రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
జోజిలా సొరంగం ప్రాజెక్టు చారిత్రక పురోగమనం
జమ్మూకాశ్మీర్.. లద్దాఖ్‌ల పరిణామాత్మక అనుసంధానాన్ని విశదీకరించిన రోడ్డు రవాణా-రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ
ఈ సొరంగం ద్వారా జమ్ము.. కాశ్మీర్.. లద్దాఖ్‌ల మధ్య అన్ని రుతువుల్లోనూ అనుసంధానం
వ్యూహాత్మక మౌలిక సదుపాయాల కల్పనతో జాతీయ భద్రత మెరుగు సహా పర్యాటకం.. వాణిజ్యం.. ప్రాంతీయాభివృద్ధి వేగం పుంజుకుంటాయి
प्रविष्टि तिथि:
09 JUN 2026 7:48PM by PIB Hyderabad
కార్గిల్ జిల్లాలోని మీనామార్గ్‌లో జోజిలా టన్నెల్ ప్రాజెక్ట్ తూర్పు ముఖద్వారం వద్ద ప్రధాన సొరంగం చారిత్రక ప్రారంభాన్ని కేంద్ర రోడ్డు రవాణా-రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈ రోజు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లా, పలువురు ఎంపీలు, ప్రజాప్రతినిధులు, సీనియర్ అధికారులు, విశిష్ట అతిథులు పాల్గొన్నారు. లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా ఆన్‌లైన్ ద్వారా పాల్గొని, జోజిలా టన్నెల్ ప్రాజెక్ట్ పురోగమనంలో ఇదొక కీలక ఘట్టమని పేర్కొన్నారు.
జాతీయ రహదారి మౌలిక సదుపాయాల కల్పనలో ఈ సొరంగారంభం ఓ కీలక మలుపుగా నిలుస్తుంది. ఇది జమ్ము, కశ్మీర్, లద్దాఖ్‌ల మధ్య ఏడాది పొడవునా అనుసంధానం కల్పిస్తూ ఆ ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాలకు మరింత చేరువ చేస్తుంది.
జోజిలా సొరంగం: ఓ కీలక ఇంజనీరింగ్ విజయం
జాతీయ రహదారి-1 పరిధిలో పై బల్టల్-మీనామార్గ్ మధ్య నిర్మితమవుతున్న దాదాపు 14 కిలోమీటర్ల పొడవైన ద్విదిశాత్మక జోజిలా సొరంగం దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక పర్వత ప్రాంత మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఒకటి. దాదాపు ₹6,800 కోట్ల వ్యయంతో 2,900 మీటర్ల నుంచి 3,310 మీటర్ల ఎత్తున రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే ఒక అత్యంత కఠిన భౌగోళిక ప్రదేశంలో సాధించిన కీలక ఇంజనీరింగ్ విజయంగా నిలుస్తుంది.
భారీ హిమపాతం, కఠిన వాతావరణ పరిస్థితులు, సంక్లిష్ట భౌగోళిక సవాళ్లు ఉన్నప్పటికీ- ఇంజనీర్లు, కార్మికులు, కన్సల్టెంట్లు, కాంట్రాక్టర్లు, నేషనల్ హైవేస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సహా ఇతర భాగస్వాముల కృషితో ఈ ప్రాజెక్టు నిలకడగా పురోగమిస్తోంది. ఈ పురోగతిలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ శ్రీ గడ్కరీ ఈ సందర్భంగా అభినందించారు.
ఆధునిక భద్రత సౌకర్యాలు.. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు
సురక్షితమైన, సమర్థ ప్రయాణానికి భరోసా ఇస్తూ ఈ సొరంగంలో ఆధునిక వెంటిలేషన్ వ్యవస్థలు, ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ వ్యవస్థలు, అత్యాధునిక సీసీటీవీ నిఘా సహా పాదచారుల కోసం క్రాస్-పాసేజ్ సదుపాయం కూడా కల్పిస్తామని శ్రీ నితిన్ గడ్కరీ వెల్లడించారు.
