జల శక్తి మంత్రిత్వ శాఖ
జల రంగంలో పరిశోధన, అభివృద్ధి అంశాలపై జాతీయ వర్క్‌షాప్..
జల భద్రత సాధనకు అనుసరించాల్సిన చర్యల మార్గసూచీకి రూపకల్పన
‘మహా ఆన్ వాటర్’, భారత్-విన్ స్టార్టప్‌లకు పిలుపు..
‘జన్ సంచయ్ జన్ భాగీదారీ, క్యాచ్ ది రెయిన్’ పోర్టల్ ప్రారంభం..
ఎమ్ఓయూను కుదుర్చుకున్న జల శక్తి శాఖ, ఇస్రో
నాడు పోస్టు చేయడమైనది:
01 JUN 2026 6:54PM by PIB Hyderabad
జల రంగంలో పరిశోధన, అభివృద్ధిపై ఏర్పాటు చేసిన జాతీయ వర్క్‌షాప్‌లో ప్రభుత్వం, విద్యారంగం, పరిశోధన సంస్థలు, పరిశ్రమల రంగం, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలతో పాటు అంకుర సంస్థలతో ముడిపడిన 500 కన్నా ఎక్కువ ఆసక్తిదారులు పాల్గొన్నారు. భారత జల పరిశోధన, నూతన ఆవిష్కరణలకు సంబంధించిన విస్తారిత అనుబంధ వ్యవస్థను పటిష్టం చేయడంపై వీరు చర్చించారు. జల భద్రత, వాతావరణ మార్పులను తట్టుకోవడానికి చేయాల్సిన ఏర్పాట్లను నిర్ధారించడం లక్ష్యంగా ఈ చర్చలు సాగాయి. వర్క్‌షాప్‌లో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి శ్రీ సి.ఆర్. పాటిల్, సైన్స్, టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) డాక్టర్ జితేంద్ర సింగ్, జల శక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ రాజ్ భూషణ్ చౌదరి, అంతరిక్ష విభాగం కార్యదర్శి, ఇస్రో చైర్మన్, ఏఎన్ఆర్ఎఫ్ సీఈఓ డాక్టర్ వి. నారాయణన్, సీనియర్ సెక్రటరీలు, శాస్త్రవేత్తలు, నిపుణులు, దేశవ్యాప్త పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.
సభను ఉద్దేశించి కేంద్ర జల శక్తి శాఖ మంత్రి శ్రీ సి.ఆర్. పాటిల్ ప్రసంగిస్తూ, ‘‘నీరు మన నాగరికతకీ, అభివృద్ధికీ ప్రతీక’’ అని వర్ణించారు. నీటికి సంబంధించిన సరికొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి పరిశోధన, సాంకేతిక నూతన ఆవిష్కరణలు, ప్రజల భాగస్వామ్యం.. ఈ మూడిటి సాయంతో ముందుకు సాగవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. పరిశోధనలనీ, నూతన ఆవిష్కరణలనీ ప్రోత్సహించే దిశగా మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాల్ని ఆయన వివరిస్తూ జల రంగంలో 315 కన్నా ఎక్కువ పరిశోధన, అభివృద్ధి పథకాల్ని మొదలుపెట్టినట్లూ, వాటిలో మంత్రిత్వ శాఖ నేరుగా తోడ్పాటును అందిస్తున్న పథకాలు 113 వరకూ ఉన్నట్లూ తెలిపారు.
జల్ సంచయ్ జన్ భాగీదారీ (జేఎస్‌జేబీ) ప్రచార ఉద్యమంలో సాధించిన విజయాలను మంత్రి వివరించారు. దేశమంతటా 1.5 కోట్ల కన్నా ఎక్కువ జల సంరక్షణకు సంబంధించిన నిర్మాణాలను పూర్తి చేశారని తెలిపారు. జల్ సంచయ్ జన్ భాగీదారీ: క్యాచ్ ది రెయిన్ (జేఎస్‌జేబీ:సీటీఆర్) పోర్టల్ పేరుతో ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇది దేశమంతటికీ ఉద్దేశించిన కార్యక్రమమన్నారు. పౌరులు, పరిశ్రమలు, ప్రభుత్వేతర సంస్థలతో పాటు ప్రభుత్వ ఏజెన్సీల భాగస్వామ్యంతో సముదాయ సేవ ఆధారితంగా నీటి సంరక్షణని బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని ఆయన చెప్పారు. శాస్త్రీయ పద్ధతుల్లో నీటి నిర్వహణకీ, నీటి వనరుల స్థిరత్వానికీ ప్రోత్సాహాన్ని అందించడంలో భూ-స్థానిక (జియోస్పేషియల్) సాంకేతికతలతో పాటు భాగస్వామ్యాలు కూడా పాత్రను పోషించాల్సివుంటుందని మంత్రి స్పష్టం చేశారు
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, 2047 కల్లా ‘వికసిత్ భారత్’ను ఆవిష్కరించాలన్న భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే విద్యారంగం, పరిశ్రమ, ఎమ్ఎస్ఎమ్ఈలు, అంకుర సంస్థలను కలుపుకొని ముందుకు పోతూ ‘ఏకోన్ముఖ ప్రభుత్వం’, ‘ఏకోన్ముఖ జాతీయ విధానం’.. వీటిని అవలంబించడం ముఖ్యమన్నారు. నీటి నిర్వహణలో విజ్ఞానశాస్త్రం, సాంకేతికత పాత్ర అంతకంతకూ పెరుగుతోందంటూ, నీటికి సంబంధించిన ‘మహా ఆన్ వాటర్’ (మిషన్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఇన్ హై-ఇంపాక్ట్ ఏరియాస్ ఫర్ వాటర్)ను ప్రారంభించిన విషయాన్ని ప్రస్తావించారు. జల శక్తి శాఖ, ‘ఇస్రో’ పరస్పరం సహకరించుకోవడానికి ముందుకు రావడాన్ని స్వాగతించారు. నీటికి సంబంధించిన సవాళ్లను పరిష్కరించడంలో అంతరిక్ష ఆధారిత సేవలు (అప్లికేషన్స్) సహా ఆధునిక సాంకేతికతలు అందించే అవకాశాలకు కీలక పాత్ర ఉంటుందని ఆయన అన్నారు. గత 12 సంవత్సరాల్లో జల శక్తి మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలను ఆయన ప్రశంసించారు. జల వనరుల నిర్వహణ, వాతావరణ మార్పు వేళల్లో అందుకు దీటైన చర్యలను తీసుకోవడం, తాగునీటి భద్రత.. వీటిలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా ఒక ముఖ్య నిర్ణయంగా ‘మహా మిషన్’ను ఆవిష్కరించినట్లు వెల్లడించారు. జల రంగాన్ని దృష్టిలో పెట్టుకొని పరిశోధనల-ఆధారిత, విస్తృత స్థాయి పరిష్కారాలకు వేగాన్ని అందించడానికి ఏఎన్ఆర్ఎఫ్, జల శక్తి శాఖ ఒక సంయుక్త పరిశోధనను చేపట్టాయని కూడా డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు.
శ్రీ రాజ్ భూషణ్ చౌదరి మాట్లాడుతూ, ‘‘నీరు ఒక మౌలిక వనరు.. ఇది వ్యవసాయం, బతుకుతెరువు, ప్రజారోగ్యం, ఆర్థికాభివృద్ధి, పర్యవరణ సంబంధిత స్థిరత్వాలకు ఆధారం’’ అని స్పష్టం చేశారు. జల రంగంలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడానికి ఒక సమగ్ర దృష్టికోణాన్ని అవలంబించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశం నలు మూలలా దీర్ఘకాలిక స్థిరత్వంతో కూడిన నీటి నిర్వహణ పద్ధతుల్ని పటిష్టపరచడంలో శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతికత- ఆధారిత విధానాల రూపకల్పన, కార్యాచరణలకు తోడు ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. నూతన ఆవిష్కరణలు, ఫలితాలను రాబట్టగల విధానాలను తీసుకురావడం, జన్ భాగీదారీ.. ఇవి దీర్ఘ కాలంలో జల భద్రతను నిర్ధారించడంలోనూ, వికసిత్ భారత్ ఆశయ సాధనలోనూ కీలకం అవుతాయన్నారు.
