గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
భారత్ టెక్స్ 2026లో మహిళల నేతృత్వంలోని గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులను ప్రదర్శించిన గ్రామీణాభివృద్ధి శాఖ
భారత్ టెక్స్ 2026 వేదికగా మహిళా నేతృత్వపు గ్రామీణ పరిశ్రమలను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన డీఏవై-ఎన్‌ఎఆర్‌ఎల్‌ఎం
మహిళా నేతృత్వంలోని గ్రామీణ పరిశ్రమల బలోపేతానికి ప్రభుత్వ నిబద్ధతను చాటిచెప్పిన భారత్ టెక్స్ 2026
प्रविष्टि तिथि:
15 JUL 2026 6:09PM by PIB Hyderabad
దీన్‌దయాల్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డీఏవై-ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) ద్వారా ప్రతిష్ఠాత్మక భారత్ టెక్స్ 2026 ప్రదర్శనలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పాల్గొంది. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జూలై 14 నుంచి 17, 2026 వరకు జరుగుతున్న ఈ అంతర్జాతీయ వేదికపై దేశవ్యాప్త స్వయం సహాయక సంఘాల గ్రామీణ మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను, వారి నేతృత్వంలోని సూక్ష్మ పరిశ్రమలను ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు.
ఈ ప్రదర్శన ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన లఖ్‌పతీ దీదీలు అంతర్జాతీయ వస్త్ర రంగ వేదికపైకి అడుగుపెట్టారు. తమ నైపుణ్యంతో రూపొందించిన ఉత్పత్తులను దేశ విదేశీ సందర్శకులు, కొనుగోలుదారులు, పరిశ్రమల ప్రతినిధుల ముందు ప్రదర్శిస్తున్నారు. గ్రామీణ మహిళలు స్వయం ఉపాధి సాధించడంలో, కుటుంబ ఆదాయాలను మెరుగుపరుచుకోవడంలో, స్థానిక కళలు, ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌కు పరిచయం చేయడంలో వారు పోషిస్తున్న అద్భుతమైన పాత్రను ఈ కార్యక్రమం చాటిచెబుతోంది.
ఈ విశిష్ట ప్రదర్శనను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ రోహిత్ కన్సల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ జీవనోపాధి సంయుక్త కార్యదర్శి శ్రీమతి స్వాతి శర్మ, డీఏవై-ఎన్‌ఆర్‌ఎల్ఎం డైరెక్టర్ డాక్టర్ మోలిశ్రీ పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం వీరంతా ప్రదర్శనలో పాల్గొన్న లఖ్‌పతీ దీదీలతో ముఖాముఖి మాట్లాడారు. దేశ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ మహిళా నేతృత్వంలోని సంస్థలు ప్రదర్శించిన విభిన్న రకాల ఉత్పత్తులను వారు ఆసక్తిగా తిలకించారు.
ఈ ప్రదర్శన దేశవ్యాప్త గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలు కాపాడుకుంటూ ప్రోత్సహిస్తున్న విభిన్న నైపుణ్యాలను, సాంప్రదాయాలను చాటిచెబుతోంది. చేనేత వస్త్రాలు, దుస్తుల తయారీ మొదలుకుని హస్తకళలు, సహజసిద్ధమైన వస్తువులతో తయారు చేసిన ఉత్పత్తుల వరకు ఎన్నో ఈ వేదికపై కొలువుదీరాయి. తరాల నాటి జ్ఞానం, స్థానిక నైపుణ్యాలు విస్తృత మార్కెట్ సౌకర్యం గల స్థిరమైన మహిళా నేతృత్వపు పరిశ్రమలుగా ఎలా రూపాంతరం చెందుతున్నాయో ఈ ప్రదర్శన ప్రతిబింబిస్తోంది.
ఇందులో చేనేత, ధోక్రా లోహపు కళాకృతులు, కొల్హాపూరి తోలు వస్తువులు, జనపనార కళలు, వెదురు ఉత్పత్తులు, చెక్క వస్తువులు, పూసల పనితనం, పట్టు దారాల ఆభరణాలు, పర్యావరణహిత గుర్రపుడెక్క (వాటర్ హైసింత్) మొక్కలతో చేసిన వస్తువుల వంటి ఎన్నో వైవిధ్యభరితమైన సాంప్రదాయ హస్తకళలు, ప్రాంతీయ ప్రత్యేకతలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. మహిళల నేతృత్వంలోని స్వయం సహాయక సంఘాల పరిశ్రమలు దేశవ్యాప్తంగా ముందుకు తీసుకువెళ్తున్న నైపుణ్యాలను, విభిన్న ముడిసరుకుల వైవిధ్యాన్ని ఇవి స్పష్టం చేస్తున్నాయి.
ఈ ప్రదర్శనలో డే-ఎన్‌ఆర్‌ఎల్ఎం కింద సరికొత్తగా ప్రవేశపెట్టిన ప్రీమియం బహుమతుల విభాగం సరస్ శక్తి కలెక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలు రూపొందించిన అత్యుత్తమ నాణ్యత గల హస్తకళా ఉత్పత్తులను బ్రాండెడ్ సంస్థాగత బహుమతుల సేకరలుగా మార్చేందుకు ఈ వినూత్న ప్రయత్నం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ, సంస్థాగత సంస్థల మార్కెట్లలోకి సులభంగా ప్రవేశం లభిస్తుంది. అదే సమయంలో గ్రామీణ కళాకారుల ప్రతిభకు లభించే విలువ, గుర్తింపు దేశవ్యాప్తంగా మరింత మెరుగవుతాయి.
సరస్ శక్తి ఎంపిక కేవలం ఉత్పత్తుల సేకరణ మాత్రమే కాదు.. నాణ్యత, అద్భుతమైన పనితనం, సరికొత్త డిజైన్లు, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, మార్కెట్ సంసిద్ధత వంటి వాటికి ఇచ్చే అత్యున్నత ప్రాధాన్యతతో ప్రత్యేక గుర్తింపు పొందింది. తమ ప్రాంతీయ గుర్తింపును, తరాల నాటి సాంప్రదాయ జ్ఞానాన్ని ఏమాత్రం కోల్పోకుండా.. నేటి ఆధునిక మార్కెట్ అంచనాలకు సరిపోయేలా ఈ ఉత్పత్తులను ఎంపిక చేసి అభివృద్ధి చేస్తారు. ఒక ప్రత్యేకమైన బ్రాండ్ గుర్తింపు, ఆకర్షణీయమైన ప్రదర్శన ద్వారా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మార్కెట్ విలువను పెంచి, గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలకు మెరుగైన ఆర్థిక అవకాశాలను సృష్టించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
భారత్ టెక్స్ 2026 ప్రదర్శనలో లఖ్‌పతీ దీదీల భాగస్వామ్యం, స్వయం సహాయక సంఘాల మహిళలు కేవలం రోజువారీ జీవనోపాధి స్థాయి నుంచి ఎలా స్థిరమైన వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించే దిశగా ఎదుగుతున్నారో స్పష్టం చేస్తోంది. డీఏవై-ఎన్‌ఆర్‌ఎల్‌ఎం ద్వారా గ్రామీణ మహిళలకు అవసరమైన ఆర్థిక సహాయం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, నూతన ఉత్పత్తి రూపకల్పన, మార్కెట్ అనుసంధానాల కల్పన వంటి రంగాలలో లభిస్తున్న పూర్తి మద్దతు వారి ఆదాయాల పెంపుదలకు, వ్యాపారాల విస్తరణకు ఎంతగానో దోహదపడుతోంది.
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా గ్రామీణ మహిళలను డీఏవై-ఎన్‌ఆర్‌ఎల్‌ఎం విజయవంతంగా స్వయం సహాయక సంఘాల్లోకి సమీకరించింది. ఇంతటి భారీ సామాజిక సంస్థాగత వ్యవస్థ ఆధారంగా అమలవుతున్న లఖ్‌పతీ దీద' కార్యక్రమం గ్రామీణ మహిళల ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మారుస్తోంది. ఇప్పటికే దేశంలో 3 కోట్ల మంది లఖ్‌పతీ దీదీల మైలురాయిని అధిగమించగా.. ప్రభుత్వం దీనిని ఏకంగా 6 కోట్ల మంది లఖ్‌పతీ దీదీలుగా మార్చాలనే అత్యున్నత దార్శనికతతో ముందుకు సాగుతోంది.
భారత్ టెక్స్ 2026లో గ్రామీణాభివృద్ధి శాఖ భాగస్వామ్యం.. గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలకు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడానికి, కొనుగోలుదారులు, పరిశ్రమల పెద్దలతో నేరుగా చర్చలు జరపడానికి, నూతన మార్కెట్ అవకాశాలను అన్వేషించడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని అందించింది. మహిళల నేతృత్వంలోని గ్రామీణ పరిశ్రమలను బలోపేతం చేయడానికి, సాంప్రదాయ కళలను కాపాడటానికి, గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించడానికి భారత ప్రభుత్వం ఎంతటి నిబద్ధతతో ఉందో ఈ కార్యక్రమం మరోసారి రుజువు చేసింది.
***
(रिलीज़ आईडी: 2285211)
आगंतुक पटल : 14