పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ రీసెటిల్‌మెంట్ (డీజీఆర్) భాగస్వామ్యంతో రక్షణరంగ అధికారుల కోసం కార్పొరేట్ గవర్నెన్స్‌లో డైరెక్టర్స్ సర్టిఫికేషన్ కోర్స్ ఐదవ బ్యాచ్‌ను ప్రారంభించిన ఐఐసీఏ
రెండు వారాల సర్టిఫికేషన్ కార్యక్రమంలో భారత సాయుధ దళాల మూడు విభాగాల నుంచి 30మంది సీనియర్ అధికారుల ప్రాతినిధ్యం
प्रविष्टि तिथि:
15 JUL 2026 6:38PM by PIB Hyderabad
రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ రీసెటిల్‌మెంట్ (డీజీఆర్) భాగస్వామ్యంతో, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఐఐసీఏ) గురుగ్రామ్ మేనేసర్‌లోని తన ప్రాంగణంలో 2026 జూలై 13న రక్షణ రంగ అధికారుల కోసం డైరెక్టర్స్ సర్టిఫికేషన్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ ఐదవ బ్యాచ్‌ను ప్రారంభించింది.
భారత సాయుధ దళాల మూడు విభాగాలకు చెందిన 30 మంది సీనియర్ అధికారులు ఈ రెండు వారాల సర్టిఫికేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కార్పొరేట్ వ్యవహారాల నిర్వహణకు సంబంధించిన సైద్ధాంతిక, నియంత్రణ విధానాలపై అవగాహన కల్పించేలా, కార్పొరేట్ బోర్డులలో నాయకత్వ, ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవులకు వారిని సమర్థవంతంగా సన్నద్ధం చేసేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. వ్యూహాత్మక ప్రణాళిక, సమాచార సాంకేతికత, సైబర్ భద్రత, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో వారికున్న విస్తృతమైన సైనిక అనుభవాన్ని ఉపయోగించుకోవడం ద్వారా, భారత కార్పొరేట్ రంగానికి అర్థవంతమైన సహకారాన్ని అందించేలా ఈ ప్రోగ్రామ్ వారిని సమర్థవంతంగా సన్నద్ధం చేస్తుంది.
లెఫ్టినెంట్ జనరల్ సంజయ్ సేథి అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, సైనిక రంగ సేవ నుంచి కార్పొరేట్ సేవ వైపు సాగే ఈ మార్పు ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. క్లిష్ట సమయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడం, సంస్థాగత నాయకత్వం, అత్యున్నత నైతిక విలువలు కలిగి ఉండటంలో సీనియర్ రక్షణ అధికారులకు ఉన్న సుదీర్ఘ అనుభవం కార్పొరేట్ బోర్డు రూమ్‌లకు ఎంతో విశిష్టమైన విలువను చేకూరుస్తుందని ఆయన అన్నారు.
రక్షణ రంగం దశాబ్దాలుగా ఎంతో ఒత్తిడితో కూడిన వాతావరణంలో నిర్మించుకున్న బలమైన నైతిక విలువలను, ఫలితాలపై కచ్చితమైన బాధ్యతను వహించే అలవాటును, రిస్క్ మేనేజ్‌మెంట్‌లో కఠినమైన, క్రమశిక్షణతో కూడిన విధానాన్ని కలిగి ఉందని లెఫ్టినెంట్ జనరల్ సేథి అన్నారు. ప్రస్తుతం కార్పొరేట్ బోర్డులు స్వతంత్ర నిర్ణయాధికారం, సంస్థాగత క్రమశిక్షణ,పారదర్శకత పట్ల తిరుగులేని నిబద్ధతను ఎక్కువగా కోరుకుంటున్నాయని, అందువల్ల ఈ గుణాలు రక్షణ రంగానికి చెందిన అధికారులను కార్పొరేట్ బోర్డులకు అత్యంత అనుకూలంగా మారుస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఐఐసీఏ డైరెక్టర్ జనరల్, సీఈఓ శ్రీ జ్ఞానేశ్వర్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, ఆగస్టు 2024లో ప్రారంభమైనప్పటి నుంచి ఈ కార్యక్రమం కింద నాలుగు బ్యాచ్‌ల ద్వారా 120 మంది రక్షణ అధికారులకు విజయవంతంగా శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. ఇప్పుడు ఐదవ బ్యాచ్ ప్రారంభంతో ఈ సంఖ్య 150కి చేరుకుంటుందని, అటు రక్షణ మంత్రిత్వ శాఖ, ఇటు భారతీయ పరిశ్రమ ఈ కార్యక్రమంపై ఉంచిన నిరంతర నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు.
కార్పొరేట్ బోర్డుల మారుతున్న స్వభావం గురించి శ్రీ సింగ్ మాట్లాడుతూ, నేటి ఆధునిక బోర్డులు కేవలం చట్టపరమైన నిబంధనలను పాటించడమే కాకుండా, సంస్థ వ్యూహాలు, ప్రతిపాదనలు, ప్రత్యామ్నాయాలపై క్రియాశీలకమైన, ప్రశ్నించే ధోరణిని అలవర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. భారత కార్పొరేట్ చరిత్రలో నమోదైన పలు ఉదాహరణలను ప్రస్తావిస్తూ, కార్పొరేట్ పాలనలో వైఫల్యాలు ఒక్కసారిగా జరిగే పెద్ద సంఘటనల వల్ల కాకుండా, అడగాల్సిన సాధారణ ప్రశ్నలు అడగకపోవడం, సులభంగా లభించిన సమాధానాలను ఎలాంటి సందేహం లేకుండా అంగీకరించడం వంటి పరిణామాల ఫలితంగా క్రమంగా ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు. బోర్డు పాత్ర కేవలం దూరం నుంచి పర్యవేక్షించే స్థాయి నుంచి సమగ్ర వ్యూహాత్మక నాయకత్వం అందించే దిశగా మారుతోందని శ్రీ సింగ్ పేర్కొన్నారు. ఒక బోర్డు సమర్థవంతంగా, ఫలవంతంగా పనిచేయాలంటే డైరెక్టర్లు సరైన సమయంలో సరైన ప్రశ్నలు అడగడం అత్యంత కీలకమని ఆయన అన్నారు. భారతదేశంలోని కార్పొరేట్ బోర్డు గదుల్లో అలాంటి ప్రశ్నించే, బాధ్యతాయుతమైన సంస్కృతిని పెంపొందించేందుకు తమ వంతు పాత్ర పోషించాలని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రక్షణ దళాల అధికారులకు ఆయన పిలుపునిచ్చారు.
