పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత విమానాల అద్దె, ఫైనాన్సింగ్ సదస్సు 2.0

నాడు పోస్టు చేయడమైనది: 08 MAY 2026 6:54PM by PIB Hyderabad

ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (ఐఎఫ్‌ఎస్‌సీఏ), ఫిక్కీతో (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) కలిసి కేంద్ర ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (ఎంఓసీఏ) నిర్వహించిన ‘భారత విమానాల అద్దె, ఫైనాన్సింగ్ సదస్సు 2.0 (ఇండియా ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్ సమ్మిట్- ఐఏఎల్ఎఫ్ఎస్ 2.0)' విజయవంతమైంది. గుజరాత్ గాంధీనగర్‌లోని గిఫ్ట్ సిటీ వేదికగా 2026 మే 8వ తేదీ శుక్రవారం నాడు ఇది జరిగింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సదస్సుకు అధ్యక్షత వహించగా గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

2025లో జరిగిన తొలి సదస్సు విజయవంతమవటంతో దాని కొనసాగింపుగా నిర్వహించిన ఐఏఎల్‍ఎఫ్‌ఎస్ 2.0.. విధాన రూపకర్తలు, ఆర్థిక రంగ నిపుణులు, విమానయాన రంగ ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. అంతర్జాతీయ వేదికగా ఎదుగుతున్న గిఫ్ట్ ఐఎఫ్ఎస్‌సీ‌పై ప్రత్యేక దృష్టితో విమానాల అద్దె, విమానయాన ఫైనాన్సింగ్ రంగాలలో దీని పాత్రను మరింత బలోపేతం చేయడంపై ఈ సదస్సులో చర్చించారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ మాట్లాడుతూ.. గిఫ్ట్ సిటీని ప్రపంచ ఆర్థిక, ఆర్థిక సాంకేతికత కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. కొత్త విమానాశ్రయాల అభివృద్ధి ప్రాజెక్టులతో సహా గుజరాత్‌లో పెరుగుతున్న విమానయాన మౌలిక సదుపాయాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్ర విమానయాన వృద్ధి పథంలో భాగస్వాములు కావాలని అంతర్జాతీయ భాగస్వాములను ఆయన కోరారు.

గౌరవ అతిథిగా విచ్చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్‌గానే కాకుండా విమానయాన ఫైనాన్సింగ్, అద్దె రంగాల్లో అంతర్జాతీయ స్థాయి అధికార పరిధి కలిగిన దేశంగా ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో అన్ని రకాల విమాన విభాగాల్లో భారత వాణిజ్య విమానాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ అద్భుతమైన వృద్ధికి ఊతమివ్వడానికి దేశీయంగా పటిష్టమైన ఫైనాన్సింగ్, అద్దె వ్యవస్థను తయారు చేయాల్సిన ఆవశ్యకతను ఆయన ఈ సందర్భంగా ప్రధానంగా పేర్కొన్నారు. 

అద్దె రంగంలో ఉన్న అపారమైన అవకాశాల గురించి ఆయన మాట్లాడుతూ.. “భారత వాణిజ్య విమానాల సంఖ్య 2027 నాటికి 1,100కు చేరుకుంటుందని.. 2035 నాటికి అది 2,250 కంటే ఎక్కువకు పెరుగుతుందన్న అంచనా ఉంది. ప్రస్తుతం భారతీయ విమానయాన సంస్థలు 1,640 విమానాల కోసం ఆర్డర్లు పెట్టాయి. ఇది రాబోయే దశాబ్ద కాలంలో భారతదేశ అద్దె వ్యవస్థకు 50 బిలియన్ డాలర్ల మేర భారీ అవకాశాలను కల్పిస్తుంది” అని వ్యాఖ్యానించారు.

మొదటి ‘విమానాల అద్దె, ఫైనాన్సింగ్ సదస్సు’ తర్వాత నెరవేర్చిన ప్రధాన హామీలను శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముఖ్యంగా 'ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ ఇన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్ (పీఐఏఓ) చట్టం- 2025' అమలు గురించి ఆయన ప్రస్తావించారు. కేప్ టౌన్ కన్వెన్షన్‌కు అనుగుణంగా భారత చట్ట వ్యవస్థలో తీసుకొచ్చిన ఒక కీలక సంస్కరణగా దీనిని ఆయన అభివర్ణించారు. “చాలా ఏళ్లుగా అద్దెకు ఇచ్చే సంస్థలు (లెస్సర్లు) ఐడీఈఆర్‌ఏ హక్కులను వినియోగించుకోవడంలో సుదీర్ఘ జాప్యాన్ని ఎదుర్కొన్నాయి.  దీని వల్ల భారతీయ విమానయాన సంస్థలపై ఖర్చుల భారం పెరిగి అంతిమంగా విమాన ప్రయాణికులపై అధిక ఛార్జీల రూపంలో ప్రభావం పడింది. ఇప్పుడు ఆ లోటు భర్తీ అయింది” అని ఆయన పేర్కొన్నారు.

