బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎస్ఈసీఎల్ కార్యకలాపాలను సమీక్షించిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీశ్ చంద్ర దుబే.. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రితో భేటీ


మౌలిక సదుపాయాల కల్పనకు, ఆసుపత్రి నిర్వహణకి ఉద్దేశించిన డిజిటల్ పోర్టళ్ల ప్రారంభం..
ఒక రోజు పర్యటనలో ఆధునిక 5-పార్ట్ హెమటాలజీ అనలైజర్ యూనిట్ కూ శ్రీకారం

నాడు పోస్టు చేయడమైనది: 27 MAY 2026 10:51AM by PIB Hyderabad

సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్‌స్ (ఎస్ఈసీఎల్)ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీశ్ చంద్ర దుబే సందర్శించారు. కంపెనీ పనితీరును, మౌలిక సదుపాయాల కల్పనతో ముడిపడిన కార్యక్రమాలతో పాటు భావి అభివృద్ధి ప్రణాళికలను మంత్రి సమీక్షించారు. మంత్రి ఒక రోజు పర్యటనలో భాగంగా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయ్‌తోనూ సమావేశమయ్యారు. రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆధునిక వస్తు రవాణా వ్యవస్థ అనుసంధానం, ఇంధన భద్రతలతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన అంశాలపై శ్రీ సతీశ్ చంద్ర దుబే, శ్రీ విష్ణు దేవ్ సాయ్‌ చర్చించారు.


కీలక అభివృద్ధి ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడం, కార్యకలాపాల నిర్వహణలో సౌలభ్యాన్ని పెంచడం, బొగ్గు ఉత్పాదక ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధితో పాటు ఉపాధికల్పన అవకాశాల్ని కల్పించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై ఈ సందర్భంగా ప్రధానంగా చర్చించారు. బొగ్గు రంగం అభివృద్ధికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషిని మంత్రి ప్రశంసించారు. సహకారాత్మక విధానాన్ని అనుసరిస్తే జాతీయ ఇంధన భద్రతకు రాష్ట్రం అందిస్తున్న తోడ్పాటు ఇప్పటి కన్న ఎక్కువ పటిష్ఠంగా మారగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

 


ఎస్ఈసీఎల్ ప్రధాన కేంద్రాన్ని మంత్రి శ్రీ సతీశ్ చంద్ర దుబే దర్శించి, సమగ్ర సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. బొగ్గు ఉత్పత్తి, పంపిణీ, నాణ్యత నిర్వహణ, భద్రత, డిజిటలీకరణ కార్యక్రమాలు, పర్యావరణ స్థిరత్వాన్ని పరిరక్షించే దిశగా చేపడుతున్న చర్యలు, బొగ్గును మండించడానికి అనువైన గ్యాసుగా మార్చే ప్రాజెక్టులు, గనుల మూసివేతకు సంబంధించిన కార్యకలాపాలు, సీఎస్ఆర్ కార్యక్రమాలతో పాటు రాబోయే కాలంలో కంపెనీ అమలుచేయదలుస్తున్న ప్రణాళికలను ఈ సమావేశంలో సమీక్షించారు. ఎస్ఈసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు శ్రీ హరీశ్ దుహాన్, కార్యకలాపాల డైరెక్టర్లు, ముఖ్య నిఘా అధికారి, బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులతో పాటు ఎస్ఈసీఎల్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

 


