవేటు పెట్టుబడులు 600 మిలియన్ డాలర్లు దాటాయని తెలిపారు. భారతీయ ప్రైవేటు కంపెనీలు అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపే, కక్ష్యలోకి ప్రవేశపెట్టే సామర్థ్యాలను విజయవంతంగా ప్రదర్శించాయని, ప్రైవేటు సంస్థలు 30 కంటే ఎక్కువ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టాయని చెప్పారు. పీఎస్ఎల్వీ ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్ వంటి వేదికల ద్వారా దాదాపు 45 పేలోడ్లలను అంతరిక్షంలోకి పంపాయన్నారు. ఈ పురోగతి మన దేశ ప్రైవేటు అంతరిక్ష రంగానికి ఉన్న సాంకేతిక ప్రావీణ్యాన్ని, వాణిజ్యపరమైన పరిణతిని స్పష్టంగా చాటిచెబుతోందని మంత్రి వివరించారు.
ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్‌కు పెరుగుతున్న ప్రపంచ ప్రాబల్యాన్నిఈ ప్రభావ అంచనా నివేదిక స్పష్టం చేస్తోంది. భారతీయ అంతరిక్ష సంస్థలు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తూ, విదేశీ కార్యకలాపాలను విస్తరిస్తూ, ప్రపంచ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నాయి. 45 కంటే ఎక్కువ దేశాలతో ఇన్ స్పేస్ సంస్థ కార్యాచరణ సంబంధాలను నెలకొల్పి, పలు విదేశీ అంతరిక్ష సంస్థలతో సహకార ఒప్పందాలపై సంతకాలు చేసింది. స్వదేశంలో భూపరిశీలన ప్రభుత్వ-ప్రైవేటు రంగాల ఉమ్మడి భాగస్వామ్యం ద్వారా ప్రముఖ భారతీయ కంపెనీలు కలిసి సుమారు రూ.1,200 కోట్ల ప్రైవేటు పెట్టుబడితో దేశంలోనే తొలి ప్రైవేటు భూపరిశీలన ఉపగ్రహ సమూహాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. భారత అంతరిక్ష సంస్కరణలపై పారిశ్రామిక రంగానికి ఉన్న నమ్మకానికి ఈ భారీ భాగస్వామ్యమే ప్రత్యక్ష నిదర్శనం.


***
(रिलीज़ आईडी: 2288646)
आगंतुक पटल : 8