గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హిందుస్తాన్ కాపర్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించిన శ్రీ అనుపమ్ మిశ్రా

నాడు పోస్టు చేయడమైనది: 01 JUL 2026 9:18PM by PIB Hyderabad

హిందుస్తాన్ కాపర్ సంస్థ (హెచ్‌సీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌ (సీఎమ్‌డీ)గా శ్రీ అనుపమ్ మిశ్రా ఈ రోజు పదవీ బాధ్యతలను స్వీకరించారు.

శ్రీ మిశ్రా తన వ్యూహాత్మక దృష్టికోణాన్నీ, వాణిజ్య సంబంధ నైపుణ్యాన్నీ, నిరూపిత నాయకత్వంతో కూడిన అరుదైన సామర్థ్యాన్నీ ఇక హెచ్‌సీఎల్‌కు అందిస్తారు. ఈ సంస్థ త్వరితగతిన అభివృద్ధి చెందడానికీ, భారత్‌లో కీలక ఖనిజాలతో పాటు రాగి రంగ భద్రతను దృఢతరంగా తీర్చిదిద్దుకోవడంలో సంస్థ పోషించాల్సిన పాత్రను బలోపేతం చేయడానికీ శ్రీ మిశ్రా తోడ్పాటును అందించనున్నారు.

శ్రీ మిశ్రా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ (ఆనర్స్) చదువుకున్నారు. ఆయన ఐఐఎమ్ లక్నో నుంచి పీజీడీఎమ్ నూ, ఐఐఎమ్ అహ్మదాబాద్, ఐఐఎమ్ కోల్‌కతా నుంచి ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాములనూ పూర్తి చేశారు. శ్రీ మిశ్రా అనుభవజ్ఞ‌ుడైన మేనేజ్‌మెంట్ వృత్తి నిపుణుడు. ఆయనకు మార్కెటింగ్, అంతర్జాతీయ వాణిజ్యం, వాణిజ్యాభివృద్ధిలో 33 సంవత్సరాల కన్నా ఎక్కువ అనుభవం ఉంది. ఖనిజాలు, లోహాలు, రసాయనాలు, ఇంజినీరింగ్ సామగ్రి, ప్రాజెక్టు వాణిజ్యంలో శ్రీ మిశ్రా అపార నైపుణ్యాన్ని సంపాదించారు.

హెచ్‌సీఎల్‌లో పదవీ బాధ్యతలను స్వీకరించడాని కన్నా ముందు, 2020 జులై నుంచి 2026 జూన్ వరకూ ఫర్టిలైజర్స్, కెమికల్స్ ట్రావెన్కూర్ (ఎఫ్ఎసీటీ)లో డైరెక్టర్ (మార్కెటింగ్)గా శ్రీ మిశ్రా సేవలను అందించారు. ఎఫ్ఏసీటీలో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను కూడా నిర్వహించారు. బోర్డు స్థాయి నాయకత్వంలో విశేష అనుభవంతో పాటు వ్యూహాత్మక, వాణిజ్య అవగాహన శక్తిని కూడా చాటారు.

శ్రీ మిశ్రా పదవీ బాధ్యతలను స్వీకరించిన తరువాత హెచ్‌సీఎల్ నిర్వహణ, వ్యూహ సంబంధ ప్రాధాన్యాల్ని సమీక్షించడానికి సంస్థ ఫంక్షనల్ డైరెక్టర్లతో సమావేశమయ్యారు. నిర్వహణ సంబంధిత అంశాలు, సంస్థ ఆధ్వర్యంలో ప్రస్తుతం పురోగమిస్తున్న ప్రాజెక్టుల పనులే కాకుండా సంస్థ అభివృద్ధికి చెందిన ప్రాథమిక ప్రణాళికను చర్చించడానికి కార్పొరేట్ కార్యాలయంలో వివిధ విభాగాల సారథులతో దృశ్య మాధ్యమం ద్వారా ఒక సమావేశాన్ని శ్రీ మిశ్రా నిర్వహించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2280295) సందర్శకుల సూచీ సంఖ్య : : 54
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी