రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఆర్మీ శిక్షణ కమాండ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన భారత రాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 01 MAY 2026 12:39PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి, సాయుధ దళాల సుప్రీం కమాండర్ శ్రీమతి ద్రౌపది ముర్ము నేడు సిమ్లాలోని ఆర్మీ శిక్షణ కమాండ్ (ఏఆర్‌టీఆర్‌ఏసీ) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ కవీందర్ గుప్తా, ఏఆర్‌టీఆర్‌ఏసీ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర శర్మ ఆమెకు స్వాగతం పలికారు.

 

ఈ సందర్భంగా ఏఆర్‌టీఆర్‌ఏసీ పరిణామక్రమం, భారత సైనిక సిబ్బంది కార్యాచరణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి నాణ్యమైన శిక్షణ అందించడంలో ఏఆర్‌టీఆర్‌ఏసీ పోషిస్తున్న కీలక పాత్ర, చేపడుతున్న ప్రధాన కార్యక్రమాల గురించి జీఓసీ-ఇన్-సీ రాష్ట్రపతికి వివరించారు. ముఖ్యంగా డ్రోన్ శిక్షణకు ఇస్తున్న ప్రాధాన్యత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం కోసం తీసుకుంటున్న చర్యలు, ‘రెడ్ టీమింగ్’ భావనను ప్రవేశపెట్టడం, భారత సైన్యంలో డిజిటలైజేషన్, ఆటోమేషన్ దిశగా సాగుతున్న కార్యక్రమాల గురించి ఆయన వివరించారు.

 

యుద్ధ భావనల రూపకల్పన, భారత సైన్యానికి అవసరమైన వనరుల అభివృద్ధి, మిత్ర విదేశాలతో. ఇతర రక్షణ విభాగాలతో విస్తృతమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉండటంలో ఏఆర్‌టీఆర్‌ఏసీ పాత్ర అత్యంత కీలకమని రాష్ట్రపతి ఈ సందర్భంగా కొనియాడారు. సైనిక వైభవం, ఆత్మనిర్భరత, వికసిత్ భారత్ సాధనలో ఇదొక కీలక సాధనమని ఆమె పేర్కొన్నారు. తన పరిధిలోని 32 అగ్రశ్రేణి శిక్షణ కేంద్రాల ద్వారా భారత సైన్యంలో వృత్తి నైపుణ్యాన్ని ఏఆర్‌టీఆర్‌ఏసీ పెంపొందిస్తుందని తెలిపారు. ఇది యుద్ధ కళ, విజ్ఞాన శాస్త్రంలో సైన్యానికి ఒక విశిష్టమైన దృక్పథాన్ని కల్పిస్తోందని ఆమె ప్రశంసించారు.

 

దేశాన్ని సురక్షితంగా, శక్తిమంతంగా తీర్చిదిద్దడంలో భాగంగా భారత సైన్యంలో శిక్షణపై హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ కవీందర్ గుప్తా సమక్షంలో లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర శర్మతో రాష్ట్రపతి తన అభిప్రాయాలను పంచుకున్నారు.

 

భారత సైన్యం కార్యాచరణ సంసిద్ధతను పెంపొందించడానికి ఏఆర్‌టీఆర్‌ఏసీ తన కృషిని ఇదే ఉత్సాహంతో కొనసాగించాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. ఏఆర్‌టీఆర్‌ఏసీలోని అన్ని స్థాయిల సైనిక అధికారులు, సిబ్బంది, రక్షణ పౌర అధికారులు చేస్తున్న అద్భుతమైన పనిని ఆమె అభినందించారు. భవిష్యత్తులో మరింత పట్టుదలతో, దీక్షతో పనిచేయాలని వారిని కోరారు.

 


(రిలీజ్ ఐడి: 2257420) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali