చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యాయ వ్యవహారాల విభాగం ఆధ్వర్యంలో 8వ బ్రిక్స్ దేశాల ప్రాసిక్యూషన్ సర్వీసెస్ అధిపతుల సమావేశం

प्रविष्टि तिथि: 20 JUL 2026 2:28PM by PIB Hyderabad

ప్రతిష్ఠాత్మక బ్రిక్స్-2026 నేపథ్యంలో భారత ప్రభుత్వ చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ పరిధిలోని న్యాయ వ్యవహారాల విభాగం జూలై 20 నుంచి 21, 2026 తేదీల్లో బ్రిక్స్ దేశాల ప్రాసిక్యూషన్ సర్వీసెస్ అధిపతుల 8వ సమావేశాన్ని వర్చువల్ పద్ధతిలో నిర్వహిస్తోంది. భారత అటార్నీ జనరల్ శ్రీ ఆర్. వెంకట రమణి అధ్యక్షతన జరుగుతున్న ఈ కీలక అధికారిక చర్చల్లో సభ్య దేశాల ప్రాసిక్యూషన్ అధిపతులు పాల్గొంటారు. ఈ కీలక సమావేశం భారతదేశ దార్శనికత "పటిష్ఠమైన, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత గల దేశ నిర్మాణం"ను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తుంది. సభ్యదేశాల ప్రాసిక్యూషన్ నాయకత్వాన్ని ఒకే తాటిపైకి తీసుకురావటం ద్వారా బ్రిక్స్ కూటమి దేశాల్లో ఆర్థిక వృద్ధికి సహకరించే స్థిరమైన, నిష్పాక్షికమైన, స్పష్టమైన వ్యవస్థలను పెంపొందించేందుకు ఉమ్మడి నిబద్ధతను ఈ సమావేశం స్పష్టం చేస్తుంది.

ఈ వర్చువల్ సమావేశం "నేర విచారణలో ప్రాసిక్యూషన్ దృక్పథం నుంచి అనుభవాలు, ఉత్తమ విధానాలను పరస్పరం మార్చుకోవటం" ఇతివృత్తంపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇది ప్రస్తుత కాలానికి అనువైన, సమయోచితమైన ఇతివృత్తం. ఈ రెండు రోజుల పాటు ఆధునిక సంస్థాగత సవాళ్లపై సీనియర్ నాయకులు చర్చించటంతో పాటు న్యాయ నిర్ణయ ప్రక్రియకు సంబంధించిన కీలక విధానాలను పంచుకుంటారు. గత సమావేశాల్లో ప్రారంభమైన డిజిటల్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ… కృత్రిమ మేధ, న్యాయ సూత్రాలను రోజువారీ ఆచరణాత్మక విధానాల్లోకి తీసుకురావటంపై ఈ చర్చలు సాగుతాయి. సాంకేతికతతో కూడిన న్యాయ నిర్ణయాన్ని పరిశీలించటం ద్వారా క్రిమినల్ విధానాల డిజిటలైజేషన్, ఎలక్ట్రానిక్ సాక్ష్యాల నిర్వహణ, నిర్దేశిత సమయ పరిమితితో విచారణలను పూర్తి చేయటం వంటి కీలక అంశాలపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది.

నేర న్యాయ వ్యవస్థను మరింత సున్నితంగా, పారదర్శకంగా, బాధితుల వైపు నిలిచేలా మార్చటం.. ఈ ఏడాది చర్చల ముఖ్య ఉద్దేశం. ప్రాసిక్యూషన్ విభాగాల పనితీరును మెరుగుపరచటానికి, వాటిపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచటానికి సభ్య దేశాలు ప్రత్యేక అనుభవాలను పంచుకుంటాయి. ఆర్థిక నేరాలు, సైబర్ బెదిరింపులు, పర్యావరణ ఉల్లంఘనల వంటి క్లిష్టమైన ఆధునిక సవాళ్లను ఎదుర్కోవటానికి బలమైన అంతర్జాతీయ సహకారం అవసరమని ఈ సమావేశం గుర్తిస్తోంది. తరచూ చర్చల నిర్వహణ ద్వారా పరస్పర చట్టపరమైన సహాయం, అంతర్జాతీయ సాక్ష్యాల సేకరణ వ్యవస్థలను పటిష్టం చేయటంతో పాటు ప్రాసిక్యూటర్ల వృత్తిపరమైన సామర్థ్య పెంపొందింపును ప్రోత్సహించటం ఈ సమావేశం లక్ష్యం.

డిజిటల్ సాంకేతికత ద్వారా భౌగోళిక దూరాలను అధిగమిస్తూ, బ్రిక్స్ దేశాల మధ్య సంస్థాగత బంధాలను మరింత బలోపేతం చేయటంలో ఈ సమావేశం కీలక ముందడుగుగా నిలిచింది. మరింత సులభతరమైన పరస్పర సహకారానికి ఆచరణాత్మక, ఉమ్మడి ప్రణాళికలను అన్వేషించటానికి, సామర్థ్య పెంపొందింపు కోసం డిజిటల్ వేదికలను ఏర్పాటు చేయటానికి భారత ప్రభుత్వ న్యాయ వ్యవహారాల శాఖ, చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది. ఈ అధికారిక సమావేశం... ఆధునిక, డిజిటల్ శక్తితో కూడిన వ్యవస్థను రూపొందించటంలో భారతదేశ క్రియాశీలక నాయకత్వాన్ని తెలియజేస్తుంది. అలాగే సభ్య దేశాలన్నింటికీ మరింత న్యాయమైన, సమర్థవంతమైన, సహకార భవిష్యత్తును అందిస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2286645) आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , Bengali , Gujarati