రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రామ్‌నగర్-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్


రామ్‌నగర్, డెహ్రాడూన్ మధ్య మొదటి ప్రత్యక్ష ఎక్స్‌ప్రెస్ రైలు.. ఉత్తరాఖండ్‌లోని కుమాన్, గర్వాల్ ప్రాంతాల మధ్య మెరుగైన అనుసంధానం

రద్దీని పెంచకుండా పేద, మధ్యతరగతి ప్రయాణికులకు మెరుగైన వసతులపైనే హరిద్వార్, డెహ్రాడూన్ స్టేషన్ల పునరాభివృద్ధి: శ్రీ అశ్విని వైష్ణవ్

ఉత్తరాఖండ్‌లో రైలు సామర్థ్యాన్ని విస్తరించడానికి ఫీడర్ స్టేషన్‌గా అభివృద్ధి చెందనున్న రిషికేశ్ రైల్వే స్టేషన్: కేంద్ర రైల్వే మంత్రి

వేగంగా సాగుతున్న రిషికేశ్-కర్ణప్రయాగ్ రైల్వే లైను పనులు.. ఉత్తరాఖండ్ సామాజిక, ఆర్థిక, మతపరమైన, పర్యాటక అభివృద్ధికి ఇది జీవనాడి కానుంది: శ్రీ పుష్కర్ సింగ్ ధామి

प्रविष्टि तिथि: 18 JUL 2026 4:11PM by PIB Hyderabad

రామ్‌నగర్, డెహ్రాడూన్ నగరాలను అనుసంధానిస్తూ ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఎక్స్‌ప్రెస్ రైలు  సర్వీసును కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ నేడు వర్చువల్ విధానంలో ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ప్రాంతీయ ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త రైలు, ఉత్తరాఖండ్‌లోని కుమాన్, గర్వాల్ ప్రాంతాల మధ్య రైలు అనుసంధానాన్ని గణనీయంగా బలోపేతం చేయనుంది.

 

ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి వారం బుధ, శుక్రవారాల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. రైలు నంబర్ 15310 ఉదయం 05:50 గంటలకు రామ్‌నగర్‌ నుంచి బయల్దేరి, మధ్యాహ్నం 12:40 గంటలకు డెహ్రాడూన్ చేరుకుంటుంది. రైలు నంబర్ 15309 మధ్యాహ్నం 15:55 గంటలకు డెహ్రాడూన్‌లో బయలుదేరి, రాత్రి 23:30 గంటలకు తిరిగి రామ్‌నగర్ చేరుకుంటుంది. ఈ రైలు తన ప్రయాణ మార్గంలో కాశీపూర్, రోషన్‌పూర్, పీపల్‌సనా, మొరాదాబాద్, నజీబాబాద్, హరిద్వార్ స్టేషన్లలో ఆగుతుంది.

 

ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైలులో ఏసీ సెకండ్ క్లాస్, ఏసీ థర్డ్ క్లాస్, ఏసీ చైర్ కార్, స్లీపర్ క్లాస్, సెకండ్ సిట్టింగ్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు. దీనివల్ల అన్ని వర్గాల ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతమైన, సులువైన ప్రయాణ అవకాశాలు లభిస్తాయి.

 

ఈ కొత్త రైలు సేవ వల్ల ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్, ఉధమ్‌ సింగ్ నగర్, హరిద్వార్, డెహ్రాడూన్ జిల్లాలతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్, బిజ్నోర్ జిల్లాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఇది డెహ్రాడూన్, హరిద్వార్ నగరాలకు ఒకే రోజులో ప్రయాణించి వచ్చేలా అనుకూలమైన అనుసంధానాన్ని అందిస్తుంది. దీనివల్ల ప్రయాణికులు తమ అధికారిక, విద్యాసంబంధిత, వ్యాపార, వ్యక్తిగత పనులను ముగించుకుని తిరిగి ఇంటికి చేరుకోవడానికి వీలవుతుంది.

 

ఈ రైలు ప్రాంతీయ పర్యాటకం, ఆధ్యాత్మిక యాత్రలను కూడా ఎంతగానో ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం, రామ్‌నగర్ సమీపంలోని కోసి నది మధ్యలో ఒక పెద్ద బండరాయిపై ఉన్న గిరిజా దేవి ఆలయం, ప్రాచీన పుణ్యక్షేత్రాలైన సీతామధి,సీతావానిలకు ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా హరిద్వార్, డెహ్రాడూన్ నుంచి తదుపరి ప్రయాణ సౌకర్యాల ద్వారా బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రితో కూడిన చార్ ధామ్ యాత్రను చేరుకోవడం ప్రయాణికులకు మరింత సులభతరం కానుంది. 

