బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సీఎంపీడీఐఎల్‌ పనితీరును సమీక్షించిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయమంత్రి


బొగ్గు, ఖనిజాల అన్వేషణ రంగంలో రెండు ప్రముఖ సంస్థల మధ్య సహకారాన్ని పెంచేందుకు సీఎంపీడీఐఎల్‌, ఎంఈసీఎల్‌ మధ్య కుదిరిన ఒప్పందం

నాడు పోస్టు చేయడమైనది: 15 MAY 2026 12:10PM by PIB Hyderabad

కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయమంత్రి శ్రీ సతీశ్ చంద్ర దూబే 14.05.2026న రాంచీలో సీఎంపీడీఐ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎంపీడీఐ సీఎండీ శ్రీ చౌదరి శివరాజ్‌ సింగ్‌, సీసీఎల్‌ సీఎండీ శ్రీ నీలేందు కుమార్ సింగ్‌, ఎంఈసీఎల్‌ సీఎండీ శ్రీ ఐ.డీ. నారాయణ్‌తో పాటు సీఎంపీడీఐ టెక్నికల్ డైరెక్టర్లు, సీఎంపీడీఐ, సీసీఎల్‌, ఎంఈసీఎల్‌ సంస్థల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

 

అన్వేషణ, నివేదిక తయారీ, మూలధన వ్యయం, పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులు, సీఎస్‌ఆర్‌ కార్యక్రమాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టుల వంటి వివిధ రంగాల్లో 2025-26 సంవత్సరానికి సంబంధించి సీఎంపీడీఐ పనితీరుపై ఈ సమావేశంలో చర్చించారు. 2026-27 సంవత్సరానికి నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించారు.

సీఎంపీడీఐ పనితీరును కేంద్రమంత్రి ప్రశంసించారు. భవిష్యత్తులో దేశ ఇంధన, ఆర్థిక భద్రతకు అత్యంత కీలకమైన క్లీన్‌ కోల్‌ టెక్నాలజీ, అరుదైన ఖనిజాల అన్వేషణ ప్రాముఖ్యతను స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీసీఎల్ సీఎండీ శ్రీ నిలేందు కుమార్ సింగ్, ఎంఈసీఎల్ సీఎండీ శ్రీ ఐ.డీ. నారాయణ్ పాల్గొన్నారు. అధిక సంఖ్యలో బిడ్డర్లు పాల్గొనటం వల్ల ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా చూసేందుకు, సేకరణ ప్రక్రియలను సులభతరం చేసేందుకు.. పారదర్శకతను పెంచాలని, మార్కెట్ విస్తరణను మెరుగుపరచాలని సీఎంపీడీఐ యాజమాన్యానికి సూచించారు.

 

గనుల తవ్వకం పూర్తయిన తర్వాత ఆ ప్రాంతాలను స్థానిక ప్రజలకు సామాజికంగా-ఆర్థికంగా ఉపయోగపడేలా మార్చాలని మంత్రి చెప్పారు. "ఒక జిల్లా-ఒక ఉత్పత్తి" (ఓడీఓపీ) పథకంలో భాగంగా ఈ ప్రాంతాల్లో తామర గింజల (మఖానా) సాగు, చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. మూతపడిన గనులను వ్యవసాయ, మత్స్య సంపద కేంద్రాలుగా మార్చటం ద్వారా స్థానిక ప్రజలకు స్థిరమైన ఉపాధిని కల్పించటమే ఈ దూరదృష్టి విధాన లక్ష్యం.

కేంద్రమంత్రి శ్రీ సతీశ్ చంద్ర దూబే సమక్షంలో బొగ్గు, ఇతర ఖనిజాల అన్వేషణలో పరస్పర సహకారానికి సీఎంపీడీఐఎల్‌ (సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇనిస్టిట్యూట్ లిమిటెడ్), ఎంఈసీఎల్‌ (మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్‌) సంస్థల మధ్య 14.05.2026న అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ భాగస్వామ్యం ద్వారా దేశంలో నూతన గనుల ఏర్పాటు వేగవంతం అవటమే కాక, ఖనిజ నిల్వల లభ్యత మరింత పెరుగుతుంది.

 

భారతదేశ ఖనిజ సంపద వృద్ధికి తోడ్పడుతూ, ఖనిజ రంగంలో స్వావలంబనను ప్రోత్సహిస్తూ.. ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్య సాధనకు ఈ కార్యక్రమం కీలక ముందడుగా నిలుస్తుంది.

***


(రిలీజ్ ఐడి: 2261361) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali