శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రహదారి మౌలిక సదుపాయాల్లో కాలం చెల్లిన ప్లాస్టిక్‌ ఉపయోగించే వినూత్న ఆలోచన


సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐ, బీపీసీఎల్ సంస్థలకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు

నాడు పోస్టు చేయడమైనది: 06 MAY 2026 6:35PM by PIB Hyderabad

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) సహకారంతో... "కాలం చెల్లిన ప్లాస్టిక్‌తో తయారు చేసిన టెక్నికల్ టెక్స్‌టైల్ జియోసెల్‌ను ఉపయోగించి నిర్మించిన మొదటి రోడ్‌బ్లాక్ సెక్షన్" ను సాధించిన సీఎస్ఐఆర్-సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐ) సంస్థ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు సాధించింది.

సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్, డీఎస్ఐఆర్ కార్యదర్శి డాక్టర్ ఎన్. కలైసెల్వి సమక్షంలో, న్యూఢిల్లీలోని సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐ ఆడిటోరియంలో ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

నిర్మాణ రంగంలో ప్లాస్టిక్ వ్యర్థాలను శాస్త్రీయంగా, ఆచరణాత్మకంగా ఉపయోగించే విధానాన్ని ప్రదర్శించిన ఈ విజయం సుస్థిర రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుంది. శుద్ధి చేసిన ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారు చేసిన టెక్నికల్ టెక్స్‌టైల్ జియోసెల్స్‌ను అభివృద్ధి చేయడం, ఉపయోగించడం గుర్తింపు పొందిన ఈ సాంకేతికతలో భాగంగా ఉంటుంది. నిర్వహించడానికి కష్టంగా ఉండే ప్లాస్టిక్ వ్యర్థాలను విలువైన మౌలిక సదుపాయాల సామాగ్రిగా మార్చే వినూత్న మార్గాన్ని ఇది అందిస్తుంది.

ఈ కార్యక్రమం సుస్థిర వ్యర్థాల నిర్వహణ, పటిష్ఠ రహదారి నిర్మాణం అనే రెండు కీలక జాతీయ ప్రాధాన్యాలను పరిష్కరిస్తుందని సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ సి.హెచ్. రవిశేఖర్ తెలిపారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను జియోసెల్ ఆధారిత రోడ్‌బ్లాక్ అనువర్తనాలతో ఏకీకృతం చేయడం ద్వారా, ఈ సాంకేతికత ప్లాస్టిక్ డిస్పోజల్‌తో ముడిపడి ఉన్న పర్యావరణ భారాన్ని తగ్గిస్తుంది. సర్క్యులర్ ఎకానమీ లక్ష్యాలకూ ఇది దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐ సైంటిస్ట్ ఎఫ్ డాక్టర్ అంబికా బెల్ మాట్లాడుతూ, "ఈ విజయం సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐ, బీపీసీఎల్ మధ్య సహకారాత్మక పరిశోధన బలాన్ని ప్రతిబింబిస్తుంది. సుస్థిరమైన, వనరులను సమర్థంగా వినియోగించే రహదారి ఇంజనీరింగ్‌కు దోహదపడే, క్షేత్రస్థాయిలో విస్తరించగలిగే సాంకేతికతలను అభివృద్ధి చేయడం పట్ల మా నిబద్ధతను ఇది బలపరుస్తుంది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా లభించిన ఈ గుర్తింపు... ఆచరణాత్మక మౌలిక సదుపాయాల పరిష్కారాల ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సవాలును శాస్త్రీయ ఆవిష్కరణలు ఎలా పరిష్కరించగలవో ప్రదర్శించడంలో కీలక ముందడుగు అవుతుంది" అన్నారు. సీఆర్ఆర్ఐ సైంటిస్ట్ శ్రీ గగన్‌దీప్ సింగ్ మాట్లాడుతూ, "ఉత్పత్తి వ్యర్థాల వినియోగ లక్ష్యాలను నెరవేర్చడమే కాకుండా... నిర్మాణ సమగ్రత, మన్నిక, క్షేత్రస్థాయి అనువర్తనీయత పరంగా ఇంజనీరింగ్ పనితీరు అవసరాలనూ తీర్చేలా చూడటం ఈ కృషిలో కీలకం" అని తెలిపారు. అభివృద్ధి చేసిన జియోసెల్ వ్యవస్థ రహదారి అనువర్తనాలకు ఎంతగా అనుకూలంగా ఉందో అంచనా వేయడం కోసం విస్తృతమైన పదార్థ లక్షణాల నిర్ధారణ, పనితీరు మూల్యాంకనం, ధ్రువీకరణ అధ్యయనాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

పరిశోధనను విస్తృత క్షేత్రస్థాయి అనువర్తనాల్లోకి మార్చడంలో పరిశ్రమ-విద్యాసంస్థల సహకారం ప్రాముఖ్యతను బీపీసీఎల్ చీఫ్ మేనేజర్ డాక్టర్ మహేష్ కస్తూరే స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ, వనరుల సామర్థ్యానికి అనుగుణంగా సుస్థిర మౌలిక సదుపాయాల పరిష్కారాల పట్ల పెరుగుతున్న భారత్ నిబద్ధతనూ ఈ విజయం ప్రతిబింబిస్తుంది. రిఫైనరీల ప్రస్తుత కార్యాచరణ విధానం దృష్ట్యా, బీపీసీఎల్ సుస్థిరత లక్ష్యాల్లో భాగంగా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేపట్టినట్లు తెలిపారు. ఆ లక్ష్యాలకు సంబంధించిన కొన్ని అవసరాలను తీర్చడంలో ఇది సహాయపడుతుందని బీపీసీఎల్ జీఎం (ఆర్&డి) డాక్టర్ టి. చిరంజీవి తెలిపారు.

చివరగా, ఈ రికార్డు ద్వారా సాధించిన సమగ్ర విజయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ... కార్యక్రమానికి హాజరైన వారందరికీ సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ వినోద్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.

రహదారి ఇంజనీరింగ్ రంగంలోనే మొదటి ప్రదర్శనగా దీని కొత్తదనాన్ని, ప్రభావాన్ని 'ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్' గుర్తింపు ధ్రువీకరిస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2258563) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी