వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
‘సీఫుడ్ ఎక్స్‌పో భారత్ 2026’లో ఎంపెడా ఆధ్వర్యంలో రెండవ జాతీయ సీఫుడ్ స్కిల్ ఒలింపియాడ్ నిర్వహణ
జాతీయ సీఫుడ్ స్కిల్ ఒలింపియాడ్‌కు ముందు దేశవ్యాప్తంగా 50 విలువ ఆధారిత సముద్ర ఆహారఉత్పత్తులపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించిన ఎంపెడా
సీఫుడ్ ఎక్స్‌పో భారత్–2026లో వ్యాపార, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి కోసం ఒకే వేదికపైకి రానున్న 5,000 మంది అంతర్జాతీయ భాగస్వాములు
प्रविष्टि तिथि:
29 JUN 2026 6:53PM by PIB Hyderabad
భారత సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రదర్శన (సీఫుడ్ ఎక్స్‌పో భారత్ - 2026)లో భాగంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ - ఎంపెడా) జూలై 1 నుంచి 3 వరకు రెండో జాతీయ సీఫుడ్ స్కిల్ ఒలింపియాడ్‌ను నిర్వహించనుంది. విలువ ఆధారిత సముద్ర ఆహార ఉత్పత్తుల తయారీలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి దేశవ్యాప్తంగా నిపుణులైన సీఫుడ్ ప్రాసెసింగ్ నిపుణులను ఈ ఒలింపియాడ్ ఒకే వేదికపైకి తీసుకురానుంది.
భారత సముద్ర ఆహార ఉత్పత్తుల శుద్ధి రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడం, నాణ్యత ప్రమాణాలను పెంచడం, పరిశ్రమలోని ప్రతిభావంతులను గుర్తించడం, నిపుణులైన శ్రామిక శక్తి అభివృద్ధిని బలోపేతం చేయడం ఈ పోటీ ముఖ్య ఉద్దేశం. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో మరింత విలువ ఆధారిత ప్రక్రియలను ప్రోత్సహించడం కూడా ఈ పోటీ లక్ష్యంగా పెట్టుకుంది.
రెండో విడత స్కిల్ ఒలింపియాడ్‌కు సన్నాహకంగా, ఎంపెడా దేశవ్యాప్తంగా 50 సముద్ర ఆహార విలువ ఆధారిత ఉత్పత్తులపై శిక్షణా కార్యక్రమాలతో కూడిన విస్తృత సామర్థ్య పెంపుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. అంతర్జాతీయ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉన్న విలువ ఆధారిత సముద్ర ఉత్పత్తుల తయారీలో 2,500 మందికి పైగా ప్రాసెసింగ్ కార్మికులకు, నిపుణులకు ఈ సందర్భంగా శిక్షణ ఇచ్చారు.
ఈ శిక్షణలో బ్రెడెడ్ స్క్విడ్ రింగ్స్, నోబాషి (సాగదీసిన రొయ్యలు), బ్రెడెడ్ బటర్‌ఫ్లై రొయ్యలు, ఉడికించిన పీల్డ్, డివైన్డ్, టైల్-ఆన్ రొయ్యలు, మెరినేటెడ్ రొయ్యల స్కూయర్స్ (కడ్డీలకు గుచ్చిన రొయ్యలు), ఫిష్ ఫిల్లెట్స్ (చేప ముక్కలు) వంటి ఉత్పత్తుల తయారీపై అవగాహన కల్పించారు. ప్రతి శిక్షణా కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రాథమిక స్థాయి నైపుణ్య పోటీలను నిర్వహించి, వాటిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని తుది పోటీలకు ఎంపిక చేశారు.
ఆ తర్వాత ఈ పోటీలను తీరప్రాంత రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి స్కిల్ ఒలింపియాడ్‌లుగా నిర్వహించారు. అనంతరం పశ్చిమ తీర ప్రాంతం కోసం ముంబైలో, తూర్పు తీర ప్రాంతం కోసం విజయవాడలో ప్రాంతీయ స్కిల్ ఒలింపియాడ్‌లను నిర్వహించారు. ఈ ప్రాంతీయ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టాప్ 10 మంది విజేతలు జాతీయ సీఫుడ్ స్కిల్ ఒలింపియాడ్ గ్రాండ్ ఫినాలేకు అర్హత సాధించారు.
