కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
మే 6 నుంచి తిరువనంతపురంలో బ్రిక్స్ ఉపాధి కార్యవర్గ రెండో సమావేశం
సామాజిక భద్రతా వ్యవస్థల బలోపేతం, మహిళల భాగస్వామ్యం పెంపు, నైపుణ్యాల గుర్తింపు, డిజిటల్ సాంకేతికత వినియోగంపై సభ్య దేశాల చర్చలు
నాడు పోస్టు చేయడమైనది:
05 MAY 2026 4:40PM by PIB Hyderabad
భారత్ అధ్యక్షతన బ్రిక్స్ 2026 రెండో ఉపాధి కార్యవర్గ సమావేశం మే 6, 7 తేదీల్లో కేరళలోని తిరువనంతపురంలో జరగనుంది. ఈ రెండు రోజుల సదస్సులో బ్రిక్స్ సభ్య దేశాలైన బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాతో పాటు కొత్తగా చేరిన సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, ఇండోనేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొననున్నారు. కార్మిక, ఉపాధి, కార్మిక సంక్షేమ రంగాలకు చెందిన నిపుణులు ఈ సమావేశంలో తమ దేశాల తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు.
మొదటి ఉపాధి కార్యవర్గ సమావేశంలో చర్చించిన అంశాలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ సదస్సు ఒక కీలక వేదికగా నిలవనుంది. ముఖ్యంగా భారత్ ప్రతిపాదించిన ప్రాధాన్యత అంశాలు, లక్ష్యాలపై సభ్య దేశాల మధ్య స్పష్టమైన అవగాహన పెంపొందించడం ఈ రెండో సమావేశం ప్రధాన ఉద్దేశం. బ్రిక్స్ ఉపాధి కార్యవర్గం గుర్తించిన నాలుగు ప్రధాన ఇతివృత్తాల చుట్టూ ఈ సమావేశం సాగనుంది. ఇందులో భాగంగా ఆచరణాత్మక విధానాలు, వివిధ దేశాల అనుభవాలు, పరస్పర సహకార రంగాలపై సభ్య దేశాలు సమగ్రంగా చర్చించనున్నాయి.
కార్మిక మార్కెట్లను క్రమబద్ధీకరించడం, సామాజిక భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించనుంది. ముఖ్యంగా డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు ఒక చోటు నుంచి మరోచోటికి బదిలీ చేసుకునే వీలున్న సామాజిక భద్రతా యంత్రాంగాలు, ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యే డిజిటల్ పరిష్కారాల ద్వారా కార్మికులకు సంక్షేమ ఫలాలు ఎలా అందించాలనే అంశంపై సభ్య దేశాలు చర్చించనున్నాయి. వివిధ ఉపాధి రంగాల్లో ఉన్న కార్మికులకు సామాజిక రక్షణ కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం.
ఉపాధి రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం ఈ సమావేశంలో కీలక అంశం. మహిళా ఉపాధిని ప్రోత్సహించే విధానాలు, పని ప్రదేశాల్లో వారి ప్రాతినిధ్యాన్ని మెరుగుపరచడం, అడ్డంకులను తొలగించడం, అన్ని రంగాల్లో మహిళలకు గౌరవప్రదమైన పని అవకాశాలను ప్రోత్సహించే విధానపరమైన చర్యలపై సభ్య దేశాలు తమ అనుభవాలను పంచుకునేందుకు ఈ సమావేశం ఒక అవకాశాన్ని అందిస్తుంది.
మారుతున్న పని స్వరూపానికి అనుగుణంగా ఉపాధి సామర్థ్యం, నైపుణ్యాల గుర్తింపు, నైపుణ్యాభివృద్ధిపై చర్చలు జరగనున్నాయి. డిజిటల్ నైపుణ్యాలను బలోపేతం చేయడం, భవిష్యత్తులో అవసరమయ్యే కొత్త రకపు నైపుణ్యాలను గుర్తించడం, కార్మిక మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా శ్రామిక శక్తి నైపుణ్యాలను తీర్చిదిద్దడంపై బ్రిక్స్ దేశాల మధ్య సహకారం కోరుతూ ఈ చర్చలు సాగుతాయి.
డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులతో సహా అందరికీ సామాజిక భద్రత, సేవలు, అవకాశాలను ఎలా విస్తరించవచ్చనే అంశాన్ని ఈ సమావేశం పరిశీలిస్తుంది. కార్మికుల నమోదు, సంక్షేమ పథకాల పంపిణీ, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, కార్మిక మార్కెట్ సమాచారాన్ని మెరుగుపరచడానికి సాంకేతిక ఆధారిత వ్యవస్థల వినియోగంపై సభ్య దేశాలు చర్చించనున్నాయి.
ఈ చర్చలను మరింత ఫలప్రదం చేసేందుకు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ), అంతర్జాతీయ సామాజిక భద్రతా సంఘం (ఐఎస్‌ఎస్‌ఏ), ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కోఆర్డినేటర్ కార్యాలయం వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు భాగస్వాములుగా పాల్గొంటున్నాయి. ఉపాధి, కార్మిక సంక్షేమం, సామాజిక భద్రత, భవిష్యత్తు పని విధానాలపై తమకున్న అంతర్జాతీయ అనుభవాలను, సాంకేతిక సలహాలను ఈ సంస్థలు ప్రతినిధులతో పంచుకోనున్నాయి.
మార్చి 16–17, 2026 తేదీల్లో వర్చువల్ విధానంలో విజయవంతంగా జరిగిన మొదటి ఉపాధి కార్యవర్గ సమావేశానికి ఇది కొనసాగింపు. మొదటి సమావేశం నాలుగు ప్రాధాన్యతా రంగాలపై నిర్మాణాత్మక చర్చలను ప్రారంభించింది. అవి సామాజిక భద్రతను పెంపొందించడం, కార్మిక మార్కెట్ల క్రమబద్ధీకరణ... మహిళా ఉపాధి, వారి భాగస్వామ్యాన్ని పెంచడం... నైపుణ్యాల గుర్తింపు,అభివృద్ధిలో సహకారం... గిగ్, ప్లాట్‌ఫాం కార్మికులకు డిజిటల్ సాంకేతికతను చేరువ చేయడం.
మొదటి సమావేశం అందించిన ఫలితాల ఆధారంగా ఈ రెండో ఈడబ్ల్యూజీ సమావేశం ప్రాధాన్యత రంగాలను మరింత స్పష్టం చేయడానికి ఒక వ్యవస్థీకృత అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రతిపాదిత లక్ష్యాలను లోతుగా చర్చించడంతో పాటు, బ్రిక్స్ ఉపాధి కార్యవర్గ ప్రక్రియలో భాగంగా ముందుకు తీసుకెళ్లాల్సిన భవిష్యత్తు కార్యాచరణకు ఈ సమావేశం ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఈ సమావేశంలో చర్చకు వచ్చే ప్రతిపాదనలను మూడో ఈడబ్ల్యూజీ సమావేశంలో తుది దశకు చేరుస్తారు. అనంతరం ఈ ఏడాది జులైలో జరగనున్న బ్రిక్స్ కార్మిక, ఉపాధి మంత్రుల సమావేశంలో వీటిని అధికారికంగా ఆమోదించనున్నారు.
బ్రిక్స్ సభ్య దేశాలు, అంతర్జాతీయ నైపుణ్య భాగస్వాముల క్రియాశీల భాగస్వామ్యం... కార్మిక, ఉపాధి రంగాల్లో పరస్పర ప్రయోజనకరమైన, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకున్న ఫలితాలను సాధించడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2258171)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6