రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

దక్షిణ వైమానిక దళం కమాండింగ్-ఇన్-చీఫ్‌గా ఎయిర్ మార్షల్ జస్వీర్ సింగ్ మాన్ బాధ్యతల స్వీకారం

प्रविष्टि तिथि: 01 JUL 2026 8:09PM by PIB Hyderabad

   అతి విశిష్ట సేవా పతకం (ఏవీఎస్‌ఎం), వాయు సేనా పతకం (వీఎస్‌ఎం) గ్రహీత ఎయిర్ మార్షల్ జస్వీర్ సింగ్ మాన్ ఈ రోజు దక్షిణ వైమానిక దళం ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యాలయంలో ఆయనకు సిబ్బంది లాంఛనప్రాయంగా గౌరవ వందనం సమర్పించారు.

భారత వైమానిక దళంలోని ‘ఫైటర్ స్ట్రీమ్‌’లో 1989 డిసెంబరు 16న ఆయన తొలుత ఎయిర్ ఆఫీసరుగా నియమితులయ్యారు. అటుపైన హయ్యర్ ఎయిర్ కమాండ్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌, లండన్ (యూకే)లోని రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ చేశారు. ఒక ‘పైలట్ అటాక్ ఇన్‌స్ట్రక్టర్’గా అపాచీ, మిగ్-21, జాగ్వార్, మిగ్-29, ఎస్‌యూ-30, రఫేల్ తదితర వివిధ రకాల విమానాల్లో ఆయనకు 3000 గంటలకు పైగా అనుభవం ఉంది.

దాదాపు నాలుగు దశాబ్దాల తన ఆదర్శప్రాయ వైమానిక దళ సేవా జీవితంలో ఈ ఎయిర్ మార్షల్ ఒక ఫైటర్ స్క్వాడ్రన్‌కు అధిపతిగా వ్యవహరించారు. అలాగే, ప్రముఖ ఫైటర్ బేస్‌కు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్‌గా పనిచేశారు. అంతేకాకుండా ఎయిర్ డిఫెన్స్ కమాండరుగా, ఓ కమాండ్ పాలన బాధ్యతలు చూసుకునే సీనియర్ ఆఫీసరుగా కీలక కమాండ్-స్టాఫ్ పదవులను నిర్వహించారు. ఎయిర్ హెచ్‌క్యూలోనూ అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఆపరేషన్స్ (అఫెన్సివ్), డైరెక్టర్ జనరల్ (వెపన్ సిస్టమ్స్) పదవులను కూడా ఆయన నిర్వర్తించారు. ప్రస్తుత పదవీ బాధ్యతలు చేపట్టక ముందు వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌లో సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్‌గా ఉంటూ, వివిధ రంగాల్లో సమష్టి కార్యాచరణ స్ఫూర్తిని పెంచడంలో ఈ ఎయిర్ మార్షల్ ఎంతగానో తోడ్పడ్డారు. తన విశిష్ట సేవలకు గుర్తింపుగా, అతివిశిష్ట సేవా పతకం, వాయుసేన పతకం పొందారు.

ఉత్తమ్ యుద్ధ సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, వాయు సేనా పతకాల గ్రహీత ఎయిర్ మార్షల్ మనీష్ ఖన్నా నాలుగు దశాబ్దాల విశిష్ట సేవల అనంతరం 2026 జూన్‌ 30న పదవీ విరమణ చేసిన నేపథ్యంలో ఎయిర్ మార్షల్‌ జస్వీర్ సింగ్ మాన్ ఆ బాధ్యతలు  స్వీకరించారు.

 

***


(रिलीज़ आईडी: 2280137) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी