గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సికిల్ సెల్ వ్యాధికి భారత్ తొలి స్వదేశీ సీఆర్ఐఎస్‌పీఆర్ ఆధారిత జన్యు చికిత్స ‘‘బిర్సా 101’’పై వర్క్‌షాపును నిర్వహించిన గిరిజన వ్యవహారాల శాఖ, సీఎస్ఐఆర్, ఐజీఐబీ


‘జన్‌జాతీయ గరిమా ఉత్సవ్-2026’లో భాగంగా ఈ వర్క్‌షాపు నిర్వహణ..

ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత స్ఫూర్తితో సాగుతున్న ‘వికసిత్ భారత్’ యాత్రకు సంబంధించిన నెల రోజుల ఉత్సవం

నాడు పోస్టు చేయడమైనది: 14 MAY 2026 9:11PM by PIB Hyderabad

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారత్‌లో మొదటి స్వదేశీ సీఆర్ఐఎస్‌పీఆర్ ఆధారిత జన్యు చికిత్స ‘‘బిర్సా 101’’పై కార్యశాల (వర్క్‌షాప్)ను 2026 మే 14న న్యూఢిల్లీలోని సీఎస్ఐఆర్-ఐజీఐబీలో నిర్వహించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ‘జన్‌జాతీయ గరిమా ఉత్సవ్-2026’ కార్యక్రమాల్లో ఈ వర్క్‌షాపు ఓ భాగం. దీనికి మంత్రిత్వ శాఖ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ (సీఎస్ఐఆర్)తో పాటు సీఎస్ఐఆర్-ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ బయాలజీ (ఐజీఐబీ) సహకారాన్ని కూడా తీసుకుంది.

గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత స్ఫూర్తితో చేపట్టిన ‘వికసిత్ భారత్’ యాత్రలో భాగంగా నెల పాటు ‘జన్‌జాతీయ గరిమా ఉత్సవ్-2026’ను పాటిస్తున్నారు. ఉత్సవాల్లో మొదటి వారాన్ని ‘‘అభివృద్ధికి చోదకశక్తిగా నిలుస్తున్న సాంకేతికత’’ అంశానికి అంకితం చేశారు. నూతన ఆవిష్కరణలతో చోటు చేసుకొనే మార్పుతో పాటు గిరిజనుల ప్రగతికీ, వారి సంక్షేమానికీ ఊతాన్నందిస్తున్న సాంకేతిక విజయాలకు ఈ ఏడు రోజుల్లో ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు.

 

