యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘వికసిత్ వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్-20026’ను ప్రారంభించిన మై భారత్


హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లదాఖ్‌లోని సరిహద్దు గ్రామాల్లో యువత భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యం

దేశ నలుమూలల నుంచి వచ్చే 500 మంది మై భారత్ వాలంటీర్లు

సరిహద్దు గ్రామాల్లో వారం రోజుల పాటు జరిగే సమగ్ర కార్యక్రమం వారిచే ప్రారంభం

100 సరిహద్దు గ్రామాల్లో యువత భాగస్వామ్యాన్ని పటిష్ఠం చేయడానికి ఐదు అంశాలతో నేషన్ ఫస్ట్ ఛాలెంజ్

प्रविष्टि तिथि: 03 JUN 2026 2:33PM by PIB Hyderabad

యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని యువజన వ్యవహారాల విభాగమైన మేరా యువ భారత్ (మై భారత్), వికసిత్ వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్ (వీవీవీపీ)-2026 మొదటి దశను ప్రారంభించింది.  భారత సరిహద్దు గ్రామాల్లో క్షేత్రస్థాయి భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, జాతీయ సమైక్యతను పెంపొందించడం, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా చేపట్టిన ఈ మార్గదర్శక   కార్యక్రమం రెండు దశల్లో అమలు కానుంది.

 

దేశవ్యాప్తంగా 3 లక్షలకు పైగా యువత దీనికి సంబంధించిన ఆన్‌లైన్ క్విజ్ పోటీలో పాల్గొనగా, వారి నుంచి మొత్తం 500 మంది 'మై భారత్' వాలంటీర్లను ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఎంపిక చేశారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాలంటీర్లను లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని ప్రత్యేకంగా ఎంపిక చేసిన సరిహద్దు గ్రామాల్లో రెండు దశల్లో మోహరిస్తున్నారు. మొదటి దశలో 250 మంది వాలంటీర్లు 43 గ్రామాల్లో క్షేత్రస్థాయి కార్యక్రమాల్లో పాల్గొంటుండగా... మిగిలిన 250 మంది వాలంటీర్లు ఈ నెల చివరలో 50 గ్రామాల్లో జరిగే రెండో దశ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటారు.

ఈ కార్యక్రమం సరిహద్దు గ్రామాల్లో నివసించడానికి, స్థానిక సమాజాలతో నేరుగా మమేకమవ్వడానికి యువతకు ఒక విశిష్ట అవకాశాన్ని అందిస్తుంది. గ్రామ వాసులు, పంచాయతీ రాజ్ సంస్థలు, స్థానిక పరిపాలన, భద్రతా సిబ్బందితో సంభాషించడం ద్వారా... ఈ కార్యక్రమంలో పాల్గొనే యువత దేశ సరిహద్దు ప్రాంతాల సామాజిక-ఆర్థిక వాస్తవాలు, సాంస్కృతిక వారసత్వం, అభివృద్ధి ఆకాంక్షలు, వ్యూహాత్మక ప్రాముఖ్యాన్నీ ప్రత్యక్షంగా తెలుసుకుంటారు.

సరిహద్దు అవగాహన, సాంస్కృతిక వినిమయం, సామూహిక జీవనం, పరిపాలన, సామాజిక-ఆర్థిక అంచనా, గ్రామాభివృద్ధి ప్రణాళిక, స్వచ్ఛంద సేవ, జాతీయ సమైక్యత వంటి నేపథ్య అంశాల ప్రాతిపదికన ఈ ఏడు రోజుల సమగ్ర కార్యక్రమాన్ని రూపొందించారు. స్వచ్ఛంద కార్యకర్తలు ఇంటింటి సర్వేలు చేపట్టడం, గ్రామ సభ కార్యకలాపాల్లో పాల్గొనడం, పరిశుభ్రత-పర్యావరణ ప్రచారాలకు తోడ్పడటం, గ్రామాల్లో అభివృద్ధి అవకాశాలను గుర్తించడంలో సహాయపడటం వంటి పనుల్లో పాలుపంచుకుంటారు.

 

బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని, సుస్థిర జీవనశైలి పద్ధతులను ప్రోత్సహించే దేశవ్యాప్త ప్రచారమైన 'నేషన్ ఫస్ట్ ఛాలెంజ్'ను ప్రోత్సహించడం ఈ కార్యక్రమంలోని ఒక ముఖ్యమైన భాగం. మై భారత్ వాలంటీర్లు ఈ ప్రచారంలోని ఐదు కీలక అంశాలను చురుగ్గా ప్రచారం చేస్తారు. అవి స్వదేశీ ఉత్పత్తుల వాడకం, ఆరోగ్యకరమైన వంట పద్ధతులు, ప్రజా రవాణా వినియోగం, ఇంధన పొదుపు, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, స్థానిక పర్యాటకానికి గట్టి మద్దతునివ్వడం. కమ్యూనిటీ స్థాయిలో ప్రచారం, అవగాహన కార్యక్రమాల ద్వారా... దేశం పట్ల, పర్యావరణం పట్ల బాధ్యతాయుతమైన పద్ధతులను స్వీకరించేలా ఈ యువకుల బృందం స్థానికులను ప్రోత్సహిస్తారు.

ఈ కార్యక్రమాన్ని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సహకారంతో అమలు చేస్తున్నారు. దేశ నిర్మాణ కార్యక్రమాల్లో యువత చురుకైన భాగస్వామ్యం ద్వారా 'వికసిత్ భారత్ @2047'ను నిర్మించాలనే దార్శనికతకు ఇది అనుగుణంగా ఉంది.

కార్యక్రమం విజయవంతంగా అమలు జరిగేలా చూసేందుకు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో విస్తృత సన్నాహాలు చేపట్టారు. మై భారత్, ఐటీబీపీ, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు, స్థానిక భాగస్వాములతో కూడిన సమన్వయ యంత్రాంగాలనూ ఏర్పాటు చేశారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు ప్రత్యేక కంట్రోల్ రూములు, నోడల్ అధికారులు, గ్రామ కార్యాచరణ ప్రణాళికలు, పాల్గొనేవారికి అవగాహన సదస్సులు, రవాణా ఏర్పాట్లూ చేశారు.

వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్-2026... దేశ నిర్మాణంలో యువతను క్రియాశీల భాగస్వాములుగా తీర్చిదిద్దడంలోనూ, దేశ యువతకు-దేశ సరిహద్దులోని చైతన్యవంతమైన గ్రామాలకు మధ్య ఉన్న సామాజిక, సాంస్కృతిక, అభివృద్ధి సంబంధాలను బలోపేతం చేయడంలోనూ భారత ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

***


(रिलीज़ आईडी: 2268536) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil