బొగ్గు మంత్రిత్వ శాఖ
ఒడిషాలోని లఖన్‌పూర్‌లో ‘భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్’ ఏర్పాటు చేసే ‘కోల్ టు అమ్మోనియం నైట్రేట్’ ప్రాజెక్టుకు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన
प्रविष्टि तिथि:
20 JUN 2026 6:53PM by PIB Hyderabad
ఇంధన భద్రత, సాంకేతిక స్వావలంబన, దేశీయ బొగ్గు వనరుల సుస్థిర వినియోగం దృక్కోణంలో ఇవాళ ఒక చారిత్రక ఘట్టం నమోదైంది. ఈ మేరకు ఒడిషాలోని ఝార్సుగూడ జిల్లా లఖన్‌పూర్‌లో ‘భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (బీసీజీసీఎల్) ఏర్పాటు చేసే ‘కోల్ టు అమోనియం నైట్రేట్’ ప్రాజెక్ట్‌కు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా సంయుక్తంగా శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శ్రీ కంభంపాటి హరిబాబు, ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ, కేంద్ర బొగ్గు-గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే సహా ఒడిషా ఉప ముఖ్యమంత్రులు శ్రీ కనక్ వర్ధన్ సింగ్ దేవ్, శ్రీమతి ప్రవతి పరిడా, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
లఖన్‌పూర్‌లోని ప్రాజెక్ట్ ప్రాంతంలో శ్రీ జి.కిషన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ- ముందుగా ఝార్సుగూడ ప్రజలను అభినందించారు. కోల్ ఇండియా లిమిటెడ్, బీహెచ్‌ఈఎల్ మధ్య సంయుక్త భాగస్వామ్యంలో ఏర్పాటయ్యే ఈ పరిశ్రమ బొగ్గు శుద్ధిలో నవ శకానికి నాంది పలుకుతుందని ఆయన అన్నారు. స్వదేశీ బొగ్గు గ్యాసిఫికేషన్ సాంకేతికతను ఇది ప్రోత్సహిస్తుందని, సమృద్ధ దేశీయ బొగ్గు వనరులను విలువ ఆధారిత రసాయనాలుగా మార్చే సౌలభ్యం కల్పిస్తుందని పేర్కొన్నారు. అలాగే, ఈ ప్రాంతంలోని యువతకు గణనీయ స్థాయిలో ఉపాధి లభించడమే కాకుండా నైపుణ్యాభివృద్ధికి అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. మరోవైపు అనుబంధ పరిశ్రమలు, సేవల రంగం ద్వారా ప్రాంతీయ ఆర్థిక వృద్ధి పుంజుకుంటుందని తెలిపారు.
‘బీసీజీసీఎల్’ అనేది కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) మధ్య ఏర్పాటైన ఒక సంయుక్త భాగస్వామ్య కంపెనీ. ఇందులో ‘సీఐఎల్’ వాటా 51 శాతం కాగా, బీహెచ్‌ఈఎల్ వాటా 49 శాతంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు కోసం కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ ‘మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్’ (ఎంసీఎల్) ఒడిషాలోని ఝార్సుగూడ జిల్లా, లఖన్‌పూర్‌లోగల తన 350 ఎకరాల బొగ్గు నిక్షేపాల భూమిని ఇస్తోంది. ఇక్కడే ‘బీసీజీసీఎల్ ప్రాజెక్టు నిర్మితమవుతుంది. దీంతోపాటు ఈ ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును ‘ఐబి వ్యాలీ వాషరీ’ నుంచి 0.79 ‘ఎంటీవై’ మేర శుద్ధి చేసిన బొగ్గును, 1.19 ‘ఎంటీవై’ వ్యర్థ బొగ్గును ‘ఎంసీఎల్’ సరఫరా చేస్తుంది.
కేంద్ర ప్రభుత్వ ‘జాతీయ బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్’కు అనుగుణంగా దేశవ్యాప్త భవిష్యత్ బొగ్గు-రసాయనాల ప్రాజెక్టులకు ఇదొక నమూనా కాగలదని అంచనా. బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా ఏటా సుమారు 0.66 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) టెక్నికల్ గ్రేడ్ అమ్మోనియం నైట్రేట్‌ను ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. రసాయన ఉత్పత్తి కోసం దేశీయంగా రూపొందించిన ‘ప్రెషరైజ్డ్ ఫ్లూయిడైజ్డ్ బెడ్ గ్యాసిఫికేషన్’ (పీఎఫ్‌బీజీ) సాంకేతికతను వినియోగించుకునే భారత తొలి వాణిజ్య స్థాయి కార్యక్రమాలలో ఇదొకగా నిలుస్తుంది.
ఈ ప్రాజెక్టును ₹25,000 కోట్లకు పైగా అంచనా వ్యయంతో సిద్ధం చేస్తుండగా, దీనికి ఒడిషా ప్రభుత్వ ఉన్నత స్థాయి ఆమోద ప్రాధికార సంస్థ (హెచ్‌ఎల్‌సీఏ) నుంచి ఏకగవాక్ష అనుమతులు లభించాయి. దీంతోపాటు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నుంచి ₹1,350 కోట్ల మేర ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా మంజూరయ్యాయి. తద్వారా దేశీయ బొగ్గు గ్యాసిఫికేషన్ సాంకేతికత వాణిజ్యీకరణకు ప్రధాన ప్రోత్సాహంగా నిలుస్తుంది.
ఈ మేరకు అన్ని కీలక చట్టబద్ధ, పర్యావరణ ఆమోదాలు, అనుమతుల సౌలభ్యం, ఆర్థిక సహాయం కూడా సమకూరడం సహా ఏకమొత్తంగా టర్న్‌కీ ఎగ్జిక్యూషన్ ప్యాకేజీల కేటాయింపుతో ఈ ప్రాజెక్టును 2029 సెప్టెంబరు నాటికి ప్రారంభించాలని లక్ష్యనిర్దేశం చేసుకున్నారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో బొగ్గును అధిక విలువ గల రసాయన ఉత్పత్తులుగా మార్చడంలో భారత్ సామర్థ్యాన్ని చాటే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా ఇది రూపొందగలదని భావిస్తున్నారు.
***
(रिलीज़ आईडी: 2275863)
आगंतुक पटल : 11