నౌకారవాణా మంత్రిత్వ శాఖ
భారత నౌకావాణిజ్య రంగంలో 2020 తరువాత మహిళల భాగస్వామ్యంలో 340 శాతం వృద్ధి నమోదు: శ్రీ సర్బానంద సొనోవాల్
సురక్షితమైన, భద్రమైన, సుస్థిరమైన హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని ప్రోత్సహించే దిశగా
భాగస్వామ్య దేశాలన్నిటితో కలిసి పనిచేయడానికి భారత్ కట్టుబడి ఉంది: సర్బానంద సొనోవాల్
నాడు పోస్టు చేయడమైనది:
07 MAY 2026 7:52PM by PIB Hyderabad
భారత నౌకావాణిజ్య రంగంలో 2020వ సంవత్సరం తరువాతి కాలంలో మహిళల భాగస్వామ్యం 340 శాతం మేర వృద్ధి చెందింది. ఈ విషయాన్ని కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సొనోవాల్ ఈ రోజు ఒక కార్యక్రమంలో తెలిపారు. ప్రభుత్వం మరింత ఎక్కువ సమ్మిళితత్వంతో కూడిన, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అందుకు సన్నద్ధంగా ఉండేలా నౌకావాణిజ్య రంగ శ్రమశక్తిని తీర్చిదిద్దేందుకు అమలు చేస్తున్న కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా ఆయన వివరించారు.
పదో ‘హిందూ మహాసముద్ర చర్చా కార్యక్రమాన్ని’ న్యూఢిల్లీలో నిర్వహించగా శ్రీ సొనోవాల్ హాజరై కీలకపన్యాసాన్నిచ్చారు. భారత నౌకావాణిజ్య అభివృద్ధి గాథలో ‘‘నారీ శక్తి’’ ఒక కీలక పాత్రను పోషిస్తోందని ఆయన స్పష్టం చేశారు. మారిషస్ విదేశాంగ మంత్రి శ్రీ ధనంజయ్ రాంఫుల్, యెమెన్ సహాయ మంత్రి శ్రీ వలీద్ మొహమ్మద్ అల్-ఖదీమీ కూడా కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సొనోవాల్ తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘‘ సాగర్ మే సమ్మాన్ వంటి కార్యక్రమాలతో నౌకావాణిజ్య రంగంలో మహిళల ఆత్మగౌరవాన్నీ, సమ్మిళితత్వాన్నీ, నాయకత్వ అవకాశాల్నీ మేం ప్రోత్సహిస్తున్నాం. వీటి ఫలితంగా ఈ రంగంలో మహిళల భాగస్వామ్యం 2020వ సంవత్సరం తరువాత అనూహ్యస్థాయిలో దాదాపు 340 శాతం మేర వృద్ధి చెందింది’’ అని శ్రీ సర్బానంద సొనోవాల్ అన్నారు. ‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చురుకైన నాయకత్వంలో, నౌకావాణిజ్య రంగంలో తీసుకువస్తున్న ఈ మార్పులు హిందూ మహాసముద్ర ప్రాంతానికి సంబంధించి మరింత సమ్మిళితత్వంతో కూడిన, దృఢమైన, భవిష్య అవసరాలను పరిగణనలోకి తీసుకొని సన్నద్ధమై ఉండే సిబ్బందిని తీర్చిదిద్దడానికి తోడ్పడుతున్నాయి’’ అని కేంద్ర మంత్రి వివరించారు.
మహిళల భాగస్వామ్యంలో నమోదైన ఈ వృద్ధి భారత విస్తృత నౌకావాణిజ్య దార్శనికతలో భాగమని కేంద్ర మంత్రి అన్నారు. ఇది ఆర్థిక అభివృద్ధిని సామాజిక సాధికారత కల్పనతో జోడిస్తోందని ఆయన చెప్పారు. భద్రతనీ, అనుసంధానాన్నీ, సుస్థిరతనీ పెంపొందింపచేసే దిశగా చేస్తున్న ప్రయత్నాలతో పాటు, భారత నౌకావాణిజ్య హంలో ‘‘మానవీయ కోణం’’ కూడా కీలక పాత్రను పోషిస్తోందని ఆయన తెలిపారు.
‘‘హిందూ మహాసముద్రం కేవలం భౌగోళిక ప్రాంతం కాదు.. ప్రపంచానికి ఓ జీవరేఖ’’ అని శ్రీ సొనోవాల్ వర్ణించారు. ‘‘ప్రపంచ దేశాలకు ఇంధన సరఫరా, వాణిజ్యం, సరఫరా వ్యవస్థల పరంగా దీనికి ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి చూస్తే బలమైన సహకారం, ఆటుపోట్లను తట్టుకోగలిగే ధీరత్వంతో పాటు సమ్మిళితత్వం ఎంతైనా అవసరం’’ అని ఆయన అన్నారు.
