నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
దేశంలో నైపుణ్యాల కొరతను అధిగమించడానికి, ప్రపంచ నైపుణ్యాల కేంద్రంగా భారత్ స్థానాన్ని బలోపేతం చేయడానికి ఓ ప్రణాళికను రూపొందించే లక్ష్యంతో ప్రభుత్వం, పరిశ్రమలు, అంతర్జాతీయ నాయకులను ఒక చోట చేర్చిన ‘‘ఇండియా స్కిల్స్ యాక్సిలరేటర్ రౌండ్‌టేబుల్’’ సమావేశం
శ్రీ జయంత్ చౌదరి, డాక్టర్ సుకాంత మజుందార్, శ్రీమతి శోభనా కామినేని, శ్రీ సంజీవ్ బజాజ్ సహ అధ్యక్షులుగా భవిష్యత్తు నైపుణ్యాలపై ఉన్నత స్థాయి చర్చ
నాడు పోస్టు చేయడమైనది:
01 JUN 2026 7:58PM by PIB Hyderabad
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సహకారంతో నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ నేడు న్యూఢిల్లీలో ‘ఇండియా స్కిల్స్ యాక్సిలరేటర్’ ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. ‘‘అవగాహన నుంచి ఆచరణ వైపు: అభివృద్ధి కోసం నైపుణ్యాల కొరతను అధిగమించడం’’ ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నైపుణ్యాల కొరతను భర్తీ చేయడానికి, ప్రపంచ నైపుణ్యాల కేంద్రంగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేయడానికి అవసరమైన ప్రాధాన్యతా చర్యలపై చర్చించడానికి ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, అభివృద్ధి భాగస్వాములను ఈ సమావేశం ఒకచోట చేర్చింది.
కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత జనవరి 2026లో ప్రకటించిన ఇండియా స్కిల్స్ యాక్సిలరేటర్ కార్యక్రమాన్ని నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ గ్లోబల్ యాక్సిలరేటర్స్ నెట్‌వర్క్‌లో ఒక భాగం. మారుతున్న కార్మిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య వ్యవస్థలను మెరుగుపరచడం, నైపుణ్యాల అభివృద్ధికి కొత్త ఆర్థిక సహాయ పద్ధతులను రూపొందించడం, కృత్రిమ మేధ, ఆధునాతన తయారీ, సరఫరా వ్యవస్థలు, హరిత ఆర్థిక వ్యవస్థ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలతో యువతను సిద్ధం చేయడానికి ప్రభుత్వ, ప్రైవేటు సహకారాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమ లక్ష్యం.
ఈ ఉన్నత స్థాయి రౌండ్‌టేబుల్ సమావేశానికి కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌదరి, కేంద్ర విద్యాశాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్, అపోలో ఆసుపత్రుల కార్యనిర్వాహక అధ్యక్షురాలు శ్రీమతి శోభనా కామినేని, బజాజ్ ఫిన్‌సర్వ్ చైర్మన్, ఎంపీ శ్రీ సంజీవ్ బజాజ్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. వీరితోపాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మిరెక్ దుసెక్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు.
దేశ శ్రామిక మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్న కీలక అంశాలను గుర్తించడం, నైపుణ్యాల కొరతను తీర్చడానికి అవసరమైన ప్రాధాన్యతా చర్యలను ఖరారు చేయడం, ఇండియా స్కిల్స్ యాక్సిలరేటర్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉండే భాగస్వాముల కూటమిని బలోపేతం చేయడం వంటి విషయాలపై ప్రధానంగా చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌదరి మాట్లాడుతూ.. ‘‘సాంకేతికత, పరిశ్రమలు, మారుతున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను నిరంతరం అనుసంధానించగలిగితే.. దేశ జనాభా శక్తి ప్రపంచంలోనే అతిపెద్ద వృద్ధి కారకంగా మారుతుంది. ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు, అంతర్జాతీయ సంస్థలు కేవలం సవాళ్లపై చర్చించడానికే కాకుండా, పరిష్కారాలను కలిసి రూపొందించడానికి ఇండియా స్కిల్స్ యాక్సిలరేటర్ ఒక కొత్త సహకార నమూనాను అందిస్తుంది. దేశం వికసిత్ భారత్ 2047 వైపు పురోగమిస్తున్న తరుణంలో దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఆవిష్కరణలు, వృద్ధిని ముందుు తీసుకెళ్లగలిగే చురుకైన, భవిష్యత్తకు సిద్ధంగా ఉన్న, ప్రపంచవ్యాప్తంగా పోటీ పడగల నైపుణ్యాలను పెంపొందించడంపై మనం దృష్టి సారించాలి’’.
సమావేశాన్ని ఉద్దేశించి కేంద్ర విద్యాశాఖ ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్ మాట్లాడుతూ..‘‘ నేర్చుకోవడం, ఉపాధి అవకాశాల మధ్య మరింత లోతైన అనుసంధానంపైనే విద్య, నైపుణ్యాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సాంకేతికత మునుపెన్నడూ లేని వేగంతో పరిశ్రమలను మార్చేస్తున్న తరుణంలో మన విద్యాసంస్థలు విద్యార్థులకు కేవలం జ్ఞానాన్ని మాత్రమే కాకుండా, దానికి తగిన నైపుణ్యాలను, మారుతున్న పరిస్థితులకు అలవాటు పడే తత్వాన్ని, నిరంతరం నేర్చుకునే మానసిక స్థితిని అందించడం ఎంతో అవసరం. ఇండియా స్కిల్స్ యాక్సిలరేటర్ వంటి వేదికల ద్వారా అభివృద్ధి చెందుతున్న కొత్త రంగాల్లో మన యువతకు అవకాశాలను కల్పించే మార్గాలను మనం అందించాలి. దీని ద్వారా దేశ అభివృద్ధి ప్రస్థానంలో గొప్ప సహకారాన్ని అందించవచ్చు’’
వరల్డ్ ఎకనామిక్ ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి సాదియా జాహిదీ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచ శ్రామిక శక్తి భవిష్యత్తును తీర్చిదిద్దే బలమైన స్థితిలో భారత్ ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఆర్థిక, సాంకేతిక మార్పులకు అనుగుణంగా నైపుణ్య వ్యవస్థలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యా రంగాల భాగస్వాముల మధ్య పటిష్టమైన సహకారం అవసరం. ఈ సమన్వయాన్ని పెంపొందించడానికి, పరిశ్రమల డిమాండుకు అనుగుణంగా శ్రామిక శక్తిని అభివృద్ధి చేయడానికి, మరింత సమ్మిళిత, స్థితిస్థాపక, భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో సహాయపడటానికి ఇండియా స్కిల్స్ యాక్సిలరేటర్ కీలక వేదికగా నిలుస్తుంది”
శ్రామిక శక్తి పరివర్తన, నైపుణ్యాలకు నిధుల సమకూర్పు, అభివృద్ధి చెందుతున్న సరికొత్త సాంకేతికతలు, సమ్మిళిత వృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. ఒక వ్యవస్థీకృత ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా ప్రాధాన్యతా చర్యలను ముందుకు తీసుకెళ్తామని వాటాదారులందరూ ఉమ్మడి నిబద్ధతను ప్రకటించడంతో ఈ రౌండ్‌టేబుల్ సమావేశం ముగిసింది. ఈ చర్చల ఫలితాలు ఇండియా స్కిల్స్ యాక్సిలరేటర్ కార్యాచరణ అమలుకు దిశానిర్దేశం చేయడమే కాకుండా, ప్రపంచ అగ్రగామి నైపుణ్యాల కేంద్రంగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు అండగా నిలుస్తాయి.
ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు, అంతర్జాతీయ సంస్థలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పారిశ్రామిక రంగం నుంచి అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్, మహీంద్రా గ్రూప్, ఆర్పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, రిలయన్స్ ఫౌండేషన్, రెన్యూ, ఐబీఎం , భారత్ సీట్స్ లిమిటెడ్, రిలయెన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు పాల్గొన్నారు. వీరితో పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఫిక్కీ, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్, ఐఐటీ ఢిల్లీ-ఎఫ్ఐటీటీ, ఏఐసీటీఈ, యూజీసీ, సీబీఎస్ఈ, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఎన్సీవీఈటీ, ఎన్ఎస్డీసీ, ఎంఎస్డీఈ ప్రతినిధులు, దేశ నైపుణ్య, శ్రామిక శక్తి రంగానికి చెందిన ఇతర కీలక భాగస్వాములు కూడా ఈ చర్చల్లో పాల్గొని తమ సూచనలను పంచుకున్నారు.
ఇండియా స్కిల్స్ యాక్సిలేటర్ గురించి
వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి చెందిన గ్లోబల్ యాక్సిలేటర్ నెట్ వర్క్ లో ఇండియా స్కిల్స్ యాక్సిలరేటర్ ఒక భాగం. దీనిని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. నైపుణ్యాల కొరతను అధిగమించడం, శ్రామిక శక్తిని సన్నద్ధం చేయడం, ఉపాధి రంగంలో దేశ ఆర్థిక వృద్ధి, పోటీతత్వాన్ని పెంపొందించేందుకు భాగస్వాముల వినూత్న పరిష్కారాలను ప్రోత్సహించడం ఈ వేదిక ప్రధాన లక్ష్యం.






***
(రిలీజ్ ఐడి: 2267976)
సందర్శకుల సూచీ సంఖ్య : : 19