ఆయుష్
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో కలసి ఐడీవై-2026న యోగా చేసేందుకు నమోదు చేసుకున్న సంస్థల సంఖ్య 6 లక్షలు


ఐడీవై-2026 నేపథ్యంలో యోగా సంగం పోర్టల్ రిజిస్ట్రేషన్లలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన పశ్చిమ బెంగాల్

ఐడీవై-2026 ఏర్పాట్లలో అపూర్వమైన ప్రజా భాగస్వామ్యం - దేశవ్యాప్త ఉద్యమంగా మారిన యోగా సంగం

प्रविष्टि तिथि: 19 JUN 2026 11:45PM by PIB Hyderabad

ఆయుష్ మంత్రిత్వశాఖ, 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై)-2026 సందర్భంగా నిర్వహిస్తున్న యోగా సంగం పోర్టల్ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ పోర్టల్ ద్వారా 6 లక్షల సంస్థలు నమోదు చేసుకున్నాయి. ఇది దేశవ్యాప్తంగా ఉన్నసంస్థలు, సమాజాలు ప్రదర్శిస్తున్న అపూర్వమైన ఆసక్తిని ప్రతిబింబిస్తుంది.

ఈ విజయం సామూహిక భాగస్వామ్యానికున్న విస్తృత స్థాయిని తెలియజేస్తోంది. జూన్ 21న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో కలిసి ఏకకాలంలో యోగా సాధన చేయడానికి దేశవ్యాప్తంగా యోగా సంగంను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారిని నమోదిత సంస్థలు సమీకరిస్తున్నాయి.

ఇటీవలి కాలంలో ఈ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఇది ఐడీవై-2026 వేడుకల్లో భాగమయ్యేందుకు ప్రజల్లో పెరుగుతున్న ఉత్సాహాన్ని సూచిస్తోంది. ప్రధానమంత్రి నేతృత్వంలో జరిగే ఈ యోగా వేడుకల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, ఎన్జీవోలు, సంఘాలు ఉత్సాహంగా నమోదు చేసుకుంటున్నాయి.

ఐడీవై-2026లో భాగంగా నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమమే యోగా సంగం. కామన్ యోగా ప్రోటోకాల్ (సీవైపీ) ఆధారంగా జరిగే యోగా కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సంస్థలను, సమాజాలను ఒకే సమయంలో అనుసంధానించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. ఈ వేడుకలను ఒకే ప్రాంతానికి పరిమితం చేయకుండా... సామూహిక జాతీయ ఉద్యమంలో అందరూ భాగమయ్యేలా తోడ్పడుతుంది. దీని కోసం భారతదేశమంతటా ఉన్న సంస్థలు తమ సొంత వేదికలపై యోగా సెషన్లను నిర్వహించుకుంటూనే ఈ కార్యక్రమానికి అనుసంధానమవుతాయి.

నమోదు, సమన్వయం, భాగస్వామ్య పర్యవేక్షణను సులభతరం చేయడం ద్వారా ఈ కార్యక్రమానికి ప్రధాన డిజిటల్ ఆధారంగా యోగా సంగం పోర్టల్ నిలిచింది. తాము చేపట్టే కార్యక్రమాలను నమోదు చేసుకొనే వీలును ఈ వేదిక సంస్థలకు అందిస్తుంది. అలాగే.. కార్యక్రమాన్ని నిర్వహించే వేదిక వివరాలను అందించడానికి, భాగస్వామ్యాన్ని సమన్వయం చేసుకోవడానికి, దేశవ్యాప్తంగా నిర్వహించే యోగా వేడుకలకు తమ వంతు సహకారాన్ని అందించడంలో కూడా సంస్థలకు తోడ్పడుతుంది.

ఈ కార్యక్రమం భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 778 జిల్లాలకు విస్తరించింది. నమోదు చేసుకున్న వాటిలో 3.22 లక్షలకు పైగా ప్రభుత్వ సంస్థలు, దాదాపు 2 లక్షల విద్యా సంస్థలు, 16,000కు పైగా ప్రైవేటు సంస్థలు, 5,000కి పైగా ఎన్జీవోలు, ఇతర విభాగాలకు చెందిన సుమారు 44,000 సంస్థలు ఉన్నాయి.

రాష్ట్రాల వారీగా చూస్తే 2.76 లక్షలకు పైగా నమోదిత సంస్థలతో పశ్చిమ బెంగాల్ అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. దాదాపు 1.50 లక్షల రిజిస్ట్రేషన్లతో రాజస్థాన్ ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. ఈ పోర్టల్‌లో అధిక స్థాయిలో భాగస్వామ్యాన్ని నమోదు చేస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ఉన్నాయి.

ఈ ఉద్యమంలో మరిన్ని సంస్థలు, విద్యా సంస్థలు, సంఘాలు పాల్గొనాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోంది. అవి నిర్వహించే యోగా సంగం కార్యక్రమాలను దిగువ పేర్కొన్న లింక్‌లో నమోదు చేసుకోవాలని సూచించింది.

yoga.ayush.gov.in/yoga-sangam

ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సంస్థ, సంప్రదింపుల వివరాలను పూరించడం, కోడ్‌ను ధ్రువీకరించడం, వేదిక సమాచారాన్ని నమోదు చేయడం, రిఫరెన్స్ సంఖ్యను పొందడానికి ఫారాన్ని సమర్పించడం లాంటివి ఉంటాయి.

"ఆరోగ్యవంతమైన ఆయుష్షు కోసం యోగా" ఇతివృత్తంతో ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అన్ని తరాలకు చెందినవారిలోనూ... మరింత ఆరోగ్యకరమైన, చురుకైన, సంతృప్తికరమైన జీవనశైలిని పెంపొందించడంలో యోగా పాత్రను ఇది ప్రముఖంగా తెలియజేస్తోంది.

యోగా సంగం పోర్టల్లో పెరుగుతున్న ఈ భాగస్వామ్యం, జన భాగీదారీ స్ఫూర్తిని, అంతర్జాతీయ ఉద్యమం నుంచి సామాజిక  ఆరోగ్యం, సామరస్యాల వేడుకగా యోగాను మార్చడంలో భారత్‌కున్న సమష్టి సంకల్పాన్ని సూచిస్తుంది.

***


(रिलीज़ आईडी: 2275638) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी