గనుల మంత్రిత్వ శాఖ
‘శాస్త్ర, సాంకేతికత–ప్రిజమ్’ కార్యక్రమం కింద ఇంటరాక్టివ్ కార్యశాల, సాంకేతిక మూల్యాంకన సమావేశాలను నిర్వహిస్తున్న గనుల మంత్రిత్వ శాఖ
పోటీ-ఆధారిత విధాన ప్రణాళిక ద్వారా కీలక ఖనిజాల వ్యాపార కార్యకలాపాల నిర్వహణ సంబంధిత అంకుర సంస్థలకు మద్దతునిచ్చే వ్యవస్థల బలోపేతం కోసం ఇంటరాక్టివ్ సమావేశాలు
प्रविष्टि तिथि:
30 MAY 2026 4:49PM by PIB Hyderabad
జవహర్‌లాల్ నెహ్రూ అల్యూమినియం రీసెర్చ్ డెవలప్‌మెంట్ అండ్ డిజైన్ సెంటర్ (జేఎన్ఏఆర్‌డీడీసీ), నాగ్‌పూర్ సహకారంతో శాస్త్ర,సాంకేతికత-ప్రిజమ్ 5.0 (అంకుర సంస్థలు, ఎమ్ఎస్ఎమ్ఈలలో పరిశోధన-ఆవిష్కరణల ప్రోత్సాహం) కింద గనుల మంత్రిత్వ శాఖ ఈ నెల 29-30 తేదీల్లో రెండు రోజుల ఇంటరాక్టివ్ కార్యశాల, సాంకేతిక మూల్యాంకన సమావేశాలను జేఎన్ఏఆర్‌డీడీసీ, నాగ్‌పూర్ వేదికగా విజయవంతంగా నిర్వహించింది. అంకుర సంస్థలు, ఎమ్ఎస్ఎమ్ఈలకు చెందిన ఆవిష్కర్తలు, పరిశ్రమ ప్రతినిధులు, కీలక ఖనిజాల రంగంలోని నిపుణులను ఒకచోట చేర్చే ఉమ్మడి వేదికను ఈ కార్యశాల అందించింది. గనుల మంత్రిత్వ శాఖ శాస్త్ర-సాంకేతికత కార్యక్రమంలోని మూడు భాగాల్లో శాస్త్ర, సాంకేతికత-ప్రిజమ్ పథకం ఒకటి. శాస్త్ర, సాంకేతికత-ప్రిజమ్ 5.0 కింద కీలక ఖనిజాల వ్యాపార నిర్వహణ కార్యకలాపాల్లో అన్వేషణ, వెలికితీత, ప్రాసెసింగ్, రీసైక్లింగ్, విలువ జోడింపు సాంకేతికతలు సహా వినూత్న ప్రతిపాదనలను గనుల మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది.
జేఎన్ఏఆర్‌డీడీసీ డైరెక్టర్ డాక్టర్ అనుపమ్ అగ్నిహోత్రి, గనుల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ శ్రీ సుఖ్‌దీప్ సింగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ సుఖ్‌దీప్ సింగ్ మాట్లాడుతూ... కీలక ఖనిజాల్లో స్వయం-సమృద్ధిని ప్రోత్సహించడానికి ఆవిష్కరణలు, సాంకేతికత అభివృద్ధిల ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించారు. అంకురసంస్థల మధ్య సహకారాన్ని, పోటీని ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమం సాంప్రదాయిక మూల్యాంకనం నుంచి ఒక ఇంటరాక్టివ్ కార్యశాలగా ఎలా మారిందో ఆయన వివరించారు.
శాస్త్ర, సాంకేతిక - ప్రిజమ్ పథకం కింద కీలక ఖనిజాల అన్వేషణ, ప్రాసెసింగ్, రీసైక్లింగ్ మొదలైన రంగాల్లో నిమగ్నమైన అంకుర సంస్థలకు అనుకూల వ్యవస్థను ప్రోత్సహించేందుకు, మూల్యాంకన ప్రక్రియతో పాటు ఒక ఇంటరాక్టివ్ కార్యశాలనూ మొదటిసారిగా నిర్వహించారు. పోటీ ఆధారిత విధానం ద్వారా అంకురసంస్థలు, ఎమ్ఎస్ఎమ్ఈలు, విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం, నిపుణులతో సంప్రదింపులు, నిర్మాణాత్మక అభిప్రాయాలు-అనుభవాలను పంచుకునే సంప్రదాయాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఈ కార్యశాలలో సీ-మెట్, డీఎంఆర్ఎల్, సీఎస్ఐఆర్-ఐఎంఎంటీ, సీఎస్ఐఆర్-ఎన్‌జీఆర్ఐ, సీఎస్ఐఆర్-ఎన్ఈఈఆర్ఐ మొదలైన సంస్థల నిపుణులు దరఖాస్తుదారులతో తమ సాంకేతిక సలహాలను పంచుకోవడంతో పాటు, వారికి అవసరమైన సహాయం అందించారు.
కీలక ఖనిజాల రంగంలో ఆశాజనకమైన సాంకేతికతలను గుర్తించడానికి ఆవిష్కరణ సవాళ్లు, పోటీ ఆధారిత మూల్యాంకన సమావేశాలను నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా అంకురసంస్థలు, ఎమ్ఎస్ఎమ్ఈలు తమ ఆవిష్కరణలను సాంకేతిక మూల్యాంకన కమిటీ (టీఈసీ) నిపుణుల ముందు ప్రదర్శించి, విలువైన సాంకేతిక అభిప్రాయాన్ని పొందేందుకు వీలు కలిగింది.
సమర్థ సాంకేతిక మూల్యాంకనం, థీమాటిక్ పోటీ కోసం... కీలక ఖనిజాల వ్యాపార కార్యకలాపాలను కవర్ చేస్తూ 31 ప్రతిపాదనలను ఏడు ప్రత్యేక సమూహాలుగా వర్గీకరించారు. ఈ సమూహాల్లో వ్యర్థాల ప్రవాహాలు, పారిశ్రామిక అవశేషాల నుంచి కీలక ఖనిజాల పునరుద్ధరణ, అన్వేషణ సాంకేతికతలు, వెలికితీత, వేరు చేయు ప్రక్రియలు, శుద్ధి-శుభ్రపరచడం, విలువ జోడించిన లోహాలు, మిశ్రమాలు, ప్రక్రియ పరికరాల అభివృద్ధి వంటి అంశాలు ఉన్నాయి. ఈ సమూహ-ఆధారిత విధానం... ఒకే రకమైన సాంకేతిక రంగాల్లో పనిచేస్తున్న ఆవిష్కర్తల మధ్య కేంద్రీకృత అంచనా, నిపుణుల మార్గదర్శకత్వం, అర్థవంతమైన పోటీకి వీలు కల్పించింది.
రెండో రోజులోని ముఖ్యాంశాల్లో ఒకటి విజయ గాథల సమావేశం. ఇందులో భాగంగా, పూర్వపు ప్రిజమ్ లబ్ధిదారులైన అశ్విని రేర్ ఎర్త్ ప్రైవేట్ లిమిటెడ్ (పూణే)... పాలిప్రోటిక్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (వడోదర)... సెల్ఆర్క్ పవర్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ (కటక్)... రెలిరా బ్లాస్ట్‌టెక్ ఎల్ఎల్‌పీ (నాగ్‌పూర్) సంస్థలు... ఈ పథకం కింద తమ పారిశ్రామిక ప్రయాణాలను, అనుభవాలను పంచుకున్నాయి. ప్రిజమ్ కార్యక్రమం కింద లభించిన మద్దతు... సాంకేతిక అభివృద్ధి, పారిశ్రామికీకరణ, పారిశ్రామిక భాగస్వామ్యాలను వేగవంతం చేయడంలో వారికి ఎలా సహాయపడిందో ఈ సమావేశంలో ప్రముఖంగా ప్రస్తావించారు. వారి అనుభవాలు, పాల్గొంటున్న అంకురసంస్థలు, ఎమ్ఎస్ఎమ్ఈలకు విలువైన సూచనలను, స్ఫూర్తినీ అందించాయి. తద్వారా, కీలక ఖనిజాల రంగంలో ఆవిష్కరణల ఆధారిత మద్దతు పరివర్తనాత్మక ప్రభావాన్ని అవి ప్రదర్శించాయి.
***
(रिलीज़ आईडी: 2267169)
आगंतुक पटल : 42