వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములవ్వాలని అంతర్జాతీయ ఔషధ కంపెనీలను ఆహ్వానించిన కేంద్రమంత్రి శ్రీ పీయూష్ గోయల్... రాబోయే ఐదేళ్లలో రెండింతలు వృద్ధి కానున్న ఫార్మా పరిశ్రమ
తక్కువ ధరకు ఔషధాలను అందించాలనే ప్రాధాన్యతను కొనసాగిస్తూనే... జనరిక్ ఔషధాలను దాటి ఆవిష్కరణల ఆధారిత ఔషధ ఉత్పత్తుల దిశగా భారత్ అడుగులు: శ్రీ పీయూష్ గోయల్
అంతర్జాతీయ సవాళ్ల మధ్య 7.7 శాతం వృద్ధిని నమోదు చేసిన భారత్... ప్రపంచ ఔషధ రంగ భాగస్వామ్యాలకు గొప్ప అవకాశాల కల్పన: శ్రీ పీయూష్ గోయల్
భారతదేశ ఔషధ ప్రగతి ప్రయాణంలో విశ్వాసం, ఆవిష్కరణ, భాగస్వామ్యం మూడు కీలకాధారాలు: శ్రీ పీయూష్ గోయల్
प्रविष्टि तिथि:
08 JUN 2026 9:37PM by PIB Hyderabad
ఆవిష్కరణల ఆధారిత, సమ్మిళిత ఆరోగ్య సంరక్షణ దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో భాగస్వాములు కావాలని అంతర్జాతీయ ఔషధ కంపెనీలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఇవాళ ఆహ్వానించారు. భారత ఔషధ రంగం ప్రస్తుతం సుమారు 60 బిలియన్ డాలర్ల విలువైనదని, రాబోయే ఐదేళ్లలో ఇది రెట్టింపయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఔషధ రంగానికి సంబంధించి ఇవాళ న్యూఢిల్లీలో జరిగిన గ్లోబల్ అంబాసిడర్ మీట్, జీడీఆర్‌సీ (గ్లోబల్ డ్రగ్ రెగ్యులేటర్స్ కాంక్లేవ్)-2026, ఐఫెక్స్ (ఇంటర్నేషనల్ ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఎక్స్ పో)-2026ల ప్రారంభ వేడుకను ఉద్దేశించి శ్రీ పీయూష్ గోయల్ ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా చౌకగా మందులను అందించటాన్ని కొనసాగిస్తూనే... కేవలం జనరిక్ మందులకే పరిమితం కాకుండా ఆవిష్కరణల ఆధారిత ఔషధ ఉత్పత్తుల దిశగా భారత్ అడుగులు వేస్తోందని ఆయన అన్నారు.
అంతర్జాతీయ ఔషధ సరఫరా వ్యవస్థలో భారత్ కీలక భాగమని శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. వినియోగదారుడిగా, ఆవిష్కర్తగా, సాంకేతిక భాగస్వామిగా, ఔషధ పరిశోధనల వేదికగా, ఔషధ తయారీ కేంద్రంగా ప్రపంచ దేశాలకు విశ్వసనీయమైన భాగస్వామిగా ఉండాలని భారత్ భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఉక్రెయిన్, పశ్చిమాసియా ఘర్షణలు, అమెరికా విధించిన 50 శాతం పన్నుల వంటి అంతర్జాతీయ సవాళ్లున్నప్పటికీ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతోందని మంత్రి అన్నారు. మార్చి 2026న ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి స్థిర ధరల వద్ద భారత ఆర్థిక వ్యవస్థ 7.7 శాతం వృద్ధిని నమోదు చేసిందని వెల్లడించారు.
భాగస్వామ్య దేశాల నుంచి వచ్చే నాణ్యమైన, కొత్త రకం ఔషధాలకు మార్కెట్లోకి ప్రవేశం కల్పించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల పలు ఔషధ ఉత్పత్తులకు పన్ను లేని ప్రవేశంతో పాటు ఇతర ప్రాధాన్యతలు లభించాయని పేర్కొన్నారు.
