బొగ్గు మంత్రిత్వ శాఖ
మే 28న న్యూఢిల్లీలో ఉపరితల బొగ్గు, లిగ్నైట్ వాయువీకరణ ప్రాజెక్టులపై బొగ్గు మంత్రిత్వ శాఖ రోడ్‌షో
నాడు పోస్టు చేయడమైనది:
27 MAY 2026 4:43PM by PIB Hyderabad
రూ. 37,500 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రారంభించిన ఉపరితల బొగ్గు, లిగ్నైట్ వాయువీకరణ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకంపై రేపు ప్రత్యేక రోడ్‌షో నిర్వహించేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. దేశంలోని విస్తారమైన బొగ్గు, లిగ్నైట్ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి, బొగ్గును వాయువుగా మార్చే ప్రక్రియను స్వచ్ఛమైన, పర్యావరణహిత మార్గంగా ప్రోత్సహించే దిశగా ఈ ప్రాజెక్టు కీలక చర్యగా నిలవనుంది.
ఈ కార్యక్రమానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డితో పాటు కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. వీరితో పాటు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్, అదనపు కార్యదర్శి శ్రీ సనోజ్ కుమార్ ఝా, ఇతర మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
దేశంలో బొగ్గు గ్యాసిఫికేషన్ రంగాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేయాలనే మంత్రిత్వ శాఖ నిరంతర ప్రయత్నాల్లో భాగంగా ఈ రోడ్‌షోను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విధాన నిర్ణేతలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులు, ఆర్థిక సంస్థలు, ఇతర కీలక భాగస్వాములందరూ ఒకే వేదికపైకి రానున్నారు. దేశంలో బొగ్గు వాయువు ఉత్పత్తి రంగంలో పుట్టుకొస్తున్న సరికొత్త అవకాశాలు, భాగస్వామ్యాలు, భవిష్యత్తు కార్యాచరణపై వీరంతా సుదీర్ఘంగా చర్చించనున్నారు.
2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గును వాయువుగా మార్చాలనే జాతీయ లక్ష్యాన్ని సాధించే దిశగా ఈ పథకం కీలకంగా వ్యవహరించనుంది. ఇది దేశ ఇంధన భద్రతను మరింత బలోపేతం చేయడమే కాకుండా ఎల్ఎన్జీ, యూరియా, అమ్మోనియా, మిథనాల్ వంటి కీలక పదార్థాల దిగుమతి కోసం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని భావిస్తున్నారు.
ఈ పథకం ద్వారా సుమారు రూ. 2.5 నుంచి 3 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. దేశంలోని బొగ్గు నిక్షేప ప్రాంతాల్లో చేపట్టబోయే సుమారు 25 ప్రాజెక్టుల ద్వారా సుమారు 50,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. దాదాపు 75 మిలియన్ టన్నుల బొగ్గు, లిగ్నైట్ను వినియోగించడం ద్వారా జీఎస్టీ, ఇతర పన్నుల ద్వారా లభించే అదనపు అనుబంధ ఆదాయంతో పాటు, ఏటా దాదాపు రూ. 6,300 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా.
2021లో ప్రారంభించిన జాతీయ బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్, 2024 జనవరిలో ఆమోదించిన రూ. 8,500 కోట్ల బొగ్గు గ్యాసిఫికేషన్ పథకాలకు కొనసాగింపుగా ఈ కొత్త పథకాన్ని తీసుకువచ్చారు. ఇప్పటికే పాత పథకం కింద కూ. 6,233 కోట్ల ప్రోత్సాహకాలతో ఎనిమిది ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. ఇప్పుడు తీసుకొచ్చిన ఈ కొత్త పథకం దేశంలో బొగ్గు వాయువీకరణ కార్యక్రమాలకు ప్రభుత్వ మద్దతును, నిధులను భారీగా విస్తరిస్తుంది.
మన దేశంలో దొరికే బొగ్గు, లిగ్నైట్లను సింథసిస్ వాయువు, మిథనాల్, అమ్మోనియా, సింథటిక్ సహజ వాయువు, పర్యావరణహిత ఇంధనాలు, రసాయనాల తయారీకి అవసరమైన ముడి పదార్థాలుగా మార్చడానికి ఈ బొగ్గు వాయువీకరణ ఒక అద్భుతమైన మార్గంగా మారుతోంది. ఈ కార్యక్రమం ద్వారా దేశంలో పారిశ్రామిక వృద్ధికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయని, వనరుల వాడకాన్ని పెంచడంతోపాటు దేశీయ దీర్ఘకాలిక ఇంధన అవసరాలకు ఎంతో మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు.
తాజాగా ప్రభుత్వం ఆమోదించిన ఈ పథకం ద్వారా రాబోయే కొత్త అవకాశాల గురించి చర్చించడానికి, ఉపరితల బొగ్గు, లిగ్నైట్ వాయువీకరణ ప్రాజెక్టుల అమలును వేగవంతం చేసే మార్గాలను అన్వేషించడానికి ఈ సదస్సు సంబంధిత భాగస్వాములందరికీ ఒక మంచి వేదికను అందిస్తుంది. పర్యావరణానికి మేలు చేసే స్వచ్ఛమైన బొగ్గు సాంకేతికతలను ప్రోత్సహించడం, దేశ ఇంధన భద్రతను పెంచడం, ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేయడంపై కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిరంతర నిబద్ధతను ఈ కార్యక్రమం స్పష్టం చేస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2266285)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5