పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హెలికాప్టర్ సర్వీసుల విషయంలో దేశంలోనే మొదటిసారిగా పిన్స్ ఇన్‌స్ట్రుమెంట్ అప్రోచ్ విధానాన్ని ఆమోదించిన ప్రభుత్వం


దీనితో మరో కీలక ఘనతను సాధించిన భారత్

प्रविष्टि तिथि: 01 JUL 2026 9:11PM by PIB Hyderabad

దేశంలోనే మొదటిసారిగా హెలికాప్టర్ సర్వీసుల కోసం ఉండవల్లి హెలీపోర్ట్‌లో ప్రైవేట్ 'పాయింట్-ఇన్-స్పేస్' (పిన్స్) ఇన్‌స్ట్రుమెంట్ అప్రోచ్ విధానానికి ఆమోదం లభించింది. భారత విమానయాన రంగంలో దీనినొక చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణిస్తూ ఈ విషయంపై పౌర విమానయాన శాఖ హర్షం వ్యక్తం చేసింది. 

భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) రూపకల్పన చేసిన ఈ 'పిన్-ఇన్-స్పేస్' (పిన్స్) విధానానికి పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఆమోదం తెలిపింది. ఈ విధానాన్ని డీజీసీఏ నిబంధనలతో పాటు అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ) ప్రమాణాలు, సిఫార్సు చేసిన పద్ధతులకు అనుగుణంగా రూపొందించారు.

సంప్రదాయక ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ మౌలిక సదుపాయాలు లేని హెలిపోర్ట్‌లలో కూడా హెలికాప్టర్లు సురక్షితంగా, కచ్చితత్వంతో దిగేందుకు ఈ పిన్స్ (పిన్-ఇన్-స్పేస్) విధానాలు అత్యాధునిక ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ సాంకేతికతను ఉపయోగిస్తాయి. ముఖ్యంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, భూతల నావిగేషన్ సదుపాయాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఈ విధానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ 'పాయింట్-ఇన్-స్పేస్' (పిన్స్) ఇన్‌స్ట్రుమెంట్ అప్రోచ్ విధానాన్ని ప్రవేశపెట్టే ప్రక్రియను పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు దగ్గరుండి చూసుకున్నారు. ఈ పరిణామంపై మంత్రి మాట్లాడుతూ.. "భారత్‌లో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ పిన్స్ విధానం.. ప్రయాణ భద్రతను, కార్యాచరణ సామర్థ్యాన్ని, అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ రవాణా సౌకర్యాన్ని గణనీయంగా పెంపొందించడం ద్వారా హెలికాప్టర్ రంగంలో సరికొత్త యుగానికి నాంది పలుకుతుంది. ఈ చారిత్రాత్మక ఘనతను సాధించడంలో భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ, డీజీసీఏ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సహా సమన్వయంతో కృషి చేసిన అన్ని సంస్థలను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దేశవ్యాప్తంగా హెలికాప్టర్ సేవలను మరింత నమ్మదగినవిగా చేయటంతో పాటు అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించటమే మా మొదటి ప్రాధాన్యత. అప్‌గ్రేడ్ చేసిన సాంకేతిక మౌలిక సదుపాయాల సహాయంతో ఈ ఏడాది ఇటీవల ముగిసిన చార్ ధామ్ హెలికాప్టర్ సేవల మొదటి దశను ఎటువంటి ప్రమాదాలు లేకుండా మేం విజయవంతంగా పూర్తి చేశాం. భారత్‌లో సాంకేతికత ఆధారితమైన, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన హెలికాప్టర్ వ్యవస్థను నిర్మించడమే మా సంకల్పం" అని వ్యాఖ్యానించారు. 

దీనికి ఉన్న విస్తృత ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించిన పౌర విమానయాన మంత్రి.. "గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సాంకేతికత ఆధారిత నాయకత్వంలో భారత విమానయాన రంగం వేగవంతమైన సాంకేతిక పురోగతిని సాధిస్తోంది. గత వారమే ఒక వాణిజ్య విమానం ద్వారా దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ 'గగన్' ఆధారిత ప్రిసిషన్ అప్రోచ్‌‌ను మేం విజయవంతంగా ప్రదర్శించాం. దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ 'పిన్-ఇన్-స్పేస్' అనే ఇన్‌స్ట్రుమెంట్ అప్రోచ్ విధానం ఈ ప్రయాణంలో మరొక ప్రధానమైన పురోగతి. ఇది పర్ఫార్మెన్స్-బేస్డ్ నావిగేషన్ (పీబీఎన్) ద్వారా విమానయాన మౌలిక వసతులను ఆధునికీకరించడం, స్వదేశీ ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ సాంకేతికతల వినియోగాన్ని విస్తరించడం, భారతీయ విమానయాన వ్యవస్థను అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది" అని అన్నారు. 

ఈ ఆమోదం దేశవ్యాప్తంగా ఇలాంటి మరిన్ని పిన్స్ విధానాల అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు. దీనివల్ల అత్యవసర వైద్య సేవలు, విపత్తు సహాయక చర్యలు, పర్యాటకం, ఆఫ్‌షోర్ కార్యకలాపాలు, తీర్థయాత్రల సేవలు, కార్పొరేట్ విమానయానం, ప్రాంతీయ అనుసంధానతకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇది మారుమూల, వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాలకు మరింత సురక్షితమైన ఇన్‌స్ట్రుమెంట్ ఫ్లైట్ రూల్స్ (ఐఎఫ్ఆర్) కార్యకలాపాలను సాధ్యం చేస్తుంది. అలాగే విమాన సేవల నమ్మకత్వాన్ని పెంచడంతో పాటు వాతావరణ పరిస్థితుల వల్ల తలెత్తే అంతరాయాలను గణనీయంగా తగ్గిస్తుంది.

ఈ ముఖ్యమైన ఘనతను సాధించడంలో భాగస్వాములైన డీజీసీఏ, ఏఏఐ బృందాలతో పాటు ఇతర భాగస్వామ్య పక్షాల అందరికీ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అభినందనలు తెలియజేస్తోంది. ఈ విజయం.. అత్యాధునిక విమానయాన సాంకేతికతలను అవలంబించడంలో ప్రపంచ నాయకుడిగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను స్వీకరించడం, హెలికాప్టర్ అనుసంధానతను బలోపేతం చేయడం, ఆధునిక ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ ద్వారా విమానయాన భద్రతను పెంపొందించడం పట్ల మంత్రిత్వ శాఖ నిబద్ధతకు ఈ ఘనత తెలియజేస్తోంది. 

 

***


(रिलीज़ आईडी: 2280290) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali