ఆయుష్
మరో 50 రోజుల్లోఅంతర్జాతీయ యోగా దినోత్సవం-2026: యోగా మహోత్సవానికి రేపటి నుంచే తెలంగాణ సన్నద్ధం
అత్యధిక యోగాభ్యాసకులతో భుజంగాసనం ద్వారా ‘ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో నమోదుకు చారిత్రక ప్రయత్నం
నాడు పోస్టు చేయడమైనది:
01 MAY 2026 4:44PM by PIB Hyderabad
కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ (ఎండీఎన్‌ఐవై) 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి (ఐడీవై-2026) సిద్ధమవుతోంది. ఈ మేరకు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోగల కన్హా శాంతి వనంలో 2026 మే 2 నుంచి 50 రోజులపాటు ‘యోగా మహోత్సవ్-2026’కు శ్రీకారం చుడుతుంది. హైదరాబాద్ సమీపంలోని ప్రపంచ ప్రసిద్ధ ‘హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ సెంటర్’కు నెలవైన కన్హా శాంతి వనంలోని ప్రశాంత ప్రాంగణం మహా క్రతువుకు ఆతిథ్యం ఇస్తుంది.
ఈ కార్యక్రమం రేపు ఉదయం 6:00 గంటల నుంచి ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక యోగా విధివిధానాలు (సీవైపీ) అనుసరించే ఔత్సాహిక యోగాభ్యాసకులు ఈ మహా యజ్ఞంలో భారీగా పాల్గొంటారని అంచనా.
ఔత్సాహికులందరూ సామూహికంగా భుజంగాసన భంగిమను ప్రదర్శించడం ఈ కార్యక్రమ ప్రధాన ఆకర్షణ. ‘ఐడీవై’నాడు ఈ ప్రదర్శన ద్వారా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధించే చారిత్రక ప్రయత్నంలో భాగంగా వీరంతా 2వ తేదీనుంచి ఏకకాలంలో సమన్వయంతో సాధన చేస్తారు.
గౌరవనీయులైన కేంద్ర బొగ్గు-గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, కేంద్ర ఆయుష్ శాఖ (స్వతంత్ర బాధ్యతగల), ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖల సహాయ మంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్ సహా హార్ట్‌ఫుల్‌నెస్ అధ్యక్షులు కమలేష్ డి.పటేల్ (దాజీ) ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ సందర్భంగా శ్రీ ప్రతాప రావు జాదవ్ యోగా మహోత్సవం గురించి వివరిస్తూ- “రాబోయే 50 రోజుల ఈ ప్రస్థానాన్ని ఒక శక్తిమంతమైన సామూహిక సంకల్పంగా మలచుకోవాలని ప్రతి ఒక్కరికీ నా వినతి. యోగాభ్యాసాన్ని ఒక్క రోజుకే పరిమితం చేయరాదు… దైనందిన జీవనంలో అనుక్షణం మన ప్రతి శ్వాసలోనూ దాన్నొక భాగం చేసుకోవాలి. ఆరోగ్యకర కాయం, ప్రశాంత చిత్తం, శక్తియుత-సుసంపన్న భారత్‌ను సాకారం చేసే దిశగా మనమంతా సమష్టిగా ఉద్యమిద్దాం” అని పిలుపునిచ్చారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వైద్య రాజేష్ కోటెచా, సంయుక్త కార్యదర్శి శ్రీమతి మోనాలిసా దాష్ సహా ఆ విభాగంలోని సీనియర్ అధికారులు, యోగా గురువులు సహా ఆయుష్ విధానాలను అనుసరించే ఆధునిక వైద్య నిపుణులు, దేశవ్యాప్తంగాగల యోగాభ్యాసకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ప్రపంచవ్యాప్తంగా యోగా, భారతీయ ఆరోగ్య సంప్రదాయాలతో మానవాళి అనుబంధం పెనవేసుకోవడాన్ని ప్రతిబింబిస్తూ- వివిధ రాయబార కార్యాలయాలు, అంతర్జాతీయ సంస్థల ప్రముఖులు కూడా ఈ 50 రోజుల సన్నాహక కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. వీరిలో హైదరాబాద్‌లోని కజకిస్తాన్ గణతంత్ర గౌరవ కాన్సుల్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్, లెసోతో రాజ్య గౌరవ కాన్సుల్ సూరత్ సింగ్ మల్హోత్రా, బల్గేరియా గౌరవ కాన్సుల్ కిరణ్ కుమార్, క్యూబా వాణిజ్య కమిషనర్ డాక్టర్ మూర్తి దేవరభట్ల, నమీబియా వాణిజ్య కమిషనర్ డాక్టర్ తస్నీమ్ షరీఫ్, హైదరాబాద్‌లోని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్, కెనడా వాణిజ్య కార్యాలయ అధికారి విక్రమ్ జైన్, ఆస్ట్రేలియా వీసా దరఖాస్తు కేంద్రం నుంచి రామకృష్ణ తదితరులున్నారు.
మరోవైపు సింగపూర్, చైనా, వియత్నాం, కొలంబియా, మలేషియా, బ్రెజిల్, ఉగాండా శరణార్థి శిబిరం సహా ప్రపంచవ్యాప్త దౌత్య కార్యాలయాల కాన్సులేట్ జనరళ్లు, హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులు, భారత్‌లోని వివిధ కేంద్రాల నుంచి అభ్యాసకులు ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా పాల్గొనే ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ భాగస్వామ్యం కూడా విస్తృతంగా ఉంటుంది. ఈ అభ్యాస సందర్భంగా ‘ఆయుష్ ఆహారం’ కూడా పంపిణీ చేస్తారు.
అంతర్జాతీయ యోగ దినోత్సవానికి ముందు కీలక సన్నాహకంగా ఏటా కొనసాగే ఈ మహోత్సవం దేశవ్యాప్తంగా నిర్వహించే వివిధ పలు కార్యక్రమాలు, భారీ ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాల ద్వారా జన భాగస్వామ్య బలోపేతం సహా విస్తృత ప్రచారానికి ఉపకరణంగా ఉపయోగపడుతుంది.
ఆరోగ్యకర, పటిష్ట, భారత్ రూపకల్పనపై ప్రభుత్వ దృక్కోణానికి అనుగుణంగా ఈ నెల 2 నుంచి ప్రారంభమయ్యే 50 రోజుల సన్నాహక కార్యక్రమం యోగా మహోత్సవం-2026 అందరికీ మరింత ఉత్తేజం చేకూర్చడంతోపాటు వ్యాధినిరోధక ఆరోగ్య సంరక్షణ, మానసిక శ్రేయస్సు, సంపూర్ణ జీవనానికి యోగా శక్తిమంతమైన సాధనమనే సందేశాన్ని మరింతగా విశ్వవ్యాప్తం చేయనుంది.
***
(రిలీజ్ ఐడి: 2257337)
సందర్శకుల సూచీ సంఖ్య : : 33