బొగ్గు మంత్రిత్వ శాఖ
సర్ఫేస్ కోల్, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులపై ఈ నెల 18న ముంబయిలో బొగ్గు శాఖ మూడో రోడ్ షో
प्रविष्टि तिथि:
17 JUN 2026 12:42PM by PIB Hyderabad
బొగ్గు మంత్రిత్వ శాఖ సర్ఫేస్ కోల్, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకంపై మూడో రోడ్‌షోను ముంబయిలో 2026 జూన్ 18న నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమ నిర్వహణ భారత్ బొగ్గు గ్యాసిఫికేషన్ ఉద్యమంలో ఆసక్తిదారుల భాగస్వామ్యాన్ని విస్తరించడంతో పాటు పరిశ్రమ భాగస్వామ్యం జోరందుకునేటట్లు చేయనుంది. ఇప్పటికే న్యూఢిల్లీ, హైదరాబాద్‌లో ఇలాంటి రోడ్‌షోలకు ప్రోత్సాహకర ప్రతిస్పందన రావడంతో, ముంబయి రోడ్‌షోలో పారిశ్రామిక రంగానికి చెందిన ప్రముఖ ఆసక్తిదారులు, ఇన్వెస్టర్లు, సాంకేతిక సేవలను అందించే సంస్థలు, విధాన నిపుణులు, బొగ్గు రంగ ప్రతినిధులు, ఆర్థిక సహాయ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొంటారని ఆశిస్తున్నారు. వారు బొగ్గు గ్యాసిఫికేషన్‌కు సంబంధించి సరికొత్త అవకాశాలపై చర్చిస్తారనీ, దేశంలో బొగ్గు గనులను ఇప్పటి కన్నా మరింత స్వచ్ఛ విధానాల్లో, దీర్ఘకాలిక ప్రాతిపదికన వినియోగించుకోవాలన్న దేశ దార్శనికతకు మద్దతిస్తారనీ భావిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్‌ణవీస్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీశ్ చంద్ర దుబే గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమంలో బొగ్గు శాఖ కార్యదర్శి శ్రీ విక్రం దేవ్ దత్, బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి శ్రీ సనోజ్ కుమార్ ఝాతో పాటు మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొంటారు.
ఇంధన భద్రతను పటిష్ఠపరిచి, దిగుమతి చేసుకున్న ముడిసరుకుపై ఆధారపడడాన్ని తగ్గించి, దేశవాళీ బొగ్గు వనరులకు విలువ జోడింపును ప్రోత్సహించడంతో పాటు సంబంధిత పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి సాయపడాలన్న భారత్ వ్యూహంలో బొగ్గు గ్యాసిఫికేషన్ కీలకంగా మారుతోంది. బొగ్గును సింథెసిస్ గ్యాస్ (సిన్‌గ్యాస్)గా మార్చి మెథనాల్, యూరియా, అమోనియం నైట్రేట్, సింథెటిక్ నేచరల్ గ్యాస్, ఇతర రసాయనిక ముడిసరుకులు సహా విలువను జోడించిన అనేక విధాలైన ఉత్పాదనలకు బొగ్గు గ్యాసిఫికేషన్ మార్గాన్ని సుగమం చేస్తుంది. దీంతో పారిశ్రామిక అభివృద్ధికీ, దిగుమతులకు ప్రత్యామ్నాయాలను అన్వేషించడానికీ సరికొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.
బొగ్గు గ్యాసిఫికేషన్‌కు పెద్ద మార్పులను తీసుకువచ్చే సత్తా ఉందని ప్రభుత్వం గుర్తించి సర్ఫేస్ కోల్, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి రూ.46,000 కోట్ల ఖర్చయ్యే కార్యక్రమానికి ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను త్వరితగతిన ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమం ధ్యేయం. వ్యూహాత్మక పారిశ్రామిక, రసాయనిక ఉత్పాదనలను తయారు చేయడానికి దేశీయ బొగ్గును ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం, సహజవాయువు, మెథనాల్, అమోనియా, ఇతర కీలక ముడి సరుకుల కోసం దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం, పారిశ్రామిక అభివృద్ధికీ, ఆర్థిక స్వయంసమృద్ధికీ మద్దతిస్తూ భారత ఇంధన భద్రతను బలోపేతం చేయడం కూడా ఈ కార్యక్రమం ధ్యేయాలే.
ఆసక్తిదారులు పెద్ద ఎత్తున భాగస్వామ్యాన్ని పంచుకొనేటట్లు చూడడానికీ, కార్యాచరణలో పారదర్శకత్వాన్ని తీసుకురావడానికీ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్‌ను (ఆర్ఎఫ్‌పీ) బొగ్గు శాఖ అందరికీ అందుబాటులోకి తీసుకు రావడంతో పాటు సూచనలను, అభిప్రాయాలను పంచుకోవాల్సిందిగా ఆసక్తిదారులను కోరింది.
పారిశ్రామిక నూతన ఆవిష్కరణలు, ఇంధన భద్రత, ఆర్థిక అభివృద్ధిలలో పెద్ద మార్పును తీసుకువచ్చేందుకు భారత్‌లోని అపార బొగ్గు వనరులను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలన్న మంత్రిత్వ శాఖ ఆసక్తిని రోడ్‌షో చాటిచెబుతోంది. భాగస్వామ్యాలను, పెట్టుబడులను ప్రోత్సహించి, ఉన్నత సాంకేతికతలను అనుసరించడానికి అనువైన వాతావరణాన్ని ఏర్పరచడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్, ఇంధన రంగంలో స్వయంసమృద్ధి సాధన, 2047 కల్లా వికసిత్ భారత్ దార్శనికత సాకారం దిశగా దేశం చేస్తున్న కృషికి మద్దతిచ్చే పటిష్ఠ బొగ్గు గ్యాసిఫికేషన్ విస్తారిత అనుబంధ వ్యవస్థ ఏర్పాటుకు బొగ్గు శాఖ మార్గాన్ని సుగమం చేస్తోంది.
***
(रिलीज़ आईडी: 2274078)
आगंतुक पटल : 7