భారత నౌకావాణిజ్య రంగంలో చేపడుతున్న కార్యక్రమాలు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఉన్నాయని శ్రీ సోనోవాల్ స్పష్టం చేశారు. వీటిలో.. ‘సాగర్’ (సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్), ‘మహాసాగర్’ వంటి ప్రణాళికలు భాగంగా ఉన్నాయనీ, ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయడమే కాకుండా సమానాభివృద్ధికి పూచీపడడం కూడా ఈ కార్యక్రమాల లక్ష్యమనీ మంత్రి అన్నారు.
2025-27 మధ్య కాలానికి ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ (ఐఓఆర్ఏ) అధ్యక్ష బాధ్యతల్ని నిర్వహిస్తున్న భారత్.. పదో ‘హిందూ మహాసముద్ర చర్చ కార్యక్రమాన్ని’ ఏర్పాటు చేసింది. ‘‘మారుతున్న ప్రపంచంలో హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని’’ ఈ కార్యక్రమానికి ఇతివృత్తంగా ఎంపిక చేశారు. ఈ వేదిక నౌకావాణిజ్య రంగ భద్రత, బ్లూ ఎకానమీ, విపత్తుల కాలంలో రిస్క్ మేనేజ్‌మెంట్‌తో పాటు మహిళలకు సాధికారత కల్పన అంశాలపై చర్చించాల్సిందిగా మంత్రులనూ, విధాన రూపకర్తలనూ, విద్యారంగ నిపుణులనూ, పారిశ్రామిక రంగ ప్రముఖులనూ ఆహ్వానించింది.
ఐఓఆర్ఏకి అధ్యక్షత వహిస్తున్న భారత్.. ‘‘నూతన ఆవిష్కరణ, బాహాటత్వం, దృఢత్వం, అనుసరణీయత’’ అంశాలపై దృష్టిని కేంద్రీకరిస్తోంది. దీనిలో భాగంగా మహిళలకు ఆర్థిక సాధికారత కల్పనను ఒక కీలక, విస్తృత ప్రాధాన్యం కలిగిన రంగంగా గుర్తించింది.
ఈ ప్రాంతంలో ‘‘భద్రత ప్రదాత’’గా భారత్ పోషిస్తున్న పాత్రను కూడా శ్రీ సొనోవాల్ వివరించారు. మానవతాపూర్వక సహాయాన్ని అందించడం, నౌకావాణిజ్య సంబంధిత నిఘా, వైపరీత్యాల వేళ ప్రతిస్పందన పూర్వక చర్యలను చేపట్టడం వంటి అంశాలను ఆయన గుర్తు చేశారు. నౌకావాణిజ్యంలో సవాళ్లను ఏ ఒక్క దేశమో ఒంటరిగా ఎదుర్కోజాలదని మంత్రి అన్నారు. ఈ విషయంలో పారదర్శకత, అంతర్జాతీయ చట్టాల్ని గౌరవించడం ప్రాతిపదికలుగా ఉమ్మడి ప్రయత్నాలు అవసరమని ఆయన పిలుపునిచ్చారు.
‘‘సురక్షితమైన, భద్రమైన, సుస్థిరమైన హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని ప్రోత్సహించే దిశగా భాగస్వామ్య దేశాలన్నిటితోనూ కలిసి పనిచేయడానికి భారత్ కట్టుబడి ఉంది’’ అని శ్రీ సొనోవాల్ అన్నారు.
హిందూ మహాసముద్ర చర్చా కార్యక్రమాన్ని (ఇండియన్ ఓషన్ డైలాగ్..ఐఓడీ) 2014లో ప్రారంభించారు. ఇది ఐఓఆర్ఏ కు చెందిన ప్రధానమైన ‘ట్రాక్ 1.5 వేదిక’గా నిలుస్తోంది. ఈ వేదిక కీలక ప్రాంతీయ అంశాలపై చర్చోపచర్చలు చేయడానికి మంత్రులనూ, విధాన రూపకర్తలనూ, విద్యారంగ నిపుణులనూ, పారిశ్రామిక రంగ ప్రముఖులనూ ఆహ్వానిస్తోంది. ఐఓఆర్ఏలో 23 సభ్య దేశాలతో పాటు, చర్చల్లో పాల్గొనేందుకు 12 మంది ఇతర భాగస్వాములు కూడా ఉన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఆర్థిక సహకారం, సుస్థిర ప్రాతిపదిక కలిగివుండే అభివృద్ధి అంశాలపై ఐఓఆర్ఏ దృష్టిని కేంద్రీకరిస్తుంది. దీనిలో ‘బ్లూ ఎకానమీ’తో పాటు మహిళల ఆర్థిక సాధికారతను ఒక కీలక ప్రాధాన్యాంశంగా గుర్తించారు. పదో చర్చా కార్యక్రమాన్ని 2026 మే నెల 7, 8వ తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నారు. దీనిలో నౌకావాణిజ్య భద్రత, బ్లూ ఎకానమీ, విపత్తుల వేళల్లో రిస్క్ మేనేజ్మెంట్, వాతావరణ మార్పు, మహిళలకు సాధికారత కల్పన అంశాలపై ప్రత్యేక సదస్సుల్ని నిర్వహిస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2259057)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6