జల వనరులు, నదీ వికాసం, గంగా నది పునరుద్ధరణ విభాగ కార్యదర్శి శ్రీ వి.ఎల్. కాంతా రావు మాట్లాడుతూ జలం ఒక వ్యూహాత్మక వనరనీ, దీని సంరక్షణకు పరిశోధనల్లో, నూతన ఆవిష్కరణల్లో నిరంతరాయంగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. తాగునీటి భద్రత, భూగర్భ జల నిర్వహణ, వరదలను ముందుగా అంచనా వేయడం, నదీజలాల సంరక్షణ, వాతావరణ మార్పులకు తగినట్లుగా ఉండే వ్యూహాలను అమలుచేసే విషయాల్లో అత్యాధునిక పరిష్కారాలను కనుగొనడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సివుందన్నారు. నిలకడతనంతో కూడిన నీటి నిర్వహణే లక్ష్యంగా సాంకేతికత-ఆధారిత పరిష్కారాల్ని అన్వేషించడానికి అంతరిక్ష విభాగం, డీఎస్టీ, ఏఎన్ఆర్ఎఫ్, సీఎస్ఐఆర్, తదితర సంస్థలు ఒకదానితో మరొకటి సహకరించుకుంటూ ముందుకుపోవడం ముఖ్యమని ఆయన అన్నారు.
అంతరిక్ష విభాగం కార్యదర్శి, ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ మాట్లాడుతూ, జల వనరుల నిర్వహణలో అంతరిక్ష సాంకేతికత, రిమోట్ సెన్సింగ్, జియోస్పేషల్ అప్లికేషన్లు పెనుమార్పులను తీసుకురాగలుగుతాయన్నారు. జల శక్తి శాఖ-ఇస్రో భాగస్వామ్యాన్ని ఆయన స్వాగతించారు. ఫలితాల-ఆధారిత జల నిర్వహణను దృఢతరంగా తీర్చిదిద్దడానికి ఉపగ్రహ-ఆధారిత పరిశీలనలను క్షేత్ర స్థాయి గణాంకాలతో ఏకీకరించాలని ఆయన స్పష్టం చేశారు.
తాగునీరు, స్వచ్ఛత విభాగం కార్యదర్శి శ్రీ అశోక్ మీనా మాట్లాడుతూ, జల్ జీవన్ మిషన్‌లో భాగంగా వాతావరణ మార్పులను ఎదుర్కొనే సామర్థ్యాన్నీ, తాగు నీటి భద్రతనీ, జల వనరుల స్థిరత్వాన్నీ బలోపేతం చేయడం కోసం పరిశోధనల పరంగానూ, సాంకేతికంగానూ సాధించిన ప్రగతిని వ్యావహారిక, క్షేత్ర స్థాయి పరిష్కారాల రూపంలోకి మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. నీటి నాణ్యతకీ, వనరుల స్థిరత్వానికీ సంబంధించి స్థానికంగా ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడానికి అంకితమైన పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కమిటీలను ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రాలనూ, కేంద్రపాలిత ప్రాంతాలనూ ఆయన కోరారు. డేటాపై ఆధారపడి నీటి నిర్వహణను చేపట్టాల్సి ఉందని చెబుతూ ఇస్రో, బీఐఎస్ఏజీ-ఎన్‌లతో మంత్రిత్వ శాఖ సహకారం గ్రామ స్థాయిలో మ్యాపింగ్, శాస్త్రీయ ప్రణాళికల ప్రక్రియల్లో సహాయకారి అవుతోందన్నారు. దీనిలో గ్రామం మొదలు జాతీయ స్థాయి వరకూ నిరంతర జల వనరుల నిర్వహణ పటిష్టమవుతుందన్నారు.
ఏఎన్ఆర్ఎఫ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ శివ్‌కుమార్ ‘మహా ఆన్ వాటర్’ (మిషన్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఇన్ హై-ఇంపాక్ట్ ఏరియాస్) ప్రాధాన్యాన్ని వివరించారు. జల రంగంలో భారత్ పరిశోధన, నూతన ఆవిష్కరణలతో ముడిపడిన విస్తారిత అనుబంధ వ్యవస్థను బలోపేతం చేయడానికి పెనుమార్పులను తీసుకురాగలిగిన కార్యక్రమంగా ఈ మిషన్‌ను ప్రవేశపెట్టారని ఆయన అన్నారు. జల వనరుల నిర్వహణ, తాగునీటి భద్రత, వాతావరణ మార్పులను ఎదుర్కొనే సామర్థ్యం, తాజా సాంకేతికతల వంటి ప్రాధాన్య రంగాల్లో అధిక ప్రభావాన్ని ప్రసరించగల పరిశోధనలను ఈ మిషన్ ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు. దీంతో పాటు, విద్యారంగ ప్రముఖులు, పరిశోధన సంస్థలు, పరిశ్రమ, అంకుర సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీల మధ్య సహకారాన్ని పెంపొందింపచేస్తుందని కూడా వివరించారు. ‘జలం విషయంలో భద్రమైన, సుస్థిర భవిష్యత్తును పొందడానికి నూతన, విస్తరణ యోగ్య పరిష్కారాలను కనుగొనే, వాటిని వేగంగా ఆచరించగల సామర్థ్యం ‘మహా ఆన్ వాటర్’ (మిషన్)కు ఉందని డాక్టర్ శివ్‌కుమార్ అన్నారు.
