ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్ - జపాన్ వాణిజ్య ఫోరంను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
प्रविष्टि तिथि:
02 JUL 2026 9:48PM by PIB Hyderabad
నా గౌరవ సోదరి, ప్రధానమంత్రి తకాయిచీ,
ఇరు దేశాల వాణిజ్యవేత్తలారా,
నమస్కారం…
ఇండియా - జపాన్ సంయుక్త ఆర్థిక ఫోరమ్‌లో మీ అందరితో కలిసి ఇక్కడ పాల్గొనడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.
ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక కంపెనీలు దశాబ్దాలుగా భారత్ తో అనుబంధాన్ని కలిగి ఉన్నాయి. కొన్ని కంపెనీలు అయితే శతాబ్ద కాలానికి పైగా భారతదేశ ప్రస్థానంలో భాగస్వాములుగా ఉన్నాయి.
ఈ ఫోరమ్‌లో కొత్తగా చేరుతున్న మా నూతన భాగస్వాములకు, ఇండియా - జపాన్ విజయగాథలో భాగమైనందుకు నా హృదయపూర్వక అభినందనలు.
మిత్రులారా,
భారత, జపాన్ దేశాల సంబంధాలు నిజంగా ఎంతో ప్రత్యేకమైనవి.
మన ఆర్థిక భాగస్వామ్య విజయానికి ఎన్నో అద్భుతమైన ఉదాహరణలు ఉన్నాయి.
కొద్దిసేపటి క్రితమే, హర్యానాలోని ఖార్ఖోడాలో మారుతి సుజుకి నూతన తయారీ కర్మాగారాన్ని మేం ప్రారంభించాం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుజుకి కార్లలో దాదాపు మూడింట రెండు వంతులు భారతదేశంలోనే తయారవుతున్నాయి. అవి 100 పైగా దేశాలకు ఎగుమతి కూడా అవుతున్నాయి.
ప్రధానమంత్రి తకాయిచీ - మీకు మోటార్ సైకిళ్లు అంటే చాలా ఇష్టమని నాకు తెలిసింది. భారతదేశంలో కవసాకి, యమహా, హోండా కంపెనీలు తయారు చేస్తున్న మోటార్ సైకిళ్లు ఈ రోజు ప్రపంచవ్యాప్త మార్కెట్లకు ఎగుమతి అవుతుండటం మనకు ఎంతో సంతోషకరం.
అదేవిధంగా, ఎయిర్ కండిషనర్లు, పవర్ గ్రిడ్ పరికరాలు, ప్రిసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదా వైద్య సాంకేతికత - ఏదైనా కావచ్చు - జపాన్ నైపుణ్యం, పెట్టుబడి... భారత్ వేగం, విస్తృతితో చేతులు కలిపినప్పుడు, దాని వల్ల ప్రపంచం మొత్తానికి ప్రయోజనం చేకూరుతుంది.
మిత్రులారా,
నేడు ప్రపంచ సరఫరా వ్యవస్థ అంతరాయాలు, వాణిజ్యంలో అనిశ్చితి ప్రపంచవ్యాప్త డిమాండ్ క్షీణత వంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.
అయితే సామెత చెప్పినట్టు..
"పరిస్థితులు కఠినంగా మారినప్పుడు, ధైర్యవంతులు మరింత పట్టుదలగా ముందుకు సాగుతారు."
భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ.
గత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.7 శాతం జీడీపీ వృద్ధి రేటును నమోదు చేసింది.
అంతేకాదు, గత పన్నెండేళ్లుగా మేం నిరంతర అభివృద్ధి (కైజెన్) సూత్రాన్ని అనుసరిస్తూ, భారత ఆర్థిక మూలాలను పూర్తిగా మార్చివేస్తు న్నాం.
కొన్ని నెలల క్రితమే, పన్నుల విధానం, పరిపాలన, సులభతర వాణిజ్యం వంటి రంగాలలో సరికొత్త తరం సంస్కరణలను మేం ప్రవేశ ప్రవేశపెట్టాం.
ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగాన్ని ప్రైవేట్ రంగ భాగస్వామ్యం కోసం మరింతగా తెరుస్తున్నాం.
పలు కీలక రంగాలలో ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్నాం. తద్వారా మీరందరూ లబ్ధి పొందగల అద్భుతమైన అవకాశాలను సృష్టిస్తున్నాం.
ఇందువల్లే, జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ (జేబీఐసీ) నిర్వహించిన సర్వేలో, జపాన్ వ్యాపారాలకు అత్యంత ఆశాజనకమైన గమ్యస్థానంగా భారత్ వరుసగా నాలుగో ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచింది.
