ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
భారత ప్రభుత్వ కొనుగోళ్ల వ్యవస్థకు బహుభాషా సౌకర్యం
డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ (డీఐబీడీ), గవర్నమెంట్ ఇ-మార్కెట్‌ప్లేస్ (జీఈఎం) మధ్య అవగాహనా ఒప్పందం
ఏఐ ఆధారిత భాషా సాంకేతికతలతో ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థలు, వ్యాపార సంస్థలకు సాధికారత కల్పించటం, అధికారికంగా గుర్తింపు పొందిన 22 భారతీయ భాషల్లో అంతరాయం లేని చర్చలకు వీలు
प्रविष्टि तिथि:
15 JUN 2026 9:58PM by PIB Hyderabad
ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై), డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (డీఐసీ) పరిధిలోని డిజిటల్ ఇండియా భాషిణి విభాగం (డీఐబీఐ).. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ ప్రభుత్వ కొనుగోళ్ల పోర్టల్ గవర్నమెంట్ ఇ-మార్కెట్‌ప్లేస్ (జీఇఎం) అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. జాతీయ భాషా డిజిటల్ మౌలిక సదుపాయమైన భాషిణి వేదిక ద్వారా దేశంలోని ప్రభుత్వ కొనుగోళ్ల వ్యవస్థలో బహుభాషా డిజిటల్ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు "భాషిణి ఫర్ సేవ, సంచాలన్ - ఏ భాషిణి సహయోగి ప్రోగ్రామ్" ద్వారా ఈ ఒప్పందం జరిగింది.
జీఇఎం డిజిటల్ వేదికల్లో వివిధ భాషల్లో సౌలభ్యాన్ని, పాలనను, సేవలను అందించడాన్ని ప్రోత్సహించటమే ఈ భాగస్వామ్యం ఉద్దేశం. దీనిద్వారా భాగస్వాములకు నచ్చిన భాషలో సమాచారాన్ని, సేవలను పొందే వీలుంటుంది. ఈ ఒప్పందం ద్వారా వాయిస్ ఆధారిత భాషా సాంకేతిక మౌలిక సదుపాయాలను, జనరేటివ్ ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయటమే కాక, అధికారిక గుర్తింపు కలిగిన 22 భారతీయ భాషలతో పాటు ఇతర భారతీయ భాషల్లోనూ సులభంగా సంభాషించేందుకు వీలవుతుంది.
ఈ సహకార ఒప్పందం ద్వారా జీఇఎం, భాషిణి బృందం కలిసి భాషిణి ఉద్యత్, మిత్ర, యాప్ మిత్ర, సహయోగి, ప్రవక్త వంటి కార్యక్రమాల సహాయంతో బహుభాషా డిజిటల్ ప్రజా వనరుల రూపకల్పన, సమగ్రత, అమలు దిశగా కృషి చేస్తాయి. జీఇఎం వ్యవస్థలో బహుభాషా సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు అనువాద ఏపీఐ సమగ్రత, నిర్దిష్ట రంగానికి సంబంధించిన భాషా నమూనాల అభివృద్ధి, బహుభాషా పదకోశాల తయారీ, వాయిస్-ఆధారిత సాంకేతికతలు, రిఫరెన్స్ అప్లికేషన్లు, వాయిస్ బాట్లు, భాషా సంబంధిత డేటాసెట్ల అభివృద్ధి వంటి అంశాలకు ఈ సహకారం మద్దతిస్తుంది.
భాషా పరమైన అడ్డంకులను తొలగించటం ద్వారా సేకరణ సేవలు, విక్రేత ఆన్‌బోర్డింగ్, ప్లాట్‌ఫారమ్ నావిగేషన్, కమ్యూనికేషన్, వాటాదారుల భాగస్వామ్యంలో- అందరికీ అందుబాటులో ఉండేలా, సమానమైన భాషా సౌలభ్యాన్ని కల్పించటం ద్వారా మరింత సమ్మిళిత ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థ అభివృద్ధికి ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. జీఇఎం వేదికలోని వాటాదారులు బహుభాషా డిజిటల్ వ్యవస్థలో సమర్థవంతంగా పనిచేయటానికి, పరస్పరం చర్చించుకునేందుకు, పాల్గొనేందుకు వారిని శక్తిమంతం చేయాలని ఈ భాగస్వామ్యం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రభుత్వ కొనుగోళ్లు, ప్రభుత్వ సేవలు, వాణిజ్య వ్యాపార భాగస్వామ్య అవసరాలకు అనుగుణంగా రూపొందించిన బహుభాషా ఏఐ నమూనాలు, భాషా సాంకేతికతలను బలోపేతం చేయటంపై ఈ సహకారం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. తద్వారా భారతదేశంలోని విభిన్న భాషా ప్రాంతాల్లో వాయిస్ ఆధారిత బహుభాషా సేవలను పొందే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వ సేకరణ అవకాశాలను విస్తృతం చేయటంలో, సులభతర వ్యాపారాలను (ఈఓడీబీ) ప్రోత్సహించటంలో బహుభాషా సాంకేతికతల ప్రాముఖ్యత పెరుగుతోందని ఈ చర్చలు స్పష్టం చేశాయి. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థలు, వ్యవస్థాపకులు, వివిధ భాషా ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహించే సంస్థలకు ఇవి మరింత ముఖ్యం. ప్రభుత్వ సేకరణ, ఆర్థిక అవకాశాల్లో భాగస్వామ్యానికి భాష అడ్డంకిగా ఉండకుండా చూడటమే ఈ ఒప్పంద ఉద్దేశం.