భగవాన్ బిర్సా ముండాను స్ఫురణకు తెస్తూ, కార్యక్రమానికి ‘‘బిర్సా 101’’ అనే పేరును పెట్టారు. ఇది భారత్‌లో వృద్ధిలోకి వస్తున్న బయోటెక్నాలజీ, జన్యు ప్రధాన పరిశోధన అనుబంధ విస్తారిత వ్యవస్థలో ఓ కీలక ప్రగతి ప్రస్థానమని చెప్పవచ్చు. ఈ కార్యక్రమం సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తరఫున నిరంతరాయంగా సాగిస్తున్న కృషిని ముందుకు తీసుకుపోతుంది. ఈ వ్యాధి దేశంలోని అనేక ప్రాంతాల్లో గిరిజన జనాభాను అసమాన రీతిన ప్రభావితం చేస్తున్నది. గిరిజనుల సంక్షేమమే ప్రధానంగా భావించి పరిశోధన, నూతన ఆవిష్కరణలతో పాటు తక్కువ ఖర్చులో ఆరోగ్యసంరక్షణ సేవలను బలోపేతం చేసేందుకు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరాయంగా చేపడుతున్న ప్రయత్నాల్లో భాగంగా సుమారు రూ.3.75 కోట్ల ఆర్థిక సహాయాన్ని ఈ ప్రాజెక్టుకు అందించింది.గిరిజన సమాజాల కోసం ఆరోగ్యసంరక్షణ సేవల లభ్యతను మెరుగుపరిచే దృష్టితో ఉన్నత శాస్త్రీయ పరిశోధన, దేశీయ నూతన ఆవిష్కరణల ప్రయోజనాల్ని వినియోగించుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి రంజనా చోప్రా స్పష్టం చేశారు. లక్షిత లబ్ధిదారుల్లో చివరి వ్యక్తికి కూడా తక్కువ ఖర్చుతో ఆరోగ్యసంరక్షణ సేవల లభ్యతను నిర్ధారించడానికి శాస్త్రీయ సంస్థలకూ, ప్రభుత్వ ఏజెన్సీలకూ మధ్య బలమైన సహకారం నెలకొనాల్సి వుందని ఆమె సూచించారు.  సీఎస్ఐఆర్-ఐజీఐబీ డైరెక్టరు డాక్టర్ సౌవిక్ మైతీ ప్రిసీజన్ మెడిసిన్, జాతీయ జినోమ్ సీక్వెన్సింగ్, ట్రాన్స్‌లేషనల్ బయోమెడికల్ రిసర్చ్ రంగంలో సంస్థ అమలుపరుస్తున్న ప్రధాన శాస్త్రీయ కార్యక్రమాలను వివరించారు. ఆయుర్జెనోమిక్స్ సంబంధిత పరిశోధనలు, అరుదైన జన్యుపర రుగ్మతలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన గార్డియన్ (GUaRDIAN) కార్యక్రమం, ఇండియన్ బ్రెస్ట్ క్యాన్సర్ జినోమ్ అట్లాస్ (ఐబీసీజీఏ), ఫెనోమ్ ఇండియా, ఇండియన్ గట్ మైక్రోబయోమ్ అధ్యయనాలతో పాటు సార్స్-కోవ్-2 మహమ్మారి కాలంలో భారత్ జినోమిక్ ప్రతిస్పందన వంటి ముఖ్య కార్యక్రమాల్ని తన ప్రజెంటేషన్లో చేర్చారు.సాంప్రదాయిక జ్ఞానానికి సంబంధించిన డిజిటల్ గ్రంథాలయం (ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ.. టీకేడీఎల్) పరిధిలో చేపడుతున్న భారత సాంప్రదాయిక ఔషధీయ జ్ఞాన వ్యవస్థలు, ప్రత్యేకించి గిరిజన జ్ఞాన పరంపర తాలూకు విస్తృత భండారాన్ని సంరక్షించుకోవడంతో పాటు వాటి భద్రతకు తీసుకుంటున్న చర్యలను సీఎస్ఐఆర్-టీకేడీఎల్ డైరెక్టరు శ్రీమతి విశ్వజనని సత్తిగెరీ వివరించారు.‘‘బిర్సా 101’’తో పాటు సీఆర్ఐఎస్‌పీఆర్ ఆధారిత జీన్-ఎడిటింగ్ సాంకేతికతలపై డాక్టర్ దేబొజ్యోతి చక్రబర్తి సమగ్ర సాంకేతిక ప్రజెంటేషనును అందించారు. ఆయన 2017 మొదలు భారతీయ కార్యక్రమంలో నమోదైన ప్రగతిని వివరించారు. సికిల్ సెల్ వ్యాధికి తక్కువ ఖర్చులో, దేశవాళీ జీన్-ఎడిటింగ్ ప్రధాన చికిత్సాపద్ధతిని అభివృద్ధిపరిచే దిశగా సాగిన ప్రయత్నాల్ని ప్రస్తావించారు. సికిల్ సెల్ యోధులు, రోగి హక్కుల సమర్ధకులైన శ్రీ గౌతం డోంగ్రే, ఫర్హత్ నాజ్‌లతో గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శి మాట్లాడారు. వారు ఇరువురూ తమ జీవన ప్రస్థాన వివరాల్ని పంచుకుంటూ, ప్రాథమిక దశలోనే రోగనిర్ణయం, చైతన్యాన్ని పెంపొందింపచేయడం, హైడ్రాక్సీయూరియా వంటి మందులను ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడం, ఆదరణకు నోచుకోని ప్రాంతాల్లో నిరంతరాయ ఆరోగ్యసంరక్షణ సేవలను అందించడం వంటి చర్యలకు ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న వారికి క్లినికల్ ట్రయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నియంత్రణ ప్రక్రియలు, ప్రముఖ వైద్య, పరిశోధక సంస్థలతో సహకారపూర్వక ఏర్పాట్లు చేసుకునే విషయంలో దశలవారీగా చోటు చేసుకుంటున్న ప్రగతిని గురించి తెలియజేశారు. రోగచికిత్సతో పాటు తయారీకి సంబంధించిన ప్రక్రియల్ని సహకారపూర్వకంగా చేపట్టడానికి ఒక సాంకేతిక ప్రణాళికను సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు బదలాయించిన సంగతినీ వర్క్‌షాపులో ప్రస్తావించారు.
అనంతరం గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంతో సంబంధమున్న జీఎమ్‌పీ తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేస్తున్న తయారీ విస్తారిత అనుబంధ వ్యవస్థ, పరిశోధన సంబంధిత మౌలిక సదుపాయాలతో పాటు సాంకేతిక సామర్థ్యాలను కూడా ఈ సందర్భంగా సమీక్షించారు.

 


గిరిజన సమాజాలపై ప్రభావాన్ని చూపుతున్న, ఆరోగ్యపరంగా జటిలమైన సవాళ్లను పరిష్కరించడానికి స్వదేశీ శాస్త్రీయ నూతన ఆవిష్కరణలు, సంస్థాగత సహకారం, సాంకేతికత ఆధారిత ఆరోగ్యసంరక్షక సేవలకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలని  వర్క్‌షాపులో సూచించారు. అన్ని వర్గాలనూ కలుపుకొనిపోతూ, సాధికారికంగానూ, సాంకేతికంగానూ సమర్థమైన ‘‘వికసిత్ భారత్’’ దిశగా ముందుకు వెళ్లాలని కూడా స్పష్టం చేశారు.    

 

***


(రిలీజ్ ఐడి: 2261446) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil