శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘భారత కాలుష్య రహిత రవాణా కార్యక్రమం’ కింద స్వదేశీ టైప్-4 సీఎన్‌జీ సిలిండర్ల వాణిజ్యీకరణ దిశగా ‘ఎన్‌టీఎఫ్‌ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌’తో ‘టీడీబీ-డీఎస్‌టీ’ ఒప్పందం

నాడు పోస్టు చేయడమైనది: 07 MAY 2026 10:51AM by PIB Hyderabad

స్వయంసమృద్ధ భారత్ కార్యక్రమం కింద కాలుష్య రహిత ఇంధన రవాణా రంగానికి ప్రోత్సాహం, కర్బన ఉద్గారాల తగ్గింపు, స్వదేశీ తయారీ రంగ బలోపేతం తదితరాలపై కేంద్ర ప్రభుత్వ దృష్టి సారించింది. దీనికి అనుగుణంగా “టైప్-4 సీఎన్‌జీ సిలిండర్ల వాణిజ్యీకరణ కోసం తయారీ కేంద్రం”  ఏర్పాటుకు నిర్ణయించింది. దీనిపై కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ (డీఎస్‌టీ) పరిధిలోని ‘టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్’ (టీడీబీ) ఢిల్లీ నగరంలోని “మెస్సర్స్ ఎన్‌టీఎఫ్‌ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌”తో ఒప్పందం కుదుర్చుకుంది.

 

అత్యాధునిక ఫిలమెంట్ వైండింగ్, బ్లో మోల్డింగ్, హై-ప్రెజర్‌ పరీక్ష సాంకేతిక పరిజ్ఞానాలతో దేశీయంగా రూపొందించిన టైప్-4 కాంపోజిట్ సీఎన్‌జీ సిలిండర్ల ఉత్పాదన-వాణిజ్యీకరణకు అధునాతన తయారీ కేంద్రం ఏర్పాటు చేయడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ కార్యక్రమంతో కాలుష్య రహిత రవాణా రంగం, ఆధునిక ఇంధన అనువర్తనాల దిశగా అధునాతన గ్యాస్ నిల్వ వ్యవస్థలలో భారత్‌ దేశీయ సామర్థ్యం  బలోపేతం కాగలదని అంచనా.

సంప్రదాయ స్టీల్ సిలిండర్లకు టైప్-4 కాంపోజిట్ సిలిండర్లు నవ తరం ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. వీటివల్ల బరువు 75 శాతం తగ్గి, వాహన సామర్థ్యం మెరుగుపడటమే కాకుండా కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి. మరోవైపు భద్రత, మన్నిక మెరుగుపడటం సహా లీకేజ్, కంపనం, పీడన వర్తులత నిరోధకతకు భరోసా లభిస్తుంది. తుప్పు పట్టని పాలిమర్ లైనర్, ఆప్టిమైజ్డ్ ‘సీఎఫ్‌ఆర్‌పీ’ లేఅప్, ఆధునిక మెకానికల్ లాకింగ్ వ్యవస్థలతో ఈ సిలిండర్లను రూపొందించారు. నిర్దేశిత నియంత్రణ నిబంధనలతో పోలిస్తే గణనీయంగా ‘600 బార్ల’కు మించి ‘బరస్ట్ ప్రెజర్‌’ను ఈ డిజైన్‌ అందిస్తుంది. తద్వారా కార్యాచరణ పరంగా పటిష్ట భద్రత లభిస్తుంది.

‘ఎన్‌టీఎఫ్‌’ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ సాంకేతికతను దేశీయంగానే రూపొందించింది. భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న సీఎన్‌జీ రవాణావరణానికి తోడ్పాటునిచ్చేదిగా దీన్ని తయారు చేశారు. సుస్థిర రవాణా, కాలుష్య రహిత ఇంధనాలు, అత్యాధునిక రవాణా పరికరాల దేశీయ తయారీ దిశగా ప్రభుత్వం చేస్తున్న విస్తృత కృషికి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ ఏర్పాటవుతుంది.

ప్రతిపాదిత కర్మాగారం స్థానికంగా లభించే ముడి పదార్థాలను, అధునాతన తయారీ ప్రక్రియలను సద్వినియోగం చేసుకుంటుంది. తద్వారా అధిక పీడన కాంపోజిట్ సిలిండర్ల కోసం స్వల్ప వ్యయంతో, భవిష్యత్‌ సంసిద్ధ ఉత్పాదక వ్యవస్థను సృష్టిస్తుంది. దేశంలో దిగుమతి పరాధీనత తగ్గింపు, సాంకేతిక స్వయంసమృద్ధి, పటిష్ట కాలుష్య రహిత ఇంధన సరఫరా వ్యవస్థల వృద్ధికి ఇది గణనీయంగా దోహదం చేస్తుందని అంచనా.

ఈ నేపథ్యంలో ‘టీడీబీ’ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ పాఠక్ మాట్లాడుతూ- “భారత కాలుష్య రహిత రవాణా మౌలిక సదుపాయాలు సహా దేశీయ తయారీ రంగ బలోపేతానికి అత్యాధునిక టైప్-4 కాంపోజిట్ సిలిండర్ల రూపకల్పన-వాణిజ్యీకరణ అత్యంత కీలకం. సుస్థిర రవాణా, ఇంధన భద్రత, స్వయంసమృద్ధ భారత్‌ సాకారానికి దోహదం చేసే భావితరం సాంకేతికతలను ప్రోత్సహించడంలో ప్రభుత్వ నిబద్ధతను ఈ ఒప్పందం ప్రతిబింబిస్తుంది” అని పేర్కొన్నారు.

‘టీడీబీ’ తమకు చేయూతనివ్వడంపై ‘ఎన్‌టీఎఫ్’ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నవీన్ జైన్, డైరెక్టర్ శ్రీ నమన్ జైన్ కృతజ్ఞతలు తెలిపారు. స్వదేశీ తేలికపాటి కాంపోజిట్ సిలిండర్ సాంకేతికతల వాణిజ్యీకరణను ఈ ఒప్పందం వేగిరపరుస్తుందని వారు అన్నారు. తద్వారా భారత్‌ మరింత కాలుష్య రహిత, సమర్థ రవాణా పరిష్కారాల వైపు మళ్లడంలో తమ కంపెనీ తోడ్పాటునిస్తుందని వారు పేర్కొన్నారు.

***


(రిలీజ్ ఐడి: 2258679) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Gujarati , हिन्दी , Tamil