ఈ రోజు, నేను మీ అందరితో ఒక కొత్త ప్రతిపాదనను పంచుకోవాలనుకుంటున్నాను. ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ప్రత్యేకంగా ఒక జపాన్ వ్యాపార వారోత్సవాలను నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా, పీఎంఓకి చెందిన ఉన్నతాధికారులు మీతో నేరుగా సంభాషిస్తారు. మీ సమస్యలను వింటారు. భారతదేశంలో సులభతర వాణిజ్యాన్ని మరింత మెరుగుపరచడంపై సమగ్రమైన చర్చలు జరుపుతారు. భారతదేశంలో జపనీస్ పెట్టుబడులను, భాగస్వామ్యాలను మరింతగా పెంపొందించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.
మిత్రులారా.
ఈ రోజు నేను, ప్రధానమంత్రి తకాయిచి కలసి రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత చైతన్యవంతంగా, మరింత లోతుగా మార్చాలని నిర్ణయించాం.
ఆర్థిక భద్రత, కృత్రిమ మేధ, రక్షణ, ఆరోగ్య సంరక్షణతో సహా విస్తృతమైన రంగాలలో మేం ఒప్పందాలను కుదుర్చుకున్నాం. ఇది మన భాగస్వామ్యాన్ని భవిష్యత్తు వైపు నడిపించేదిగా, అపరిమితమైనదిగా మారుస్తుంది.
మన రెండు ప్రభుత్వాల మధ్య వ్యూహాత్మక సమన్వయం, పరస్పర విశ్వాసం, అన్నింటికంటే మించి స్పష్టత ఉన్నాయి.
ఇప్పుడు ఈ ఉమ్మడి దృక్పథాన్ని ప్రత్యక్ష ఫలితాలుగా మార్చాల్సిన బాధ్యత మీపైనే ఉంది.
మిత్రులారా.
మీరందరూ కలిసి, రాబోయే దశాబ్దంలో భారతదేశంలో జపనీస్ పెట్టుబడులు 10 ట్రిలియన్ యెన్ల లక్ష్యాన్ని చేరుకోవడమే కాకుండా, దాన్ని దాటి ముందుకు వెళ్లేలా చూడాలి.
అదే సమయంలో, రాబోయే పదేళ్లలో భారతదేశంలో పనిచేస్తున్న జపనీస్ కంపెనీల సంఖ్యను రెట్టింపు చేయడానికి మనం కృషి చేయాలి.
మిత్రులారా.
నేను మీతో ఒక ఆలోచనను పంచుకోవాలనుకుంటున్నాను.
సెమీకండక్టర్లు, ఫార్మాస్యూటికల్స్, కీలకమైన ఖనిజాల విభాగాలలో ప్రపంచానికి అత్యంత సుస్థిరమైన సరఫరా వ్యవస్థలను అందించడం కోసం జపాన్ సాంకేతికత, భారతదేశ మార్కెట్ సామర్థ్యం చేతులు కలిపే ఒక సరికొత్త ప్రపంచాన్ని నేను ఊహిస్తున్నాను
ఎక్కడైతే జపాన్ పెట్టుబడి, భారత ఆకాంక్షలు చేతులు కలిపి నౌకా నిర్మాణం, రవాణా, స్వచ్ఛ ఇంధన రంగాలలో సరికొత్త ప్రపంచ నాయకత్వాన్ని సృష్టిస్తాయో - అటువంటి ప్రపంచాన్ని నేను ఊహిస్తున్నాను.
భారత్, జపాన్ దేశాల స్టార్టప్ వ్యవస్థలు కలిసి కృత్రిమ మేధ, క్వాంటం టెక్నాలజీస్, బయోటెక్నాలజీ రంగాలలో ప్రపంచానికి కావలసిన సరికొత్త తరం పరిష్కారాలను నడిపించే ఒక ప్రపంచాన్ని నేను ఊహిస్తున్నాను.
ఇంకా, ఎక్కడైతే అంతరిక్ష, రక్షణ రంగాలలో అపూర్వమైన సహకారం ప్రపంచ భద్రతకు మనం మరింత బలమైన సహకారాన్ని అందించేలా దోహదపడుతుందో - అటువంటి ప్రపంచాన్ని నేను ఊహిస్తున్నాను.
మిత్రులారా,
విశ్వాసం, ఆశావాహ దృక్పథ పునాదులపై ఏర్పడిన ఈ భాగస్వామ్యం ద్వారా మనం పరస్పర వృద్ధికీ, ప్రపంచ శ్రేయస్సుకూ సరికొత్త మార్గాన్ని సుగమం చేద్దాం.
టయోటా చెప్పినట్టుగా “పదండి… కొత్త గమ్యాల వైపు సాగుదాం.”
మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
***
(रिलीज़ आईडी: 2280630)
आगंतुक पटल : 4