గనుల తవ్వకానికి సంబంధించిన కార్యకలాపాల్లో సురక్షితమైన, మన్నికైన  పద్ధతుల్ని, ఆధునిక సాంకేతికతల్ని అనుసరించడంతో పాటు కార్యకలాపాల్లో సామర్థ్యాన్ని పెంచడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. భారత్ ఇంధన భద్రతను పటిష్ఠపరచడంలో ఎస్ఈసీఎల్ కీలక పాత్రను పోషిస్తోందని మంత్రి అన్నారు. ఉత్పత్తి, నాణ్యత విషయంలో హామీ, భద్రత ప్రమాణాలు.. ఈ రంగాల్లో కంపెనీ కృషిని ఆయన ప్రశంసించారు.  బొగ్గు గని ప్రాంతాల వద్ద నివాసముండే ప్రజల సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమమే ప్రధానంగా సీఎస్ఆర్ కార్యక్రమాలను అమలు చేయాలని సూచించారు.
ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో, కోల్ ఇండియా నిర్దేశించుకున్న 100  మిలియన్ టన్నుల మొత్తం ఉత్పత్తి లక్ష్యానికి చేరుకోవడంలో ఎస్ఈసీఎల్ 26.86 మిలియన్ టన్నుల అత్యధిక తోడ్పాటును అందించిందని ఎస్ఈసీఎల్ సీఎమ్‌డీ శ్రీ హరీశ్ దుహాన్ వెల్లడించారు. దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను పూర్తి చేయడంలో బొగ్గు శాఖ మార్గదర్శకత్వంలో ఎస్ఈసీఎల్ నిబద్ధతతో పనిచేస్తోందని ఆయన పునరుద్ఘాటించారు.


డిజిటలీకరణ దిశగా మార్పు కోసం ఎస్ఈసీఎల్ చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా ఈ-డీఏడీఏఎస్ (డిజైన్ అండ్ డ్రాయింగ్స్ అప్రూవల్) పోర్టల్‌తో పాటు ఆసుపత్రి నిర్వహణ, సమాచార వ్యవస్థ (హెచ్ఎమ్ఐఎస్) పోర్టల్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. ఈ-డీఏడీఏఎస్ పోర్టల్ ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించిన ఇంజినీరింగ్ డిజైన్లు, డ్రాయింగులను ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా పరీక్షించి, పర్యవేక్షిస్తూ, ఆమోదాన్ని తెలియజేసేందుకు మార్గాన్ని సుగమం చేస్తుంది. ఫలితంగా పారదర్శకత్వంలో, పర్యవేక్షణలో, అనుకున్న కాలానికి అమలు చేయగలగడంలో మెరుగుదల చోటుచేసుకోనుంది. హెచ్ఎమ్ఐఎస్ పోర్టల్‌.. రోగి రికార్డులను డిజిటల్ రూపంలోకి మార్పు చేయడం ద్వారానూ,  ఆసుపత్రి నిర్వహణ వ్యవస్థలను మెరుగుపరచడం ద్వారానూ ఎస్ఈసీఎల్‌కు చెందిన ఆసుపత్రుల్లో ఆరోగ్యసంరక్షణ సేవల లభ్యతను బలోపేతం చేయనుంది.

 


శ్రీ దుబే తన పర్యటనలో బిలాస్‌పూర్‌లోని ఇందిరా విహార్ ఆరోగ్య కేంద్రంలో అత్యాధునిక 5-పార్ట్ హెమటాలజీ అనలైజర్ యూనిటును ప్రారంభించారు. ఆధునిక ఆటోమేటెడ్ పరీక్షా సదుపాయాలను ఈ యంత్రానికి జతపరిచారు. ఈ యంత్రం రక్త విశ్లేషణను వేగవంతంగా, ఇదివరకటితో పోలిస్తే మరింత ఖచ్చితమైందిగా తీర్చిదిద్దడమే కాకుండా ఆరోగ్యసంరక్షణ సేవల్లో రోగనిర్ధారణ సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఈ కేంద్రంలో ఆరోగ్యసంరక్షణ సదుపాయాలను కూడా మంత్రి  సమీక్షించారు. నాణ్యతతో కూడిన ఆరోగ్యసంరక్షణ సేవల్ని అందించే, వైద్య సంబంధిత మౌలిక సదుపాయాలను పటిష్ఠపరిచే దిశగా ఎస్ఈసీఎల్ చేస్తున్న ప్రయత్నాల్ని ఆయన ప్రశంసించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2265845) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil