సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రగాఢ ఆధ్యాత్మిక ఉత్సాహం నడుమ లేహ్‌‌కు చేరిన తథాగత బుద్ధుని పవిత్ర అవశేషాలు


సాంప్రదాయక రీతిలో స్వాగతం పలికిన లెఫ్టినెంట్ గవర్నరు...
ఈ చరిత్రాత్మక సందర్భంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజానీకం

प्रविष्टि तिथि: 29 APR 2026 5:32PM by PIB Hyderabad

ప్రగాఢ ఆధ్యాత్మిక ఉత్సాహం, భక్తిమయ వాతావరణం నడుమ తథాగత బుద్ధుని పవిత్ర పిప్‌రావా అవశేషాలు ఈ రోజు లేహ్‌కు చేరుకున్నాయి. ఈ కార్యక్రమం కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌లో ఓ చరిత్రాత్మక ఆధ్యాత్మిక ఉత్సవ ప్రారంభానికి ప్రతీకగా నిలిచింది.

స్వాగత కార్యక్రమంలో సాంప్రదాయిక ప్రదర్శనలు, లాంఛనపూర్వక గౌరవ సత్కారాలతో పాటు పవిత్ర ఆచారాలను పాటించారు. ద్రుక్‌పా థుక్‌సే రిన్‌పోచే, మాథో మఠానికి చెందిన ఖేన్‌పో థిన్‌లాస్ చోసల్ లు వైమానిక దళ ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తీసుకువచ్చిన అవశేషాలను లడఖ్‌లో లెఫ్టినెంట్ గవర్నరు శ్రీ వినయ్ కుమార్ సక్సేనా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఖామ్‌తక్ రిన్‌పోచే, రిగ్యాల్ రిన్‌పోచే,  లడఖ్‌ గోన్‌పా అసోసియేషన్ ప్రెసిడెంటు పూజ్య దోర్‌జే స్టాన్‌జిన్, లడఖ్ బౌద్ధ సంఘం ప్రెసిడెంటు చెరింగ్ దోర్‌జే లక్‌రుక్, పార్లమెంట్ పూర్వ సభ్యులు థుప్‌స్టన్ చెవాంగ్, జామ్‌యాంగ్ త్సెరింగ్ నామ్‌గ్యాల్, పూర్వ సీఈసీ ఎల్ఏహెచ్‌ఏడీసీ లేహ్ తాతశీ గ్యాల్‌సన్‌లతో పాటు వివిధ సామాజిక, ధార్మిక, రాజకీయ సంస్థల ప్రతినిధులు సహా ప్రముఖ ధార్మిక, ప్రజా ప్రముఖులు కూడా ఉన్నారు.

లడఖ్ పోలీసు ఆచారపూర్వక గార్డ్ ఆఫ్ ఆనర్‌ను నిర్వర్తించగా, భిక్షువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సంప్రదాయబద్ధ స్వాగత సమారోహం అనంతరం, అవశేషాలను ఘనమైన ఊరేగింపుతో జీవత్సల్‌కు తీసుకువెళ్లారు. అక్కడ మే నెల 1 నాటి నుంచి ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. (మే 1 నాడు 2569వ బుద్ధ పూర్ణిమ). ఈ కార్యక్రమంలో లడఖ్ నలు మూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  ఇది ఐకమత్యానికీ, విశ్వాసానికీ, సామూహిక శ్రద్ధాప్రపత్తులకీ అద్దం పట్టింది. ఈ సందర్బంగా వేల మంది భక్తులు సాంప్రదాయిక వస్త్రధారణలో జీవత్సల్ వరకు వెళ్లే మార్గంలో పవిత్ర అవశేషాలను దర్శించుకోవడానికి బారులు తీరి నిలిచారు.  

పవిత్ర అవశేషాలను వెంట తీసుకు వచ్చిన సీనియర్ అధికారులను బడి పిల్లలతో పాటు టిబెట్ సమాజానికి చెందిన వారు సాంప్రదాయిక వస్త్రధారణలో పూలతోనూ, శుభాకాంక్షలు చెబుతూ ఎంతో ఉత్సాహంగా స్వాగతించారు.

ఈ అవకాశం అత్యంత శుభప్రదమని లెఫ్లినెంట్ గవర్నరు శ్రీ సక్సేనా వర్ణించారు. పవిత్ర అవశేషాల రాకతో ఈ ప్రాంతం అంతటికీ ఆశీర్వాదాలు లభించినట్లయిందని ఆయన అన్నారు.  ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో  ఈ అవశేషాలను ప్రదర్శించడం పూర్తి అయింది. వీటిని మూల సంరక్షణ స్థానం నుంచి తీసి భారత్‌లో ప్రదర్శించడం ఇదే తొలి సారి. ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించడానికి లడఖ్‌ను ఎంపిక చేసినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి శ్రీ సక్సేనా కృతజ్ఞ‌తలు తెలిపారు. ఈ ప్రాంతానికి బౌద్ధ ధర్మంతో, ఆధ్యాత్మికతతో ప్రగాఢ అనుబంధం ఉందని ఆయన వివరించారు. భగవాన్ బుద్ధుని ఆశీర్వాదాలను అందుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలి రావాల్సిందిగా ప్రజలకు లెఫ్టినెంట్ గవర్నరు విజ్ఞ‌ప్తి చేశారు.

గత కొన్ని సంవత్సరాల్లో, భగవాన్ బుద్ధుని పవిత్ర పిప్‌రావా అవశేషాలను థాయిలాండ్, మంగోలియా, వియత్నామ్, రష్యా, సింగపూర్, భూటాన్, శ్రీ లంక, మయన్మార్ సహా అనేక దేశాల్లో ప్రదర్శించారు. దీంతో పలు దేశాలు ఈ అవశేషాలను గురించి అవగాహనను ఏర్పరుచుకొని, భక్తితత్పరతను చాటుకొన్నాయి. ఈ అవశేషాలను  ప్రజల సందర్శనార్థం మే నెల 2 నుంచి మే 10 వరకు  లడఖ్‌లోని జీవత్సల్‌లో ఉంచుతారు. ఆ తరువాత మే 11, 12 వ తేదీల్లో జాంస్కర్‌లో, మళ్లీ మే 13, 14 వరకు లేహ్‌లోని ధర్మ కేంద్రంలో ప్రదర్శిస్తారు. ఆఖర్లో మే 15న తిరిగి ఢిల్లీకి తీసుకు వెళ్తారు.

కేంద్ర హోం వ్యవహారాలు, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా, కేంద్ర మంత్రులు, రాయబారులు, బౌద్ధుల సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ బౌద్ధ సంఘాల ప్రతినిధులు లేహ్‌కు విచ్చేసి, భక్తిశ్రద్ధలను చాటుకోనున్నారు.

ఇటీవల కొన్నేళ్లుగా పిప్‌రావా అవశేషాలు ప్రపంచ స్థాయిలో పునఃప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. 127 సంవత్సరాల పాటు వలసవాదుల హయాం ఆధీనంలో ఉన్న తరువాత, 2025 జులైలో ఓ బ్రిటిషు కుటుంబంతో పాటు ఒక ప్రయివేటు సంచయంతో సంబంధమున్న రత్నాలు, కానుకలు భాగంగా ఉన్న ప్రధాన సేకరణను తిరిగి  భారత్‌కు పంపించారు.

సందర్శకులందరికీ ఆనంద పూరిత, సౌందర్య భరిత, ఆధ్యాత్మికంగా సమృద్ధమైన అనుభూతిని అందించే ఉద్దేశంతో మొక్కల పెంపకం, పూల కుండీల ఏర్పాటు సహా నగరం అంతటా స్వచ్ఛతా సంరక్షణ కార్యక్రమాన్ని ఓ ఉద్యమం మాదిరిగా చేపట్టారు.

 

***


(रिलीज़ आईडी: 2257016) आगंतुक पटल : 44
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Gujarati