ప్రధాన కార్యక్రమాల ప్రారంభం.. వ్యూహాత్మక ప్రకటనలు
జల రంగంలో నూతన ఆవిష్కరణలు, పరిశోధన ఫలితాల కార్యాచరణ, సాంకేతికతను అమలుపరచడంలో వేగాన్ని పెంచాలన్న ఉద్దేశంతో ఈ వర్క్‌షాపులో అనేక వ్యూహాత్మక కార్యక్రమాలను మొదలుపెట్టారు.
‘మహా ఆన్ వాటర్’ (మిషన్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఇన్ హై-ఇంపాక్ట్ ఏరియాస్)ను సహకారం ప్రధానంగా ఉండే ఓ వేదికగా ప్రవేశపెట్టారు. మిషన్-ఆధారిత పరిశోధన, నూతన ఆవిష్కరణల ద్వారా సరికొత్త జల సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వ ఏజెన్సీలు, విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలు, పరిశ్రమ, అంకుర సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు దీనిని తీసుకువచ్చారు.
భారత్ వాటర్ ఇన్నొవేషన్ నెట్‌వర్క్ (భారత్-విన్)ను కూడా ప్రారంభించారు. ఇది అంకుర సంస్థలు, ఎమ్ఎస్ఎమ్ఈలకు ఉద్దేశించిన ఓ బహిరంగ ఆహ్వాన కార్యక్రమం. జల రంగంలో ఉత్పాదన, ప్రోటోటైప్ అభివృద్ధిని ప్రోత్సహించడం దీని ఉద్దేశం. జల సంరక్షణ, జల వినియోగ దక్షత, వనరుపరమైన స్థిరత్వం, నీటి నాణ్యత నిర్వహణ, వాతావరణ మార్పులను ఎదుర్కొనే జల ప్రణాళికలకు సంబంధించి వినూత్న పరిష్కారాలను గుర్తించడం, ప్రోత్సహించడం, విస్తరించడం కూడా ఈ కార్యక్రమం ధ్యేయాలే. నూతన ఆవిష్కర్తలు, పరిశోధన సంస్థలు, పరిశ్రమ భాగస్వాములు, ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు చివరి స్థాయి వినియోగదారుల మధ్య సహకారానికి మార్గాన్ని సుగమం చేయడం కూడా ఈ కార్యక్రమం లక్ష్యంగా ఉంది. ఆశాజనక సాంకేతికతలను అమలుపరచడంతో పాటు వాటిని వేగంగా విస్తరించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది.
ఈ వర్క్‌షాపులో జల్ సంచయ్ జన్ భాగీదారీ: క్యాచ్ ది రెయిన్ (జేఎస్సీబీ: సీటీఆర్) పేరిట ఒక జాతీయ స్థాయి భాగస్వామ్య ఉద్యమాన్ని కూడా ప్రారంభించారు. సముదాయాలు నాయకత్వం వహించే జల సంరక్షణ ప్రయత్నాలను మరింత బలపరచడం దీని ఉద్దేశం. జల్ సంచయ్ జన్ భాగీదారీ కార్యక్రమం సఫలం అయ్యే క్రమంలో ఈ వెబ్‌సైట్ పౌరుల భాగస్వామ్యాన్నీ, జ్ఞానాన్నీ పంచుకోవడానికీ, జల సంరక్షణకు చేపట్టే పనులకు సంబంధించిన కథనాల్నీ, అత్యుత్తమ పద్ధతుల్నీ దేశం అంతటా ప్రచారం చేయడానికి సహకరిస్తుంది.
