కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బిఎస్ఎన్ఎల్ రాబడి గత రెండేళ్లలో రూ. 21,000 కోట్ల నుంచి రూ. 25,000 కోట్లకు పెరిగింది, ఇది 20-25% ఆరోగ్యకరమైన వృద్ధి: కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని

బిఎస్ఎన్ఎల్ అద్భుతమైన పునరుద్ధరణ: స్వదేశీ 4G సాంకేతికత విజయం, రాబడిలో భారీ వృద్ధి మరియు లాస్ట్-మైల్ కనెక్టివిటీతో 'వికసిత భారత్' కు బలమైన ఊతం

మారుమూల ప్రాంతాలలో తీవ్రవాదంపై పోరాటానికి బిఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ ఎంతో తోడ్పడుతోంది: డాక్టర్ పెమ్మసాని

प्रविष्टि तिथि: 25 MAY 2026 4:25PM by PIB Vijayawada

కేంద్ర సమాచార మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని 'డీడీ ఇండియా' ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బిఎస్ఎన్ఎల్ సాధించిన అద్భుతమైన విజయాల గురించి సవివరంగా మాట్లాడారు.

ఒకప్పుడు నష్టాల్లో నడిచిన ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో అద్భుత పునరుద్ధరణ సాధిస్తుందన్నారు. కేవలం రెండేళ్లలోనే దేశ డిజిటల్ విప్లవంలో, జాతీయ అభివృద్ధిలో ఒక కీలకమైన శక్తిగా అవతరిస్తుందని డాక్టర్ పెమ్మసాని అన్నారు. ఈ మార్పు ఎంతో సవాలుతో కూడుకున్నదని, అదే సమయంలో తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని పెమ్మసాని అన్నారు. సంస్థాగత పని సంస్కృతి, టవర్ల పనితీరు, పాతబడిపోయిన మౌలిక సదుపాయాల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించడం ద్వారానే ఈ మార్పు సాధ్యమైందని ఆయన తెలియజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ, "మేము ఈ పునరుద్ధరణ ప్రక్రియను వ్యవస్థాగత పట్టుదలతో, ప్రైవేట్ రంగానికి ధీటుగా చేపట్టాము. దీని ఫలితాలు ఇప్పుడు బలమైన ఆర్థిక స్థితి, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం, దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలకు సైతం కనెక్టివిటీ చేరుకోవడం రూపంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి" అని అన్నారు.

బిఎస్ఎన్ఎల్ సాధించిన ఆర్థికపరమైన మలుపు ఎంతో అద్భుతంగా ఉందన్న ఆయన.. సంస్థ రాబడి గత రెండేళ్లలో రూ. 21,000 కోట్ల నుంచి రూ. 25,000 కోట్లకు పెరిగిందన్నారు. ఇది 20-25% ఆరోగ్యకరమైన వృద్ధిని సూచిస్తోందని వివరించారు. మరీ ముఖ్యంగా, సంస్థ నిర్వహణ లాభం (EBITDA) కేవలం రూ. 50 కోట్ల నుంచి ఏకంగా రూ. 7,000 కోట్లకు పెరగడం.. సంస్థ మెరుగైన నిర్వహణ సామర్థ్యాన్ని, లాభాల బాటను స్పష్టం చేస్తోందని అన్నారు.

ఈ విజయాల వెనుక ఉన్న వ్యూహాత్మక విధానాన్ని డాక్టర్ పెమ్మసాని వివరించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో టవర్ల అప్‌టైమ్ (పనిచేసే సమయం) కేవలం 75% మాత్రమే ఉండేదని గుర్తుచేశారు. "మేము దీనిని 95% కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేశాం. ఇందుకోసం దేశవ్యాప్తంగా 50,000 టవర్లలో పాత బ్యాటరీలను మార్చాము, పవర్ ప్లాంట్లను అప్‌గ్రేడ్ చేశాము మరియు పాత కేబుళ్లను పూర్తిగా తొలగించాము. ఆ తర్వాత ప్రతి సర్కిల్, రాష్ట్ర స్థాయిలో ఎంటర్‌ప్రైజ్ బిజినెస్, కొత్త మొబైల్ కనెక్షన్ల కోసం నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించాము. నిరంతర పర్యవేక్షణ, జవాబుదారీతనం మాత్రమే ఈ ప్రయత్నంలో కీలకమైనవిగా నిలిచాయి" అని తెలిపారు.

కేవలం ఒక సంవత్సర కాలంలోనే స్వదేశీ 4G సాంకేతికతను దేశవ్యాప్తంగా వేగంగా విస్తరించడం తాము సాధించిన, గర్వించదగ్గ మైలురాయి అని కేంద్ర సహాయ మంత్రి అన్నారు. "మేము ఒకే సంవత్సరంలో లక్ష టవర్లపై స్వదేశీ 4G సాంకేతికతను విజయవంతంగా అందుబాటులోకి తెచ్చాము, ఇప్పుడు దీనిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాము. దీనితో, ప్రపంచంలోనే ఇంతటి క్లిష్టమైన స్వదేశీ 4G సాంకేతికతను సొంతంగా అభివృద్ధి చేసిన 5వ దేశంగా భారతదేశం అవతరించింది" అని ఆయన ప్రకటించారు.

