ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
ప్రకృతి సంరక్షణకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని
ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
05 JUN 2026 9:53AM by PIB Hyderabad
ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ సంరక్షణ పట్ల మక్కువను కనబరిచే వారందరినీ ఆయన ప్రశంసించారు.
పర్యావరణ సంరక్షణనీ, సుస్థిరాభివృద్ధినీ ప్రోత్సహించడానికి నిబద్ధతను పునరుద్ఘాటించే రోజు ఈ రోజు అని ప్రధానమంత్రి అన్నారు. గత పది సంవత్సరాలుగా ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలను ఆయన ప్రస్తావిస్తూ, ఆ చర్యలతో.. మొక్కలను పెంచుతున్న ప్రాంతాల సంఖ్యతో పాటు , అనేక పశు జాతులు కూడా పెరిగాయన్నారు.
ఉమ్మడి ప్రయత్నాలు, పటిష్ఠ విధానాలు, విజ్ఞానశాస్త్రం పట్ల నమ్మకం, నూతన ఆవిష్కరణలతో పర్యావరణంలో చెప్పుకోదగిన మెరుగుదలను తీసుకురావచ్చని దేశ ప్రజలు నిరూపించారని శ్రీ మోదీ అన్నారు.
భారత్‌లో జీవ వైవిధ్యం దేశానికి అమిత గర్వకారణమని ప్రధానమంత్రి చెబుతూ, ఈ జీవ వైవిధ్యం విభిన్న విస్తారిత అనుబంధ వ్యవస్థల రూపేణా లెక్కపెట్టలేనన్ని జాతులకూ, జీవనోపాధులకూ దన్నుగా నిలుస్తోందని తెలిపారు.
కొన్ని ప్రత్యేక జాతుల పునరుద్ధరణలో చోటుచేసుకున్న విశేష ప్రగతిని శ్రీ మోదీ ప్రస్తావించారు. బట్టమేక పక్షి (గ్రేట్ ఇండియన్ బస్టర్డ్), మంచు ప్రాంతాల్లో కనిపించే చిరుతలు, ఎలుగుబంట్లు (స్లాత్ బేర్లు), చీతాల సంరక్షణకు చేస్తున్న ప్రయత్నాలు నిరంతర కృషితో వన్యప్రాణులతో పాటు విస్తారిత అనుబంధ వ్యవస్థలను పునరుద్ధరించడంలో ఏ మేరకు తోడ్పడగలవో చాటిచెబుతున్నాయని ప్రధానమంత్రి వివరించారు.
‘ఏక్ పేడ్ మా కే నామ్’ (తల్లి పేరిట ఒక మొక్కను పెంచుదాం) వంటి కార్యక్రమాలు ప్రతి ఏటా దాదాపు లక్షా పది వేల హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని కొత్తగా జతపరచడంలో గొప్ప తోడ్పాటును అందించాయని ప్రధానమంత్రి తెలిపారు.
‘వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ అండ్ వన్ ఫ్యూచర్’ (ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకటే భవిష్యత్తు) సిద్ధాంతాన్ని భారత్ మార్గదర్శకంగా తీసుకొని స్వచ్ఛమైన, పచ్చదనంతో నిండివుండే, మరింత ఎక్కువ కాలం పాటు మనుగడలో ఉండేలా ఈ భూగ్రహాన్ని సంరక్షించే దిశగా నిరంతరం పాటుపడుతుందని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
సాంస్కృతిక భావన భారతదేశ సాంప్రదాయిక జ్ఞానంలో ఎంతో అందంగా ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. పర్యావరణాన్ని సంరక్షించాలన్న సందేశాన్ని పరిపుష్టం చేసే ఉద్దేశంతో ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ఆయన పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వరుస సందేశాలను ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. పర్యావరణాన్ని సంరక్షించుకోవాలని మక్కువను చూపే వారందరినీ నేను ప్రశంసలు తెలియజేయదలుస్తున్నాను. ఈ రోజు మన పర్యావరణాన్ని సంరక్షించుకొంటామనీ, మానవ జాతి దీర్ఘకాలం మనుగడ సాగించేందుకు అనువైన విధంగా అభివృద్ధి బాటలో నడుస్తామనీ మనకున్న నిబద్ధతను పునరుద్ఘాటించాల్సిన రోజు. గత పది సంవత్సరాలుగా మా ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలు ఈ దిశగా మేం చేసిన కృషిని వెల్లడిస్తున్నాయి. భారత్ సాధించిన కీలక విజయాల్లో .. మొక్కలను పెంచుతున్న ప్రాంతాలను విస్తరించడంతో పాటు అనేక పశు జాతుల జనసంఖ్యలో నమోదైన వృద్ధి వంటివి ఉన్నాయి. ఉమ్మడి ప్రయత్నాలు, విధానాలు, సైన్సు, నూతన ఆవిష్కరణల పట్ల నమ్మకం మన పర్యావరణాన్ని మెరుగుపరచగలుగుతాయని భారతదేశ ప్రజలు చాటారు’’.
‘‘మన జీవ వైవిధ్యాన్ని చూసుకొని భారత్ ప్రజలం చాలా గర్వపడుతున్నాం. మన విభిన్న విస్తారిత అనుబంధ వ్యవస్థలు అసంఖ్యాక జాతులకీ, జీవనోపాధులకీ ఊతాన్ని అందిస్తున్నాయి. విశేష సంరక్షణ రంగంలో మన ప్రయత్నాలు కూడా ప్రశంసనీయంగా ఉన్నాయి. బట్టమేక పక్షి (గ్రేట్ ఇండియన్ బస్టర్డ్), హిమ ప్రాంత చిరుతలు, ఎలుగుబంట్లు (స్లాత్ బేర్లు), చీతాలను సంరక్షించే దిశగా చేపట్టిన ప్రయత్నాలు.. నిరంతర నిబద్ధతతో నడుచుకున్నప్పుడు వన్యప్రాణులతో పాటు విస్తారిత అనుబంధ వ్యవస్థల పునరుద్ధరణలో తోడ్పడగలుగుతాయని చాటాయి. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ వంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఇంచుమించు 1.19 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతాలను జోడించడంలో కీలక పాత్రను పోషించాయి’’.
‘‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకటే భవిష్యత్తు’’ సిద్ధాంతం మార్గదర్శకత్వం వహిస్తుండగా, మిషన్ లైఫ్ (Mission LiFE) భావన ద్వారా స్వచ్ఛమైన, పచ్చదనంతో నిండివుండే, మరింత ఎక్కువ కాలం పాటు మనుగడ సాగించేలా ఈ భూగ్రహాన్ని సంరక్షించే దిశగా నిరంతరం పాటుపడడాన్ని కొనసాగించుదాం’’.
ప్రకృతిని సంరక్షించడం ఒక బాధ్యతే కాక, మన సంస్కృతి, సంస్కారం నుంచి విడదీయలేని భాగం కూడా.
మధు వాతా రుతాయతే మధు క్షరన్తి సిన్ధవః
మాధ్వీర్నః సన్త్వోషధిః’’ అని పేర్కొన్నారు.
ఈ సంస్కృత సుభాషితానికి.. మన చుట్టుపక్కల గాలి ఆహ్లాదకరంగా, మనకు మేలు కలిగించేదిగా ఉండుగాక. నదులు జీవనదాయినులై, పౌష్టిక జలాలను అందించుగాక. మందులను తయారు చేయడానికి ఉపయోగించే మొక్కలు అన్ని ప్రాణులకూ ఆరోగ్యాన్నీ, సంక్షేమాన్నీ ప్రసాదించుగాక అని అర్థం.
***
(रिलीज़ आईडी: 2269326)
आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam