వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
జమ్మూ కాశ్మీర్ నుంచి సింగపూర్‌కు ప్రీమియం అరెకో చెర్రీలు, సెంట్రోస్ ప్లమ్‌ల తొలి ఎగుమతిని ప్రారంభించిన ఏపీఈడీఏ
प्रविष्टि तिथि:
18 JUL 2026 4:08PM by PIB Hyderabad
జమ్మూ కాశ్మీర్ ఉద్యానవన ఉత్పత్తుల ఎగుమతుల కోసం మరింత ప్రోత్సాహం కల్పిస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఏపీఈడీఏ)... షోపియాన్, పుల్వామా నుంచి సింగపూర్‌కు ప్రీమియం అరెకో చెర్రీస్ (హై-డెన్సిటీ యూరోపియన్ స్వీట్ చెర్రీస్), సెంట్రోస్ ప్లమ్‌ల తొలి ఎగుమతి రవాణాను ప్రారంభించింది. ఈ ప్రాంతం నుంచి యూఏఈలోని అబుదాబి, దుబాయ్‌లకు తాజా చెర్రీలు, ప్లమ్‌లను విజయవంతంగా ఎగుమతి చేసిన తర్వాత, తాజాగా ఈ ఘనత సాధ్యమైంది. కాశ్మీర్‌లోని సమశీతోష్ణ వాతావరణంలో సాగు చేసిన ప్రీమియం నాణ్యత గల పండ్ల ప్రపంచవ్యాప్త ఎగుమతులను ఇది మరింత విస్తరింపజేస్తుంది.
ఎమ్/ఎస్ ఓసుమ్ ఫుడ్ సొల్యూషన్స్ ఎల్ఎల్‌పీ, పుల్వామాకు చెందిన ఎమ్/ఎస్ ఫ్రూట్ మాస్టర్ ఆగ్రో ఫ్రెష్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఈ నెల 16న సింగపూర్‌కు తొలి ఎగుమతి కోసం సరుకు రవాణా ప్రారంభోత్సవాన్ని ఏపీఈడీఏ నిర్వహించింది..
సమశీతోష్ణ పండ్ల సాగుకు అనుకూలమైన వ్యవసాయ-వాతావరణ పరిస్థితులకు ప్రసిద్ధి చెందిన జమ్మూ కాశ్మీర్... అద్భుతమైన రుచి, ఆకృతి, నిల్వ సామర్థ్యం కలిగిన అత్యుత్తమ నాణ్యత గల పండ్లను ఉత్పత్తి చేస్తుంది. సింగపూర్‌కు చేరేసరికి తాజాదనం, నాణ్యతలో మార్పు లేకుండా చూసేందుకు గానూ... ఈ పండ్లను శాస్త్రీయంగా చెట్ల నుంచి కోసి, గ్రేడ్ చేసి, ప్యాక్ చేసి, సమర్థమైన కోల్డ్ చైన్ ద్వారా ఈ ఎగుమతి సరుకును అంతర్జాతీయ ఆహార భద్రత, ఫైటోశానిటరీ ప్రమాణాలకు అనుగుణంగా రవాణా చేశారు.
సాంప్రదాయిక మార్కెటింగ్ మార్గాలతో పోలిస్తే, ఈ కార్యక్రమం ద్వారా రైతులు 50 శాతానికి పైగా అధిక రాబడిని పొందగలరని అంచనా. ఇది ఎగుమతి ఆధారిత ఉత్పత్తిని, శాస్త్రీయ సాగు పద్ధతులను, పంట కోతానంతర నిర్వహణనూ ప్రోత్సహిస్తుందని... పంట కోతానంతర నష్టాలను తగ్గిస్తుందని, విలువను పెంచుతుందని, జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా పండ్లు సాగు చేసే వర్గాలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలనూ కల్పిస్తుందని భావిస్తున్నారు.
మార్కెట్ విస్తరణ, ఎగుమతి సౌలభ్యం, మెరుగైన సరుకు రవాణా వ్యవస్థల ద్వారా భారత ఉద్యానవన ఎగుమతుల బలోపేతం దిశగా ఏపీఈడీఏ నిరంతర కృషిని ఈ ఎగుమతి ప్రతిబింబిస్తోంది. రైతులను ప్రీమియం అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించడం ద్వారా... ఈ కార్యక్రమం రైతుల ఆదాయాలను పెంచుతుందనీ, ప్రపంచ మార్కెట్లలో అధిక విలువ కలిగిన తాజా సమశీతోష్ణ పండ్ల కోసం ఒక నమ్మకమైన వనరుగా జమ్మూ కాశ్మీర్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
***
(रिलीज़ आईडी: 2286120)
आगंतुक पटल : 10