మొదటి సదస్సు ముగింపులో ఇచ్చిన మరో కీలక హామీ అయిన.. లీజింగ్ ప్రక్రియ కోసం 'ఉన్నత స్థాయి వాటాదారుల కమిటీ' ఏర్పాటు కూడా పూర్తయిందని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.

భారతీయ విమానయాన సంస్థల కార్యాచరణ స్థిరత్వం, దీర్ఘకాలిక వృద్ధిని నిర్ధారించడంలో ప్రభుత్వం నిరంతరం మద్దతు ఇస్తుందని కేంద్ర మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు ఉద్ఘాటించారు. విమానయాన ఇంధన (ఏటీఎఫ్) ధరల పెరుగుదలపై ప్రభుత్వం 25 శాతం పరిమితిని విధించిందని.. దేశవ్యాప్త విమానాశ్రయాలలో ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలను 25 శాతం తగ్గించిందని అన్నారు. విమానయాన సంస్థలకు రుణాల విషయంలో మద్దుతు చర్యలను విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల తీసుకున్న క్యాబినెట్ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ.. విమానయాన సంస్థలు ఎదుర్కొంటున్న నగదు లభ్యత ఇబ్బందులను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 5,000 కోట్ల వ్యయంతో 'క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకానికి' ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు. ప్రపంచంలోని మరే ఇతర ప్రభుత్వం కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

ఐఎఫ్ఎస్‌సీఏ ఛైర్మన్ శ్రీ కే. రాజారామన్ మాట్లాడుతూ.. విమానాలను అద్దెకు ఇచ్చే సంస్థలు, విమాన ఇంజన్లు, హెలికాప్టర్లు, ఇతర విమానయాన ఆస్తులకు సంబంధించిన ఫైనాన్సింగ్ వేదికలకు ప్రస్తుతం గిఫ్ట్ ఐఎఫ్ఎస్‌సీ నిలయంగా ఉందని పేర్కొన్నారు. పన్ను మినహాయింపు గడువు పొడిగింపు, సింగిల్ విండో ఐటీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం, ఎస్‌పీవీ- ట్రస్ట్‌లను ప్రవేశపెట్టడం వంటి కీలక సంస్కరణలు అంతర్జాతీయంగా ఆమోదం పొందిన ఫైనాన్సింగ్ నమూనాలకు పునాదులని ఆయన అన్నారు. తదుపరి దశలో నియంత్రణపరమైన వెసులుబాటు, విమానయాన ఆర్థిక విలువ గొలుసులో విస్తృత సంస్థాగత భాగస్వామ్యం ద్వారా ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నట్లు ఆయన తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ పౌర విమానయాన శాఖ కార్యదర్శి శ్రీ సమీర్ కుమార్ సిన్హా మాట్లాడుతూ.. స్థిరమైన, పెట్టుబడిదారులకు అనుకూలమైన వ్యవస్థను నిర్మించడంలో ప్రభుత్వ నిబద్ధతను ఉద్ఘాటించారు. భారత విమానయాన వృద్ధి కేవలం ప్రయాణికుల రాకపోకలకే పరిమితం కాకుండా యాజమాన్య హక్కులు, ఫైనాన్సింగ్, ఆర్థిక ఆవిష్కరణల దిశగా విస్తరిస్తోందని ఆయన అన్నారు. ఆర్థిక సంస్థలు, బీమా సంస్థలు, పెన్షన్ ఫండ్‌లు, మౌలిక సదుపాయాల ఆర్థిక సంస్థల నుంచి దీర్ఘకాలిక దేశీయ మూలధనాన్ని విమానయాన రంగానికి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ప్రకటించారు. 

పరిశ్రమ గురించి మాట్లాడిన ఫిక్కీ పౌర విమానయాన కమిటీ ఛైర్మన్, ఎయిర్‌బస్ భారత్- దక్షిణాసియా అధ్యక్షులు- ఎండీ శ్రీ జుర్గెన్ వెస్టర్‌మీర్.. భారత విమానయాన- ఏరోస్పేస్ రంగం భద్రత, అందుబాటు ధరలు, పోటీతత్వం, సుస్థిరతల ఆధారంగా ముందుకు సాగుతోందని అభిప్రాయపడ్డారు. భారతీయ విమానయాన సంస్థల వద్ద ఉన్న భారీ ఆర్డర్ బ్యాక్‌లాగ్‌, విమానాల కొనుగోలుకు అవసరమైన భారీ ఫైనాన్సింగ్ గురించి మాట్లాడుతూ.. రాబోయే కాలం అటు దేశీయ, ఇటు అంతర్జాతీయ ఫైనాన్సియర్లు, అద్దెకు ఇచ్చే సంస్థలకు గొప్ప అవకాశాలను అందిస్తుందన్నారు.