ఈ అవగాహన ఒప్పందం ద్వారా భాషాదాన్ పోర్టల్ సహాయంతో డేటాను అందించేలా ప్రోత్సహించటం, అవగాహనా కార్యక్రమాలు, సామర్థ్యాన్ని పెంపొందించే చర్యలు చేపట్టం, జీఇఎం వ్యవస్థతో ముడిపడున్న సంస్థలు, భాగస్వాముల్లో బహుభాషా ఏఐ సాధనాల వినియోగం విస్తృతం అవుతుంది. ప్రభుత్వ సేకరణ సేవల్లో బహుభాషా మద్దతును మెరుగుపరచటానికి భాషా వనరులను సేకరించటం, క్రమబద్దీకరించటం, అందరికీ అందుబాటులోకి తీసుకురావటానికి ఈ భాగస్వామ్యం సహకరిస్తుంది.
ఈ సహకారంలో భాగంగా బహుభాషా డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటం, సేకరణ సేవల సౌలభ్యాన్ని విస్తరించటం, ఆవిష్కరణలను ప్రోత్సహించటం, ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థ అంతటా భాషా సాంకేతికతలను విస్తృతంగా వినియోగించేలా చేయటం వంటి నిర్దిష్ట కార్యక్రమాలను జీఇఎం, డీఐబీడీ సంయుక్తంగా అన్వేషించి, మద్దతిస్తాయి.
దేశవ్యాప్తంగా కొనుగోలుదారులు, అమ్మకందారుల విస్తృత భాగస్వామ్యానికి వీలుకల్పిస్తూ.. పారదర్శక, సమర్థవంతమైన, సమ్మిళిత ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థను అందించాలనే జీఇఎం సంకల్పానికి ఈ భాగస్వామ్యం మద్దతిస్తుంది. సమ్మిళిత, సులభంగా అందుబాటులో ఉండే, ఏఐ ఆధారిత డిజిటల్ పాలనకు భారతదేశ భాషా మౌలిక సదుపాయాల రంగంలో భాషిణి పాత్రను ఇది మరింత బలోపేతం చేస్తుంది.
"ప్రభుత్వ సేకరణలో భాషాపరమైన అడ్డంకులను తొలగించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులు, అమ్మకందారులకు జీఇఎం పోర్టల్‌ను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావటానికి.. భాషిణి ఏఐ ఆధారిత భాషా సాంకేతికతలను ఉపయోగించుకోవటమే ఈ భాగస్వామ్య లక్ష్యం" - ఏసీఈఓ, విక్రయ విభాగ ప్రధానాధికారి శ్రీ అజిత్ బి చవాన్
"ప్రజలు, సంస్థలు తమకు నచ్చిన భారతీయ భాషల్లో పరస్పరం సంభాషించుకునేలా వీలు కల్పించటం ద్వారా డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు భాషిణి కట్టుబడి ఉంది. బహుభాషా, వాయిస్ ఆధారిత సాంకేతికతల ద్వారా ప్రభుత్వ కొనుగోళ్లను మరింత సులభతరం చేయటంలో జీఈఎంతో మా సహకారం దోహదపడుతుంది. తద్వారా భాగస్వామ్యానికి భాష అడ్డంకిగా మారదు. స్థానిక వ్యాపారాలు, ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థలు, స్వదేశీ సంస్థలను జాతీయ అవకాశాలతో అనుసంధానం చేయటానికి మేం సాధికారత కల్పిస్తున్నాం. డిజిటల్ సమ్మిళిత ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయాలనే భారత దార్శనికతను బలోపేతం చేస్తున్నాం" - డిజిటల్ ఇండియా భాషిణి విభాగం సీఈఓ శ్రీ అమితాబ్ నాగ్.
డిజిటల్ ఇండియా భాషిణి విభాగం (డీఐబీడీ) గురించి:
ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై), డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (డీఐసీ) పరిధిలోని డిజిటల్ ఇండియా భాషిణి విభాగం (డీఐబీడీ).. ఏఐ ఆధారిత బహుభాషా డిజిటల్ చేరికను, భాషా సాంకేతికతను పెంపొందించటానికి భారత్ చేపట్టిన జాతీయ కార్యక్రమం. నేషనల్ హబ్ ఫర్ లాంగ్వేజ్ టెక్నాలజీ (ఎన్హెచ్ఎల్టీ) ద్వారా పరిపాలన, ప్రభుత్వ వేదికలు సంస్థల కోసం భారతీయ భాషల్లో విస్తరించదగిన స్పీచ్, టెక్ట్స్ ఆధారిత ఏఐ సేవలను భాషిణి అందిస్తుంది. ఈ వేదిక 800లకు పైగా ప్రభుత్వ వెబ్‌సైట్లకు సేవలందిస్తోంది. రోజూ 15 మిలియన్లకు పైగా సందేహాలను విశ్లేషిస్తుంది. 36 భారత లిపి భాషలకు, 23 భారతీయ లిపిలేని భాషలకు, 35 అంతర్జాతీయ భాషలకు మద్దతిస్తుంది. డీఐబీడీ ఓపెన్-సోర్స్ ఆవిష్కరణ, బహుభాషా ఏఐ పరిశోధన, డేటాసెట్ సృష్టి, అంకుర సంస్థల ప్రోత్సాహం, విద్యా సహకారాన్ని ప్రోత్సహిస్తూ, భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాల వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
***
(रिलीज़ आईडी: 2273509)
आगंतुक पटल : 15