అంతరిక్ష సాంకేతికత, రిమోట్ సెన్సింగ్, ఉపగ్రహ ఆధారిత పరిశీలనలు, జియోస్పేషల్ సమాచారాన్ని ఉపయోగించుకొని జల వనరుల సంబంధిత ప్రణాళిక రచన, పర్యవేక్షణలతో పాటు విధాన నిర్ణయాలను తీసుకోవడానికి ఒక అవగాహన ఒప్పందంపై జల శక్తి శాఖ, ఇస్రో సంతకాలు చేయడం కీలక ప్రగతి ప్రస్థానమని చెప్పవచ్చు. ఈ భాగస్వామ్యం శాస్త్రీయ జల నిర్వహణకు ప్రోత్సాహాన్ని అందించడంతో పాటు, మన్నికైన జల నిర్వహణ కోసం డేటా-ఆధారిత విధానాల్ని దృఢతరం చేయడానికి తోడ్పడుతుందని భావిస్తున్నారు.
జాతీయ ప్రాధాన్యాలపైనా, భావి పరిశోధన దిశలపైనా సాంకేతిక కార్యక్రమాల్లో చర్చలు
ఈ సాంకేతిక కార్యక్రమాల్లో కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలు, పరిశ్రమ, అంకుర సంస్థలు, అభివృద్ధి భాగస్వాములతో పాటు పౌర సమాజ సంస్థలను ఒక చోట సమావేశపరిచారు. ఈ సమావేశం జల రంగంలో సరికొత్త సవాళ్లు, రాబోయే కాలంలో పరిశోధనల్లో పెద్దపీట వేయాల్సిన అంశాలపై చర్చించడానికి ఒక అవకాశాన్ని అందించింది.
హిమాలయ ప్రాంత విస్తారిత అనుబంధ వ్యవస్థలు, నదీపరివాహక ప్రాంతాలు, భూగర్భ జలంపై ఆధారపడిన ప్రాంతాలు, కోస్తా తీర ప్రాంతాలు, పట్టణ కేంద్రాలు, దుర్భిక్ష బాధిత భూభాగాలు సహా దేశ వ్యాప్తంగా వివిధ జల, వాతావరణ సంబంధిత, భౌగోళిక సందర్భాలు చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. వాతావరణ మార్పు వేళల్లో దీటైన చర్యలను తీసుకోవడం, భూగర్భ జలాలు అడుగంటి పోకుండా జాగ్రత్త చర్యలను చేపట్టడం, సాగునీటి సమర్థ వినియోగం, నీటి నాణ్యతను కాపాడుకోవడం, నదుల్నీ, జలాశయాల్నీ పరిరక్షించుకోవడానికి తీసుకోవలసిన చర్యలు, వరద, అనావృష్టి పరిస్థితులను తట్టుకుని నిలిచే సామర్థ్యం, పర్యావరణ సమతౌల్య పునరుద్ధరణ, పట్టణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవడం, జియోస్పేషల్ సాంకేతికతలు, కృత్రిమ మేధ సేవల వినియోగం, నీటి నిర్వహణకు డిజిటల్ పరిష్కారాలు వంటి కీలక విషయాలపై చర్చల్లో దృష్టిని కేంద్రీకరించారు.
పరిశోధన సంస్థలకూ, అమలుపరిచే సంస్థలకూ మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి అవకాశాలు ఉన్నాయా? అనే అంశంతో పాటు, సాంకేతికత బదలాయింపు ప్రక్రియను వేగవంతం చేయడం, నూతన ఆవిష్కరణల మద్దతుతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు పోవడాన్ని ప్రోత్సహించడం, శాస్త్రీయ జ్ఞానాన్ని క్షేత్ర స్థాయిలో ప్రభావవంతంగా అమలుపరిచేందుకు అవకాశాలు ఉన్నాయా అనే అంశాలను చర్చల్లో పాల్గొన్న వారు పరిశీలించారు. జాతీయ ప్రాధాన్యాలను లెక్కలోకి తీసుకుంటూ ప్రాంతం వారీ సవాళ్లను సమర్థంగా, విస్తృత ప్రాతిపదిక, స్థానిక అనుకూలతలతో కూడిన పరిష్కారాలను కనుగొనడంపై దృష్టిని కేంద్రీకరించారు.
ప్రభుత్వం, విద్యారంగం, పరిశ్రమ, సముదాయాల మధ్య మరింత ఎక్కువ సమన్వయం ఎంతైనా అవసరమని చర్చల్లో స్పష్టం చేశారు. ఈ విధమైన సమన్వయాన్ని ఏర్పరిచినప్పుడు మెరుగైన జల భద్రత, వాతావరణ మార్పు వేళల్లో దీటైన చర్యలు తీసుకోవడం, వనరులను దీర్ఘకాలిక ప్రాతిపదికన నిర్వహించడంతో పాటు ఫలితాల ఆధారిత విధాన రూపకల్పనకు పరిశోధన ఫలితాలు నేరుగా దోహదపడతాయని తేల్చారు.