 

ప్రజలను ఉద్దేశించి శ్రీ వైష్ణవ్ మాట్లాడుతూ.. రామ్‌నగర్-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ ఉత్తరాఖండ్‌లోని కుమాన్, గర్వాల్ ప్రాంతాల మధ్య రైలు అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందని చెప్పారు. ఈ రెండు నగరాల మధ్య నడిచే మొట్టమొదటి ప్రత్యక్ష ఎక్స్‌ప్రెస్ రైలు ఇదేనని, ఇది ఉత్తరాఖండ్ ప్రజలకు వేగవంతమైన, మరింత సౌకర్యవంతమైన, నమ్మకమైన రైలు ప్రయాణాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. 

 

హరిద్వార్ స్టేషన్‌పై ఒత్తిడిని తగ్గించడానికి రిషికేశ్ రైల్వే స్టేషన్‌ను ఫీడర్ స్టేషన్‌గా అభివృద్ధి చేయనున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. ఇందుకోసం అదనపు సామర్థ్యాన్ని పెంపొందించడానికి హరిద్వార్, రిషికేశ్ ప్రాంతాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు అనుసంధానాన్ని మెరుగుపరచడానికి ఒక మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

 

ఉత్తరాఖండ్‌లో రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని శ్రీ వైష్ణవ్ ప్రస్తావించారు. రాష్ట్రంలో డెహ్రాడూన్, హరిద్వార్ జంక్షన్, హర్రావాలా, కాశీపూర్ జంక్షన్, కిచ్చా, కోటద్వార్, రూర్కీ, కత్‌గోదామ్, లాల్ కువాన్ జంక్షన్, రామ్‌నగర్, తనక్‌పూర్‌లతో కూడిన 11 స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 

 

రద్దీ పెరగకుండా చూస్తూనే,పేద, మధ్యతరగతి ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించేలా హరిద్వార్, డెహ్రాడూన్ స్టేషన్ల పునరాభివృద్ధిని చేపడుతున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు. ఇతర రైల్వే కార్యక్రమాలను ప్రస్తావిస్తూ.. ఇటీవల ప్రారంభించిన తనక్‌పూర్-నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, ఈ ప్రాంతంలో వందే భారత్ సేవలు కూడా అద్భుతంగా నడుస్తున్నాయని శ్రీ వైష్ణవ్ పేర్కొన్నారు.

 

రామ్‌నగర్-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం ఉత్తరాఖండ్‌లో రైలు అనుసంధానాన్ని బలోపేతం చేయడంలో మరో కీలక పరిణామంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి పేర్కొన్నారు. కొత్త రైలు సేవలు అందుబాటులోకి వచ్చినందుకు రాష్ట్ర ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్‌లకు కృతజ్ఞతలు తెలియజేశారు.

 

ఇటీవలి సంవత్సరాల్లో ఉత్తరాఖండ్‌లో రైలు రవాణా సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయని, రాష్ట్రవ్యాప్తంగా పలు కొత్త రైలు సేవలు ప్రారంభమయ్యాయని శ్రీ ధామి తెలిపారు. రిషికేశ్-కర్ణప్రయాగ్ రైల్వే లైన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని, ఉత్తరాఖండ్ సామాజిక, ఆర్థిక, మతపరమైన, పర్యాటక అభివృద్ధికి ఇది జీవనాడి కానుందని ఆయన పేర్కొన్నారు.

 

ఉత్తరాఖండ్‌కు రికార్డు స్థాయిలో రూ. 4,769 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయింపులు లభించాయని శ్రీ ధామి వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రూ.40,000 కోట్లకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టులు అమలులో ఉన్నట్లు తెలిపారు. హరిద్వార్‌లో రైల్వే అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ.. రాబోయే కుంభమేళాను దృష్టిలో ఉంచుకుని పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రైలు సేవలను ప్రణాళిక చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

 

ఈ కార్యక్రమంలో హరిద్వార్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడు శ్రీ త్రివేంద్ర సింగ్ రావత్, గర్వాల్ నియోజకవర్గ ఎంపీ అనిల్ బలూని, సీనియర్ రైల్వే అధికారులు పాల్గొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2286154) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Odia , Tamil , Kannada