రక్షణ మంత్రిత్వ శాఖ
భారత-అల్జీరియా రక్షణ సహకారం మరింత విస్తృతం.. న్యూఢిల్లీలో తొలి సంయుక్త కమిషన్ సమావేశం
నాడు పోస్టు చేయడమైనది:
06 MAY 2026 1:22PM by PIB Hyderabad
భారత్, అల్జీరియా దేశాల మధ్య తొలి సంయుక్త కమిషన్ సమావేశం మే 05, 2026న న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో భాగంగా ఇరు దేశాలు తమ రక్షణ రంగ సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించాయి. ముఖ్యంగా శిక్షణ, సైనిక విన్యాసాలు, వైద్య సహకారం, రక్షణ పరిశ్రమలు వంటి కీలక రంగాల్లో పరస్పర ప్రయోజనాలపై ఇరు పక్షాలు సుదీర్ఘంగా చర్చించాయి. రక్షణ రంగ కార్యకలాపాలను భవిష్యత్తులో మరింత విస్తరించుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి.
AAES.jpeg)
ఈ సందర్భంగా భారత-అల్జీరియా రక్షణ సహకార అమలును పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన నియమావళిపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ నియమాలు భవిష్యత్తులో జరిగే సంయుక్త కమిషన్ సమావేశాలకు ఒక మార్గదర్శక ప్రణాళికలా పనిచేస్తాయి. ఈ కీలక సమావేశానికి భారత్ తరపున రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి (అంతర్జాతీయ సహకారం) శ్రీ అమితాబ్ ప్రసాద్, అల్జీరియా తరపున నౌకాదళ అధిపతి మేజర్ జనరల్ కైద్ నూర్ ఎద్దీన్ సహ-అధ్యక్షులుగా వ్యవహరించారు. భారత ప్రతినిధుల బృందంలో త్రివిధ దళాల అధికారులు, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్, కేంద్ర కార్యాలయం, రక్షణ ఉత్పత్తి విభాగం, డీఆర్‌డీఓ, సాయుధ దళాల వైద్య సేవలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
JWVT.jpeg)
2024లో రక్షణ అవగాహన ఒప్పందంపై సంతకం చేసినప్పటి నుంచి భారత్, అల్జీరియాల మధ్య రక్షణ సంబంధాలు ఊపందుకున్నాయి. ఇరుపక్షాల ఉన్నత స్థాయి పర్యటనలు ఈ సంబంధాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. అల్జీరియా నౌకాదళ అధిపతి పర్యటన భారత్-అల్జీరియా రక్షణ సంబంధాల పురోగతిలో కీలకంగా నిలిచింది. పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో కలిసి పనిచేయడానికి ఇరుపక్షాల నిబద్ధతను ఇది మరింత బలపరుస్తుంది.
ఈ సమావేశానికి ముందు, మేజర్ జనరల్ కైద్ నూర్ ఎద్దీన్ న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ పర్యటన సందర్భంగా అల్జీరియా ప్రతినిధి బృందం రక్షణ రంగ పరిశ్రమల ప్రతినిధులతో కూడా సమావేశం కానుంది.
***
(రిలీజ్ ఐడి: 2258411)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8