జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav

ట్రాన్స్‌జెండర్ల సంక్షేమంపై కేంద్ర మంత్రిత్వ శాఖలకు, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు మార్గదర్శకాలు (అడ్వైజరీ 2.0) జారీ చేసిన జాతీయ మానవ హక్కుల సంఘం


కమిషన్ 2023 నాటి మార్గదర్శకాలకు కొనసాగింపుగా క్షేత్రస్థాయి పరిశీలనలు, సంబంధిత భాగస్వాములతో సంప్రదింపుల అనంతరం అడ్వైజరీ 2.0 జారీ

ట్రాన్స్‌జెండర్ల కోసం లింగ సమ్మిళిత సంస్కరణలను చేపట్టాలని, వారి కోసం సమ్మిళిత జనాభా గణన, పని ప్రదేశాలలో సంస్కరణలను చేపట్టాలని సిఫార్సు

ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల విద్య, వైద్యం, ఆస్తి, చట్టపరమైన హక్కులకు సంబంధించిన సమస్యలకు కొత్త మార్గదర్శకాల్లో ప్రాధాన్యం

చేపట్టిన చర్యలపై రెండు నెలల వ్యవధిలో నివేదికలను సమర్పించాలని ఆదేశం

నాడు పోస్టు చేయడమైనది: 19 MAY 2026 4:43PM by PIB Hyderabad

ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల మానవ హక్కులను పరిరక్షించడానికి, పెంపొందించడానికి కొనసాగిస్తున్న ప్రయత్నాలలో భాగంగా, వారి సంక్షేమం కోసం భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) కేంద్ర ప్రభుత్వంలోని 11 మంత్రిత్వ శాఖల కార్యదర్శులకు, రిజిస్ట్రార్ జనరల్,  సెన్సస్ కమిషనర్ కార్యాలయానికి, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు/అడ్మినిస్ట్రేటర్లకు కొత్త మార్గదర్శకాలు (అడ్వైజరీ 2.0)) జారీ చేసింది. సామాజిక న్యాయం, సాధికారత, హోం, న్యాయ, గణాంకాలు,  కార్యక్రమాల అమలు, విద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, మహిళా, శిశు అభివృద్ధి, కార్పొరేట్ వ్యవహారాలు, కార్మిక,ఉపాధి, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలకు ఈ మార్గదర్శకాలను జారీ చేశారు.

ఈ మార్గదర్శకాలను జారీ చేస్తూ, గతంలో 15 సెప్టెంబర్ 2023న తాము ఇచ్చిన మార్గదర్శకాలకు సంబంధిత అధికారుల నుంచి లభించిన ప్రోత్సాహకరమైన స్పందనను, అలాగే ఈ ఆశయం పట్ల ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబిస్తూ వారు చూపిన నిర్మాణాత్మక భాగస్వామ్యాన్ని కమిషన్ కొనియాడింది. దీనితో పాటు, ట్రాన్స్‌జెండర్ల సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకువచ్చిన ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల (హక్కుల రక్షణ) చట్టం 2019, దానికి అనుబంధంగా ఉన్న పథకాలు, విధానపరమైన చర్యలను కూడా కమిషన్ అభినందించింది.

క్షేత్ర స్థాయి సమావేశాలు, సంబంధిత భాగస్వాములతో జరిపిన సంప్రదింపులు,  అమలు తీరుపై నిర్వహించిన సమీక్షలతో కూడిన నిరంతర చర్యల ఆధారంగా.. ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు చాలా కాలంగా, కొత్తగా ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను కమిషన్ గుర్తించింది. అందువల్ల, వారి సంక్షేమాన్ని మరింత పెంపొందించడానికి మరో విడత మార్గదర్శకాలను జారీ చేయడం అవసరమని, అందుకు ఇది సరైన సమయమని కమిషన్ భావించింది. దీనికి అనుగుణంగా, సంబంధిత అధికారులందరూ ఈ అడ్వైజరీలో పేర్కొన్న సిఫార్సులను అమలు చేయాలని, ఆయా మార్గదర్శకాల అమలులో సాధించిన పురోగతిని కమిషన్‌కు తెలియజేస్తూ చేపట్టిన చర్యల నివేదికలను (యాక్షన్ టేకెన్ రిపోర్ట్) రెండు నెలల్లోగా సమర్పించాలని కమిషన్ కోరింది.

ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సంక్షేమంపై చర్యలకు సంబంధించి పది ముఖ్యాంశాలపై ఈ మార్గదర్శక పత్రం దృష్టి సారించింది. వీటిలో జాతీయ డేటా వ్యవస్థల్లో లింగ వైవిధ్యాన్ని సమగ్రపరచడం, లింగ సమానత్వాన్ని నిర్ధారించేందుకు చట్టాలు/ నియమాలు/ విధానాలను సమీక్షించడం, సమగ్ర న్యాయ వ్యవస్థ నిర్మాణం, ఆస్తిపై హక్కు, విద్య హక్కు, ఆరోగ్య సంరక్షణ, కార్యాలయాల్లో సమగ్రత, భిన్న లైంగిక లక్షణాలు, లింగ గుర్తింపులు/ వ్యక్తీకరణలు కలిగిన పిల్లల హక్కుల పరిరక్షణ, వృద్ధ ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల హక్కుల రక్షణ, అలాగే గరిమా గృహ్ ఆశ్రయ కేంద్రాలను బలోపేతం చేయడం ఉన్నాయి.