ఈ సదస్సులో పరిశ్రమకు సంబంధించిన కీలక ప్రకటనలు వెలువడ్డాయి. 'ఏఐ ఫ్లీట్ సర్వీసెస్ ఐఎఫ్ఎస్‌సీ లిమిటెడ్' (ఎయిర్ ఇండియా) విమానాల పోర్ట్‌ఫోలియోను ప్రస్తుతం ఉన్న 50 నుంచి 2027 మార్చి నాటికి 76 విమానాలకు పెంచనున్నట్లు ప్రకటించింది. ఇదే కాలంలో తన విమానాల సంఖ్యను ప్రస్తుతమున్న సుమారు 75 నుంచి దాదాపు 150 విమానాలకు పెంచనున్నట్లు 'ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐఎఫ్ఎస్‌సీ' (ఇండిగో) వెల్లడించింది.

గిఫ్ట్ సిటీలో 'ఆకాశ ఎయిర్ లీజింగ్ ఐఎఫ్ఎస్‌సీ ప్రైవేట్ లిమిటెడ్' (ఏఏఎల్ఐ) అనే సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఆకాశ ఎయిర్ ప్రకటించింది. రాబోయే ఐదేళ్లలో సుమారు 60 విమానాలను లీజుకు తీసుకోవడం ద్వారా ఆకాశ ఎయిర్ విమానశ్రేణి విస్తరణకు గిఫ్ట్ సిటీలోని ఈ కార్యాలయం తోడ్పాటునందిస్తుంది. మరోవైపు 2026 మేలో ఎంబ్రాయర్ ఈ190 విమానాలను లీజుకు తీసుకోవడం కోసం గిఫ్ట్ ఐఎఫ్ఎస్‌సీలో 'ఘోడావత్ ఏవియేషన్ ఐఎఫ్ఎస్‌సీ ప్రైవేట్ లిమిటెడ్'ను ఏర్పాటు చేస్తున్నట్లు స్టార్ ఎయిర్ ప్రకటించింది. 2027 ఆర్థిక సంవత్సరంలో గిఫ్ట్ ఐఎఫ్ఎస్‌సీ నుంచి మరో 6 నుంచి 8 ప్రాంతీయ విమానాలను అద్దెకు తీసుకోవాలని స్టార్ ఎయిర్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇటీవల సవరించిన 'ఐఎఫ్ఎస్‌సీఏ (టెక్‌ఫిన్, అనుబంధ సేవలు) నిబంధనలు- 2025' ప్రకారం 'ట్రస్ట్ అండ్ కంపెనీ సర్వీస్ ప్రొవైడర్' (టీసీఎస్‌పీ) హోదాలో గిఫ్ట్ ఐఎఫ్ఎస్‌సీ నుంచి విమానాల అద్దె కోసం ఎస్‌పీవీ సౌకర్యాలను ఏర్పాటు చేయడం ద్వారా అద్దెకిచ్చే సంస్థలకు సేవలు అందించనున్నట్లు విస్ట్రా ప్రకటించింది.

పౌర విమానయాన శాఖ (ఎంఓసీఏ), ఫిక్కీ సహకారంతో 'భారతదేశంలో విమానాల అద్దె వ్యవస్థను అభివృద్ధి చేయటం- సంస్కరణల నుంచి భవిష్యత్తు వృద్ధికి చోదక శక్తిగా' పేరుతో తయారు చేసిన నివేదికను కేపీఎంజీ విడుదల చేసింది.

అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా, విమానయాన ఫైనాన్స్‌కు ప్రపంచ స్థాయి కేంద్రంగా గిఫ్ట్ ఐఎఫ్ఎస్‌సీని మార్చేందుకు ఐఎఫ్ఎస్‌సీఏ, ఫిక్కీ మధ్య అవగాహన ఒప్పందం కుదరడంతో ఈ ప్లీనరీ సెషన్ ముగిసింది.

గిఫ్ట్ ఐఎఫ్ఎస్‌సీ‌లో విమానాల అద్దె, విమానయాన ఫైనాన్సింగ్ వ్యవస్థ బలోపేతం చేయడంపై సెషన్లు:

విమానాల అద్దె- ఫైనాన్సింగ్, విమానయాన పెట్టుబడులకు గిఫ్ట్ ఐఎఫ్ఎస్‌సీని ఒక పోటీతత్వ ప్రపంచ కేంద్రంగా బలోపేతం చేయడంపై ఈ సెషన్లు దృష్టి సారించాయి. ఈ చర్చల్లో విమానయాన సంస్థలు, కార్గో నిర్వహణ సంస్థలు, హెలికాప్టర్ ఆపరేటర్లు, అద్దెకు ఇచ్చే సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, న్యాయ నిపుణులు, పన్నులకు సంబంధించిన నిపుణులు, నియంత్రణ సంస్థలు, ఇతర భాగస్వాములు పాల్గొన్నారు.

భారతీయ వాయుయాన్ అధినియం, పీఐఓఏ చట్టం, అద్దె సంస్థలకు పన్ను ప్రయోజనాలను ఇవ్వటం, కార్పొరేట్ పన్ను రేట్ల తగ్గింపు వంటి కీలక సంస్కరణల ద్వారా పటిష్టమైన విమానయాన అద్దె వ్యవస్థను నిర్మించడంలో ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రతినిధులు అభినందించారు. నియంత్రణ, పన్ను పరమైన స్పష్టతను అందించేలా తీసుకున్న చర్యలను వారు కొనియాడారు. ఈ సంస్కరణలు పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా ఈ రంగంలో వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేశాయని వారు అభిప్రాయపడ్డారు.

దేశీయ విమాన, ఇంజిన్ ఫైనాన్సింగ్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని.. నిధుల లభ్యతను మెరుగుపరచటంతో పాటు మరింత పోటీతత్వంతో కూడిన ఫైనాన్సింగ్ వాతావరణాన్ని సృష్టించాలని విమానయాన సంస్థలు, నిర్వహణ సంస్థలు ప్రధానంగా చెప్పాయి. నైపుణ్యమైన మానవ వనరుల లభ్యత, నిశ్చయమైన పన్నులు, డీటీఏఏ సంబంధిత స్పష్టత, దేశీయ విమాన ఫైనాన్సింగ్ సామర్థ్యాలు, ఆస్తుల ఆధారిత ఫైనాన్సింగ్ నమూనాల వైపు పరివర్తన వంటి అంశాలపై కూడా చర్చలు దృష్టి సారించాయి. వీటితో పాటు కార్గో, హెలికాప్టర్ ఆపరేటింగ్ సంస్థలు.. కస్టమ్స్ విధానాలను సరళీకరించాలని, దిగుమతి ప్రక్రియలను సులభతరం చేయాలని, రంగాల వారీ సమస్యల పరిష్కారానికి అంకితమైన సంస్థాగత మద్దతు యంత్రాంగాల అవసరముందని విన్నవించాయి.

గిఫ్ట్ ఐఎఫ్ఎస్‌సీ‌లో మరింత దృఢమైన, పోటీతత్వంతో కూడిన విమానయాన ఫైనాన్సింగ్ మార్కెట్‌ను సృష్టించాల్సిన ప్రాముఖ్యతపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చర్చించాయి. ఇందులో భాగంగా రీఫైనాన్సింగ్ యంత్రాంగాల అభివృద్ధి, పూల్డ్ ఫండింగ్ నిర్మాణాలు, విమానాల ఫైనాన్సింగ్ కోసం క్రియాశీలకమైన ద్వితీయ మార్కెట్‌ను ఏర్పాటు చేయడం వంటి అంశాలను అవి ప్రస్తావించాయి.

విమానాల అద్దె- ఫైనాన్సింగ్, ఆస్తుల రికవరీ విషయంలో వర్ధమాన నియంత్రణ ముసాయిదాపై డీజీసీఏ స్పష్టతనిచ్చింది. కేప్ టౌన్ కన్వెన్షన్ అమలు కోసం రూపొందించిన ఫ్రేమ్‌వర్క్ ఒక కీలక ఘట్టమని పేర్కొంది. భారత పౌర విమానయాన రంగానికి మద్దతునివ్వటంతో పాటు ఈ రంగ వృద్ధిని బలోపేతం చేసే విషయంలో నియంత్రణ సంస్థ నిబద్ధతను ఇది తెలియజేస్తోంది. 

మొత్తంగా చూస్తే భారతదేశ విమానయాన ఫైనాన్సింగ్, అద్దె వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి.. గిఫ్ట్ ఐఎఫ్ఎస్‌సీని అంతర్జాతీయ స్థాయి పోటీతత్వ విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం, పరిశ్రమ వర్గాలు, అద్దె సంస్థలు, ఆర్థిక భాగస్వాముల మధ్య ఉన్న ఉమ్మడి నిబద్ధతను ఈ సెషన్లు ప్రతిబింబించాయి.

***


(రిలీజ్ ఐడి: 2259247) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Marathi , English , Urdu , हिन्दी