గత 12 ఏళ్లుగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ పరిశ్రమల అంతర్జాతీయ విస్తరణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చినట్లు మంత్రి తెలిపారు. ఇటీవల కాలంలో భారత్ తొమ్మిది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని, ప్రస్తుతం 50కి పైగా దేశాలతో వాణిజ్య ఒప్పందాలున్నాయని, దీనివల్ల అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్లో మనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.
భారతదేశ జనరిక్ ఔషధాల పరిశ్రమ ప్రాముఖ్యతను శ్రీ పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. భారత్ చౌకగా సరఫరా చేసే మందుల వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది రోగులు లబ్ధి పొందుతున్నారని అన్నారు. అమెరికాలో అమ్ముడయ్యే మొత్తం ఔషధాల్లో 80-90 శాతం జనరిక్ మందులే ఉన్నా, వాటి విలువ కేవలం 10-15 శాతం మాత్రమేనని చెప్పారు. దీనివల్ల ఎంత తక్కువ ధరలో జనరిక్ ఔషధాలు లభ్యమవుతాయో, వాటివల్ల ప్రజలకు ఎంత ప్రయోజనం ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే భారత్‌లో ప్రతిభ గల మానవ వనరులు ఉండటమే కాక, మందుల తయారీ ఖర్చులు తక్కువగా ఉన్నట్లు తెలిపారు.
భారత ఔషధ రంగానికున్న మూడు కీలక బలాలు... విశ్వాసం, ఆవిష్కరణ, భాగస్వామ్యాలని మంత్రి వివరించారు.
విశ్వసనీయతపై శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ... ఉత్పత్తుల తయారీ పద్దతులను ప్రపంచ ప్రమాణాలకనుగుణంగా భారత్ మార్చిందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్ అవసరాల్లో సుమారు 65-70 శాతం భారత్ నుంచే సరఫరా అవుతున్నాయని, ప్రపంచంలోని 25 అతిపెద్ద జనరిక్ ఔషధ కంపెనీల్లో 10 కంపెనీలు భారత్ నుంచే పనిచేస్తున్నాయని చెప్పారు. అమెరికా వెలుపల యూఎస్ ఎఫ్‌డీఏ ఆమోదించిన అత్యధిక ఔషధ తయారీ ప్లాంట్లు భారతదేశంలోనే ఉన్నట్లు వెల్లడించారు.
ఆవిష్కరణల గురించి శ్రీ పీయూష్ గోయల్ వివరిస్తూ... ఇటీవల సంవత్సరాల్లో భారతదేశంలో పేటెంట్ దరఖాస్తులు దాదాపు 100 శాతం పెరిగినట్లు చెప్పారు. ఔషధ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు బయోఫార్మా శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రత్యేకంగా తెలిపారు. ఔషధ రంగంతో సహా వివిధ రంగాల్లో ఆవిష్కరణలకు మద్దతుగా ప్రభుత్వం ప్రకటించిన 10 బిలియన్ డాలర్ల కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.
భాగస్వామ్యాల అంశంపై శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ... 140 కోట్ల మంది ప్రజలు గల మార్కెట్, వేగంగా విస్తరిస్తున్న మధ్యతరగతి వర్గం, పెరుగుతున్న ఆదాయాలు, స్థిరమైన ఆర్థిక వృద్ధి అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, భారత్‌లో మరింత బలమైన ఉనికిని చాటుకోవాలని అంతర్జాతీయ ఔషధ కంపెనీలను శ్రీ పీయూష్ గోయల్ ఆహ్వానించారు.
భారతదేశ ప్రాచీన ఆరోగ్య తత్వశాస్త్రాన్ని ప్రస్తావిస్తూ... "సర్వే సంతు నిరామయా" అంటే "సమస్త జీవులు రోగాల బారి నుంచి విముక్తి పొందును గాక" అనే సంస్కృత సూక్తిని శ్రీ పీయూష్ గోయల్ ఉదహరించారు. ఆరోగ్యకరమైన జీవితాన్ని ఉమ్మడి బాధ్యతగా భావించే విధానం భారత్‌లో వేల ఏళ్లుగా కొనసాగుతోందని చెప్పారు.
ముఖ్యంగా కొవిడ్-19 తర్వాత ప్రపంచాన్ని మరింత సురక్షితమైన ప్రదేశంగా మార్చేందుకు అందరికీ సమానమైన ఆరోగ్య సంరక్షణను కల్పించేందుకు దేశాల ఉమ్మడి బాధ్యతను ప్రపంచం గుర్తించిందని ఆయన అన్నారు. ఈ సిద్ధాంతమే భారతదేశ ఆధునిక ఔషధ రంగానికి నిరంతరం మార్గదర్శకత్వం వహిస్తోందని పేర్కొన్నారు.
కొవిడ్-19 మహమ్మారి సమయంలో భారత ఔషధ రంగం ప్రదర్శించిన మనోధైర్యాన్ని శ్రీ పీయూష్ గోయల్ ప్రశంసించారు. భారతదేశ కంపెనీలు కేవలం దేశీయ అవసరాలను తీర్చటమే కాక, ప్రపంచ దేశాలకు ముఖ్యంగా గ్లోబల్ సౌత్, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు, అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలను కూడా తీర్చాయని చెప్పారు.
మహమ్మారి సమయంలో భారతదేశం ఔషధాల సరఫరాను నిర్వహించిన తీరును గుర్తుచేస్తూ.. ఇతర దేశాలకు సహాయాన్ని నిరాకరించకుండా, అందరికీ సమానమైన ప్రాతిపదికన సరసమైన ధరలకే లభ్యమయ్యేలా చూసేందుకు ఔషధాలు, వ్యాక్సిన్ల ఎగుమతులపై తాత్కాలిక ఆంక్షలు విధించినట్లు శ్రీ పీయూష్ గోయల్ వివరించారు. ఈ సంక్షోభ సమయంలో భారీ ఆర్థిక వనరులున్న వ్యాపారులు, సంస్థలు అందుబాటులో ఉన్న నిల్వలను తమ ఆధీనంలో ఉంచుకుని, వాటిని అధిక ధరలకు విక్రయిస్తాయనేది ప్రభుత్వ ఆందోళన అని చెప్పారు.
మహమ్మారి సమయంలో వందకి పైగా దేశాలు భారత్ నుంచి ఉచితంగా ఔషధాలను పొందాయని, ఔషధ రంగంలో సహాయం కోసం భారతదేశాన్ని ఆశ్రయించిన ప్రతి దేశానికి కొవిడ్-19 కంటే ముందున్న ధరలకే ఔషధాలను అందించినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఆసరాగా చేసుకుని వ్యాపారులు, మధ్యవర్తులు లాభపడకుండా భారత్ జాగ్రత్త వహించినట్లు చెప్పారు.
మహమ్మారులు, యుద్ధాల వంటి సంక్షోభ సమయాల్లోనే కాక, ఎల్లప్పుడూ ఉండే శాశ్వత భాగస్వామ్యాలను భారత్ కోరుకుంటోందని మంత్రి చెప్పారు. కొత్త ఆవిష్కరణలు, నిరంతర ఆరోగ్య సంరక్షణా ఉత్పత్తులు, అందరికీ నాణ్యమైన వైద్యం అందేలా చేసేందుకు.. దీర్ఘకాలిక భాగస్వామ్యాలను ఏర్పరచుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
2023లో భారత్ అధ్యక్షత వహించిన జీ20 ఇతివృత్తమైన "వసుధైవ కుటుంబకం" లేదా "ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్" అంశాన్ని ప్రస్తావిస్తూ.. ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ఏ ఒక్కరూ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణకు, భద్రతకు దూరం కాకుండా ప్రపంచ దేశాలతో కలిసి పనిచేయాలని భారత్ భావిస్తోందని, ప్రపంచ దేశాలన్నింటినీ సొంత కుటుంబ సభ్యులుగా చూస్తుందని శ్రీ పీయూష్ గోయల్ అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాయబారులు, దౌత్యవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. జీడీఆర్‌సీ-2026, ఐఫెక్స్-2026 విజయవంతం కావాలని కాంకిస్తూ, శుభాకాంక్షలు తెలియజేశారు.
***
(रिलीज़ आईडी: 2270968)
आगंतुक पटल : 21