సంస్థపై ప్రజల విశ్వాసాన్ని తిరిగి పెంపొందించే కీలకమైన అంశంపై మంత్రి ఆచరణాత్మకంగా, ఆశాజనకంగా మాట్లాడారు. "విశ్వాసం అనేది ఒక రాత్రిలోనే తిరిగి రాదని మాకు తెలుసు. ప్రస్తుతం మా టారిఫ్‌లు ప్రైవేట్ ఆపరేటర్ల కంటే చాలా చౌకగా ఉన్నాయి. ప్రజలు మా సేవల నాణ్యతను స్వయంగా పరీక్షించడానికి వీలుగా ఇండియా పోస్ట్ ద్వారా కేవలం ఒక రూపాయికే సిమ్ కార్డులను అందిస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ ఉద్యోగుల ద్వారా బిఎస్ఎన్ఎల్ మెరుగైన సేవలపై ఇంటింటికీ అవగాహన కల్పించడానికి ఇండియా పోస్ట్‌తో కలిసి పనిచేస్తున్నాము. బిఎస్ఎన్ఎల్ మాత్రమే నమ్మకమైన ప్రత్యామ్నాయంగా ఉన్న గ్రామాల్లోని ప్రజలు ఖచ్చితంగా ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలి" అని కోరారు.

బిఎస్ఎన్ఎల్ సాధించిన అత్యంత ప్రభావవంతమైన ఫలితాలు మారుమూల, గిరిజన ప్రాంతాలలో స్పష్టంగా కనిపిస్తున్నాయని డాక్టర్ పెమ్మసాని ప్రముఖంగా ప్రస్తావించారు. గతంలో భౌగోళిక ఇబ్బందులు, సాంకేతిక-వాణిజ్య సవాళ్లు లేదా వామపక్ష తీవ్రవాద ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా దాదాపు 35,000 గ్రామాలకు సరైన కనెక్టివిటీ లేదన్నారు. "ఎంతటి మారుమూల ప్రాంతమైనా సరే, దేశంలోని ప్రతి గ్రామాన్ని అనుసంధానించాలనేది ప్రధానమంత్రి మోదీ దృఢమైన సంకల్పం. మేము ఈ ప్రగతిని ప్రతి వారం పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటికే ఈ గ్రామాలను కవర్ చేస్తూ 25,000 టవర్లను ఏర్పాటు చేశాం, మిగిలిన 10,000 టవర్ల నిర్మాణ పనులు కూడా అత్యంత వేగంగా జరుగుతున్నాయి" అని మంత్రి తెలిపారు.

ఈ డిజిటల్ కనెక్టివిటీ జాతీయ భద్రతకు, సామాజిక స్థిరత్వానికి ఏ విధంగా ప్రత్యక్షంగా దోహదపడుతుందో ఆయన వివరించారు. ఛత్తీస్‌గఢ్ లోని నారాయణపూర్ వంటి మారుమూల ప్రాంతాలలో బిఎస్ఎన్ఎల్ టవర్లు అందుబాటులోకి రావడం వల్ల స్థానిక ప్రజలు పోలీసులను, అధికారులను అత్యవసర సమయాల్లో త్వరగా సంప్రదించగలుగుతున్నారని పేర్కొన్నారు. ఈ రకమైన డిజిటల్ సాధికారత వామపక్ష తీవ్రవాదం తగ్గుముఖం పట్టడానికి ఎంతగానో సహాయపడుతోందని; ఈ ప్రాంతాలకు కనెక్టివిటీ చేరిన వెంటనే అభివృద్ధి వేగవంతం అవుతుందని, ఫలితంగా తీవ్రవాదం అంతరిస్తుందని స్పష్టం చేశారు.

బిఎస్ఎన్ఎల్ ప్రయత్నాలకు అదనపు బలాన్ని ఇస్తూ ప్రతిష్టాత్మకమైన 'భారత్‌నెట్' ప్రాజెక్ట్ ముందంజలో ఉందన్నారు. "ప్రతి గ్రామ పంచాయితీకి హై-స్పీడ్ ఫైబర్ ఇంటర్నెట్ అందించడానికి మేము దాదాపు రూ. 1,40,000 కోట్లను పెట్టుబడిగా పెడుతున్నాము. భారత్‌నెట్ 1, 2 దశల్లోని లోపాల నుంచి పాఠాలు నేర్చుకుని, ఆ సమస్యలను సరిదిద్ది, ఇప్పుడు పూర్తి జవాబుదారీతనంతో దీనిని అమలు చేస్తున్నాము. ప్రస్తుతం కేవలం 15 లక్షల గ్రామీణ గృహాలకు మాత్రమే కనెక్టివిటీ ఉంది, కానీ మొదటి దశలోనే దీనిని 1.5 కోట్ల గృహాలకు విస్తరించడమే మా ప్రధాన లక్ష్యం" అని డాక్టర్ పెమ్మసాని చెప్పారు. చివరి మైలు వరకు ఇంటర్నెట్ వినియోగాన్ని విస్తరించడానికి గ్రామీణ జౌత్సాహికులను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

"2047 నాటికి 'వికసిత భారత్' సాధించాలనే ప్రధానమంత్రి మోదీ సంకల్పానికి బలమైన కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలు చాలా కీలకం. ఇది కేవలం టవర్లు, కేబుళ్ల విస్తరణ మాత్రమే కాదు, ప్రభుత్వ సంస్థల ఆలోచనా విధానాన్ని, పని సంస్కృతిని మార్చడం" అని అన్నారు. రాబోయే ఐదేళ్లలో బిఎస్ఎన్ఎల్ సంస్థ కోసం తనకున్న విజన్‌ను వివరిస్తూ.. దానిని 'నమ్మకమైనది, గర్వించదగినది, లాభదాయకమైనది' గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ధ్యేయమని కేంద్ర సహాయ మంత్రి తెలియజేశారు.


(रिलीज़ आईडी: 2265423) आगंतुक पटल : 45
यह लिंक इस वेबसाइट के बाहर एक वेब पेज पर ले जाएगा। जारी रखने के लिए OK क्लिक करें। रोकने के लिए Cancel क्लिक करें। :   https://www.youtube.com/watch?v=xR78SrVgCZo
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English