గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నిలకడైన భవితను దృష్టిలో పెట్టుకొని కీలక ఖనిజాల వ్యవస్థను అభివృద్ధి చేసే అంశంపై సంప్రదింపుల కార్యశాలను నిర్వహించిన గనుల శాఖ

నాడు పోస్టు చేయడమైనది: 28 APR 2026 5:54PM by PIB Hyderabad

 ‘‘నిలకడైన భవితను దృష్టిలో పెట్టుకొని కీలక ఖనిజాల వేల్యూ చైన్‌ను అభివృద్ధి చేయడం’’ అనే విషయంపై ఒక ఉన్నత స్థాయి సంప్రదింపుల కార్యశాల (వర్క్‌షాప్)ను న్యూఢిల్లీలో ఈ రోజు నిర్వహించారు. ప్రభుత్వ, పారిశ్రామిక, విద్యారంగ ప్రముఖులతో పాటు అంతర్జాతీయ సంస్థలకు చెందిన ఆసక్తిదారులు (స్టేక్‌హోల్డర్స్)  ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు. వారు ద్వితీయ స్థాయి వనరులపైన, రీసైక్లింగ్ పైన దృష్టి కేంద్రీకరించి భారత కీలక ఖనిజాల అనుబంధ విస్తారిత వ్యవస్థను బలోపేతం చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చోపచర్చలు చేశారు.


కార్యక్రమంలో గనుల శాఖ కార్యదర్శి శ్రీ పీయూష్ గోయల్ కీలకోపన్యాసాన్నిస్తూ, భారత కీలక ఖనిజాల వేల్యూ చైన్‌‌ ను అభివృద్ధి చేయడానికి ప్రయివేటు రంగం ఇప్పటి కంటే ఎక్కువ స్థాయిలో పాలుపంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ కీలక ఖనిజాల మిషన్ (ఎన్‌సీఎమ్ఎమ్)లో భాగంగా ప్రభుత్వ విధాన పరంగా అమలు చేస్తున్న కార్యక్రమాల్ని ఆయన వివరించారు. సంస్కరణలు, వ్యాపార నిర్వహణలో సౌలభ్యం, లక్ష్యాల సాధనకు ప్రోత్సాహకాల మంజూరు ద్వారా ఒక పటిష్ఠ, స్వయం సమృద్ధ సరఫరాల వ్యవస్థను రూపొందించుకోవడం ముఖ్యమని శ్రీ పీయూష్ గోయల్ తెలిపారు. భారత్ ఇంధన పరివర్తన దిశగా పయనించడంలో, ఆర్థిక వృద్ధిని మెరుగుపరుచుకోవడం లో, సాంకేతిక పురోగతిని సాధించడంలో కీలక ఖనిజాల రంగానిది ముఖ్య పాత్ర అని ఆయన తెలిపారు. అన్వేషణ, శుద్ధి, రీసైక్లింగ్... వీటిలో ప్రయత్నాలను ప్రస్తుత స్థాయి కన్నా పెంపొందించాలని ఆయన పిలుపునిచ్చారు.
గనుల్లో పోగయ్యే వ్యర్థాలు, టెయిలింగ్స్, శ్లాగ్స్, ఇతరత్రా పారిశ్రామిక అవశేషాలు వంటి ద్వితీయ స్థాయి వనరుల నుంచి విశిష్ట సామర్థ్యాన్ని వెలికితీయవచ్చని వర్క్‌షాపులో ప్రస్తావించారు. వీటిని కీలక ఖనిజాలకు అనువైన, తక్కువ ఖర్చులో లభ్యమయ్యే వనరులుగా చూడవచ్చని వివరించారు. పట్టణ ప్రాంతాల్లో గనుల తవ్వకం పనులకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని కూడా చర్చోపచర్చల సందర్భంగా గమనించారు. ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఈ-వేస్ట్), ఉపయోగం రీత్యా చివరి దశకు చేరుకున్న బ్యాటరీల రీసైక్లింగ్ ప్రక్రియను చేపట్టాలని సూచించారు. ఈ ప్రక్రియలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోందని గుర్తుచేశారు.
సాంకేతిక సదస్సుల్లో భాగంగా, ద్వితీయ స్థాయి వనరుల్లో దాగివున్న విలువను రాబట్టడం, సరికొత్తగా తెర మీదకు వస్తున్న సాంకేతికతలతో పాటు ప్రయోగాత్మక ప్రాజెక్టులు, రీసైక్లింగ్ అనుబంధ విస్తారిత వ్యవస్థను బలోపేతం చేయడం, ఈ రంగాన్ని విస్తరించడానికి విధానపరమైన, నియంత్రణ సంబంధిత, సాంకేతిక అంతరాలను పూడ్చడం వంటి కీలక అంశాలపై నిపుణులు చర్చించారు. హిందాల్కో, రుబామిన్, ఎటేరో, లోహమ్, ఏల్ట్‌మిన్, జీఎమ్‌డీసీ వంటి సంస్థలతో పాటు ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలకు చెందిన నిపుణులు సాంకేతిక సన్నద్ధత, వాణిజ్యం పరంగా లాభదాయకత, విలువను రాబట్టే ప్రయత్నాలను పెద్ద ఎత్తున చేపట్టడానికి విధానాల పరంగా అవసరమైన సహకారాన్ని అందించాల్సిన ఆవశ్యకతపై సూచనలు చేశారు.

 


ప్రయోగశాల స్థాయిలోని నూతన ఆవిష్కరణలను పారిశ్రామిక పరిష్కారాల స్థాయికి మార్పు చేయాల్సిన అవసరం చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. ప్రయివేటు పెట్టుబడులను ఆకర్షించడానికి, ఈ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి విధాన ప్రణాళికలను తీర్చిదిద్దాలన్న అంశం కూడా చర్చల్లో చోటు చేసుకుంది.
ప్రభుత్వం, పరిశ్రమ, విద్యారంగం... వీటి మధ్య మెరుగైన సమన్వయాన్ని ఏర్పరుచుకొని ప్రయోగాత్మక ప్రాజెక్టులను వేగంగా అమల్లోకి తేవడంతో పాటు ఫలప్రదమైన సాంకేతికతలకు విస్తృత స్థాయిలో ఆచరణ రూపాన్ని ఇవ్వడంపై ఏకాభిప్రాయానికి రావడంతో వర్క్‌షాప్ పూర్తి అయింది. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల నుంచి పెద్ద సంఖ్యలో ఆసక్తిదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కీలక ఖనిజాల వేల్యూ చైన్‌కు సంబంధించిన వివిధ కోణాలపై లోతైన, అర్థవంతమైన చర్చలు సాగాయి. లోతైన అవగాహనతో కూడిన చర్చోపచర్చలు, సందర్భశుద్ధి కారణంగా వర్క్‌షాపు అత్యంత ఫలప్రదంగా ముగియడంతో పాటు, మార్పునకు చోదక శక్తిగా మారింది. ఎనర్జీవా వెంచర్స్ సహకారంతో  ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

***


(రిలీజ్ ఐడి: 2256572) సందర్శకుల సూచీ సంఖ్య : : 19
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati