కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలో 6జీ కోసం ‘భారత్ 6జీ కూటమి’ ద్వారా వ్యూహాత్మక స్పెక్ట్రమ్ ప్రణాళిక ఆవిష్కరణ

प्रविष्टि तिथि: 22 JUL 2026 6:03PM by PIB Hyderabad

   దేశంలో 6వ తరం (6జీ) టెలికమ్యూనికేషన్‌ సాంకేతికత దిశగా ‘భారత్‌ 6జీ కూటమి’ (బీ6జీఏ) వ్యూహాత్మక స్పెక్ట్రమ్ ప్రణాళికను ఆవిష్కరించింది. పారిశ్రామిక-విద్యా సంస్థల నేతృత్వాన ఒక ‘సొసైటీ’ తరహాలో పనిచేసే ఈ కూటమి ఈ నెల 15 నాటికి 90 సంస్థల సభ్యత్వం గల సంస్థగా విస్తరించింది. ఈ సభ్య సంస్థలలో టెలికాం సేవా ప్రదాతలు, పరికరాల తయారీదారులు, అంకుర సంస్థలు, పరిశోధన-అభివృద్ధి సంస్థలు, విద్యాసంస్థలు సహా టెలికాం రంగంలోని ఇతరత్రా భాగస్వాములతో కూడిన విస్తృత-విభిన్న వ్యవస్థలకు సంబంధించిన సంస్థలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘బీ6జీఏ’, 6జీ సాంకేతికతలు, స్పెక్ట్రమ్, అప్లికేషన్లు, వినియోగ అధ్యయనాలు, ఆదాయ మార్గాలు, పరికరాలు-విడి భాగాలు, పర్యావరణం-సుస్థిరత అంశాలు, అవగాహన వంటి కీలక రంగాలపై దృష్టి సారిస్తూ 7 కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేశారు. పారిశ్రామిక-విద్యా సంస్థల భాగస్వామ్యం, సాంకేతిక అంతరాల గుర్తింపు, భారత 6జీ దృక్కోణానుగుణ ప్రయోగవేదికలు, ఆధునిక పరిశోధనలపై ప్రతిపాదనలను ఈ కూటమి రూపొందిస్తుంది. తద్వారా దేశీయ పరిశోధన-ఆవిష్కరణ సహా ఐపీఆర్‌ వ్యవస్థ బలోపేతానికి పారిశ్రామిక-విద్యా సంస్థలు, అంకుర సంస్థలు, పరిశోధన సంస్థలకు ఒక సహకార వేదికగా ఉపయోగపడుతుంది.

ఈ నేపథ్యంలో “భారతదేశంలో 6జీ కోసం స్పెక్ట్రమ్ రోడ్‌మ్యాప్” పేరిట భారత్ 6జీ కూటమి పరిధిలోని బృందాల్లో ఒకటైన ‘స్పెక్ట్రమ్ కార్యాచరణ బృందం’ ఒక నివేదికను సమర్పించింది. మరోవైపు ‘బీ6జీఏ’ సహా వివిధ భాగస్వాములతో సంప్రదింపుల అనంతరం 6జీ సేవల సంబంధిత స్పెక్ట్రమ్ భవిష్యత్‌ ప్రణాళికను టెలికమ్యూనికేషన్ల  శాఖ ప్రకటించింది. దీన్ని  https://www.dot.gov.in/static/uploads/2026/02/092d793d6ea912a5dd79bf0c26ea1a84.pdf లంకె ద్వారా పూర్తిగా పరిశీలించవచ్చు.

ఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ పరిధిలో కోల్‌కతాలో గల స్వయంప్రతిపత్త పరిశోధన-అభివృద్ధి సంస్థ ‘సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్‌ రీసెర్చ్’ (సమీర్‌)లో ‘6జీ టెరాహెర్ట్జ్ టెస్ట్‌బెడ్‌ కన్సార్టియం’ ఏర్పాటవుతుంది. మద్రాస్‌, గువహటి, పాట్నా నగరాల్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు ఇందులో సభ్య సంస్థలుగా ఉంటాయి. ఈ కన్సార్టియం మూడేళ్ల వ్యవధితో ఒక ప్రాజెక్టు  చేపట్టేందుకు ఆమోదం లభించింది. దీంతోపాటు డిజిటల్ భారత్ నిధి కింద టెలికాం సాంకేతిక అభివృద్ధి నిధి నుంచి ఆర్థిక తోడ్పాటు ఉంటుంది. ఈ ప్రాజెక్టు కింద ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్-2025’ (ఐఎంసీ)లో అధిక డేటా రేటుగల ‘లైన్ ఆఫ్ సైట్ లింక్‌’ను కూడా ఇంతకుముందు ప్రదర్శించారు.

టెలికాం పరిశ్రమలో 6జీగా వ్యవహరించే అంతర్జాతీయ మొబైల్ టెక్నాలజీ-2030 (ఐఎంటీ) చట్రం కింద అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ (ఐటీయూ)కు భారత్‌ తన వంతు సహకారం అందించింది. ఈ మేరకు 6జీ కింద వినియోగంలోకి వచ్చే 6 రకాల సాంకేతికతలలో ఒకటైన “సర్వవ్యాప్త అనుసంధానం” సహా కవరేజ్, ఇంటర్‌-ఆపరబిలిటీ, సుస్థిరతలను జోడించేందుకు తోడ్పడింది. మరోవైపు 6జీలో ప్రపంచ అగ్రగామిగా భారత్‌ పాత్ర బలోపేతం సహా టెలికమ్యూనికేషన్స్ శాఖ పరిధిలోని “సాంకేతిక అభివృద్ధి-పెట్టుబడుల ప్రోత్సాహక పథకం” (టీడీఐపీ) కింద చేపట్టిన కార్యక్రమాల ద్వారా 3వ తరం భాగస్వామ్య ప్రాజెక్ట్ (3జీపీపీ)కు, ‘ఐటీయూ’-ఒన్‌ఎం2ఎం’ వంటి అంతర్జాతీయ ప్రామాణీకరణ సంస్థలలో భారతీయ భాగస్వాముల చురుకైన పాత్ర పోషణకు ప్రభుత్వం కూడా మద్దతిస్తోంది. సభ్యత్వ రుసుములు, అంతర్జాతీయ ప్రామాణీకరణ సదస్సులలో పాల్గొనడం, భారత్‌లో ఆ సదస్సుల నిర్వహణ, టెలికాం ఉత్పత్తుల ప్రయోగాత్మక పరీక్షలు-ధ్రువీకరణకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం చేస్తుంది. ఇందులో భాగంగా దేశంలోని అర్హతగల అంకుర సంస్థలు సహా ‘ఎంఎస్‌ఎంఈ’లకూ ‘టీడీఐపీ’ ద్వారా చేయూత లభిస్తుంది.

   కేంద్ర కమ్యూనికేషన్లు-గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని ఈ రోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.

 

****


(रिलीज़ आईडी: 2287999) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी