రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
జాతీయ రహదారుల కన్సెల్టెన్సీ కాంట్రాక్టు నిబంధనలను బలోపేతం చేస్తున్న ఎన్ హెచ్ఏఐ
అనుభవజ్ఞులైన ఇంజనీరింగ్ నిపుణులు, యువ ఇంజనీర్లను జాతీయ రహదారుల ప్రాజెక్టులలోకి ఆకర్షించేందుకు కన్సల్టెన్సీ ఆర్ఎఫ్‌పీ నిబంధనల సవరణ
प्रविष्टि तिथि:
22 JUL 2026 4:41PM by PIB Hyderabad
జాతీయ రహదారుల ప్రాజెక్టుల సాంకేతిక పర్యవేక్షణను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ).. అథారిటీ ఇంజనీర్ (ఏఈ), ఇండిపెండెంట్ ఇంజనీర్ (ఐఈ) సలహాదారుల నియామకం కోసం ఆర్ఎఫ్‌పీ (ప్రామాణిక ప్రతిపాదనల అభ్యర్థన) పత్రాలలో సవరణలు చేసింది. భవిష్యత్ కాంట్రాక్టులలో కన్సల్టెన్సీ సంస్థలు కీలక వృత్తి నిపుణులు, సబ్-ప్రొఫెషనల్స్ (సివిల్ ఇంజనీర్), యువ వృత్తి నిపుణులకు (సివిల్ ఇంజనీర్) చెల్లించాల్సిన కనీస వేతనాన్ని నిబంధనగా పేర్కొంటూ ఈ ఆదేశాలు జారీ చేసింది.
కనీస నెలవారీ వేతనం టీమ్ లీడర్, బ్రిడ్జ్ లేదా స్ట్రక్చరల్ ఇంజనీర్‌కు రూ. 5.00 లక్షలుగా.. రోడ్డు భద్రతా నిపుణుడికి రూ. 2.50 లక్షలుగా.. రెసిడెంట్ కమ్ హైవే ఇంజనీర్, ప్రోగ్రామ్ షెడ్యూల్ రివ్యూయర్, సీనియర్ క్వాలిటీ కమ్ మెటీరియల్ ఎక్స్పర్ట్, సీనియర్ పేవ్‌మెంట్ స్పెషలిస్ట్‌లకు రూ. 3.50 లక్షలుగా నిర్ణయించారు. సబ్-ప్రొఫెషనల్‌కు (సివిల్ ఇంజనీర్) కనీస నెలవారీ వేతనం రూ. 1.50 లక్షలుగా, యువ వృత్తి నిపుణులకు (సివిల్ ఇంజనీర్) రూ. ఒక లక్షగా పేర్కొంది. కన్సల్టెన్సీ సిబ్బందికి నిర్ణయించిన ఈ కనీస వేతనాలు కచ్చితంగా ఆయా సిబ్బందికి అందేలా చూసేందుకు ఎస్క్రో విధానాన్ని ఉపయోగిస్తారు.
అనుభవజ్ఞులైన సైట్ ఇంజనీర్లకు వారి ఉద్యోగ జీవనంలో ఎదిగే అవకాశాలను కల్పించే దిశగా సైట్ ఇంజనీర్ల నియామక నిబంధనల విధానాన్ని ఎన్‌హెచ్ఏఐ సవరించింది. గతంలో వారి సేవా కాలాన్ని గరిష్ఠంగా ఐదేళ్లకు మాత్రమే పరిమితం చేసిన నిబంధనను ఇప్పుడు మార్చింది. ఈ శిక్షణ పొందిన నిపుణులు జాతీయ రహదారుల నెట్‌వర్క్ అభివృద్ధిలో నిరంతరం భాగస్వామ్యం అయ్యేలా చూడటానికి ఏఐ లేదా ఐఈ కన్సల్టెన్సీ ఆర్ఎఫ్‌పీల కాంట్రాక్ట్ జనరల్ నిబంధనల్లో (జీసీసీ) నిర్దిష్ట నిబంధనలను ఎన్‌హెచ్ఏఐ చేర్చింది.
సవరించిన విధానం ప్రకారం... అథారిటీ ఇంజనీర్, ఇండిపెండెంట్ ఇంజనీర్ కన్సల్టెన్సీ సంస్థలు నియమించే సబ్-ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ సిబ్బందిలో కనీసం 20 శాతం మంది 'ఎన్‌హెచ్ఏఐ, ఎంఓఆర్టీహెచ్ లేదా ఎన్‌హెచ్‌ఐడీసీఎల్'లలో గతంలో పని చేసిన వారు ఉండాలి. జాతీయ రహదారుల ప్రణాళిక, నిర్మాణ పర్యవేక్షణ, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో ఈ నిపుణులు పొందిన అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవడమే కాకుండా రహదారి మౌలిక సదుపాయాల రంగంలో వారికి అర్థవంతమైన ఉపాధి అవకాశాలను కల్పించాలన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకొచ్చారు.
సమన్యాయమైన, పోటీతత్వంతో కూడిన వేతనాలను మరింత ప్రోత్సహించడానికి ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్న సైట్ ఇంజనీర్లు, యువ వృత్తి నిపుణులు నెలకు కనీసం రూ. 1.50 లక్షల వేతనం ఉండాలన్న నిబంధనను ఎన్‌హెచ్ఏఐ విధించింది.
సాంకేతిక అర్హత, అనుభవం, సామర్థ్యం ఉన్న కీలక వృత్తి నిపుణులను మాత్రమే నియమించేలా చూడటానికి 'ఎన్‌హెచ్ఏఐ స్కిల్ బ్రిడ్జ్' పోర్టల్ ద్వారా తప్పనిసరి ఎంపానెల్మెంట్, ఇంటర్వ్యూ నిబంధనలను ప్రవేశపెట్టింది. నియామక ప్రక్రియను బలోపేతం చేయడానికి, జాతీయ రహదారుల కన్సల్టెన్సీ ప్రాజెక్టులలో వృత్తి నిపుణుల సేవల నాణ్యతను పెంచడానికి ఈ నిబంధనలను కన్సల్టెన్సీ కాంట్రాక్ట్ ఒప్పందాల్లో భాగం చేశారు.
జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగస్వాములైన ఇంజనీరింగ్ నిపుణులకు సుస్థిరమైన కెరీర్ మార్గాన్ని వ్యవస్థీకృతం చేసే దిశగా ఈ సంస్కరణలు ఒక ముఖ్యమైన మార్పును తెలియజేస్తున్నాయి. జాతీయ రహదారుల ప్రాజెక్టుల అమలు, పర్యవేక్షణలో ప్రత్యక్ష అనుభవం ఉన్న నిపుణుల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా ఈ సవరించిన నిబంధనలు రహదారి అభివృద్ధిలో నిమగ్నమైన కన్సల్టెన్సీ సంస్థల సాంకేతిక సామర్థ్యాలను కూడా బలోపేతం చేస్తాయి. ఇది అంతిమంగా జాతీయ రహదారుల వ్యవస్థ అంతటా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయటం, మెరుగైన నాణ్యతా ప్రమాణాలకు, నిర్వహణ సామర్థ్యానికి తోడ్పడుతుంది.
అనుభవజ్ఞులైన ఫీల్డ్ ఇంజనీర్లు కన్సల్టెన్సీ రంగానికి మారేందుకు అవకాశాలను కల్పించడం ద్వారా ప్రాజెక్ట్ పర్యవేక్షణ విషయంలో నాణ్యత, నిరంతరాయతను పెంచడంతో పాటు ఈ రంగంలో అత్యంత విలువైన సాంకేతిక మేధస్సును పరిరక్షించాలని ఎన్‌హెచ్ఏఐ ఆశిస్తోంది. వృత్తిపరమైన ప్రతిభను ప్రోత్సహించడానికి, అత్యుత్తమ ఇంజనీరింగ్ నైపుణ్యాలను ఆకర్షించి వారిని నిలబెట్టుకోవడానికి, ప్రపంచ స్థాయి జాతీయ రహదారుల నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి అవసరమైన సంస్థాగత సామర్థ్యాన్ని నిర్మించడానికి పురోగతిదాయక విధానాలను పాటించేందుకు ఎన్‌హెచ్ఏఐ కట్టుబడి ఉంది.
***
(रिलीज़ आईडी: 2287995)
आगंतुक पटल : 4