రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
భారీ మౌలిక సదుపాయాల విస్తరణతో వర్ధమాన ఇంజనీర్లకు విస్తృత అవకాశాలు
प्रविष्टि तिथि:
07 JUL 2026 5:37PM by PIB Hyderabad
భారత మౌలిక సదుపాయాల ఆధారిత వృద్ధి కారణంగా వర్ధమాన ఇంజనీర్లలో ఇంజనీరింగ్ విద్య పట్ల ఆసక్తి పెరుగుతోంది. భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ద్వారా దేశ నిర్మాణానికి తోడ్పడే అవకాశాలు విస్తరిస్తున్న క్రమంలో... ముఖ్యంగా ఐఐటీలు, ఎన్ఐటీలలో సివిల్ ఇంజనీరింగ్ ఒక ప్రాధాన్య కెరీర్ ఎంపికగా ఆవిర్భవిస్తోంది.
ఇంజనీరింగ్ విద్యను జాతీయ రహదారి రంగంలోని అర్థవంతమైన ఉపాధి అవకాశాలతో అనుసంధానించే వ్యవస్థీకృత మార్గాలను కల్పిస్తూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక సహాయకారిగా ఆవిర్భవించింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్ పరీక్ష) ద్వారా సాంకేతిక ఉద్యోగాల కోసం సుమారు 100 మంది ఇంజనీరింగ్ నిపుణులను నియమించుకుంటుంది. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి పట్టభద్రులైన పలువురు డిప్యూటీ మేనేజర్ ఉద్యోగంలో నియామకానికి అర్హత సాధించారు. ఇది దేశంలోని అత్యంత ప్రతిభావంతులైన ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో కొందరు జాతీయ రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగంలో కెరీర్‌ను కొనసాగించడానికి పెరుగుతున్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తుంది.
పరిశ్రమ-విద్యాసంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఎన్‌హెచ్ఏఐ... 2025 డిసెంబరు నెలలో సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఒక నెల వింటర్ ఇంటర్న్‌షిప్‌తో తన నిర్మాణాత్మక ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. దాని తర్వాత ఆరు నెలల వ్యవధి గల ఇంటర్న్‌షిప్‌నూ ప్రవేశపెట్టింది. నెలకు రూ. 20,000 ఆకర్షణీయమైన స్టైపెండ్‌ను అందిస్తూ అనతికాలంలోనే ఈ కార్యక్రమం... ఇంజనీర్లు కావాలనుకునే వారికి దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన అనుభవపూర్వక అభ్యాస అవకాశాల్లో ఒకటిగా ఆవిర్భవించింది.
ఈ విజయం ఆధారంగా ఎన్‌హెచ్ఏఐ... 2026 వేసవి ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని గణనీయంగా విస్తరించింది. ఇందులో భాగంగా 125 ఎన్‌హెచ్ఏఐ క్షేత్ర కార్యాలయాల్లో, ఎన్‌హెచ్ఏఐ ప్రధాన కార్యాలయంలోని 51 క్రియాత్మక విభాగాల్లో వివిధ రంగాలకు చెందిన 423 మంది విద్యార్థులు ఇంటర్న్‌లుగా చేరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాంకేతిక సంస్థల ఉత్సాహభరితమైన భాగస్వామ్యం కనిపించింది. వీరిలో ఐఐటీల్లో చదివిన 59 మంది, ఎన్ఐటీ నుంచి 282 మంది విద్యార్థులు ఉన్నారు. భారత జాతీయ రహదారి అభివృద్ధి కార్యక్రమంతో ముడిపడి ఉన్న వృత్తిని చేపట్టడం పట్ల యువ ఇంజనీర్లలో పెరుగుతున్న విశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.
ఈ కార్యక్రమాలకు అనుబంధంగా, సివిల్ ఇంజనీర్ల కోసం వృత్తిపరమైన వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎన్‌హెచ్ఏఐ పలు సంస్కరణలనూ చేపట్టింది. ఇంజనీరింగ్ సేవలకు న్యాయమైన, వృత్తిపరమైన పరిహారాన్ని నిర్ధారించడానికి స్థిర-వ్యయ ప్రాజెక్టుల వివరణాత్మక నివేదికలను (డీపీఆర్‌లను) ప్రవేశపెట్టడం, సమర్థమైన పారితోషిక విధాన ప్రణాళికల ద్వారా అత్యుత్తమ ఇంజనీరింగ్ నిపుణులను డీపీఆర్, పర్యవేక్షణ కన్సల్టెంట్‌లుగా పనిచేసేందుకు ఆకర్షించే చర్యలూ ఇందులో ఉన్నాయి.
నిర్మాణాత్మక అభ్యసనం, ప్రతిభ ఆధారిత నియామకాల ద్వారా ఒక పటిష్ఠ వ్యవస్థను రూపొందించడం ద్వారా... దేశంలో పెరుగుతున్న అత్యంత నైపుణ్యం గల ఇంజనీరింగ్ ప్రతిభ డిమాండ్‌ను తీర్చడమే కాకుండా, ప్రపంచ స్థాయి జాతీయ రహదారి నెట్‌వర్క్ అభివృద్ధికీ దోహదపడేలా కొత్త తరం సివిల్ ఇంజనీర్లను తయారు చేయడాన్ని ఎన్‌హెచ్ఏఐ ప్రోత్సహిస్తోంది.
***
(रिलीज़ आईडी: 2282218)
आगंतुक पटल : 15