ఇటీవలి విధానపరమైన పరిణామాలను ప్రస్తావిస్తూ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంస్థల ఏర్పాటు, చట్టపరమైన అనుసరణ, కార్యకలాపాల విరమణ ప్రక్రియలను మరింత సరళతరం చేయడానికి వ్యాపార నిర్వహణ సౌలభ్యం లక్ష్యంగా పలు సంస్కరణలను అమలు చేసిందని తెలిపారు.
ఈ సంస్కరణల్లో భాగంగా కార్పొరేట్ ఫైలింగ్ లను కేంద్రీకృత విధానంలో ప్రాసెస్ చేయడానికి సెంట్రల్ రిజిస్ట్రేషన్ సెంటర్, సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ లను ఏర్పాటు చేశారు. అలాగే కంపెనీ నమోదుకు సంబంధించిన వివిధ దరఖాస్తులను ఒకే ఫైలింగ్‌లో విలీనం చేయడం, కంపెనీ పేర్ల రిజర్వేషన్ నిబంధనలను సరళీకరించడం చేపట్టారు. సంస్థలను స్వచ్ఛందంగా వేగంగా మూసివేయడానికి సెంటర్ ఫర్ ప్రాసెసింగ్ యాక్సిలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్ ను అమల్లోకి తీసుకురావడంతో పాటు, ఎక్కువ సంఖ్యలో స్టార్టప్‌లు, ఎంఎస్ఎమ్ఈలకు నిబంధనల భారాన్ని తగ్గించి సులువైన ఫైలింగ్, సమాచార వెల్లడి అవసరాలను విస్తరించడం, కంపెనీల చట్టం పరిధిలోని సాధారణ ప్రక్రియల ఉల్లంఘనలను క్రిమినల్ నేరాల జాబితా నుంచి తొలగించే ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగించడం వంటి చర్యలు కూడా ఈ సంస్కరణలలో భాగమే.
ఈ చర్యలన్నీ కలిసి నిబంధనల అమలుపై ఆధారపడిన పాలనా విధానం నుంచి నమ్మకంపై ఆధారపడిన పాలనా విధానం వైపు దేశం క్రమంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయని శ్రీ సింగ్ అన్నారు. సుపరిపాలన సంస్థలపై చట్టపరమైన షరతుల భారం తగ్గించడం రెండూ పరస్పరం కలిసికట్టుగా సాగాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
కార్పొరేట్ బోర్డుల ముందున్న కొత్త ప్రాధాన్యతల గురించి మాట్లాడుతూ, పర్యావరణ, సామాజిక, సుపరిపాలన అంశాల ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు. భారతీయ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు (సెబీ) అమలు చేస్తున్న బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టెయినబిలిటీ రిపోర్టింగ్ (బీఆర్ఎస్ఆర్) విధానం ప్రకారం నియంత్రణ పరిధిలోని సంస్థలకు ఆర్థికేతర నివేదికల సమర్పణ తప్పనిసరి అయిందని ఆయన పేర్కొన్నారు. దీంతో, బోర్డులు ఇకపై ఆర్థిక నివేదికలను ఎంత కచ్చితంగా, బాధ్యతాయుతంగా పర్యవేక్షిస్తాయో, అదే స్థాయి క్రమశిక్షణతో ఈ ఆర్థికేతర వెల్లడి నివేదికలను కూడా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సైబర్ స్పేస్, సాంకేతికతకు సంబంధించిన ప్రమాదాలు కూడా కార్పొరేట్ బోర్డులు మరింత అప్రమత్తంగా దృష్టి సారించాల్సిన అత్యంత కీలక అంశాలుగా మారాయని ఆయన పేర్కొన్నారు.
డైరెక్టరేట్ ఆఫ్ ట్రైనింగ్–డీజీఆర్ తరఫున ప్రాతినిధ్యం వహించిన గ్రూప్ కెప్టెన్ సుశాంత బిశ్వాస్, వీఎస్ఎం మాట్లాడుతూ, రక్షణ సేవ నుంచి విరమించి కార్పొరేట్ రంగంలోకి అడుగుపెడుతున్న రక్షణ దళాల అధికారుల సామర్థ్యాన్ని పెంపొందించడంలో డీజీఆర్, ఐఐసీఏ మధ్య కొనసాగుతున్న బలమైన భాగస్వామ్యాన్ని ప్రస్తావించారు.
ఐఐసీఏ స్కూల్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ అధిపతి డాక్టర్ నీరజ్ గుప్తా తొలుత స్వాగత ప్రసంగం చేస్తూ, రెండు వారాల శిక్షణకు అవసరమైన ప్రాతిపదికను అందించే విధంగా కార్యక్రమం ఉద్దేశాలను వివరించారు.
***
(रिलीज़ आईडी: 2285209)
आगंतुक पटल : 7