సరికొత్తగా తెర మీదకు వస్తున్న సాంకేతికతలు, అత్యుత్తమ పద్ధతులతో ఎగ్జిబిషన్ నిర్వహణ
జల రంగంలో వినూత్న సాంకేతికతలు, పరిశోధన ఫలితాలు, జియోస్పేషల్ అప్లికేషన్స్, డిజిటల్ ప్లాట్‌ఫారాలు, అంకుర సంస్థ-ఆధారిత పరిష్కారాలు, క్షేత్ర స్థాయిలో చేపట్టిన చర్యలు
ఫలప్రదమైన తీరుతెన్నులను కళ్లకు కట్టిన ఒక ఎగ్జిబిషన్‌ను కూడా వర్క్‌షాప్‌లో భాగంగా ప్రారంభించారు. పరిశోధకులు, టెక్నాలజీ డెవలపర్లు, విధాన రూపకర్తలు, పరిశ్రమ ప్రతినిధులు, చివరి స్థాయి వినియోగదారుల మధ్య మాటామంతీకి ఒక వేదికను ఈ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంచారు. ఈ వేదికను .. జ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికీ, సహకారం, సేవల విస్తరణకున్న అవకాశాలను గుర్తించడానికీ మార్గాన్ని సుగమం చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు.
గత 12 సంవత్సరాల్లో జల రంగంలో పరిశోధనలు, నూతన ఆవిష్కరణలకు సంబంధించిన విజయాలనీ, ఫలితాలనీ వివరించే ఒక లఘు చిత్రాన్ని కూడా ఈ సందర్భంగా ప్రదర్శించారు. భూగర్భజల నిర్వహణ, వాతావరణ మార్పు వేళల్లో దీటైన చర్యలు తీసుకోవడం, సాగునీటిని తగినంతగా అందించగలగడం, రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్లు, జల నిర్వహణ రంగంలో నమోదైన ప్రగతిని ఈ లఘు చిత్రంలో వివరించారు.
ఈ వర్క్‌షాపు నిర్వహణతో.. జాతీయ ప్రాధాన్యాలను దృష్టిలో పెట్టుకొని అవసరమైన చర్యలను తీసుకోవడానికి ప్రభుత్వానికీ, సైన్సుకీ, పరిశ్రమకీ, సమాజానికీ సంబంధించిన శక్తుల్ని ఉమ్మడిగా ఉపయోగించాలన్న గౌరవ ప్రధానమంత్రి దార్శనికతను సాకారం చేసే దిశలో కీలక అడుగును వేసినట్లయింది. విధాన రూపకర్తలు, పరిశోధకులు, అంకుర సంస్థల, ఎమ్ఎస్ఎమ్ఈలు, పరిశ్రమ ప్రముఖులు, సమాజంలో ఆసక్తిదారు వర్గాలను ఒక చోటులో సమావేశపరిచి ఈ వర్క్‌షాపు మరింత ఎక్కువ ఏకీకృత, సహకారపూర్వక, పరిశోధనల-ఆధారిత జల రంగ విస్తారిత అనుబంధ వ్యవస్థకు పునాది వేసింది.
చర్చలను ముగించిన తరువాత చేసిన సిఫార్సులతో భవిష్యత్తులో జల పరిశోధన, నూతన ఆవిష్కరణల్లో పెట్టే పెట్టుబడులకు ఒక దిశ లభించడం, వేర్వేరు రంగాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, పరిశోధనల ఫలితాల్ని ఆచరణీయ పరిష్కారాల రూపంలోకి మార్చే ప్రక్రియలు వేగం పుంజుకోవడంతో పాటు దీర్ఘకాలిక జల నిర్వహణకు ఆధునిక సాంకేతికతల్ని అనుసరించడంలోనూ ప్రోత్సాహం లభిస్తుందని ఆశిస్తున్నారు. వర్క్‌షాపు అందించే ఫలితాలతో అత్యాధునిక సాంకేతికతల ఉపయోగం పెరుగనుంది. జల భద్రత, వాతావరణ మార్పు వేళల్లో దీటైన చర్యలు తీసుకోగలగడంతో పాటు 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో తోడ్పాటు లభించనుంది.




***
(రిలీజ్ ఐడి: 2267968)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15