గ్రాండ్ ఫినాలేలో విజేతలు, సీఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ, విద్యా రంగానికి చెందిన ప్రముఖ నిపుణులతో కూడిన జ్యూరీ సమక్షంలో తమ సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు. విజేతలకు పతకాలు, ధృవపత్రాలతో పాటు నగదు బహుమతులను కూడా అందచేస్తారు. ప్రథమ బహుమతి కింద రూ. 1,00,000, ద్వితీయ బహుమతిగా రూ. 75,000, తృతీయ బహుమతిగా రూ. 50,000, నాల్గవ బహుమతి (కన్సోలేషన్) కింద రూ. 25,000 నగదును ప్రదానం చేస్తారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు, సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారులు, అంతర్జాతీయ కొనుగోలుదారులు, పరిశ్రమల ప్రముఖులు, సాంకేతిక నిపుణులు, సీఫుడ్ ఎక్స్‌పో భారత్ 2026లో పాల్గొనే ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
తుది పోటీల్లో అవార్డులు పొందిన విలువ ఆధారిత సముద్ర ఆహార ఉత్పత్తులను స్కిల్ ఒలింపియాడ్ పెవిలియన్లో ప్రదర్శిస్తారు. ఎంపెడా శిక్షణ కార్యక్రమాల ద్వారా అభివృద్ధి చేసిన ఎగుమతి ఆధారిత విలువ ఆధారిత సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రత్యక్ష ప్రదర్శనలు, రుచి చూసే సెషన్లు కూడా ఈ పెవిలియన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
సముద్ర ఆహార విలువ శ్రేణి అంతటా నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఎంపెడా కట్టుబడి ఉందనడానికి నేషనల్ సీఫుడ్ స్కిల్ ఒలింపియాడ్ నిదర్శనమని ఎంపెడా ఛైర్మన్ శ్రీ పి. జవహర్ తెలిపారు. నైపుణ్యం కలిగిన వారిని గుర్తించి, ప్రోత్సహించడం ద్వారా ఈ చొరవ పరిశ్రమలోని శ్రామిక శక్తిని బలోపేతం చేస్తుందని, అంతర్జాతీయంగా నాణ్యమైన సీఫుడ్‌ను సరఫరా చేసే విశ్వసనీయ దేశంగా భారత స్థానాన్ని మరింత మెరుగుపరుస్తుందని ఆయన పేర్కొన్నారు.
సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థలో భారత్ నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి మానవ వనరులపై పెట్టుబడి పెట్టడం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్ల మారుతున్న అవసరాలకు అనుగుణంగా, అత్యంత నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తయారు చేయడంలో ఈ చొరవ ఎంతగానో దోహదపడుతుందని ఆయన వివరించారు.
భారత ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సముద్ర ఆహార ప్రదర్శన - 2026లో సీఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వాకల్చర్, ప్యాకేజింగ్ యంత్రాలు, రవాణా, ప్రభుత్వ పెవిలియన్ల వంటి ప్రత్యేక విభాగాలలో 325కు పైగా స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో దాదాపు 5,000 మంది స్వదేశీ, అంతర్జాతీయ భాగస్వాములు పాల్గొననున్నారు. వీరంతా ఉన్నత స్థాయి బిజినెస్-టు-బిజినెస్ సమావేశాలలో పాల్గొనడంతో పాటు, రిటైల్, ఆక్వాకల్చర్ విలువ శ్రేణుల్లోని ఇతర భాగస్వాములతో చర్చలు జరపనున్నారు. ఆవిష్కరణలు, సుస్థిరత, పరిశ్రమలో వస్తున్న సరికొత్త పోకడలపై దృష్టి సారించే ఐదు సాంకేతిక సెషన్లకు కూడా వీరు హాజరుకానున్నారు.
ఈ ప్రదర్శనలో నేషనల్ సీఫుడ్ స్కిల్ ఒలింపియాడ్, సముద్ర ఆహార వంటకాల తయారీ ఒలింపియాడ్ వంటి ప్రధాన నైపుణ్య, పాకశాస్త్ర పోటీలను కూడా నిర్వహించనున్నారు. తద్వారా అంతర్జాతీయ సీఫుడ్ విలువ శ్రేణి అంతటా వ్యాపార అవకాశాలను విస్తరించుకోవడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, వ్యూహాత్మక భాగస్వామ్యాలను పెంపొందించుకోవడానికి పరిశ్రమలోని భాగస్వాములందరికీ ఇది ఒక సమగ్రమైన వేదికను అందించనుంది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులు రికార్డు స్థాయిలో 8.45 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీనితో ప్రపంచంలోనే అగ్రగామి సీఫుడ్ ఎగుమతి దేశాలలో ఒకటిగా భారత్ స్థానానికి మరింత గుర్తింపు లభించింది. ప్రస్తుతం దేశంలో 670 అధికార సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉండగా, వీటి మొత్తం ప్రాసెసింగ్ సామర్థ్యం రోజుకు 40,000 మెట్రిక్ టన్నులకు పైగా ఉంది. వీటిలో 127 యూనిట్లు విలువ ఆధారిత సీఫుడ్ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. ఇవి భారత మొత్తం సీఫుడ్ ఎగుమతుల్లో దాదాపు 10 శాతం (0.84 బిలియన్ డాలర్లు) వాటాను అందిస్తున్నాయి.
విలువ ఆధారిత సముద్ర ఆహార రంగానికి ఉన్న అపారమైన వృద్ధి అవకాశాలను గుర్తించిన భారత్ 2030 నాటికి మొత్తం సీఫుడ్ ఎగుమతుల్లో ఈ విలువ ఆధారిత ఉత్పత్తుల వాటాను 25 శాతానికి పెంచాలని బృహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఉత్పత్తులలో సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ప్రాసెసింగ్, విలువ ఆధారిత మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని అభివృద్ధి చేయడం, సీఫుడ్ ప్రాసెసింగ్ రంగమంతటా నాణ్యతా ప్రమాణాలపై అవగాహనను పెంచడం వంటి అంశాలపై వివిధ రకాల పథకాలనూ, సామర్థ్య పెంపుదల కార్యక్రమాలనూ ఎంపెడా అమలు చేస్తోంది.
***
(रिलीज़ आईडी: 2279196)
आगंतुक पटल : 13