వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధాని మోదీ నాయకత్వంలో చీకటి నుండి మిగులు విద్యుత్ దేశంగా భారత్: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

प्रविष्टि तिथि: 09 JUN 2026 3:09PM by PIB Vijayawada

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని 12 ఏళ్ల పాలనలో భారతదేశం విద్యుత్ కొరతను అధిగమించి, మిగులు విద్యుత్ దేశంగా అవతరించిందని… చీకటి నుంచి వెలుగులోకి వచ్చిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార & ప్రజా పంపిణీ, మరియు నూతన & పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సాధించిన విజయాలకు గుర్తుగా నిర్వహిస్తున్న  “12 ఏళ్ల నమ్మకం, వికాసం, ప్రజల సంక్షేమం”  (12 సాల్ విశ్వాస్ కే, వికాస్ కే, జన్ కళ్యాణ్ కే) కార్యక్రమంలో భాగంగా తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. 2014 కంటే ముందు దేశంలో విద్యుత్ డిమాండ్ 123 గిగావాట్లకు చేరినప్పుడు ఉత్తర భారతదేశం మొత్తం చీకట్లోకి వెళ్ళిపోయేదని గుర్తుచేశారు. కానీ, ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ఏడాది మే 23న రికార్డు స్థాయిలో ఏర్పడిన 280 గిగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను కూడా విజయవంతంగా తట్టుకోగలిగిందని చెప్పారు. ప్రస్తుతం మన దేశ విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం 538 గిగావాట్లకు చేరిందని, ఇందులో 33 శాతం వాటా పునరుత్పాదక ఇంధన వనరులదేనని తెలిపారు. అంతేకాదు, పునరుత్పాదక ఇంధన రంగంలో 290 గిగావాట్ల సామర్థ్యంతో భారతదేశం అమెరికాను కూడా దాటేసిందని.. అంతర్జాతీయంగా సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో 3వ స్థానంలో, పవన విద్యుత్‌ ఉత్పత్తిలో 4వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. 

గత 12 ఏళ్లలో ప్రధాని మోదీ అస్థిరంగా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను రూ.345 లక్షల కోట్ల వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారని కేంద్ర మంత్రి అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి వల్ల పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడమే కాకుండా, యువతకు ఉపాధి అవకాశాలు లభించాయని చెప్పారు. గత 11 ఏళ్లలో హైస్పీడ్ కారిడార్లతో కలిపి కొత్తగా 60,000 కిలోమీటర్ల మేర రోడ్డు నెట్‌వర్క్‌ను నిర్మించినట్లు తెలిపారు. మౌలిక సదుపాయాల మెరుగుదల, వ్యాపారాలు సులభతరంగా మారడం వల్ల 'సెమికాన్ ఇండియా' ప్రోగ్రామ్ కింద రూ.1.69 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని వివరించారు. దీనివల్ల ఎలక్ట్రానిక్స్ తయారీ 28 రెట్లు పెరగ్గా, మొబైల్ ఎగుమతులు ఏకంగా 163 రెట్లు పెరిగాయని.. ఫలితంగా ఈ 12 ఏళ్లలో రికార్డు స్థాయిలో మొత్తం రూ.79 లక్షల కోట్ల రికార్డు స్థాయి ఎగుమతులు జరిగాయని వెల్లడించారు. 

సమాజంలో చిట్టచివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందేలా ప్రధాని మోదీ కృషి చేశారని శ్రీ ప్రహ్లాద్ జోషి అన్నారు. అంతర్జాతీయ సంస్థలైన ఐఎంఎఫ్ (IMF), ప్రపంచ బ్యాంక్ (World Bank) అధ్యయన వివరాలను వెల్లడిస్తూ.. అందరినీ కలుపుకుపోయే మోదీ గారి 11 ఏళ్ల పాలనలో, బహుముఖ పేదరికం రేటు 2013-14లో 29.17 నుంచి 11.28 శాతానికి పడిపోయిందని తెలిపారు. దీని ఫలితంగా దేశంలో దాదాపు 25 కోట్ల కంటే ఎక్కువ మంది జనాభా బహుముఖ పేదరికం నుంచి బయటపడ్డారని వివరించారు. 

2047 నాటికి 'వికసిత భారత్' లక్ష్యాన్ని సాధించే ప్రయాణంలో ప్రతి రాష్ట్ర ప్రగతి ఎంతో ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం బలంగా నమ్ముతోందని శ్రీ ప్రహ్లాద్ జోషి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అందిస్తున్న సహకారాన్ని వివరిస్తూ.. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖపట్నంలోని సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహాయక గ్రాంట్లను ఏకంగా 325 శాతం పెంచినట్లు తెలిపారు. వివిధ సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. 

 

అంతకుముందు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఉద్యోగులు మరణించడం పట్ల కేంద్ర మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని  హామీ ఇచ్చారు. ఈ మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్, ఇంధన శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ మరియు ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశం గత 12 ఏళ్లలో సాధించిన వృద్ధిని వివరిస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రచురించిన పలు పుస్తకాలను, సమాచార పత్రాలను శ్రీ ప్రహ్లాద్ జోషి విడుదల చేశారు. 


(रिलीज़ आईडी: 2270896) आगंतुक पटल : 35
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English