భారీ హిమపాతం, భౌగోళిక సవాళ్లను ఎదుర్కోవడంలో భాగంగా ఈ ప్రాజెక్టులో 8 కట్-అండ్-కవర్ విభాగాలు, నాలుగు వంతెనలు, 40 కల్వర్టులు, స్నో గ్యాలరీలు, క్యాచ్ డ్యాములు, హిమపాత రక్షణ కట్టలు, అప్రోచ్ రోడ్లు, అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు వంటివన్నీ ఉంటాయి.
అనుసంధానం.. పర్యాటకం.. వ్యూహాత్మక రవాణా రూపాంతరీకరణ
జోజిలా సొరంగం ఒక రవాణా ప్రాజెక్టుకు పరిమితం కాదని, ఈ ప్రాంత ప్రగతికి రాచబాట కాగలదని శ్రీ గడ్కరీ అన్నారు. ఇది పూర్తయితే, సోనామార్గ్, మీనామార్గ్ మధ్య 2 గంటల ప్రయాణం దాదాపు 30 నిమిషాలకు తగ్గిపోతుంది. తద్వారా సమయం, ఇంధనం గణనీయంగా ఆదా అవుతాయి. అలాగే, ప్రమాదాల ముప్పుతోపాటు హిమపాతం లేదా ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల కలిగే అంతరాయాలు తప్పుతాయి.
ఈ సొరంగంతో పర్యాటక రంగానికి ప్రోత్సాహం లభించడంతోపాటు వాణిజ్య సౌలభ్యం కలుగుతుందని, మారుమూల ప్రాంతాలకు బాటలు వేస్తుందని, సరిహద్దు ప్రాంతాలతో అనుసంధానాన్ని బలపరుస్తుందని అంచనా. జాతీయ భద్రత దృక్కోణంలో చూస్తే, ఏడాది పొడవునా అనుసంధానం వల్ల భారత సైన్యం, పరికరాలు, సరఫరాలు, రవాణా వేగంగా మరింత సమర్థంగా సాగుతాయి. తద్వారా వ్యూహాత్మక సంసిద్ధత కూడా బలోపేతం అవుతుంది.
ఈ ప్రాజెక్టు మెరుగైన అనుసంధానం, ప్రాంతీయ సమైక్యత ద్వారా ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది. ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడమే కాకుండా స్థానిక సమాజాల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది.
లద్దాఖ్‌ను బలోపేతం చేస్తున్న ప్రధాన అనుసంధాన ప్రాజెక్టులు
కార్గిల్, లేహ్-లద్దాఖ మధ్య సుమారు ₹18,000 కోట్ల విలువైన రహదారి, సొరంగ ప్రాజెక్టులు పురోగమనంలో ఉన్నాయని మంత్రి తెలిపారు.
ఇక్కడి కీలక కార్యక్రమాలలో కార్గిల్-జాన్‌స్కార్-పదుమ్ హైవే ప్రాజెక్ట్ ఒకటి. ఇది జాన్‌స్కార్ ప్రాంతానికి బాటలు వేస్తూ, వ్యూహాత్మక అనుసంధానాన్ని బలోపేతం చేయడంతోపాటు సైన్యం రాకపోలకను సులభతరం చేస్తుంది.
లేహ్‌లో ట్రాఫిక్ నిర్వహణ మెరుగుకు, నగరంలోకి ప్రవేశించే అవసరం లేకుండా శ్రీనగర్, మనాలి, ఖార్దుంగ్ లా పాస్ వైపు ప్రయాణించే వాహనాలకు నిరాటంకంగా రాకపోకలు సాగుతాయి. అలాగే, దక్షిణ-ఉత్తర బైపాస్ రహదారి ప్రాజెక్టులను కూడా నిర్మిస్తున్నారు.
ప్రతిపాదిత ఫాటు-లా ట్విన్-ట్యూబ్ సొరంగం, కేలా పాస్ సొరంగాల గురించి కూడా శ్రీ నితిన్ గడ్కరీ ప్రముఖంగా ప్రస్తావించారు. ఇవి అన్ని కాలాల్లోనూ అనుసంధానాన్ని మెరుగుపరుస్తూ పాంగోంగ్ సరస్సు సహా కీలక పర్యాటక ప్రదేశాలకు మార్గం సుగమం చేస్తాయి.
మనాలి–లేహ్ మార్గంలో అన్ని కాలాల్లోనూ ప్రత్యక్ష సంధానం
మనాలి–లేహ్ మార్గంలో బరాలాచా లా, లచులుంగ్ లా, టాంగ్లాంగ్ లా వద్ద సొరంగ ప్రాజెక్టులపై ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ ప్రాజెక్టులు ప్రయాణ విశ్వసనీయతను గణనీయంగా మెరుగుపరచటమే కాకుండా ప్రయాణ సమయాన్ని తగ్గిస్తూ, లద్దాఖ్‌కు ఏడాది పొడవునా అనుసంధానాన్ని బలోపేతం చేస్తాయి.
జమ్మూకాశ్మీర్‌లో ₹1.35 లక్షల కోట్ల విలువైన రహదారి పనులు
ఈ ప్రగతి పనుల తర్వాత జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ అంతటా రహదారి మౌలిక సదుపాయాల రూపాంతరీకరణ దిశగా ప్రభుత్వ విస్తృత కృషిని శ్రీ గడ్కరీ ప్రముఖంగా ప్రస్తావించారు.
అనుసంధానాన్ని బలోపేతం, రవాణా సామర్థ్యం మెరుగుదల, సామాజిక-ఆర్థిక అభివృద్ధిని వేగిరపరచడం సహా ప్రస్తుత, భవిష్యత్ పనుల సహిత ₹1.35 లక్షల కోట్ల విలువైన రహదారి ప్రాజెక్టులను జమ్మూకాశ్మీర్ అంతటా కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.
జమ్మూకాశ్మీర్‌ను రూపురేఖలు మారుస్తున్న హై-స్పీడ్ కారిడార్లు
జమ్మూకాశ్మీర్ అనుసంధానం బలోపేతం దిశగా నాలుగు ప్రధాన హై-స్పీడ్ కారిడార్ల పనులు కొనసాగుతున్నాయని శ్రీ నితిన్ గడ్కరీ తెలిపారు.
వీటిలో జమ్మూ–ఉధంపూర్–శ్రీనగర్ కారిడార్ త్వరలో పూర్తికానుంది. దీనివల్ల ఆధునిక రహదారి మౌలిక సదుపాయాలు మెరుగుపడటమే కాకుండా సొరంగ మార్గాల ద్వారా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.
జమ్మూ–చెనాని–అనంతనాగ్ కారిడార్ నిర్మాణంతో చెనాబ్ లోయ జిల్లాలతో కాశ్మీర్ లోయకు సంధానం మెరుగవుతుంది. అలాగే శ్రీనగర్–బారాముల్లా–ఉరీ కారిడార్ ఉత్తర కాశ్మీర్‌తో అనుసంధానం బలోపేతమై ప్రజలు, వస్తువుల రవాణా సులభతరమవుతుంది.
జమ్మూ–అఖ్నూర్–పూంచ్ కారిడార్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఇది సరిహద్దు జిల్లాల్లో అనుసంధానం మెరుగుపరచి, ప్రయాణ సమయాన్ని గణనీయంగా ఆదా చేస్తుంది.
వ్యూహాత్మక... సరిహద్దు అనుసంధాన కార్యక్రమాలు
కట్రా–శ్రీనగర్ హై స్పీడ్ కారిడార్, రఫీయాబాద్–కుప్వారా–చౌకిబాల్–తంగ్‌ధర్ రహదారి ప్రాజెక్టు, శ్రీనగర్–సోనామార్గ్–గుమ్రి కారిడార్ వంటి వ్యూహాత్మక ప్రాధాన్యంగల అనేక భవిష్యత్ ప్రాజెక్టులను కూడా మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఇవన్నీ సరిహద్దు ప్రాంతాలకు సౌలభ్యాన్ని మెరుగుపరచడంతోపాటు పర్యాటక వృద్ధికి తోడ్పడుతూ, ఉద్యాన కార్యకలాపాలకు మద్దతివ్వడమే కాకుండా వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తాయి.
పిర్ పంజాల్ ప్రాంతం-శ్మీర్ లోయ అనుసంధానం మెరుగు దిశగా సురాన్‌కోట్, బుఫ్లియాజ్, సుపెన్, దూద్‌పత్రి, మాగమ్‌లను కలిపే కొత్త కారిడార్ కూడా ప్రణాళిక దశలో ఉంది.
పట్టణ రవాణా మెరుగుకు రింగ్ రోడ్లు
నగరంలో రద్దీ నియంత్రణ సహా బారాముల్లా, కుప్వారా, బందీపోరా, గురేజ్, కార్గిల్, లేహ్ వైపు నిరంతరాయ రాకపోకల కోసం శ్రీనగర్ రింగ్ రోడ్ ప్రాజెక్టును బహుళ దశల్లో నిర్మిస్తున్నట్లు మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రత్యేక స్పర్ లింకుల ద్వారా శ్రీనగర్ విమానాశ్రయం-రైల్వే స్టేషన్ మధ్య సంధానాన్ని కూడా మెరుగుపరుస్తున్నారు.
పట్టణంలో రద్దీ తగ్గింపు, పరిసరాల్లో వాహన రాకపోకల మెరుగుపరచడం కోసం జమ్ము రింగ్ రోడ్ ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో ప్రతిపాదిత తూర్పు విభాగం ప్రాంతీయ సంధానాన్ని బలోపేతం చేయడంతోపాటు కట్రా వైపున కూడా ప్రయాణ సౌలభ్యం కల్పిస్తుంది.
ఢిల్లీ–అమృత్‌సర్–కట్రా ఎక్స్‌ప్రెస్‌వేతో ప్రాంతీయ అనుసంధానం బలోపేతం
ఢిల్లీ–అమృత్‌సర్–కట్రా కొత్త ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయితే ఢిల్లీ-కట్రా మార్గంలో మెరుగైన సంధానం ఏర్పడుతుంది. అలాగే ఉత్తర భారత ప్రాంతాలన్నిటా ఆర్థిక అనుసంధానం బలోపేతం అవుతుంది. ఆధునిక సౌలభ్య-నియంత్రిత కారిడార్ ద్వారా జమ్మూకాశ్మీర్‌కు సౌలభ్యం ఇనుమడిస్తుందని మంత్రి తెలిపారు.
అనుసంధాన విప్లవానికి సొరంగ మౌలిక సదుపాయాల సారథ్యం
హిమాలయ ప్రాంతంలో సొరంగ మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించడాన్ని మంత్రి శ్రీ గడ్కరీ ప్రముఖంగా ప్రస్తావించారు. అన్ని రుతువుల్లోనూ ప్రయాణ సౌలభ్యానికి భరోసా ఇవ్వడంతోపాటు రహదారి భద్రత మెరుగుదల, వ్యూహాత్మక చలనశీలత పెంపు దిశగా జాతీయ రహదారులు వేయడంలో సొరంగ నిర్మాణం కీలక అంతర్భాగంగా మారిందని ఆయన వివరించారు.
ఈ మౌలిక సదుపాయాల కల్పన కార్యక్రమాలు రవాణా ప్రాజెక్టుల స్థాయికి పరిమితం కాదని, ఆర్థిక వృద్ధి, పర్యాటక ప్రగతి, ఉపాధి కల్పన, ప్రాంతీయ సమైక్యత, జాతీయ భద్రత తదితరాలకు దోహదం చేసే ఉపకరణాలని ఆయన స్పష్టం చేశారు.
భౌగోళిక సవాళ్లను అభివృద్ధి, శ్రేయస్సు, జాతీయ పురోగమనానికి అవకాశాలుగా మలచుకుంటూ, నవ భారత ఆవిర్భావం కోసం కృషి చేయడంలో జోజిలా సొరంగం పూర్తి కావడం ఒక స్ఫూర్తిదాయక విజయమని శ్రీ గడ్కరీ అభివర్ణించారు.
***
(रिलीज़ आईडी: 2270963)
आगंतुक पटल : 40