ముఖ్యమైన సిఫార్సులు ఈ క్రింద విధంగా ఉన్నాయి:

కచ్చితమైన,సమగ్రమైన లింగ-ఆధారిత డేటాను సేకరించడం కోసం.. రాబోయే భారత జనాభా గణన, ఇతర జాతీయ సర్వేలలో ‘ఇంటర్‌సెక్స్’,  ‘ట్రాన్స్‌మెన్’,  ‘ట్రాన్స్‌విమెన్’ వంటి ప్రత్యేక విభాగాలను చేర్చడం;

స్వీయ గుర్తింపు పొందిన లింగానికి  గుర్తింపునిచ్చేలా... ట్రాన్స్‌జెండర్, ఇంటర్‌సెక్స్ వ్యక్తుల హక్కులను సంరక్షించేలా... జనన మరణాల నమోదు చట్టం (రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్), జువైనల్ జస్టిస్ యాక్ట్, వారసత్వ చట్టాలతో (సక్సెషన్ లాస్) కూడిన వివిధ చట్టాలను సమీక్షించడం;

స్వీయ గుర్తింపుతో నిర్ణయించుకున్న లింగ  గుర్తింపు, ట్రాన్స్‌జెండర్, ఇంటర్‌సెక్స్ వ్యక్తుల హక్కులను పరిరక్షించడం కోసం జనన,  మరణ నమోదు చట్టం, జువెనైల్ జస్టిస్ చట్టం, వారసత్వ చట్టం సహా వివిధ చట్టాలను సమీక్షించడం;

ట్రాన్స్‌జెండర్, ఇంటర్‌సెక్స్ వ్యక్తులకు ఎటువంటి వివక్ష లేకుండా సమాన వారసత్వ, గృహ, ఆస్తి హక్కులను నిర్ధారించడం;

ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల అరెస్ట్, నిర్బంధం, సోదాలు విచారణలు, జైలు శిక్ష, గోప్యత, లింగ ఆధారిత వైద్య సదుపాయాలు పొందేలా చూడడం వంటి అంశాలపై  పోలీసు,జైళ్ల శాఖల కోసం సమగ్రమైన ప్రామాణిక నిర్వహణ విధానాలను రూపొందించడం;

వివక్ష, హింస లేదా కస్టడీలో వేధింపులను ఎదుర్కొంటున్న ట్రాన్స్‌జెండర్, వివిధ లింగ గుర్తింపులు కలిగిన వ్యక్తుల కోసం ప్రత్యేక చట్టపరమైన సహాయ విభాగాలను,  హెల్ప్‌లైన్‌లను, స్వతంత్ర ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాలను ఏర్పాటు చేయడం;

వైద్యపరమైన ఆధారాలు అడగకుండా, స్వయం-గుర్తింపు పొందిన లింగ ఆధారంగానే విద్యాసంస్థల్లో ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడం; దీనితో పాటు లింగ-రహిత  సౌకర్యాలను, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాలను ఏర్పాటు చేయడం;

సమ్మిళితం పెంపొందించడానికి, వివక్షను తగ్గించడానికి, ఉపాధ్యాయులు, కౌన్సిలర్లు, పోలీసులు, జైలు సిబ్బంది, న్యాయాధికారులు ఆరోగ్య సంరక్షణ నిపుణులకు తప్పనిసరి లింగ అవగాహన  శిక్షణను అందించడం;

లింగ ఆధారిత వైద్య సదుపాయాల  కోసం ప్రామాణికమైన, నైతిక వైద్య నిబంధనలను  రూపొందించడం; సెక్స్ రీఅసైన్‌మెంట్ సర్జరీ ఖర్చులను నియంత్రించడం, ట్రాన్స్‌జెండర్ ఆరోగ్య అవసరాలకు సమానమైన ఇన్సూరెన్స్ కవరేజీని కల్పించడం;

ప్రాణాపాయ పరిస్థితుల్లో మినహా, ఇంటర్‌సెక్స్ పిల్లలపై బలవంతపు లేదా వారి సమ్మతి లేని వైద్య విధానాలను  నిషేధించడం; తల్లిదండ్రులకు కౌన్సెలింగ్, మానసిక-సామాజిక మద్దతును అందించడం;

లింగ-రహిత  సౌకర్యాలు, సమగ్రమైన మానవ వనరుల  విధానాలు, కార్యాలయ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాలు, తప్పనిసరి వైవిధ్య ప్రకటనల ద్వారా అందరినీ కలుపుకొనిపోయే కార్యాలయాలను పెంపొందించడం; దీనితో పాటు వృద్ధులైన ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కోసం సంక్షేమ చర్యలను చేపట్టడం; 

పత్రాల ప్రక్రియను సులభతరం చేసి సంక్షేమ పథకాలలో వృద్ధ ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల స్వీయ గుర్తింపును ఆధారంగా చేసుకుని నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించడం, అలాగే ట్రాన్స్‌జెండర్ అనుకూల వృద్ధాశ్రమాలు, సామాజిక ఆశ్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి, గోప్యత, ఆరోగ్య సేవల లభ్యత, సామాజిక సంబంధాలు, భావోద్వేగ సంక్షేమాన్ని నిర్ధారించడం.

అడ్వైజరీ పూర్తి వివరాల కోసం https://nhrc.nic.in/assets/uploads/other_advisories/1779115826_649e8e4ffb525458ca0a.pdf లో చూడవచ్చు.

 

*****


(రిలీజ్ ఐడి: 2263262) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Tamil